చైనా: రేప్ ఆరోపణలు రావడంతో ‘బిజినెస్ డ్రింకింగ్’ కల్చర్‌ను దుమ్మెత్తిపోసిన సోషల్ మీడియా

ఫొటో సోర్స్, Getty Images
చైనాలో కార్పొరేట్ సంస్థల పని తీరును ప్రజలు నిశితంగా గమనించడం మొదలవడంతో అవి తమ పంథాను ఏమైనా మార్చుకునే అవకాశం ఉందా? ముఖ్యంగా, బిజినెస్ డ్రింక్స్ సంస్కృతికి స్వస్తి పలుకుతాయా?
మింగ్ షీ (పేరు మార్చాం) దాదాపు ప్రతీ రెండు వారాలకొకసారి పని ముగిసిన తర్వాత ఆమె సహోద్యోగులతో కలిసి మందు పార్టీలకు వెళ్లాల్సి వస్తుంది. ఈ పని ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు.
పబ్‌లో మద్యం సేవించడం మాత్రమే ఆమెకు ఇబ్బంది కలిగించే విషయం కాదు. క్లయింట్‌లతో బలవంతపు నవ్వులు నవ్వుకుంటూ కృత్రిమంగా ప్రవర్తించడం ఆమెకు సౌకర్యవంతంగా ఉండదు.
"మద్యం సేవించినప్పుడు నేను నిలకడగానే ఉన్నప్పటికీ, పరిస్థితులు చేతులు దాటుతాయేమోనని నేనెప్పుడూ భయపడుతూ ఉంటాను" అని 26 ఏళ్ల పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెంట్ బీబీసీకి చెప్పారు.
"ఒక్కొక్కసారి కొందరు అనవసరమైన లైంగిక జోకులు వేస్తారు. అవేవో నవ్వు తెప్పించేవిగా ఉన్నాయన్నట్లు నేను నటించాలి" అని అన్నారు.
ఇలా పార్టీలకు హాజరయ్యే ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు చైనాలో అనేక మంది ఉద్యోగులు చెప్పారు.
చైనాలో కొన్ని వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకోవడానికి, యాజమాన్యం దృష్టిలో పేరు సంపాదించుకోవడానికి వ్యక్తిగత సంబంధాలను మెరుగుపరుచుకోవడాన్ని కీలకంగా చూస్తారు.
చైనా టెక్ దిగ్గజం అలీబాబాలో ఒక ఉద్యోగి సీనియర్ మేనేజర్‌పై అత్యాచార ఆరోపణ చేసిన తర్వాత బిజినెస్ డ్రింకింగ్ సంస్కృతి అంశం మరొకసారి తెర పైకి వచ్చింది.
గత నెలలో బాధితురాలు తనపై దాడి గురించి రాసిన 11 పేజీల సమాచారం సోషల్ మీడియా వేదిక వీబోలో వైరల్ అయింది. ఉద్యోగ నిమిత్తం వెళ్లిన ట్రిప్‌లో ఒక రోజు రాత్రి మద్యం సేవించిన తర్వాత ఆమె మత్తులో ఉండగా ఆమెపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒక బిజినెస్ డిన్నర్‌లో మోతాదుకు మించి మద్యాన్ని ఆర్డర్ చేసినందుకు ఆమె పైఅధికారుల మీద కూడా ఆరోపణలు చేశారు.
ముందు రోజు సాయంత్రం జరిగిన సంఘటనలేవీ తనకు గుర్తు లేనట్లు చెబుతూ, ఆ మరుసటి రోజు హోటల్ గదిలో తెలివి వచ్చేసరికి నగ్నంగా ఉన్నట్లు ఆమె తెలిపారు.
పైఅధికారి ఆమె గదిలోకి ఆ రాత్రి నాలుగు సార్లు వచ్చినట్లు సెక్యూరిటీ ఫుటేజీ ఆధారంగా తెలుసుకున్నట్లు చెప్పారు.
