కరోనా సైడ్ ఎఫెక్ట్స్: కాలి వేళ్ల మీద పుండ్లు ఎందుకు ఏర్పడుతున్నాయి?

ఫొటో సోర్స్, CHRIS CURRY/GETTY
- రచయిత, మిషెల్లీ రాబర్ట్స్
- హోదా, హెల్త్ ఎడిటర్, బీబీసీ ఆన్‌లైన్
కోవిడ్ వైరస్ బారిన పడిన వారిలో కొందరి కాలి వేళ్లపై కందిపోయినట్లు కనిపించే గాయాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. కోవిడ్ వైరస్ మీద పోరాడటంలో భాగంగా రోగ నిరోధక వ్యవస్థ అటాక్ మోడ్‌లోకి వెళ్లినప్పుడు ఇలాంటి దుష్ప్రభావం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రోగ నిరోధక వ్యవస్థలోని కొన్ని భాగాలవల్ల ఇది ఏర్పడుతుందని తాము గుర్తించినట్లు వారు వెల్లడించారు.
కోవిడ్ టో (Covid toe) గా బ్రిటిష్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ పేర్కొన్న ఈ లక్షణాలకు చికిత్స జరపడానికి అవకాశం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు.
'కోవిడ్ టో' అంటే ఏంటి ?
ఇది అన్ని వయసుల వారిలో కనిపిస్తుందని, కానీ, పిల్లలు, టీనేజర్లలో ఎక్కువగా ఉంటుందని నిపుణులు వెల్లడించారు. దీనివల్ల నొప్పి ఏమీ ఉండనప్పటికీ దురద, బొబ్బలు, ఒక్కోసారి వాయడంలాంటి లక్షణాలు బయటపడతాయి.
ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు తాను చెప్పులు కూడా వేసుకోలేకపోయానని, నడవలేకపోయానని స్కాట్‌లాండ్‌కు చెందిన 13 ఏళ్ల సోఫియా వెల్లడించారు. ఎక్కువ దూరం నడవడానికి తాను వీల్‌చైర్ ఉపయోగించాల్సి వచ్చిందని వచ్చిందని ఆమె బీబీసీతో అన్నారు.
సోఫియా గత ఏడాది కోవిడ్ బారిన పడ్డారు.
సర్వసాధారణంగా ఇది బొటన వేలు మీద కనిపిస్తుంది. ఒక్కోసారి కాలి వేళ్లన్నింటికి పాకుతుంది. ఎర్రగా కందిపోయినట్లుగా కనిపిస్తుంది. కొందరిలో చర్మం కమిలిపోవడంతోపాటు దురద, చిన్నచిన్న గాయాల్లాంటివి ఏర్పడతాయి. ఒక్కోసారి చీము కూడా ఏర్పడుతుంది.
కొంతమందిలో ఇది కొన్ని వారాలపాటు, మరికొందరిలో ఇది నెలలపాటు కొనసాగింది
ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న వారిలో చాలామందికి కోవిడ్ లక్షణాలైన వాసన, రుచి తెలియకపోవడం, దగ్గు జ్వరంలాంటివేవీ కనిపించ లేదు.

ఫొటో సోర్స్, COVID-PIEL STUDY
ఇది ఎందుకు వస్తుంది?
రక్తం, చర్మ పరీక్షల ద్వారా తేలిన విషయమేంటంటే, శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థలోని రెండు కీలక భాగాలు ఈ పరిస్థితికి కారణమవుతాయి. ఈ రెండు భాగాలే కోవిడ్ వైరస్‌ను ఎదుర్కొనేలా శరీరాన్ని సిద్ధం చేస్తాయి.
దీనిలో ఒకదాన్ని టైప్ 1 ఇంటర్‌ఫెరాన్ అంటారు. ఇది యాంటీ వైరల్ ప్రొటీన్. రెండోది ఒకరకమైన యాంటీబాడీ. ఇది ఒక్కోసారి బయటి నుంచి వచ్చిన వైరస్ కణాలపైనే కాకుండా, శరీరంలోని కణాల మీద కూడా దాడి చేస్తుంటుంది.
ఈ ప్రభావం కనిపించే ప్రాంతాలకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణమవుతాయని యూనివర్సిటీ ఆఫ్ పారిస్ శాస్త్రవేత్తలు గుర్తించారు.
