అరుణాచలం సమీపంలోని జవ్వాదు కొండలపై ‘ఆది అరుణాచలేశ్వర ఆలయం’లో బయటపడిన బంగారు నాణేలు

బంగారు నాణేలు, నిధి
    • రచయిత, మాయాకృష్ణన్ కన్నన్
    • హోదా, బీబీసీ కోసం

తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని జవ్వాదు కొండలపైన ఉన్న ఓ శివాలయంలో నిర్మాణ పనుల కోసం గుంత తవ్వుతుండగా బంగారు నాణేలు బయటపడ్డాయి.

తిరువణ్ణామలైలోని కలశపాకం ప్రాంతంలో జవ్వాదు కొండలపై కోవిలూర్ గ్రామం ఉంది.

కలశపాకం తిరువణ్ణామలై జిల్లాలోని ఆధ్యాత్మిక పట్టణం అరుణాచలానికి సమీపంలో ఉంటుంది.

కోవిలూర్ గ్రామంలో ఒక పురాతన శివాలయం ఉంది. ఈ ఆలయాన్ని చోళుల కాలంలో నిర్మించారని అధికారులు చెబుతున్నారు.

ఈ ఆలయ పునర్నిర్మాణానికి తమిళనాడు ప్రభుత్వం నిధులు కేటాయించింది.

దీంతో పనులు కొనసాగుతున్నాయి. 30 మందికి పైగా కార్మికులు ఈ నిర్మాణ పనులు చేస్తున్నారు.

అక్కడ ఒక గుంత తవ్వుతుండగా, అందులో 100 కి పైగా బంగారు నాణేలు కనిపించాయి. దీంతో ఈ విషయాన్ని వెంటనే అధికారులకు తెలియజేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నిధి, తమిళనాడు
ఫొటో క్యాప్షన్, బంగారు నాణేలు

చిన్న బంగారు నాణేలు

ఆలయ నిర్మాణ సమయంలో దొరికిన బంగారు నాణేల నిధి గురించి ధార్మిక శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిలంబరసన్ బీబీసీతో ఫోన్‌లో మాట్లాడారు.

"దేవాదాయ శాఖ తరపున ఆలయంలో ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. సోమవారం (నవంబర్ 3) ఉదయం, కార్మికులు తిరుమూలనాథర్ గర్భగుడిలో నిర్మాణ పనుల కోసం ఒక గుంత తవ్వతుండగా వారికి భూమిలో పాతిపెట్టిన ఒక కుండ కనిపించింది" అని ఆయన చెప్పారు.

పునరుద్ధరణ పనులు, తవ్వకాలు, ఆలయం
ఫొటో క్యాప్షన్, పునరుద్ధరణ పనులు చేపట్టడానికి ముందు ఆలయం ఇలా ఉండేది.

"మేం ఆ కుండను తెరిచి చూసినప్పుడు లోపల బంగారు నాణేలు కనిపించాయి. కుండలో మొత్తం 103 బంగారు నాణేలు ఉన్నాయి. వెంటనే పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి పరిశీలించాం" అని ఆయన చెప్పారు.

దొరికిన 103 బంగారు నాణేలను రెవెన్యూ శాఖ స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఖజానాలో భద్రపరిచిందని ఆయన చెప్పారు.

ధార్మిక శాఖ, దేవాలయం, తిరువణ్ణామలై, శివాలయం

చోళుల కాలం నాటి ఆలయం

తిరువణ్ణామలై తహశీల్దార్, తిరువణ్ణామలై జిల్లా చారిత్రక పరిశోధనా కేంద్రం కార్యదర్శి బాలమురుగన్ జవ్వాదు కొండపై ఉన్న శివాలయానికి సంబంధించిన చారిత్రక సమాచారాన్ని బీబీసీకి తెలిపారు.

"చోళుల కాలం నాటి ఈ ఆలయాన్ని ప్రస్తుతం ‘ఆది అరుణాచలేశ్వర ఆలయం’ అని పిలుస్తున్నప్పటికీ, ఇక్కడి శాసనాల ప్రకారం, దీన్ని తిరుమూలనాథర్ ఆలయం అంటారు" అని బాలమురుగన్ చెప్పారు.

ఆలయంలోని చాలా భాగాలు ధ్వంసమయ్యాయని, ధార్మిక శాఖ పునర్నిర్మాణ పనులు చేపట్టిందని ఆయన తెలిపారు.

"ఈ బంగారు నాణేలు చాలా చిన్నవి. దేవాలయాలు, ఇళ్ల నిర్మాణ సమయంలో గర్భగుడి, ప్రవేశ ద్వారం వద్ద ఈ బంగారు నాణేలను ఉపయోగించారు" అని ఆయన తెలిపారు.

చారిత్రక కట్టడాలు, చోళులు
ఫొటో క్యాప్షన్, బంగారు నాణేలు దొరికిన ప్రదేశం

ఈ ఆలయానికి సమీపంలో బంగారు నాణేలే కాదు, అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయని బాలమురుగన్ అన్నారు.

"ఆలయానికి సమీపంలో 10వ శతాబ్దం నాటి శాసనం కూడా ఉంది. అలాగే, చోళుల కాలం నాటి శాసనాలు, ఆలయ గోడపై మరికొన్ని శాసనాలు ఉన్నాయి" అని ఆయన తెలిపారు.

"చోళులు అద్భుతమైన పనితనంతో దేవాలయాలను నిర్మించారు. అదేవిధంగా, జవ్వాదు పర్వతంపై వేల అడుగుల ఎత్తులో గొప్ప కళాత్మక నైపుణ్యంతో నిర్మించిన ఈ ఆలయం ముఖ్యమైనదిగా పరిగణిస్తారు" అని బాలమురుగన్ అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)