పిల్లల ప్రాణాలు తీస్తున్న అంతుచిక్కని విష జ్వరాలు, ఈ ఇన్ఫెక్షన్లు ఎలా వస్తున్నాయి?

- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గత వారం రోజుల్లో విష జ్వరాలతో మరణిస్తున్న పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే, ఈ మృతులకు కారణం ఏమిటో అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
గత వారం రోజుల్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో పిల్లలు తీవ్రమైన జ్వరం, ఒళ్లంతా చెమటలతో నిద్రలేస్తున్నారు.
వీరిలో చాలా మందిలో కాళ్ల నొప్పులు, తలనొప్పి, వాంతులు, శరీరంలో నీటి స్థాయిలు పడిపోవడం తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి. కొంతమందిలో కాళ్లు, చేతులపై దద్దుర్లు కూడా వస్తున్నాయి.
ఈ అంతుచిక్కని జ్వరాలతో మరణిస్తున్న వారిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో ఇవే లక్షణాలతో వందల మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కోవిడ్-19 పరీక్షల్లో వీరికి నెగిటివ్ వస్తోంది.
విధ్వంసకర కరోనావైరస్ సెకండ్ వేవ్ నుంచి భారత్ కోలుకున్నట్లు కనిపిస్తున్న సమయంలో మరోవైపు జనాభా అధికంగా ఉండే యూపీలో తాజా అంతుచిక్కని జ్వరం కేసులు కలవరపెడుతున్నాయి.
ఆగ్రా, మథుర, మొయిన్‌పురీ, ఎటా, కాస్‌గంజ్‌లలో వెలుగుచూస్తున్న ఈ కేసులకు దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగీనే ప్రధాన కారణమై ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్లేట్లెట్ కౌంట్ పడిపోతోంది..
రక్తం గడ్డకట్టడంలో ప్రధాన పాత్ర పోషించే ప్లేట్లెట్ల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో చాలా మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. డెంగీ లక్షణాల్లో ఇదీ ఒకటి.
‘‘ఆసుపత్రుల్లో చేరుతున్న పిల్లలు చాలా వేగంగా మరణిస్తున్నారు’’అని ఫిరోజాబాద్‌లోని సీనియర్ వైద్యాధికారి డాక్టర్ నీత కుల్‌శ్రేష్ఠ చెప్పారు. గత వారం రోజుల్లో ఈ జిల్లాలో 32 మంది పిల్లలు సహా 40 మంది మరణించారు.
ఆడ దోమల వల్ల వ్యాప్తి చెందే డెంగీ కేసులు ఉష్ణ మండల ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వందకుపైగా దేశాల్లో ఈ ఇన్ఫెక్షన్లను ఎండెమిక్‌గా గుర్తించారు. అంటే ఇవి తరచూ వస్తున్నాయని అర్థం. ప్రపంచ వ్యాప్తంగా ఈ కేసుల్లో 70 శాతం ఆసియా దేశాల్లోనే కనిపిస్తున్నాయి.
డెంగీ వైరస్‌లలో నాలుగు ప్రధాన రకాలున్నాయి. రెండోసారి వచ్చే ఇన్ఫెక్షన్‌తో పెద్దల కంటే పిల్లలు చనిపోయే ముప్పు ఐదురెట్లు ఎక్కువ.

ఫొటో సోర్స్, Getty Images
ఆశ్రయం ఇచ్చేది మనుషులే...
డెంగీ వ్యాధికి కారణమయ్యే ఏడెస్ ఏజిప్టై దోమలు మన ఇళ్లలోని మంచినీరు నిల్వ చేసే ప్రాంతాల్లో గుడ్లు పెడతాయి.
‘‘ఇవి గుడ్లు పెట్టేందుకు అవసరమయ్యే ప్రాంతాలను మనమే కల్పిస్తున్నాం. వీటి సంఖ్య పెరగకుండా చూడగలిగేది కూడా మనమే’’అని దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నిపుణులు డాక్టర్ స్కాట్ హెల్స్‌టెడ్ అన్నారు.
ఏటా ప్రపంచ వ్యాప్తంగా పది కోట్లకుపైగా తీవ్రమైన డెంగీ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తీవ్రమైన రక్తస్రావం, అవయవాల విఫలం తదితర కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
‘‘కోవిడ్-19 వ్యాప్తికి డెంగీ కూడా తోడైతే విధ్వంసకర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’అని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా హెచ్చరించింది.
