ట్రంప్-కిమ్: ‘మేం మంచి ఫ్రెండ్స్’ అని చెప్పుకోవడం వెనక మతలబేంటి?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, సంగ్మీ హన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్‌ను ఆసియా పర్యటన సందర్భంగా కలవడం లేదని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు. ఇరువురి షెడ్యూల్ కుదరలేదని ఆయన చెప్పారు.
కిమ్‌ను 'కలవడానికి ఇష్టపడతానని' ట్రంప్ ఈవారం ప్రారంభంలోనే చెప్పారు. అయితే, అపెక్ శిఖరాగ్ర సమావేశం కోసం ట్రంప్, దక్షిణ కొరియాకు చేరుకోవడానికి ఒకరోజు ముందు, ఉత్తర కొరియా తన పశ్చిమ తీరం నుంచి క్రూయిజ్ క్షిపణులను పరీక్షించింది.
ఉత్తర కొరియాలోకి ప్రవేశించిన మొదటి సిట్టింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇది జరిగి ఆరు సంవత్సరాలకు పైగా అయ్యింది. తన మొదటి పదవీకాలంలో 2018, 2019 మధ్య కిమ్‌ను మూడుసార్లు కలిశారు ట్రంప్.
ఇప్పుడు, అమెరికా, ఉత్తర కొరియాల మధ్య కమ్యూనికేషన్ ఉందా, లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ఉత్తర కొరియా ద్వీపకల్పంలో అణ్వస్త్రాలు ఉండకూడదని అమెరికా కోరుకుంటుండగా, కిమ్ దానికి నిరాకరిస్తున్నారు.
అందుకే, ఉత్తర కొరియాతో వ్యవహారం అంత సులభం కాదని ట్రంప్ కూడా అంగీకరించారు.
"వారు ఒక రకమైన అణ్వాయుధ శక్తి అనుకుంటున్నా. వాళ్లదగ్గర చాలా అణ్వాయుధాలున్నాయి. కానీ, సరైన టెలిఫోన్ సర్వీసులు మాత్రం లేవు" అని గతవారం ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికాతో చర్చలు తిరిగి ప్రారంభించాలని తాను కోరుకుంటున్నట్లు కిమ్ గత నెలలో చెప్పారు. "అధ్యక్షుడు ట్రంప్‌తో నాకు మంచి మెమరీలు ఉన్నాయి" అని కూడా అన్నారు.
ట్రంప్, కిమ్ ఈసారి కలవకపోయినా, అమెరికా మాత్రం ఉత్తర కొరియాతో చర్చలు కొనసాగిస్తుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
'యుద్ధాలు ఆపడం హాబీ కాదు'
ట్రంప్ తనను తాను 'గ్లోబల్ పీస్‌మేకర్'గా చెప్పుకుంటున్నారు. నోబెల్ శాంతి బహుమతిని పొందాలనుకుంటున్నారు.
ఈ వారం ప్రారంభంలో, ట్రంప్ తన ఆసియా పర్యటనలో భాగంగా మలేషియాకు వెళ్లారు. థాయిలాండ్, కంబోడియా మధ్య శాంతి ఒప్పందాన్ని పరిశీలించారు. ఇరుదేశాలు గత పదేళ్లలో అత్యంత దారుణమైన పోరాటాన్ని ఈ జూలైలో చూశాయి. ఈ ఘర్షణల్లో డజన్లమంది చనిపోయారు.
తాను ఎనిమిది నెలల్లో ఎనిమిది యుద్ధాలను ఆపానని ట్రంప్ అన్నారు.
"నేను దీన్ని హాబీ అనకూడదు. ఎందుకంటే ఇది చాలా సీరియస్ విషయం. కానీ, నేనిది బాగా చేయగలను, నాకు ఇష్టమైన పని కూడా" అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఆశలున్నాయి: నిపుణులు
''ఈశాన్య ఆసియాలో అత్యంత ఉద్రిక్త ప్రాంతాలలో ఒకటైన కొరియా ద్వీపకల్పంలో శాంతికి ఇప్పటికీ ఆశలున్నాయి. ఉత్తర కొరియాతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి, అణు సమస్యను పరిష్కరించడానికి అమెరికా ప్రయత్నించవచ్చు'' అని సోగాంగ్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాల ప్రొఫెసర్ కిమ్ జే-చున్ అన్నారు.
