కోవిడ్-19 వ్యాక్సినేషన్: 15-18 ఏళ్ల పిల్లలకు టీకాలు వేయించడం ఎలా?

కరోనా వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అనేక నెలల చర్చల తరువాత, ఎట్టకేలకు 2022 జనవరి 3 నుంచి భారతదేశంలో 15 నుంచి 18 సంవత్సరాల యువతకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించారు.

ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో, ఇది కీలక నిర్ణయం. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడానికి, టీకా ప్రచారాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది.

టీనేజి పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభించిన వారం తరువాత, 2022 జనవరి 10 నుంచి ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు బూస్టర్ డోస్ ఇవ్వడం మొదలుపెట్టారు.

భారతదేశంలో ఇప్పటివరకు 163 కోట్లకు పైగా వ్యాక్సీన్‌ డోసులు వేశారు. 80 కోట్లకు పైచిలుకు మొదటి డోసు వేయించుకున్నారు. రెండు డోసులూ వేయించుకున్నవారు 68.9 కోట్లకు పైనే.

ఇప్పటివరకు భారత్‌లో 4.03 కోట్ల కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. కేసుల విషయంలో అమెరికా తర్వాతి స్థానం భారత్‌దే. మరోవైపు మరణాల విషయంలో భారత్ 4,91,729 మరణాలతో.. భారత్ మూడో స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ ఉన్నాయి.

ఒమిక్రాన్

ఫొటో సోర్స్, Getty Images

పిల్లల వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏమిటి?

15 నుంచి 18 సంవత్సరాల కౌమారదశలో ఉన్న పిల్లలకు భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ టీకా మాత్రమే అందిస్తారు.

వ్యాక్సీన్ డోసు కోసం 15 లేదా అంతకంటే ఎక్కువ వయసు గల యువత కోవిన్ వెబ్‌సైట్‌ (www.cowin.gov.in) లో తమ పేరు నమోదు చేసుకోవాలి.

2007 లేదా అంతకన్నా ముందు పుట్టినవారు వ్యాక్సినేషన్ కోసం రిజిస్టర్ చేసుకోగలరు.

కోవిన్ సైటులో ఇంతకుముందే రిజిస్టర్ అయి ఉన్న ఖాతాను ఉపయోగించి తమ పేరు నమోదు చేసుకోవచ్చు. అంటే తమ కుటుంబ సభ్యుల అకౌంట్ నుంచి పిల్లలు రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా కొత్త ఖాతా తెరవవచ్చు.

ఇది కాకుండా, నేరుగా టీకా కేంద్రానికి వెళ్లి తమ పేరు నమోదు చేసుకోవచ్చు. వ్యాక్సీన్ వేయించుకునే రోజు, సమయాన్ని కోవిన్ సైట్‌లో లేదా టీకా కేంద్రంలో పొందవచ్చు.

15, 16, 17 వయసు పిల్లలు పెద్దలుగా మారడానికి సమీపంలో ఉన్నట్టు లెక్క. అందుకే వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించడం ముఖ్యమని లాన్సెట్ కోవిడ్ 19 కమిషన్ ఇండియా టాస్క్ ఫోర్స్ సభ్యురాలు డాక్టర్ సునీలా గార్గ్ అభిప్రాయపడ్డారు. డాక్టర్ సునీలా గార్గ్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ జాతీయ అధ్యక్షురాలు.

"అందుకే 18 ఏళ్లు దాటినవారికి ఇచ్చే మోతాదులోనే వీరికీ టీకాలు వేస్తారు. 15 నుంచి 18 వయసు మధ్య పిల్లలకూ రెండు డోసులు వేస్తారు. రెండింటికీ మధ్య ఆరు వారాల అంతరం ఉంటుంది" అని ఆమె వివరించారు.

కరోనా వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Getty Images

వ్యాక్సీన్లు ఉచితంగానే వేస్తున్నారా?

తాజాగా కోవోవ్యాక్స్, కోర్బెవ్యాక్స్ టీకాల అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటివరకు భారత్ ఆమోదించిన టీకాల సంఖ్య ఎనిమిదికి పెరిగింది.

మొదట్లో కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీచేసింది. ఆ తర్వాత స్పుత్నిక్ వీ, మోడెర్నా వ్యాక్సీన్లకు అనుమతులు ఇచ్చింది. అనంతరం జైకోవ్-డీ, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలకు ఆమోద ముద్ర వేసింది.

కొత్త వ్యాక్సీన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు 2021, జూన్ 7న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

కరోనా వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, FAROOQ NAEEM

వ్యాక్సీన్లు ఎవరికి ఇస్తున్నారు?

