మలేరియా: ఇప్పటివరకు వచ్చిన టీకాల్లో ఇదే అత్యుత్తమమైనదా

మలేరియా వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫిలిప్పా రాక్స్‌బీ
    • హోదా, బీబీసీ హెల్త్ రిపోర్టర్

యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేస్తున్న మలేరియా వ్యాక్సీన్ 77 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని తొలి ట్రయల్స్‌లో తేలింది. ఈ ప్రయత్నాలు సఫలమైతే ఈ వ్యాధిని అరికట్టే దిశలో పురోగతి లభిస్తుందని ఆక్స్‌ఫర్డ్ బృందం అంటోంది.

సబ్ సహారన్ ఆఫ్రికా దేశాలలో మలేరియా బారిన పడి ఏటా నాలుగు లక్షల కన్నా ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో పిల్లలే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు.

మలేరియాకు ఎన్నో ఏళ్లుగా వ్యాక్సీన్ కనిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఇప్పటి వరకూ ఏవీ సఫలం కాలేదు.

విజయం దిశగా తొలి అడుగు.

ఈ వ్యాక్సీన్ సమర్థమైనదని తేలితే అది ప్రజారోగ్యంపై మంచి ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు అంటున్నారు.

పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో 450 మంది పిల్లలపై చేసిన ట్రయల్స్‌లో ఈ వ్యాక్సీన్ సురక్షితం, సమర్థవంతం అని తేలింది.

మలేరియా వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

దోమల ద్వారా మనుషులకు మలేరియా.

మలేరియాకు మందు ఉంది. నివారణ కూడా సాధ్యమే. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2019లో ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల మంది ఈ వ్యాధి బారినపడ్డారు. అందులో నాలుగు లక్షల మంది చనిపోయారు.

మలేరియా సోకగానే జ్వరం, తలనొప్పి, వణుకు మొదలవుతాయి. వెంటనే చికిత్స చేయకపోతే వ్యాధి తీవ్రమై మరణానికి దారి తీస్తుంది.

ప్రజారోగ్యం మెరుగవుతుంది

కనీసం 75 శాతం సామర్థ్యం సాధించాలనే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యాన్ని చేరుకున్న మొదటి మలేరియా వ్యాక్సీన్ ఇదేనని వ్యాక్సీనాలజీ ప్రొఫెసర్ అడ్రైన్ హిల్ అన్నారు. ఆయన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో జెన్నర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

ఇప్పటి వరకు మలేరియాకు వ్యాక్సీన్ కనిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలలో ఒక వ్యాక్సీన్ 55 శాతం ప్రభావం చూపించిందని, డబ్ల్యూహెచ్ఓ లక్ష్యాలను దాటిన తొలి వ్యాక్సీన్ ఇదేనని ఆయన అన్నారు.

కోవిడ్ వ్యాప్తికి ముందే ఈ మలేరియా వ్యాక్సీన్ ట్రయల్స్ 2019లో ప్రారంభమయ్యాయి. దీని ద్వారా వచ్చిన అనుభవంతో ఆక్స్‌ఫర్డ్ బృందం అత్యంత వేగంగా కోవిడ్‌కు వ్యాక్సీన్ (ఆస్ట్రాజెనెకా) కనిపెట్టగలిగిందని ప్రొఫెసర్ హిల్ తెలిపారు.

మలేరియా వ్యాక్సీన్ రావడానికి చాలా సమయం పట్టింది. ఎందుకంటే ఇందులో వేయి రకాల జన్యుపరమైన పరివర్తనలు వచ్చాయి. అదే కాకుండా మలేరియాతో పోరాడడానికి చాలా ఎక్కువ రోగ నిరోధక శక్తి అవసరం అవుతుంది.

"ఈ కారణాల వల్లే అనేక రకాలా వ్యాక్సీన్లు సఫలం కాలేకపోయాయి. అయితే, ప్రస్తుత ట్రయల్స్ విజయవంతమైతే ప్రజారోగ్యం మెరుగయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది." అని ప్రొఫెసర్ హిల్ అన్నారు.

మలేరియా వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

'ప్రాణాలు నిలిపే సాధనం'

అయితే మలేరియా తీవ్రంగా కావడానికి ముందు అంటే మే, ఆగస్టుల మధ్య కాలంలో R21/Matrix-M వ్యాక్సీన్ ఫలితాలను అంచనా వేసినట్లు లాన్సెట్ రూపొందించిన ప్రచురణ కాని ఒక నివేదిక పేర్కొంది.

ఈ నివేదికను ఆక్స్‌ఫర్డ్, బుర్కినా ఫాసోలోని ననోరో, అమెరికాలకు చెందిన నిపుణుల బృందం సంయుక్తంగా రూపొందించింది.

ఈ వ్యాక్సీన్ హైయ్యర్ డోస్ గ్రూప్ మీద 77 శాతం, లోయర్ డోసేజ్ గ్రూప్ మీద 71శాతం ప్రభావం చూపినట్లు తేలింది.

ఈ ఫలితాలు ఆశాజనకంగా, ప్రభావవంతంగా కనిపిస్తున్నాయని ననోరోలోని క్లినికల్ రీసెర్చ్ యూనిట్‌ లో ఇన్వెస్టిగేటర్‌గా పని చేస్తున్న ప్రొఫెసర్ హలిడౌ టింటో వెల్లడించారు.

ఫేజ్ త్రీ ట్రయల్ కోసం ఎదురు చూస్తున్నామని, దీని ద్వారా ఈ వ్యాక్సీన్ పనితీరును స్పష్టంగా చూపడానికి అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు.

గత ఏడాది ఆఫ్రికాలో కరోనా వైరస్ కన్నా ఎక్కువమంది మలేరియా కారణంగా చనిపోయారు.

అనుమతులు వచ్చిన కొద్ది రోజులలోనే 200 మిలియన్ డోసుల వ్యాక్సీన్ ను సరఫరా చేయగలనన్న నమ్మకం తమకు ఉందని భారత్ కు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

ఈ వ్యాక్సీన్ ద్వారా ఎక్కువ రోగ నిరోధక శక్తిని అందించే ఉత్ప్రేరకాన్ని బయోటెక్నాలజీ కంపెనీ నోవావాక్స్ అందించింది.

ఆఫ్రికాలో మలేరియా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది, చిన్నారులలో ఎక్కువ మరణాలకు ఇదే కారణమవుతోంది.

రాబోయే సంవత్సరాలలో ఈ కొత్త రకం వ్యాక్సీన్‌కు అనుమతులు వస్తాయని బుర్కినా ఫాసో ఆరోగ్యమంత్రి చార్లెమాగ్నె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)