వైద్యుడు లండన్‌లో, రోగి 2400 కిలోమీటర్ల దూరంలో... కానీ ఆపరేషన్ చేశారు.. ఇది ఎలా సాధ్యమైందంటే..

ఫొటో సోర్స్, PA
- రచయిత, అమీ క్లార్కే
- హోదా, లండన్
- చదివే సమయం: 4 నిమిషాలు
సుదూర ప్రాంతంలోని రోగికి డాక్టర్ తానున్నచోటు నుంచే ఆపరేషన్ చేశారు. లండన్ నుంచి 2400 కిలోమీటర్ల దూరంలోని జిబ్రాల్టర్‌లోని రోగికి తొలిసారి సుదూర రోబోటిక్ శస్త్రచికిత్స చేశామని, ఇలాంటి ఆపరేషన్ యూకేలోనే మొదటిదని లండన్‌లోని వైద్యుడు తెలిపారు
పాల్ బక్స్‌టన్ శరీరం నుంచి ప్రొస్టేట్‌ను తొలగించే శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు ''దాదాపు అక్కడే ఉన్నట్టుగా అనిపించింది'' అని ప్రముఖ రోబోటిక్ యురాలజికల్ సర్జన్, ప్రొఫెసర్ ప్రోకర్ దాస్‌గుప్తా తెలిపారు.
ఈ శస్త్రచికిత్స చేయించుకోవడానికి ''పెద్దగా ఆలోచించలేదని, వైద్య చరిత్రలో భాగమవుతానని భావించానని'' 62 ఏళ్ల క్యాన్సర్ రోగి పాల్ బక్స్‌టన్ చెప్పారు.
చికిత్స కోసం సుదూరప్రయాణాలు చేసి, బోలెడు ఖర్చులు పెట్టే పనిని ఈ రోబోటిక్ శస్త్రచికిత్సలు తగ్గిస్తాయని, మారుమూల ప్రాంతాల్లో ఉండే రోగులకు మెరుగైన వైద్య సంరక్షణ అందించడానికి ఇవి సాయపడతాయని ఆశిస్తున్నారు.
యూకే వైద్యులు అధునాతన టెలిసర్జరీ కీలక పురోగతిలో భాగస్వాములయ్యారు. ఇందులో భాగంగా సుమారు 4వేల మైళ్ల దూరంలో, శాస్త్ర పరిశోధన కోసం శరీరాన్ని దానం చేసిన వ్యక్తి మృతదేహంపై ట్రాన్స్‌అట్లాంటిక్ రోబోటిక్ స్ట్రోక్ ప్రక్రియ నిర్వహించి, సుదూర ప్రాంతం నుంచి శస్త్రచికిత్సలు చేయడం సాంకేతికంగా సాధ్యమేనని నిరూపించారు.

బక్స్‌టన్ సోమర్‌సెట్‌లోని బర్న్‌హామ్-ఆన్-సీ ప్రాంతానికి చెందినవారు. కానీ ఆయన 40 ఏళ్ల కిందటే జిబ్రాల్టర్‌కు వెళ్లి స్థిరపడ్డారు.
బ్రిటన్‌కు చెందిన ఓవర్సీస్ టెరిటరీ అయిన జిబ్రాల్టర్‌లో యూరోపోర్ట్‌లోని సెయింట్ బెర్నార్డ్స్ అనే ఆసుపత్రి మాత్రమే ఉంది. దీంతో క్లిష్టమైన వైద్య చికిత్స అవసరమయ్యే వారు తరచూ విదేశాలకు, అర్హత ఉంటే యూకేలోని ఎన్‌హెచ్‌ఎస్ సేవలు పొందడడానికి వెళుతుంటారు.
క్రిస్మస్ తర్వాత బక్స్‌టన్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్ నిర్ధరణ అయింది. సాధారణంగా ఆయనను ఎన్‌హెచ్‌ఎస్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచుతారని భావించారు. అయితే ట్రయల్‌లో భాగంగా నిర్వహించే ఈ సుదూరచికిత్సకు తొలి రోగిగా మారే అవకాశాన్ని బక్స్‌టన్ వెంటనే అంగీకరించారు.
"చాలామంది నన్ను చూసి 'నువ్వు నిజంగానే ఇది చేయించుకుంటావా?' అని అడిగారు. కానీ దీని ద్వారా నేను కూడా ఏదో ఒక విధంగా సహాయం చేస్తున్నాననిపించింది" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, PA
ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ యజమాని అయిన బక్స్‌టన్ మాట్లాడుతూ "జిబ్రాల్టర్‌లో ఈ టెలీ సర్జరీ అవకాశం లేకపోయి ఉంటే నేను లండన్‌కు విమానంలో వెళ్లాల్సి వచ్చేది. అక్కడ ఎన్‌హెచ్‌ఎస్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉండాలి. శస్త్రచికిత్స చేయించుకున్నాక బహుశా మూడు వారాలు లండన్‌లోనే ఉండాల్సి వచ్చేది. అందుకే ఇది పెద్దగా ఆలోచించాల్సిన విషయం కాదనిపించింది. జిబ్రాల్టర్‌కు ఇదొక పురోగతి. ఎందుకంటే ఇక్కడి నుంచి కాలు బయటపెట్టాల్సిన అవసరం లేదు’’ అన్నారు.
ఫిబ్రవరి 11న జరిగిన శస్త్రచికిత్స తర్వాత తనను చాలా బాగా చూసుకున్నారని, ప్రస్తుతం తాను ‘‘ఎంతో బాగున్నానని’’ బక్స్‌టన్ తెలిపారు.