15ఏళ్లకు పైబడిన అందరూ ప్రస్తుతం వ్యాక్సీన్లు వేయించుకోవచ్చు. వ్యాక్సీన్ల కోసం కోవిన్ లేదా ఆరోగ్య సేతు యాప్‌లలో నమోదు చేసుకోవాలి.

మే1 తర్వాత మొదలైన నాలుగో దశ వ్యాక్సినేషన్‌లో 18ఏళ్లకు పైబడిన అందరికీ వ్యాక్సీన్లు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. 3, జనవరి 2022 నుంచి 15 నుంచి 18ఏళ్ల మధ్య వయసు వారికీ టీకాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

జనవరి 16న తొలి దశ వ్యాక్సినేషన్ మొదలైంది. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు దీనిలో భాగంగా వ్యాక్సీన్లు ఇచ్చారు.

మార్చి 1న రెండో దశ వ్యాక్సినేషన్ మొదలైంది. 45ఏళ్లకుపైబడిన ఇతర అనారోగ్యాలున్న వారికి ఈ దశలో వ్యాక్సీన్లు ఇచ్చారు. ఆ తర్వాతి దశలో 45 ఏళ్లకుపైబడిన అందరికీ వ్యాక్సీన్లు ఇచ్చారు.

కోవిడ్ వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Getty Images

వ్యాక్సీన్ కోసం రిజిస్టర్ చేసుకోవడం ఎలా?

వ్యాక్సినేషన్ కోసం కోవిన్ లేదా ఆరోగ్య సేతు యాప్‌లలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ కోసం మనం cowin.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి మన మొబైల్ నంబరును ఎంటర్ చేయాలి. దీంతో వన్ టైమ్ పాస్‌వర్డ్ మన నంబరుకు వస్తుంది. ఆ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, వెరిఫై ఐకాన్‌పై క్లిక్ చేయాలి. దీంతో వెరిఫికేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ వివరాలు నమోదు చేసుకోవాలి. ఫోటో ఐడీ అప్‌లోడ్ చేయాలి. మీకు మధుమేహం, బీపీ, ఆస్థమా లాంటి వ్యాధులు ఉంటే అక్కడ వెల్లడించాలి.

సమాచారం ఇవ్వడం పూర్తయిన తర్వాత, రిజిస్టర్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. దీంతో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీ కంప్యూటర్‌లో మీరు ఎంటర్ చేసిన వివరాలు కనిపిస్తాయి. ఆ తర్వాత టీకా కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి.

కరోనా వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Sopa images

రెండో డోసు కోసం కూడా అపాయింట్‌మెంట్ తీసుకోవాలా?

అవును. రెండో డోసు కోసం కూడా అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోసు తీసుకున్న తర్వాత, రెండో డోసుకు అపాయింట్‌మెంట్ ఆటోమేటిక్‌గా షెడ్యూల్ అవ్వదు.

రిజిస్ట్రేషన్ సమయంలో ఏదైనా సమస్య వస్తే, నేషనల్ హెల్ప్‌లైన్ '1075''కు ఫోన్ చేయాలి. కోవిన్ సాఫ్ట్‌వేర్ గురించి ఏదైనా సమాచారం ఇక్కడ తెలుసుకోవచ్చు.

అపాయింట్‌మెంట్ ఆన్‌లైన్‌లో బుక్ చేయడం సాధ్యం కాకపోతే నిరాశ చెందొద్దు. వ్యాక్సీన్ సెంటర్లలో ఆన్-స్పాట్ రిజిస్ట్రేషన్ సదుపాయం ఉంటుంది. అయితే రోజులో ఇన్ని రిజిస్ట్రేషన్లు మాత్రమే చేయాలని అక్కడ నిబంధన ఉంటుంది.

భారత్‌లో ఏ వ్యాక్సీన్లు ఇస్తున్నారు

కోవిడ్-19తో పోరాటంలో భాగంగా ఇస్తున్న వ్యాక్సీన్లకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆమోదం తెలుపుతోంది. ఇప్పటికే కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లతోపాటు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీకి కూడా డీసీజీఐ ఆమోదం తెలిపింది. అమెరికాకు చెందిన మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, జైకోవ్-డీ వ్యాక్సీన్లతోపాటు కోవోవ్యాక్స్, కోర్బెవ్యాక్స్‌లకు కూడా అనుమతులు జారీచేశారు.