కిమ్ జే-చున్ అభిప్రాయంతో కొరియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ నేషనల్ యూనిఫికేషన్‌లో సీనియర్ పరిశోధకుడు చో హాన్-బియోమ్ ఏకీభవిస్తూ, ఉత్తర కొరియా 'మిగిలి ఉన్న చివరి పజిల్ కావచ్చు' అన్నారు.
ఈ సమస్యకు పూర్తిగా పరిష్కారం దక్కకపోయినా, ట్రంప్ ఒక ప్రధాన ప్రపంచ భద్రతా సమస్యను పరిష్కరించారనే ఇమేజ్‌ను సృష్టించడంలో సహాయపడుతుందని, అది ఆయనను నోబెల్ శాంతి బహుమతికి దగ్గరగా తీసుకురాగలదని చో హాన్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Reuters
బలపడుతున్న కొరియా
2019లో ట్రంప్, కిమ్ చివరిసారిగా కలిసినప్పటి నుంచి ఉత్తర కొరియా మరింత బలంగా తయారైంది.
"ఉత్తర కొరియా ప్రభుత్వం ఇప్పుడు మరింత స్థిరంగా ఉంది" అని క్యుంగ్నామ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, 1990ల చివరలో దక్షిణ కొరియా ఏకీకరణ(యూనిఫికేషన్) మంత్రిగా పనిచేసిన కాంగ్ ఇన్-డియోక్ అన్నారు.
రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయం సాధించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2025 సెప్టెంబర్‌లో జరిగిన చైనా సైనిక కవాతులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో కలిసి కనిపించారు కిమ్ జోంగ్ ఉన్. ఇలా ముగ్గురు నాయకులు కలిసి బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి.
రష్యాతో ఉత్తర కొరియా సైనిక కూటమిని కూడా ఏర్పాటు చేసుకుంది. ఇప్పటికే పాశ్చాత్య దేశాల ఆంక్షల కింద ఉన్న ఈ రెండు దేశాలు, తమలో ఎవరిపైనైనా దాడి జరిగితే "వెంటనే సైనిక, ఇతర సహాయం అందించడానికి" అంగీకరిస్తూ 2024లో రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి.
జనవరి 2025లో, యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకు సహాయం చేయడానికి ఉత్తర కొరియా దాదాపు 11,000 మంది సైనికులను పంపిందని పాశ్చాత్య అధికారులు బీబీసీకి తెలిపారు. దీనికి ప్రతిగా, ఉత్తర కొరియా ఆర్థిక, సాంకేతిక సహాయం ఆశిస్తుందని చెప్పారు.
అదే సమయంలో, ఇటు చైనాతో దాని వాణిజ్యం మరింత బలపడింది. 2025 మొదటి అర్ధభాగంలో, రెండు దేశాల మధ్య వాణిజ్యం 33 శాతం పెరిగి 1.05 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,260 కోట్లు)కు చేరుకుందని చైనా కస్టమ్స్ డేటా తెలిపింది.
రష్యాతో సన్నిహిత సైనిక సంబంధాల కారణంగా చైనా గతంలో ఉత్తర కొరియాకు దూరమైందని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ, ఇప్పుడు దక్షిణ కొరియా, అమెరికాలు ప్యాంగ్యాంగ్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నందున, ఉత్తర కొరియాతో చైనా తన స్నేహాన్ని మళ్లీ బలోపేతం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
2018, 2019తో పోలిస్తే ఉత్తర కొరియా మరింత బలపడి, రష్యా, చైనాలతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నందున, అమెరికా ఆంక్షలను తొలగించుకునే ప్రయత్నాలు ఇకపై దాని ప్రథమ ప్రాధాన్యత కాదని ప్రొఫెసర్ కాంగ్ అభిప్రాయపడ్డారు.
అదనపు రిపోర్టింగ్, ఎడిటింగ్: గ్రేస్ త్సోయ్, ఓల్గా సావ్‌జుక్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