ఫొటో సోర్స్, PA
ఇదెలా పనిచేస్తుంది?
ఈ శస్త్రచికిత్సను లండన్ క్లినిక్ నుంచే నిర్వహించారు. 3డీ హెచ్‌డీ కెమెరాతోపాటు నాలుగు చేతుల రోబోట్‌ను ఒక కన్సోల్ ద్వారా నియంత్రించారు. దీనిద్వారా ఆపరేషన్ చేసేటప్పుడు కేవలం 0.06 సెకన్లు మాత్రమే ఆలస్యమైంది.
యూకేలోని కన్సోల్‌ను ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా జిబ్రాల్టర్‌లో ఉన్న రోబోతో అనుసంధానించారు. బ్యాకప్‌గా 5జీ కనెక్షన్ కూడా ఏర్పాటు చేశారు.
ఒకవేళ కనెక్షన్‌లో సమస్య తలెత్తితే జిబ్రాల్టర్‌లో కూడా ఓ వైద్య బృందం సిద్ధంగా ఉంది. కానీ శస్త్రచికిత్స ఆసాంతం కనెక్షన్‌సజావుగానే సాగింది.
ఈ ప్రక్రియలో టౌమై రోబోటిక్ సిస్టమ్‌ను ఉపయోగించారు. దీనిని లండన్ క్లినిక్,జిబ్రాల్టర్ హెల్త్ అథారిటీ సహకారంతో నిర్వహించారు.
"దూర ప్రాంతాలు, చిన్నపాటి కమ్యూనిటీలు ఉన్న ప్రాంతాలోని రోగులకు కూడా ఉత్తమ సర్జన్ల సేవలు అందించే అవకాశం ఈ విధానంతో సాధ్యమవుతుంది" అని దాస్‌గుప్తా చెప్పారు.
ఇలాంటి ప్రయోగాలలో ఇది మొదటి కేసు. రెండో శస్త్రచికిత్సను కూడా జిబ్రాల్టర్‌కే చెందిన ఓ 52 ఏళ్ల ఒక వ్యక్తికి మార్చి 4న నిర్వహించారు.
యూరోపియన్ అసోసియేషన్ ఆఫ్ యూరాలజీ సమావేశానికి ప్రపంచం నలుమూలల నుంచి హాజరవుతున్న సుమారు 20 వేల మంది యూరాలజీ నిపుణుల కోసం మార్చి 14న జరిగే మరో శస్త్రచికిత్సను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
''ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుందనిపిస్తోంది. దీనివల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు గణనీయమైనవి'' అని తెలిపారు.
ఎన్‌హెచ్‌ఎస్ ప్రస్తుతం స్థానికంగా రోబోటిక్ సహాయక శస్త్రచికిత్సలను ప్రోత్సహిస్తోంది. 2035 నాటికి ఏటా 5లక్షల రోబోట్ శస్త్రచికిత్సలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