కోవిడ్ నుంచి స్పుత్నిక్ వీ 92 శాతం రక్షణ కల్పిస్తుందని అధ్యయనాల్లో తేలింది. రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్ సంస్థతో కలిసి భారత్ స్వదేశీ సంస్థ పనాషియా బయోటెక్.. భారత్‌లో ఈ టీకాలను ఉత్పత్తి చేస్తోంది. ఏడాదికి పది కోట్ల వ్యాక్సీన్లను ఇక్కడ ఉత్పత్తి చేయాలని ఆర్‌డీఐఎఫ్ భావిస్తోంది.

కోవిషీల్డ్ నిజానికి ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ భారత వెర్షన్. కోవాగ్జిన్ పూర్తిగా భారత్‌లో తయారైన వ్యాక్సీన్. అందుకే దీనిని 'స్వదేశీ వ్యాక్సీన్' అంటున్నారు.

కోవిషీల్డ్‌ను భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోంది. కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ కంపెనీ, ఐసీఎంఆర్‌తో కలిసి తయారుచేసింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత ఏడాది డిసెంబర్‌లో దేశంలో 8 కరోనా వ్యాక్సీన్లు తయారవుతున్నాయని చెప్పింది. వాటి క్లినికల్ ట్రయల్స్ వివిధ దశల్లో ఉన్నాయని తెలిపింది.

కోవిడ్ వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, EPA

కోవిడ్ వ్యాక్సీన్ ధర ఎంత

18ఏళ్లకు పైబడిన అందరికీ వ్యాక్సీన్లు ఉచితంగా అందిస్తామని జూన్ 7న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సీన్ల కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, టీకా ధరపై కేవలం రూ.150 మాత్రమే అదనంగా వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులకు సూచించింది.

అంటే, ప్రభుత్వ కేంద్రాల్లో ఈ టీకాలను ఉచితంగానే వేస్తారు.

కోవాగ్జిన్

ఫొటో సోర్స్, BHARATBIOTECH

కోవిడ్ వ్యాక్సీన్లు సురక్షితమైనవేనా?

అయితే కోవిషీల్డ్ వ్యాక్సీన్ తీసుకున్న కొందరి మెదడులో రక్తం గడ్డకట్టిన జాడలు కనిపించినట్లు వార్తలు వచ్చాయి.

''సెరెబ్రల్ వేనస్ సైనస్ థ్రోంబోసిస్'' (సీవీఎస్‌టీ) అంటే మెదడు బాహ్య పొరల్లోని రక్త నాళాల మధ్య రక్తం గట్టికట్టినట్లు కొందరిలో వైద్యులు గుర్తించారు.

అయితే 50 శాతం సామర్థ్యంతో ఈ వ్యాక్సీన్ పనిచేస్తుందని, కొందరిలోనే సీవీఎస్‌టీ కనిపించిందని నిపుణులు చెబుతున్నారు.

వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత, ఏమైనా మార్పులు వస్తున్నాయో లేదో గుర్తించేందుకు అక్కడే కొంతసేపు ఉండాలని అందుకే వైద్యులు సూచిస్తున్నారు. ఈ సమయంలో ఏమైనా దుష్ప్రభావాలు ఉన్నాయేమో పరిశీలిస్తారు.

వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Getty Images

వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా కోవిడ్ సోకుతుందా?

కరోనావైరస్‌ నుంచి ఈ వ్యాక్సీన్లు సంపూర్ణ రక్షణ కల్పిస్తాయని ఎలాంటి ఆధారాలూ లేవు. అయితే, ఇన్ఫెక్షన్ ముప్పును మనం తగ్గించుకోవచ్చు.

ఉదాహరణకు, ఇంగ్లండ్‌లో 40,000 మందిపై చేపట్టిన అధ్యయనంలో ఒక డోసు ఫైజర్ వ్యాక్సీన్ తీసుకుంటే కరోనా సోకే ముప్పు 70 శాతం తగ్గుతుందని, రెండు డోసులు తీసుకుంటే 85 శాతం వరకు ఈ ముప్పు తగ్గుతుందని వెల్లడైంది.

రెండు డోసులు పూర్తిగా తీసుకుంటే, కోవిషీల్డ్ 90 శాతం, కోవాగ్జిన్ 81 శాతం సామర్థ్యాలతో పనిచేస్తున్నాయని మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రాథమిక పరీక్షల సమాచారం చెబుతోంది. ఫైజర్ వ్యాక్సీన్ 98 శాతం సామర్థ్యంతో పనిచేస్తోందని వివరిస్తోంది.

మరోవైపు రష్యా వ్యాక్సీన్ స్పుత్నిక్ వీ కూడా 92 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని పరీక్షల్లో తేలింది. కోవిడ్‌ నుంచి రక్షణ కోసం తాము తయారు చేసిన వ్యాక్సీన్‌ 95% ఫలితాలనిచ్చిందని అమెరికాకు చెందిన మోడెర్నా గతంలో ప్రకటించుకుంది.

