మలేరియాపై పోరాటంలో చరిత్రాత్మక ముందడుగు.. వ్యాక్సినేషన్‌కు అనుమతి.. ఈ వ్యాక్సీన్ అభివృద్ధికి ఎందుకు వందేళ్లు పట్టింది? మలేరియా నియంత్రణ ఎందుకు అంత కష్టం?

మలేరియా దోమలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జేమ్స్ గళ్లఘర్
    • హోదా, బీబీసీ హెల్త్ కరస్పాండెంట్

మలేరియాపై పోరాటంలో చరిత్రాత్మక ముందడుగు. ఆఫ్రికాలో చిన్నారులందరికీ వ్యాక్సీన్ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది.

మానవాళిని పీడిస్తున్న ప్రధానమైన వ్యాధుల్లో మలేరియా ఒకటి. దీని వల్ల నవజాత శిశువులు, పిల్లలు పెద్దయెత్తున మరణిస్తున్నారు.

దాదాపు శతాబ్ద కాలం నుంచీ జరుగుతున్న ప్రయోగపరీక్షల అనంతరం వ్యాక్సీన్ చేతికి అందడంతో.. దీన్ని భారీ విజయంగా నిపుణులు చెబుతున్నారు.

‘‘ఆర్‌టీఎస్, ఎస్‌’’గా పిలుస్తున్న ఈ వ్యాక్సీన్ సమర్థంగా పనిచేస్తున్నట్లు ఆరేళ్ల క్రితమే రుజువైంది.

ఘనా, కెన్యా, మలావీలలో ప్రయోగ పరీక్షలు విజయవంతం కావడంతో, సబ్-సహరన్ ఆఫ్రికాతోపాటు మలేరియా కేసులు ఒక మోస్తరు నుంచి భారీగా వస్తున్న ఇతర ప్రాంతాల్లోనూ వ్యాక్సినేషన్ మొదలు పెట్టనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.

‘‘ఇది చరిత్రాత్మక ఘట్టం. పిల్లలకు ఇచ్చే మలేరియా వ్యాక్సీన్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాం. పిల్లల ఆరోగ్యం, మలేరియా నియంత్రణ, సైన్స్‌లో ఇది భారీ ముందడుగు’’అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జెనరల్ డాక్టర్ టెడ్రోస్ అథనోమ్ ఘెబ్రెయేసుస్ వ్యాఖ్యానించారు.

మలేరియా వ్యాక్సిన్

ఫొటో సోర్స్, Getty Images

ప్రాణాంత పారాసైట్

ప్రాణాంతక పారాసైట్ వల్ల మలేరియా సోకుతుంది. ఈ పారాసైట్ మన శరీరంలో తన సంఖ్యను రెట్టింపు చేసుకునేందుకు రక్త కణాలపై దాడిచేస్తుంది. రక్తాన్ని పీల్చే దోమల ద్వారా ఈ పారాసైట్ మనుషుల్లోకి ప్రవేశిస్తుంది.

ఈ పరాన్నజీవిని హతమార్చే ఔషధాలు, దోమలను అడ్డుకునే దోమల తెరలు, దోమలను చంపే కీటకనాశనులు.. మలేరియా కేసులను తగ్గించేందుకు తోడ్పడుతున్నాయి.

ఆఫ్రికాలో మలేరియా ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. 2019 నుంచి ఇక్కడ మలేరియాతో 2,60,000 మంది చిన్నారులు మరణించారు.

మలేరియాకు వ్యతిరేకంగా వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు ఏళ్లు పడుతుంది. వరుసగా చాలాసార్లు మలేరియా సోకితే మనకు ఇమ్యూనిటీ వస్తుంది. దీంతో తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చే ముప్పు తగ్గుతుంది.

భారీగా పిల్లలకు ఈ వ్యాక్సీన్ ఇవ్వడం సాధ్యమేనా? దీని వల్ల ఉపయోగం ఉంటుందా? అని తెలుసుకునేందుకు ఘనాలో నిర్వహించిన ప్రయోగ పరీక్షలకు డాక్టర్ క్వామే అంపోన్సా అచియానో నేతృత్వం వహించారు.

