బిహార్ ఎన్నికలు: లాలూ ఇద్దరు కొడుకులు రెండు వేర్వేరు పార్టీల నుంచి పోటీ, ప్రశాంత్ కిశోర్ పార్టీ నుంచి ట్రాన్స్‌జెండర్ మహిళ.. తొలి దశ పోలింగ్‌లో కీలక అభ్యర్థులు వీరే

ఫొటో సోర్స్, Getty Images
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నవంబర్ 6న తొలి విడతలో 18 జిల్లాల్లోని 121 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. తొలి విడతలో మొత్తం 1,314 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
బిహార్ రాజకీయాల్లోని అగ్రనేతలు పోటీ చేసిన సీట్లలో ఎక్కువ భాగం తొలి విడతలోనే కవర్ అవుతున్నాయి.
మొదటి దశలో పట్నా, ముజఫర్‌పూర్, దర్భంగా, మధేపురా, సహర్సా, గోపాల్‌గంజ్, సివాన్, సారణ్, వైశాలి, సమస్తీపూర్, బెగూసరాయ్, లఖీస్‌రాయ్, ముంగేర్, షేఖ్‌పురా, నలందా, బక్సర్, భోజ్‌పూర్ జిల్లాల్లో ఓటింగ్ జరుగుతోంది.
ఈసారి ఎన్నికల్లో కూడా ఎన్డీయే, ప్రతిపక్ష మహాకూటమి మధ్యే పోటీ ఉంటుందని భావిస్తున్నారు.
అయితే, ప్రశాంత్ కిశోర్ పార్టీ జన్ సురాజ్ ఈసారి రంగంలోకి దిగింది. చాలా స్థానాల్లో ఇతర చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ ప్రభావాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు.


ఫొటో సోర్స్, Getty Images
తేజస్వి యాదవ్
మొదటి విడత ఓటింగ్‌లో పోటీపడుతున్న అగ్ర నాయకుల్లో బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ ఉన్నారు.
ఆయన రాఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. ఈ స్థానంలో బీజేపీ నుంచి సతీశ్ కుమార్ సింగ్ బరిలో నిలిచారు. తేజస్వీ గతంలో రెండుసార్లు ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2010 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి జేడీయూ టికెట్ మీద పోటీ చేసిన సతీశ్ కుమార్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవిని ఓడించారు.
దీన్ని బట్టి చూస్తే, రాఘోపూర్ స్థానంలో పోటీ ఆసక్తికరంగా ఉండొచ్చని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తేజ్ ప్రతాప్ యాదవ్
ఆర్జేడీ నుంచి బయటకు పంపించిన తర్వాత తేజ్ ప్రతాప్ యాదవ్ సొంతంగా 'జనశక్తి జనతా దళ్' పేరిట కొత్త పార్టీని స్థాపించారు.
ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడైన తేజ్ ప్రతాప్.. మహువా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
గత ఎన్నికల్లో ఈ సీటు నుంచి గెలుపొందిన ముకేశ్ రోషన్, ఆర్జేడీ తరఫున పోటీలో నిలిచారు.

ఫొటో సోర్స్, Getty Images
సమ్రాట్ చౌధరీ
నితీశ్ కుమార్ ప్రభుత్వంలో బీజేపీ కోటాలో ఉప మఖ్యమంత్రిగా పనిచేసిన సమ్రాట్ చౌధరీ, తారాపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఈ స్థానం నుంచి ఆయన తొలిసారి పోటీచేస్తున్నారు.
ఒకవేళ ఈ స్థానం నుంచి సమ్రాట్ చౌధరీ గెలిస్తే పార్టీలో ఆయన ప్రాబల్యం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఆయనకు ఆర్జేడీ అభ్యర్థి అరుణ్ కుమార్‌తో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.
2021లో జరిగిన ఉపఎన్నికల్లో అరుణ్ కుమార్ 4000 కంటే తక్కువ ఓట్లతో జేడీయూ అభ్యర్థి రాజీవ్ కుమార్ సింగ్ చేతిలో ఓడిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రీతి కిన్నర్
బిహార్ తొలి విడత ఓటింగ్‌లో గోపాల్‌గంజ్ జిల్లాలోని భోరె అసెంబ్లీ స్థానం ఎక్కువగా చర్చల్లో నిలిచింది.
ట్రాన్స్‌జెండర్ పర్సన్ ప్రీతి కిన్నర్ కారణంగా ఈ సీటు వార్తల్లో నిలిచింది.
ప్రశాంత్ కిశోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ ఆమెను ఎన్నికల బరిలో నిలిపింది.
బిహార్‌లో తొలిసారి ఒక ప్రముఖ పార్టీ ఒక ట్రాన్స్‌జెండర్ పర్సన్‌కు టికెట్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

ఫొటో సోర్స్, BBC/Shahnawaz Ahmad
ఒసామా షహాబ్
మాజీ ఎంపీ షాబుద్దీన్ కుమారుడు ఒసామా షహాబ్ కూడా ఈసారి ఎన్నికల బరిలో నిలిచారు.
సివాన్ మాజీ ఎంపీ, బలమైన నేతగా పరిగణించే షాబుద్దీన్ కుమారుడు ఒసామా షహాబ్ రాజకీయ భవిష్యత్ కూడా తొలి దశ ఓటింగ్‌లోనే తేలనుంది.
సివాన్‌లోని రఘునాథపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆర్జేడీ తరఫున ఒసామా తలపడుతున్నారు.
ఆయన తండ్రి షాబుద్దీన్ ఒకప్పుడు సివాన్‌లో చాలా పట్టున్న నాయకుడు. అయితే షాబుద్దీన్ ఎప్పుడు రఘునాథపూర్ నుంచి పోటీ చేయలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