వ్యాక్సీన్లు ముప్పును తగ్గించేటప్పటికీ, కరోనా సోకడాన్ని మాత్రం పూర్తిగా అడ్డుకోలేవని నిపుణులు చెబుతున్నారు. మాస్క్‌లు పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడాలను కొనసాగించాలని వివరిస్తున్నారు.

కరోనా వ్యాక్సినేషన్

రిజిస్ట్రేషన్ కోసం ఏఏ గుర్తింపు కార్డులు ఇవ్వొచ్చు?

రిజిస్ట్రేషన్ కోసం మీరు ఏదైనా మీ ఫొటో ఐడీ కార్డు యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.

వాటిలో ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, మన్రేగా జాబ్ కార్డ్, లేదా పోస్టాఫీస్ ఖాతా పాస్‌బుక్, MP/MLA/MLC జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డ్, పెన్షన్ కార్డు, ఎంప్లాయర్ జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా వోటర్ ఐడీ కార్డ్ ఇవ్వవచ్చు.

టీకా వేయించుకునే రోజున గుర్తింపు కార్డు తీసుకెళ్లాలా?

ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏ ఐడీని మీరు రిజిస్ట్రేషన్ సమయంలో అప్‌లోడ్ చేస్తారో టీకా వేయించుకునే సమయంలో దానినే తీసుకెళ్లాలి.

వేరే ఐడీతో వెళ్తే టీకా వేయరు.

ఎందుకంటే వ్యాక్సీన్ రెండు డోసులు రెండు దశల్లో వేయనున్నారు.

తర్వాత టీకా వేసుకోవాల్సిన తేదీని ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారు.

కరోనా వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, REUTERS/FRANCIS MASCARENHAS/FILE PHOTO

కోవిషీల్డ్, కోవాగ్జిన్ ప్రభావం ఎలా ఉంటుంది

ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్‌ను భారత్ కంటే ముందు బ్రిటన్, అర్జెంటీనా, ఎల్‌ సాల్వెడార్‌లో అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చారు. భారత్‌లో ఈ వ్యాక్సీన్ తయారీ పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 'కోవిషీల్డ్' పేరుతో చేసింది.

ఈ వ్యాక్సీన్‌ను కామన్ కోల్డ్ ఎడెనోవైరస్ ద్వారా అభివృద్ధి చేశారు.

చింపాజీలకు సంక్రమించే ఈ వైరస్‌ను మనుషుల్లో వ్యాపించకుండా మార్పులు చేశారు.

ఈ టీకాను 18ఏళ్లు, అంతకు పైబడిన 23,745 మందిపై పరీక్షించారు.

మరోవైపు, కోవాగ్జిన్‌ను ఐసీఎంఆర్, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంయుక్తంగా తయారు చేశాయి.

దీనిని జనాలకు ఎలాంటి నష్టం కలిగించకుండా, మృత కరోనా వైరస్‌ను ఉపయోగించి అభివృద్ధి చేశారు.

నిపుణుల వివరాల ప్రకారం ఈ వ్యాక్సీన్ శరీరంలో ప్రవేశించిన తర్వాత కరోనా వ్యాపించకుండా యాంటీబాడీస్ వృద్ధి చేస్తుంది.

వ్యాక్సీన్ ఎలా తయారవుతుంది, దాన్ని ఎవరు ఓకే చేస్తారు

భారత్ వ్యాక్సీన్ల తయారీకి పవర్ హౌస్‌గా నిలిచింది. ఇక్కడ ప్రపంచంలోని 60 శాతం వ్యాక్సీన్లు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సీన్ ప్రోగ్రాం కూడా భారత్‌లోనే నడుస్తోంది. దీని కింద ఏటా 5.5 కోట్ల మంది మహిళలకు, నవజాత శిశువులకు 39 కోట్ల టీకాలు వేస్తున్నారు.

మొట్టమొదట ఒక వ్యాక్సీన్‌ను ప్రయోగశాలల్లో టెస్ట్ చేస్తారు. తర్వాత దానిని జంతువులపై పరీక్షిస్తారు.

ఆ తర్వాత రకరకాల దశల్లో దానిని మనుషులపై పరీక్షిస్తారు. తర్వాత అది సురక్షితమేనా, దానివల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగిందా, ఇది ప్రయోగాత్మకంగా పనిచేస్తోందా అనేది పరిశీలిస్తారు.