‘‘ఈ ఫలితాలు మాలో నూతనోత్తేజం నింపాయి. భారీగా వ్యాక్సినేషన్‌తో మలేరియా కేసులను నామమాత్రానికి పరిమితం చేయొచ్చు’’అని ఆయన అన్నారు.

‘‘అవి చాలా దారుణమైన రోజులు. ప్రతివారమూ మలేరియాతో చాలా మంది పిల్లలు స్కూల్‌కు రాలేకపోయేవారు. ఏళ్లపాటు మమ్మల్ని మలేరియా పీడించింది’’అని ఆయన వివరించారు.

మలేరియా పారసైట్లు

ఫొటో సోర్స్, Getty Images

పిల్లల ప్రాణాలను కాపాడేందుకు...

మలేరియా పారాసైట్లు వందకుపైనే ఉన్నాయి. ఆఫ్రికాలో ఎక్కువగా విజృంభించే ప్లాస్మోడియం ఫాల్సిపారంను ఈ ఆర్‌టీఎస్, ఎస్ వ్యాక్సీన్ లక్ష్యంగా చేసుకుంటుంది.

‘‘వ్యాక్సీన్‌తో ప్రతి పది కేసుల్లో నాలుగింటిని అడ్డుకోవచ్చు. తీవ్రమైన కేసుల్లో మూడింటిని నియంత్రించొచ్చు. పిల్లలకు రక్తం ఎక్కించాల్సిన అవసరాన్ని మూడోవంతుకు తగ్గించొచ్చు’’అని 2015లో ఈ వ్యాక్సీన్‌పై నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో తేలింది.

అయితే, ఈ వ్యాక్సీన్ నిజంగానే మలేరియాను అడ్డుకోగలదా? అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఎందుకంటే దీన్ని నాలుగు డోసుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి మూడు వ్యాక్సీన్ల ఒకటి, ఐదు, ఏడు నెలల వయసులో ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగో వ్యాక్సీన్‌ను 18 నెలల వయసులో ఇవ్వాలి.

మలేరియా వ్యాక్సిన్

ప్రయోగ పరీక్షల ఫలితాలను డబ్ల్యూహెచ్‌వోలోని రెండు నిపుణుల కమిటీలు విశ్లేషించాయి.

ఈ ప్రయోగ పరీక్షల్లో భాగంగా 23 లక్షల లక్షల డోసులను పిల్లలకు ఇచ్చారు.

  • వ్యాక్సీన్ సురక్షితమైనది. దీనితో తీవ్రమైన మలేరియా కేసులను 30 శాతం వరకు తగ్గించొచ్చు.
  • దోమల తెరలు అందుబాటులో లేని మూడింట రెండొంతుల మంది వరకు పిల్లలకు ఈ టీకాలు ఇవ్వగలిగాం.
  • ఇతర వ్యాక్సీన్లు, మలేరియాను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలతో ఈ వ్యాక్సీన్ ఎలాంటి నెగిటివ్ ప్రభావాన్నీ చూపించదు.
  • తక్కువ ధరకే ఇది అందుబాటులోకి వస్తుంది.

‘‘శాస్త్రీయ పరిభాషలో చెప్పాలంటే ఇది భారీ ముందడుగు. ప్రజారోగ్య సంరక్షణలో ఇదొక చరిత్రాత్మక ఘట్టం’’అని డబ్ల్యూహెచ్‌వో గ్లోబల్ మలేరియా ప్రోగ్రామ్ డెరెక్టర్ డాక్టర్ పెడ్రో అలోన్సో చెప్పారు.

‘‘మలేరియా వ్యాక్సీన్ కోసం మనం వందేళ్లుగా ఎదురుచూస్తున్నాం. ఇది ఆఫ్రికాలో చిన్నారుల ప్రాణాలను కాపాడగలదు. మలేరియా విజృంభణలను కూడా అడ్డుకోగలదు.’’

