మహిళ కంట్లో 250కి పైగా పేలు.. రెప్ప మూస్తే రక్తం పీల్చేస్తాయి, వెలుతురు పడగానే పారిపోతాయి.. అయినా డాక్లర్లు ఎలా తొలగించారంటే

ఫొటో సోర్స్, Supplied
- రచయిత, అపూర్వ అమీన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కళ్లలో తీవ్రమైన దురద, నొప్పితో బాధపడుతూ 66 ఏళ్ల గీతాబెన్ ఆసుపత్రికి వెళ్లారు. సూరత్‌కు చెందిన గీతాబెన్‌ను రెండున్నర నెలలుగా ఈ సమస్య వేధిస్తోంది. కళ్లు ఎర్రబారడంతో ఆమె సరిగా నిద్ర కూడా పోవట్లేదు.
ఆమె కళ్లను పరీక్షించగా, కనురెప్పల్లో ఒకటి కాదు ఏకంగా 250 పేలు ఉన్నట్లు నేత్ర వైద్యుడు మృగాంక్ పటేల్ గుర్తించారు.
గుజరాత్‌లోని ఆమ్రేలీ జిల్లా సావర్‌కుండ్ల ఆసుపత్రిలో ఈ ఘటన వెలుగు చూసింది.
అయితే, కొన్ని వైద్య పరిమితుల కారణంగా ఇంజెక్షన్లు ఇవ్వకుండానే డాక్టర్, పేను తొలగింపు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఇది రెండు గంటల పాటు జరిగింది.
వైద్య పరిభాషలో, ఈ పరిస్థితిని ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అంటారు. ఇది ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఏంటి? ఇది రాకుండా ఏం చేయాలి?


ఫొటో సోర్స్, Supplied
వింత కేసు
కనుగుడ్లలో రెండున్నర నెలలుగా బాగా దురదగా ఉందంటూ, చికిత్స కోసం గీతాబెన్ ఓపీడీకి వచ్చారని బీబీసీకి సావర్‌కుండ్లలోని లల్లూభాయి సేఠ్ ఆరోగ్య మందిర్ ఆసుపత్రి నేత్ర విభాగం డాక్టర్ మృగాంక్ పటేల్ చెప్పారు.
'కనురెప్పల మీద దురద మామూలుగా చుండ్రు వల్ల వస్తుంది. కానీ, కనురెప్పల్లో పేలు రావడం చాలా అరుదు. మాగ్నిఫికేషన్ కింద కనురెప్పల్ని పరిశీలించినప్పుడు, పేలు కదులుతున్నట్లు కనిపించింది' అని డాక్టర్ మృగాంక్ పటేల్ తెలిపారు.
'గుండ్రని పేను గుడ్లు కూడా కనిపించాయి. ఇది పరాన్నజీవి. వైద్య భాషలో దీన్ని ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అని పిలుస్తారు. చాలా పేలు ఉన్నందున వాటిని తీయడానికి ఎక్కువ సమయం పట్టొచ్చని ముందే ఆ మహిళకు చెప్పాం' అని ఆయన వివరించారు.
దీనికంటే ముందు ఎన్నో ఆసుపత్రులు తిరిగినప్పటికీ ఈ సమస్యను డాక్టర్లు గుర్తించలేకపోయారని గీతాబెన్ కుమారుడు అమిత్ మెహతా అన్నారు.
'పరాన్నజీవి అయిన పేను రక్తాన్ని తాగుతుంది. కళ్లపై ఉండే కణజాలం చాలా పల్చగా ఉంటుంది కాబట్టి అక్కడ సులభంగా రక్తాన్ని తాగగలదు. అవి కనురెప్పలకు అతుక్కుపోయి ఉంటాయి. దీనివల్ల దురద వస్తుంది. ఈ పేలను తొలగించాలని ప్రయత్నించినప్పుడు అవి అంత తేలిగ్గా రావు' అని డాక్టర్ మృగాంక్ వివరించారు.