అలీబాబా ఆ మేనేజర్‌ను ఉద్యోగంలోంచి తప్పించి, ఆయనను మళ్లీ విధుల్లోకి తీసుకునేది లేదని ఒక ప్రకటన చేసింది.
కానీ, ఆ వ్యక్తి బలవంతంగా అమర్యాదగా ప్రవర్తించిన తీరు నేరం కాదని చైనా ప్రాసిక్యూటర్లు తేల్చడంతో కేసును కొట్టివేశారు. ఇందుకు శిక్షగా ఆయన 15 రోజుల పాటు నిర్బంధంలో ఉంటారని పోలీసులు చెప్పారు. దీంతో, ఈ విచారణను ముగించారు.
అయినప్పటికీ, ఈ సంఘటన సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలను రగిల్చింది. కేవలం ఉద్యోగం చేసే స్థలాల్లో జరిగే లైంగిక వేధింపుల గురించి మాత్రమే కాకుండా వివిధ సంస్థలు నిర్వహించే సాంఘిక కార్యక్రమాల్లో ఉద్యోగులను మద్యం సేవించమని ఒత్తిడి చేసే విషపూరితమైన సంస్కృతి గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో మాట్లాడారు.
"ఉద్యోగాలు చేసే చోట డ్రింకింగ్ సంస్కృతిని ఎలా చూడాలి" అనే హ్యాష్ ట్యాగ్ ను వీబో వేదిక పై 11 కోట్లకు పైగా ప్రజలు వీక్షించారు. దీంతో పాటు చాలా మంది ఉద్యోగులు తమ సొంత అనుభవాలను కూడా పంచుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మద్యం సేవించకపోవడాన్ని అమర్యాదగా చూస్తారు
చైనాలో ఉన్న బిజినెస్ డ్రింకింగ్ సంస్కృతికి ఇతర తూర్పు ఆసియా దేశాల్లో ఉన్న సంస్కృతికి చాలా పోలికలు ఉన్నాయి. జపాన్‌లో నోమికై, దక్షిణ కొరియాలో హోసిక్ సమావేశాలను ఉద్యోగ సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు కీలకంగా చూస్తారు.
చైనాలో ఖరీదైన విందులతో పాటు మద్యాన్ని కూడా సెర్వ్ చేస్తారు. 60 శాతం ఆల్కహాల్ ఉండే చైనా మద్యం బాజియును ఎక్కువగా సేవిస్తారు.
మద్యం సేవించడం ద్వారా యువ సిబ్బంది తమ యజమానుల పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలని ఆశిస్తారు.
క్లయింట్‌లను ఆకర్షించడానికి ఇలాంటివి అవసరమని వ్యాపారవేత్తలు ఆలోచిస్తారు.
"సత్సంబంధాల కోసం ప్రశంసించే మాటలు మాట్లాడి, మీ కృతజ్ఞతను చాటుకోవలసి వస్తుంది" అని రుయి మా అనే టెక్ అనలిస్ట్ చెప్పారు. ఆమె అనేక బిజినెస్ పార్టీలకు హాజరయ్యేవారు.
"పార్టీలు ఎక్కువయ్యే కొలదీ, మద్యం సేవించడం కూడా ఎక్కువవుతుంది" అని అన్నారు.
కొన్ని సార్లు సీనియర్ మేనేజర్లు కొత్తగా చేరిన వారిని తాగమని ఒత్తిడి చేస్తారు. దాంతో వారికి మత్తు ఏర్పడి కళ్ళు తిరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి.
"చైనాలో ఉన్న ఉద్యోగ వ్యవస్థలో బాస్‌ను ఎదిరించడం కష్టం" అని అన్నారు.
దాంతో, ఉద్యోగులు వద్దని చెప్పడానికి భయపడుతూ ఉంటారు" అని చెప్పారు.
"పార్టీ ఆహ్వానాన్ని తిరస్కరించడం అమర్యాదకరంగా భావించడంతో, ఉద్యోగంలో పైకెదగాలనుకునే ఏ ఒక్క ఉద్యోగి కూడా యజమానుల ప్రతిపాదనలను తిరస్కరించే సాహసం చేయరు" అని డాక్స్ కన్సల్టింగ్‌లో పని చేస్తున్న మార్కెట్ అనలిస్ట్ హాన్యూ లియు అన్నారు.