మలేరియా

నియంత్రణ ఎందుకు అంత కష్టం?

కోవిడ్-19 వ్యాక్సీన్లను రికార్డు వేగంతో అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలకు మలేరియా వ్యాక్సీన్ అభివృద్ధికి మాత్రం ఎందుకంత సమయం పట్టింది?

కోవిడ్-19తో పోలిస్తే, మలేరియాకు కారణమయ్యే పారాసైట్ చర్యలు చాలా నెమ్మదిగా ఉంటాయి. ఈ చర్యలను గుర్తించడానికి సమయం పడుతుంది.

మన రోగ నిరోధక వ్యవస్థను దాటుకుని ముందుకు వెళ్లేలా మలేరియా పారాసైట్ తనను తాను మెరుగుపరచుకుంది. అందుకే దీన్ని గుర్తించడానికి కాస్త సమయం పడుతుంది.

మలేరియా

ఈ పరాన్నజీవి జీవిత చక్రం రెండు దశల్లో ఉంటుంది. ఒకటి దోమల్లో.. రెండోది మనుషుల్లో. మన శరీరంలోనూ ఇది చాలా మార్పులకు లోనవుతుంది. కాలేయ కణాలకు సోకినప్పుడు ఒకలా, ఎర్రరక్త కణాలకు సోకినప్పుడు మరోలా ఇది స్పందిస్తుంది.

దోమలు కరిచిన తర్వాత, కాలేయానికి ఇన్ఫెక్షన్ సోకేవరకు మధ్య ఉన్న ఈ పరాన్నజీవి దశను స్పోరోజైట్‌గా పిలుస్తారు. ఈ దశను లక్ష్యంగా చేసుకుంటూ ఆర్‌టీఎస్, ఎస్ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేశారు.

అందుకే ఇది 40 శాతం సామర్థ్యంతో పనిచేస్తుంది. అయినప్పటికీ ఇది భారీ ముందడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. శక్తిమంతమైన వ్యాక్సీన్ల అభివృద్ధికి ఇది బాటలు పరిచే అవకాశముంది.

మలేరియా వ్యాక్సీన్

ఫొటో సోర్స్, BRIAN ONGORO

ఫార్మాస్యూటికల్ దిగ్గజం జీఎస్‌కే ఈ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసింది. దోమల తెరలు, కీటకనాశనులు తదితర ఇతర మలేరియా నియంత్రణ చర్యలకు ఇది ప్రత్యామ్నాయం కాదు.ఈ వ్యాక్సీన్ తీసుకున్నప్పటికీ నియంత్రణ చర్యలను పాటించాల్సిందే. అప్పుడే మలేరియా కట్టడి సాధ్యపడుతుంది.

ఆఫ్రికా వెలుపలి ప్రాంతాల్లో ఈ వ్యాక్సీన్ ఇవ్వడంతో పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. ఎందుకంటే భిన్న ప్రాంతాల్లో భిన్న రకాల పరాన్నజీవుల ద్వారా మలేరియా విజృంభిస్తోంది.

‘‘ఈ వ్యాక్సినేషన్ ఒక చరిత్రాత్మక ఘట్టం. ప్రజల్లో భయాలను ఇది దూరం చేయగలదు’’అని పాథ్ మలేరియా వ్యాక్సీన్ ఇనీషియేటివ్‌కు చెందిన డాక్టర్ అష్లీ బిర్కెట్ అన్నారు.

‘‘సంపూర్ణ ఆరోగ్యంతో ఆడుకునే మీ పిల్లలకు మలేరియా ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే దోమలు కుట్టిన తర్వాత వారు మంచానికే పరిమితమైతే... కొన్ని వారాల్లోనే వారు మరణిస్తే... ఊహించడానికే ఎంతో భయానకంగా ఉంది కదా’’అని ఆయన అన్నారు.

‘‘మలేరియా చాలా పెద్ద సమస్య. తీవ్ర భయాందోళనలకు ఇది కారణం అవుతోంది.’’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)