ఫొటో సోర్స్, Supplied
ఎలా తొలగించారంటే..
'ఈ పేలు వెలుతురు పడినప్పుడు కదలుతుంటాయి. కాబట్టి వాటిని తొలగించడానికి మెక్‌ఫర్సన్ అనే ప్రత్యేక పరికరం వాడాలి. ప్రతీ పేనును పట్టుకొని బయటకు లాగాలి. నొప్పి తెలియకుండా ఉండేందుకు అనస్థీషియా ఇచ్చాం' అని డాక్టర్ మృగాంక్ చెప్పారు.
ఆ తర్వాత దురద తగ్గడంతో గీతాబెన్ ఉపశమనం పొందారని ఆయన తెలిపారు. మరుసటి రోజు పరిశీలిస్తే ఆమె కళ్లు ఆరోగ్యంగా, పేలు లేకుండా కనిపించాయని చెప్పారు.
భారత్‌లో ఇలాంటి కేసులు ఉన్నాయని, అయిదు నెలల క్రితం ఇలాంటిదే ఒక కేసు వెలుగులోకి వచ్చిందని చెప్పారు. అప్పుడు అధ్యయన పత్రాలను శోధించగా ఇవి అరుదైన కేసులని తెలిసినట్లు ఆయన తెలిపారు.
డాక్టర్ మృగాంక్, ఆయన బృందం రెండు గంటల పాటు శ్రమించి గీతాబెన్ రెండు కనురెప్పల నుంచి మొత్తం 250కి పైగా పేలు, 85కు పైగా వాటి గుడ్లను తొలగించారు.
'నాకు డాక్టర్‌గా 21 ఏళ్ల అనుభవం ఉంది. కానీ ఇప్పటివరకు నేను ఇలాంటి కేసులను ఎక్కువగా చూడలేదు' అని బీబీసీతో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రకాశ్ కటారియా అన్నారు.
దాదాపు అయిదు నెలల క్రితం సావర్‌కుండ్లలో నమోదైన కేసులో ఒక పిల్లాడి కనురెప్పలో ఉన్న పేనును సులభంగా బయటకు తీశారు. ఒక గంట వ్యవధిలో ఆ బాలుడు కోలుకున్నారు.
ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అంటే ఏంటి?
యుఎస్ నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అనేది అరుదైన వైద్య పరిస్థితి.
దీనివల్ల పేలు, వాటి గుడ్లు కనురెప్పలలో చేరుతాయి.
ఈ సమస్య వల్ల తీవ్రమైన దురద, కళ్లు ఎర్రబారడం, నిద్రలేమి వస్తుంది. ఇది సాధారణ కంటి ఇన్‌ఫెక్షన్ కానందున దీన్ని నిర్ధరించడం కష్టం.

ఫొటో సోర్స్, Supplied
కనురెప్పల్లోకి పేలు ఎలా వస్తాయి?
ఇది చాలా అరుదైన పరిస్థితి అని, ఈ లార్వా కూడా దోమల లార్వా లాంటిదేనని బీబీసీతో అహ్మదాబాద్‌లోని ధ్రువ్ ఆసుపత్రి కంటి నిపుణుడు డాక్టర్ హర్షద్ అగజా చెప్పారు.
ఇన్‌ఫెక్షన్ కారణంగా లేదా పరిశుభ్రత లోపించినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుందని తెలిపారు.
పేలు రావడానికి కొన్ని రకాల వాతావరణాలు, ఇంట్లోని దిండ్లు కారణం కావొచ్చని అన్నారు.
మనుషులతోపాటు పశువుల్లో కూడా ఈ వ్యాధి కనిపిస్తుందని డాక్టర్ మృగాంక్ చెప్పారు.
'ప్రమాదవశాత్తు కూడా ఈ వ్యాధి సంభవించవచ్చు. అడవి లాంటి చోటికి వెళ్లినప్పుడు లేదా పశువులకు చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఇవి శరీరానికి అంటుకుంటాయి. అలా కనురెప్పల వరకు చేరుకుంటాయి' అని ఆయన అన్నారు.
'కాంతి పడినప్పుడు పేలు పారిపోతాయి కాబట్టి లైట్ లేకుండా వాటిని తొలగించాలి. ఇది చాలా కష్టం. పైగా ఏ ఔషధం కూడా లార్వాలను చంపదు. వాటిని ఒక్కొక్కటిగా పట్టుకొని కంటి నుంచి తొలగించాలి. వాటిని పూర్తిగా చంపగల మందులేవీ లేవు' అని కంటి వైద్య నిపుణులు డాక్టర్ అలాప్ బావిషీ చెప్పారు.
'తలలో ఉండే పేలు, కంటి పేలు భిన్నంగా ఉంటాయి. కంటి పేలు, కంట్లోని తెల్లటి భాగంలో తిరుగుతూ వెలుతురు నుంచి పారిపోతాయి. అవి కంటి రెప్ప లోపల, చీకటిగా ఉండే భాగంలో జీవిస్తాయి. అక్కడే ఉంటాయి' అని ఆయన వెల్లడించారు.

ఫొటో సోర్స్, Supplied
లక్షణాలు ఎలా ఉంటాయి?
కంటి నొప్పి, కళ్ళలో ఎప్పుడూ దురద, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్ మృగాంక్ చెప్పారు.
దురద కారణంగా కనురెప్పల వాపు, నీరు కారడం వంటివి జరుగుతాయన్నారు.
వీటి బారి నుంచి తప్పించుకోవడం ఎలా?
పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమని, చేతులను క్రమం తప్పకుండా శుభ్రంగా కడుక్కోవాలని డాక్టర్ హర్షద్ సూచించారు. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని, యువతలో ఈ పరిస్థితి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు.
కళ్లకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. ఇంట్లో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమని డాక్టర్ ప్రకాశ్ కటారియా అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