ఇలాంటి పార్టీలకు హాజరు కాకపొతే, పనిలో తనను పక్కకు పెట్టేస్తారేమోననే భయం తనను వెంటాడుతోందని, మింగ్ షి చెప్పారు.
"ఉద్యోగులతో అంటి పెట్టుకుని ఉండటానికి ఇలాంటి పార్టీలను కొంత మంది అవకాశంగా తీసుకుంటారు. కానీ, ఇవి అందరికీ పనికొచ్చేవి కాదు" అని అన్నారు.
2016లో ప్రభుత్వ అధికారులు విధి నిర్వహణలో మద్యం సేవించడాన్ని నిషేధిస్తూ ఈ పద్ధతులకు స్వస్తి పలికారు.
కానీ, ప్రైవేటు సంస్థల్లో ఈ సంస్కృతి కొనసాగుతోంది. ముఖ్యంగా ఎక్కువ వయసు ఉన్న వారు అధికారంలో ఉన్నప్పుడు, తీవ్రమైన సంఘటనలు చోటు చేసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.
గత ఏడాది జనవరిలో , షెంజెన్‌లో పని ముగిసిన తర్వాత ఒక మద్యం సేవించే పోటీలో పాల్గొనమని ఒత్తిడికి గురి చేయడంతో ఒక సెక్యూరిటీ గార్డ్ మరణించినట్లు వార్తలు వచ్చాయి.
అదే రోజు, అధికంగా మద్యం సేవించమని ఒత్తిడికి గురైన మరొక ఉద్యోగి కూడా విషపూరిత మద్యం తీసుకోవడంతో ఆసుపత్రి పాలయ్యారు. సెక్యూరిటీ సంస్థ ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం 775 డాలర్లను చెల్లించినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురించాయి. ఈ సంఘటనకు బాధ్యులైన యజమానిని పని నుంచి తొలగించారు.

ఫొటో సోర్స్, Getty Images
గత ఏడాది ఆగస్టులో కూడా బీజింగ్‌లో జరిగిన ఒక పార్టీలో ఒక సీనియర్ ఉద్యోగి ఇచ్చిన మద్యాన్ని తిరస్కరించిన ఒక యువ బ్యాంకు ఉద్యోగిని తిట్టి, చెంప దెబ్బ వేసినట్లు కూడా తెలిసింది. ఆ అబ్బాయి ఆన్ లైన్ లో ఈ సంఘటన గురించి షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది
కొంతమంది తోటి ఉద్యోగులు మద్యం సేవించి వాంతి చేసుకోవడాన్ని కూడా చూసినట్లు ఆయన పేర్కొన్నారు. కొందరు మహిళా ఉద్యోగులను తాకడం లాంటివి చేసేవారని చెప్పారు.
"నేను మద్యం సేవించకపోవడం సంస్థలో ఉద్యోగం చేసేందుకు కావల్సిన అర్హతలకు తక్కువవుతుందా? అని సంస్థ హ్యూమన్ రిసోర్స్ విభాగాన్ని అడగాలని అనుకుంటున్నాను" అంటూ ఆయన ప్రశ్నించారు.
దీనికి సమాధానంగా, సీనియర్ ఉద్యోగి హద్దులు దాటి ప్రవర్తించారని బ్యాంకు ధ్రువీకరించింది. ఆయన తరఫున సంస్థ క్షమాపణలు చెప్పింది. ఆ సీనియర్ ఉద్యోగికి హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది.
ఈ ఏడాది మొదట్లో సెలెబ్రిటీ క్రిస్ వూ చుట్టూ తిరిగిన అత్యాచార అభియోగాలు కూడా అమ్మాయిలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ ఏర్పాటు చేసిన సమావేశంలో బలవంతంగా మద్యం సేవించమని ఒత్తిడి చేయడానికి సంబంధించినవే. అయితే, వూ ఈ అభియోగాలను ఖండించారు.