కరోనా వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, EPA/ABIR SULTAN

ఇతర వ్యాక్సీన్లు ఇవే:

NVX-CoV2373:

వైరస్ ప్రొటీన్ ముక్కల ఆధారంగా తయారైన ఈ వైరస్‌ను పుణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. ఇన్‌స్టిట్యూట్ దీనికోసం నోవావ్యాక్స్ తో కలిసి పనిచేస్తోంది.

ప్రొటీన్ యాంటీజెన్ బెస్ట్:

అమెరికా ఎంఐటీ తయారు చేసిన ప్రొటీన్ యాంటీజెన్ బెస్ట్ వ్యాక్సీన్ ఉత్పత్తి హైదరాబాద్ బయోలాజికల్ ఈ-లిమిటెడ్ చేస్తోంది. దీని మొదటి, రెండో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ మొదలవబోతున్నాయి.

HGCO 19:

అమెరికా హెచ్‌డీటీ ఎంఆర్ఎన్ఏ ఆధారిత ఈ వ్యాక్సీన్ ఉత్పత్తిని పుణెలోని జినోవా అనే కంపెనీ చేస్తోంది. జంతువులపై ఈ టీకా ప్రయోగాలు పూర్తయ్యాయి. త్వరలో దీని మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించబోతున్నారు.

భారత్ బయోటెక్, థామస్ జెఫర్సన్ టీకా

హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ అమెరికా థామస్ జెఫర్సన్ యూనివర్సిటీ సహకారంతో మృత రేబిస్ వెక్టర్ ప్లాట్‌ఫాం ఆధారంగా కరోనా వ్యాక్సీన్ ఉత్పత్తి చేస్తోంది. ఈ టీకా అడ్వాన్సడ్ ప్రీ-క్లినికల్ స్థాయి వరకూ వచ్చింది.

అరబిందో ఫార్మా టీకా

అమెరికా ఆరోవ్యాక్సీన్‌తో కలిసి భారత్‌కు చెందిన అరబిందో ఫార్మా ఒక టీకా తయారు చేస్తోంది.

కరోనా వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Getty Images

వీటి ప్రభావంపై ప్రశ్నలు ఎందుకు

మొదట్టో కోవిషీల్డ్, కోవాగ్జిన్‌కు కేంద్రం అనుమతి ఇవ్వడంపై వివాదాలు కమ్ముకున్నాయి. ఈ రెండు వ్యాక్సీన్ల సమర్థతపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ కొనసాగుతున్నప్పుడే అనుమతులు జారీచేశారు. ఎఫికెసీ డేటా ఇప్పటికీ అందుబాటులో లేకపోవడంతో, ఈ టీకా ఎంత సమర్థంగా పనిచేస్తుంది అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి.కోవిషీల్డ్, స్పుత్నిక్ విషయంలోనూ ఇలాంటి సందేహాలే ఉత్పన్నం అయ్యాయి.

ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ వ్యాక్సీన్లకు అనుమతి ఇవ్వడంపై చాలా మంది శాస్త్రవేత్తలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా అనుమతులు లేవని అంటున్నారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?

కేరళలో బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

దేశ వ్యాప్తంగా నమోదైన బ్రేక్‌థ్రూ కేసుల్లో సగం కేరళలోనే వెలుగులోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

దీంతో అసలు బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్సన్ (సీడీసీ) సమాచారం ప్రకారం.. రెండు డోసులు తీసుకున్న పది నుంచి 14 రోజుల తర్వాత వైరస్ సోకినట్లు నిర్ధారణ అయితే, దాన్ని బ్రేక్ థ్రూ ఇన్ఫెక్షన్‌గా పరిగణిస్తారు.

''చాలా అరుదుగా బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్ కేసులు వస్తుంటాయి. అయితే, వీటి వల్ల తీవ్రమైన అనారోగ్యం వచ్చే అవకాశం చాలా తక్కువ.''

''రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైనప్పటికీ మాస్క్‌లు పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడం తదితర చర్యలతో ఈ ఇన్ఫెక్షన్లు అడ్డుకోవచ్చు''అని సీడీసీ తెలిపింది.

అయితే, భారత్‌లో బ్రేక్‌థ్రూ కేసులకు డెల్టా వేరియంటే కారణమని బయోటెక్నాలజీ విభాగం ప్రధాన కార్యదర్శి రేణు స్వరూప్ ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు. మరోవైపు రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్నప్పటికీ, బ్రిటన్, అమెరికాలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి.

బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్లు వస్తున్నప్పటికీ తీవ్రమైన లక్షణాలతో ఆసుపత్రి పాలయ్యే ముప్పును సమర్థంగా టీకాలు అడ్డుకుంటున్నట్లు రేణు వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)