అయితే, ఉత్తర్ ప్రదేశ్‌లో తాజా మరణాలకు డెంగీనే కారణమా? అనే విషయం స్పష్టంగా తెలియడంలేదు.
20 కోట్లకుపైగా జనాభా ఉండే ఈ రాష్ట్రంలో నాసికరమైన పారిశుద్ధ్యం, పిల్లల్లో పోషకాహార లోపం, ఆరోగ్య సదుపాయాల కొరత నడుమ ఏటా వర్షాకాలంలో ఇలాంటి కేసులు వెలుగుచూస్తూనే ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
చాలా వ్యాధులు
దోమల ద్వారా వ్యాప్తిచెందే జాపనీస్ ఎన్సెఫలైటిస్ కూడా ఉత్తర్ ప్రదేశ్‌లో చెలరేగుతుంటుంది. 1978లో తొలిసారి ఇక్కడ వెలుగుచూసిన ఈ కేసుల వల్ల ఇప్పటివరకు 6,500 మందికిపైగా మృత్యువాతపడ్డారు.
ముఖ్యంగా గోరఖ్‌పుర్‌తోపాటు నేపాల్ పరిసరాల్లోని హిమాలయాలకు అనుకుని ఉన్న ప్రాంతాల్లో ఈ కేసులు ఎక్కువగా బయటపడుతుంటాయి. వరదల ముప్పు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాలు దోమల వ్యాప్తికి అనువైన ప్రాంతాలు.
2013లో ఇక్కడ వ్యాక్సినేషన్ మొదలుకావడంతో, జాపనీస్ ఎన్సెఫలైటిస్ కేసులు తగ్గాయి. అయితే, ఇప్పటికీ ఈ ఇన్ఫెక్షన్‌తో పిల్లలు మరణిస్తూనే ఉన్నారు.
ఈ ఏడాది ఇప్పటివరకు ఈ వ్యాధితో 17 మంది పిల్లలు గోరఖ్‌పుర్‌లో మరణించారు. మొత్తంగా 428 కేసులు నమోదయ్యాయి.
2014లో ఎన్సెఫలైటిస్‌తోపాటు గుండె కణజాల వాపు (మయోకార్డైటిస్)లతో మరణిస్తున్న చిన్నారుల సంఖ్య పెరగడంతో, గోరఖ్‌పుర్‌లో 250 మంది బాధిత చిన్నారులపై వైద్యులు పరిశోధన చేపట్టారు. దీంతో వీరిలో 160 మంది చిన్నారుల్లో స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే యాంటీబాడీలున్నట్లు వెలుగులోకి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
అది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్
స్క్రబ్ టైఫస్‌నే బుష్ టైఫస్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. వైరస్‌ను వ్యాపింపజేసే చిన్నచిన్న పురుగుల వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
వర్షాలు పడిన తర్వాత, ఈ పురుగుల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా ఇంట్లో దాచుకునే వంట చెరకుపై ఈ పురుగులు కనిపిస్తాయి. ఈ వంట చెరకును పిల్లలు ముట్టుకున్నప్పుడు లేదా బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జనకు వెళ్లినప్పుడు ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది.
2015 నుంచి 2019 మధ్య తూర్పు ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆరు జిల్లాల్లో రుతుపవనాల అనంతరం వెలుగుచూసిన విష జ్వరాలకు స్క్రబ్ టైఫస్, డెంగీలే ప్రధాన కారణమని మరో అధ్యయనంలో తేలింది.
మరో ప్రాణాంతక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లెప్టోస్పిరోసిస్ కూడా ఇక్కడ జంతువుల నుంచి మనుషులకు సోకుతుంటుంది. మరోవైపు దోమల ద్వారా వ్యాప్తి చెందే చికన్‌గన్యా కూడా ఇక్కడ ఎక్కువగానే సంక్రమిస్తుంటుంది.