చికాకు తెప్పించే సంస్కృతికి అంతం
ఈ సంఘటనల పై వెల్లువెత్తిన ఆగ్రహంతో , బలవంతంగా మద్యం సేవించమని చేసే ప్రతిపాదనలు అంతం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.
"ఎప్పటి నుంచో బిజినెస్ డ్రింకింగ్ జరుగుతోంది. కానీ, సోషల్ మీడియా వల్లే అలీబాబాలో చోటు చేసుకున్న ఘటనకు అంత ప్రాముఖ్యం లభించింది" అని లియు బీబీసీతో అన్నారు.
"ఇంటర్‌నెట్‌లో చైనా ప్రజలు బాగా కనెక్ట్ అయి ఉంటారు. ఆన్‌లైన్‌లో ఉన్న నెటిజన్ల సంఖ్యను బట్టి చూస్తే, వాళ్ళు వ్యక్తులనైనా , సంస్థలనైనా సులభంగా కిందకు పడేయగలరు" అని అన్నారు.
"వివిధ పరిశ్రమలను ప్రభుత్వం అణచివేస్తున్న తీరు నడుమ , దేశంలో ఉన్న అతి పెద్ద సంస్థలు, కంపెనీలు, ప్రభుత్వ చర్యలను ఎదుర్కొనే రీతిలో ఎటువంటి పనిని చేపట్టాలన్నా కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తాయి. చైనా కార్పొరేట్, రాజకీయ రంగం మధ్య ఇటీవల చోటు చేసుకున్న కొన్ని సంఘటనల నడుమ, ప్రభుత్వం దృష్టిలో పడటం సంస్థలు చేసే ఆఖరు పని అవుతుంది" అని లియు అన్నారు.
అలీబాబా కేసు బయటపడిన తర్వాత "ఒత్తిడి చేసి మద్యం సేవించమని చెప్పే సంస్కృతికి తమ సంస్థ వ్యతిరేకం" అని చెబుతూ సంస్థ సీఈఓ డానియెల్ ఝాన్గ్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు.
ఈ చిర్రెత్తించే సంస్కృతికి అంతం పలకాలని చైనాలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వాచ్‌డాగ్ పిలుపునిచ్చింది.
"పని ముగిసిన తర్వాత పార్టీలకు హాజరై మద్యం సేవించే సంస్కృతి తప్పకుండా మారుతుంది" అని లియు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- చైనా ప్రపంచానికి సాయం చేస్తోందా, లేక అప్పుల ఊబిలో ముంచేస్తోందా?
- తెలంగాణ: కరెంటు కనెక్షన్ లేకున్నా లక్షల్లో బిల్లులు - ప్రెస్ రివ్యూ
- నిజమైన గూఢచారులు జేమ్స్బాండ్లాగే ఉంటారా? సీక్రెట్ సర్వీస్‌లో పనిచేసే ఆఫీసర్ ఏం చెబుతున్నారు
- ‘13 ఏళ్ల నా చెల్లెలిని బలవంతంగా పెళ్లి చేసుకుంటామని తాలిబాన్లు మెసేజ్ పంపించారు’
- ‘ఆయన నాపైన చేయి కూడా వేయడం లేదు, దగ్గరకు వెళ్లినా అటు తిరిగి పడుకుంటున్నారు’
- తాలిబాన్లతో ట్రంప్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందమే అఫ్గానిస్తాన్ ప్రస్తుత సంక్షోభానికి కారణం: అమెరికా రక్షణ అధికారులు
- తెలంగాణ, ఏపీ ఉపఎన్నికలు: ఆ రెండు నియోజకవర్గాల్లో అధికారపార్టీ వ్యూహాలేంటి, ప్రతిపక్షాలు ఏం చేయబోతున్నాయి?
- విప్లవ మహిళ విగ్రహాన్ని అశ్లీలంగా తయారుచేశారంటూ ఆందోళన
- Astro: ఇది అమెజాన్ రోబో... దీని ప్రత్యేకతలేంటో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