‘కోవిడ్ టో’ ఏర్పడిన 50మందిని శాస్త్రవేత్తలు పరిశీలించారు. వీరు కాక ఇదే లక్షణాలున్న మరో 13 మందిని కూడా వారు గమనించారు. ఎందుకంటే వారిలో ఇలాంటి పరిణామం కోవిడ్ వైరస్ రావడానికి చాలా ముందే ఏర్పడింది.
తాజా పరిశోధనలు ఈ తరహా సమస్యను అర్ధం చేసుకోవడంలో మరింత ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, EPA
తగ్గుతుందా?
చలికాలంలో ఇలాంటివి అప్పుడప్పుడు ఏర్పడుతుంటాయని, కొన్నాళ్లకు వాటంతట అవే తగ్గుతుంటాయని, అయితే, ఈ పరిశోధనల వల్ల వాటికి పరిష్కారం దొరకవచ్చని యూకేకు చెందిన డాక్టర్ ఇవాన్ బ్రిస్టో అన్నారు.
కొందరు వీటి కోసం మందులు, క్రీములు వాడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది.
''ఈ సమస్యను అర్ధం చేసుకోవడం వల్ల దీనికి చికిత్స విధానాలను కూడా కనుగొనే అవకాశం ఏర్పడుతుంది'' అని డాక్టర్ బ్రిస్టో అన్నారు.
కరోనా మొదటి దశలో ‘కోవిడ్ టో’ చాలామందిలో కనిపించిందని, కానీ డెల్టా వేరియంట్ వేవ్‌లో తగ్గు ముఖం పట్టిందని డాక్టర్ వెరోనిక్ బటాయిలె అన్నారు. ఆమె ప్రముఖ చర్మవ్యాధుల నిపుణురాలు
వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న కొద్దీ ఇది మరింత తగ్గు ముఖం పట్టవచ్చన్న అభిప్రాయం కూడా వినిపించింది. '' వ్యాక్సినేషన్ తర్వాత ఇవి బాగా తగ్గిపోవచ్చు'' అన్నారు డాక్టర్ వెరోనిక్
కోవిడ్ కారణంగా ఏర్పడే చర్మ సమస్యలు తీవ్రంగా కోవిడ్ సమస్యను ఎదుర్కొన్నవారిలో, అసలు లక్షణాలు లేని వారిలో కూడా కనిపిస్తున్నందున కోవిడ్ వైరస్‌తో దీన్ని ముడిపెట్టలేమని కూడా డాక్టర్ వెరోనిక్ అన్నారు.
అయితే, బ్రిటిష్ డెర్మటాలజిస్ట్స్ అసోసియేషన్ మాత్రం ఈ చర్మ సమస్యను కోవిడ్ సమస్యల్లో ఒకటిగానే పరిగణించింది.
ఇవి కూడా చదవండి:
- మా ఊరు ఎవరిది
- ఫేస్‌బుక్ వల్ల పిల్లలతో పాటు ప్రజాస్వామ్యానికి హాని : మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌజెన్
- ఫ్రెంచ్ చర్చిలో 2,16,000 మంది చిన్నారులపై లైంగిక వేధింపులు
- ‘మాజీ గర్ల్ ఫ్రెండ్ శాపాన్ని తొలగించలేకపోయిన’ భూత వైద్యురాలిపై రూ. 25 లక్షల దావా
- ప్రియాంకా గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఎందుకు అప్పగించట్లేదు?
- సముద్రపు దొంగల్ని పట్టుకునే విమానం లాంటి పక్షి
- ‘బహుమతులతో బురిడీ.. అమ్మాయిలను ఎరవేసి బ్లాక్‌మెయిలింగ్.. ఇదీ చైనా ఎత్తుగడ’
- ఉత్తర కొరియా: ఆంక్షల్ని ధిక్కరిస్తూ యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్ ప్రయోగం
- చైనా ప్రపంచానికి సాయం చేస్తోందా, లేక అప్పుల ఊబిలో ముంచేస్తోందా?
- పాకిస్తాన్ నుంచి అఫ్గానిస్తాన్‌కు డాలర్ల స్మగ్లింగ్ జరుగుతోందా... పాక్ రూపాయి పడిపోవడానికి అదే కారణమా?
- నిజమైన గూఢచారులు జేమ్స్బాండ్లాగే ఉంటారా? సీక్రెట్ సర్వీస్‌లో పనిచేసే ఆఫీసర్ ఏం చెబుతున్నారు
- డన్‌కర్క్: ‘చరిత్ర చెప్పని, పుస్తకాల్లో చోటు దక్కని’ 300 మంది భారత సైనికుల కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