‘‘వర్షాలు పడిన తర్వాత ఇక్కడ జ్వరాలకు సంబంధించిన కేసులు పెరుగుతుంటాయి. వీటిని నియంత్రించేందుకు మనం అప్రమత్తంగా ఉండాలి’’అని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్‌లోని వైరాలజీ ప్రొఫెసర్ వీ రవి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2006లోనూ ఇలాగే
2006లోనూ ఉత్తర్ ప్రదేశ్‌లో చిన్నారులు సహా చాలామంది అంతుచిక్కని విష జ్వరాలతో మరణించారు. అయితే, ఈ మృతులకు కారణం రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతాల్లో పెరిగే ఒకరమైన బీన్స్ అని తర్వాత అధ్యయనాల్లో తేలింది.
‘‘పేదరికం, ఆకలి, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, నిర్లక్ష్యం, ఆడుకోవడానికి బొమ్మలు లేకపోవడం, ఈ చెట్లు ఎక్కడపడితే అక్కడే పెరగడం తదితర కారణాలకు ఫూడ్ పాయిజనింగ్ తోడుకావడంతో ఈ మరణాలు సంభవించాయి’’అని ఆనాడు పరిశోధకులు తేల్చారు.
తాజా ఇన్ఫెక్షన్లకు కారణం డెంగీనా? లేక వేరే ఇంకేమైనా ఉందా? అనే విషయంపై లోతైన పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ అంతుచిక్కని జ్వరాలతో వచ్చే బాధితుల నుంచి నమూనాలు సేకరించి జీనోమ్ టెస్టింగ్‌కు పంపించేలా స్థానిక క్లినిక్‌లు, ఆసుపత్రులకు శిక్షణ ఇవ్వాలి.

ఫొటో సోర్స్, AFP
ఇంతకీ ఎలా మొదలవుతున్నాయి?
అసలు ఈ వ్యాధులు ఎలా మొదలవుతున్నాయి? ఎలా వ్యాపిస్తున్నాయి? ప్రభుత్వ ఆసుపత్రులకు చేరుకునేందుకు పట్టే చాలా సమయమే ఈ ఇన్ఫెక్షన్‌లు తీవ్రం అయ్యేందుకు కారణమా? తదితర అంశాలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు.
మరోవైపు ప్రస్తుతం విష జ్వరాలతో బాధపడుతున్న చిన్నారులకు టీబీ లాంటి ఇతర వ్యాధులు ఉన్నాయా? అనే విషయంలోనూ సమాచారం లేదు.
ఈ అంతుచిక్కని మరణాలకు డెంగీ మాత్రమే కారణం అయితే, దోమల నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలు విఫలమవుతున్నట్లే పరిగణించాలి. ఈ ఇన్ఫెక్షన్ల తీవ్రతను తెలుసుకోవాలంటే భిన్న వయసుల వారిలో సెరో సర్వే చేపట్టాల్సిన అవసరం ఉంటుందని డాక్టర్ హెల్స్‌టెడ్ అన్నారు.
‘‘ఎప్పటికప్పుడు ఈ ఇన్ఫెక్షన్లపై మనం నిఘా పెట్టకపోతే, ఇవి ఎప్పటికీ అంతుచిక్కకుండానే మిగిలిపోతాయి. అప్పుడు మనం వీటిని కట్టడి చేయలేం కూడా’’అని ఒక భారత వైరాలజిస్టు వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్లకు తాలిబాన్‌కు మధ్య తేడా ఏంటి?
- ''ప్రజలను గౌరవించండి, మనం వారి సేవకులం'' -ఫైటర్లతో తాలిబాన్
- ‘తాలిబాన్ల రాకతో శాంతి వెల్లివిరుస్తుంది’ - పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది
- ‘బుర్ఖా వేసుకుని, మారువేషంలో 11 చెక్పాయింట్లను దాటి వెళ్లా. కానీ..’
- ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా.. తాలిబాన్‌ను ఎందుకు ఓడించలేకపోయింది?
- తాలిబాన్లు అధికారంలోకి రావడం వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం
- ‘పాకిస్తాన్ మాట వినకపోతే.. ప్రపంచానికి పెద్ద సమస్య తప్పదు’ - పాక్ మంత్రి ఫవాద్
- అఫ్గానిస్తాన్: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాక్ సరిహద్దుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు
- తాజా నర మాంసాన్ని మేలైన ఔషధంగా ప్రాచీన వైద్య నిపుణులు ఎందుకు భావించేవారు?
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









