ట్రంప్‌కు చైనా కవాతు పంపిన సందేశం ఏమిటి?

చైనా, రాజకీయాలు, అమెరికా, సైనిక కవాతు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చైనాలో సైనిక కవాతు జరిగింది.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ మొదటిసారిగా బహిరంగంగా బుధవారం బీజింగ్‌లో జరిగిన భారీ సైనిక కవాతు సమయంలో కనిపించారు.

రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై చైనా విజయం సాధించిన 80 సంవత్సరాలకు గుర్తుగా ఈ కవాతు జరిగింది. ఇందులో కొత్త అణు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి, హైపర్‌సోనిక్ ఆయుధాలను మోసుకెళ్లే రోడ్ బౌండ్ మిసైల్, లేజర్ ఆయుధం, రోబోటిక్ డాగ్ డ్రోన్‌లతో సహా కొత్త ఆయుధాలను ప్రదర్శించారు.

ట్రంప్ సుంకాలు ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిస్థితులను కుదిపేస్తున్నందున ప్రధాన ఆర్థిక వ్యవస్థగా, అమెరికాకు ప్రత్యర్థిగా చైనా శక్తిని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడానికి జిన్‌పింగ్ ప్రయత్నిస్తున్న సమయంలో ఇది జరిగింది.

ఈ నేపథ్యంలో, చైనా కవాతు ఏ సందేశాన్ని పంపుతుంది, ఇది ఎందుకు ముఖ్యమైనది?, 'న్యూ వరల్డ్ ఆర్డర్' గురించి ఇది ఏం చెబుతోంది, తదితర విషయాలపై నలుగురు బీబీసీ ప్రతినిధులు తమ విశ్లేషణను అందించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పుతిన్, షీ జిన్‌పింగ్, కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పుతిన్, షీ జిన్‌పింగ్, కిమ్ జోంగ్ ఉన్ తొలిసారిగా ఒకే వేదిక మీద కనిపించారు.

చైనాకు, ప్రపంచానికి శాశ్వత గుర్తు

లారా బికర్, చైనా కరస్పాండెంట్

ఈ సైనిక కవాతులో అత్యంత శాశ్వతమైన చిత్రాలలో ఒకటి మొదటి ఫిరంగిని పేల్చడానికి ముందే జరిగింది.

ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్‌ను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సుదీర్ఘ కరచాలనంతో స్వాగతించడం, తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను పలకరించడానికి వెళ్లడం (ముగ్గురూ కలిసి కవాతును చూడటానికి నడిచే ముందు) ఒక స్పష్టమైన రాజకీయ రంగస్థలం.

ముగ్గురు నాయకులు కలిసి బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి. ప్రదర్శనలో ఉన్న ఆయుధాలు, దళాలు మాత్రమే కాదు, ఈ సమావేశం కూడా డోనల్డ్ ట్రంప్ దృష్టిని ఆకర్షించినట్లు కనిపిస్తోంది.

షీ ఇతరులతో కలిసి అమెరికాపై కుట్ర పన్నారని ఆరోపిస్తూ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. కానీ, తన దేశం చరిత్రలో సరైన వైపు ఉందని చైనా నాయకుడు తన ప్రసంగంలో స్పష్టంచేశారు.

బుధవారం నాటి కవాతు కచ్చితత్వం, చైనా శక్తి, దేశభక్తిని ప్రదర్శించేలా ప్లాన్ చేశారు. "కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా, ఆధునిక చైనా లేదు" అని పాడేటప్పుడు గాయక బృందం కూడా సరిగ్గా ఒకే వరుసలలో నిలబడింది. ఇక, సైనికులు ఒకేలా అడుగులు వేస్తూ కవాతు చేశారు. వారి బూట్ల శబ్దం తియానన్మెన్ స్క్వేర్‌లో 50,000 మంది అతిథుల ముందు ప్రతిధ్వనించింది.

కొత్త ఆయుధాలు - అణు క్షిపణి, లేజర్ ఆయుధాలు, రోబోటిక్ డాగ్స్‌లను ప్రజలు తమ ఫోన్లలో చిత్రీకరించారు. జనసమూహం హర్షధ్వానాలు చేసింది, ఫైటర్ జెట్‌లు తలపైకి ఎగురుతుండగా పావురాలు, బెలూన్‌లు ఆకాశంలో నిండిపోవడంతో ప్రదర్శన ముగిసింది.

  • ఈ కార్యక్రమం రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగింది. అయితే ఇది చైనా భవిష్యత్తును కూడా చూపించింది.ఆంక్షలు ఎదుర్కొంటున్నఇద్దరు నాయకులతో నిలబడి ప్రపంచ నాయకుడిగా తనను తాను ప్రదర్శించుకున్నారు జిన్‌పింగ్. అదే సమయంలో షీ పక్కన, పశ్చిమ దేశాలకు పోటీగా నిర్మిస్తున్న సైన్యం ఉంది.
చైనా, పరేడ్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా శూన్యతను పూడ్చుతున్న చైనా

జేమ్స్ లాండేల్, డిప్లొమాటిక్ కరస్పాండెంట్

చైనా ఇటీవలి రాజకీయ, సైనిక బల ప్రదర్శన పశ్చిమ దేశాల నాయకులను ఆశ్చర్యపరచక పోవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నిర్మించిన పాత గ్లోబల్ సిస్టంను భర్తీ చేసే 'న్యూ వరల్డ్ ఆర్డర్' లో తనను తాను కేంద్రంగా ఉంచుకోవాలని జిన్‌పింగ్ చాలా కాలంగా కోరుకుంటున్నారు.

కానీ, ఇక్కడ రెండు విషయాలు పశ్చిమ దౌత్యవేత్తలను వణికిస్తాయి.

  • ఒకటి, ప్రపంచ నాయకత్వం నుంచి అమెరికా వెనక్కి తగ్గడం వల్ల ఏర్పడిన ఖాళీని చైనా ఎంత వేగంగా పూరిస్తుందోననే ఆందోళన. సరిహద్దులు, మానవ హక్కుల కంటే అధికారం, ఆర్థిక వృద్ధి ముఖ్యమైన చైనా నేతృత్వంలోని వ్యవస్థ(వరల్డ్ ఆర్డర్) పశ్చిమ దేశాలకు ఇబ్బందికరంగా ఉండవచ్చు.
  • అమెరికా సుంకాలు భారత్, చైనాలను దగ్గరికి చేర్చడం కూడా పశ్చిమదేశాలకు ఆందోళన కలిగించేదే. అయినప్పటికీ, ఈ కూటమి ఐక్యంగా లేదని తెలిసి పశ్చిమ దేశాలు కొంత ఓదార్పు పొందుతాయి. ఎందుకంటే, భారత్ బుధవారం జరిగిన కవాతుకు దూరంగా ఉంది. చైనాతో దిల్లీకి ఇప్పటికీ వివాదాలున్నాయి.

కీలకమైన విషయమేంటంటే.. ట్రంప్ విధానాలు చైనా తన ప్రభావాన్ని విస్తరించుకోవడానికి భారీ అవకాశాన్ని ఇస్తున్నాయి. జిన్‌పింగ్ దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారు.

డోనల్డ్ ట్రంప్‌కు స్పష్టమైన సందేశం

స్టీవ్ రోసెన్‌బర్గ్, రష్యా బీబీసీ ఎడిటర్

ఈ వారం చైనాలో జరిగిన దౌత్యం, తదితర సంఘటనలు ట్రంప్ ప్రభుత్వానికి స్పష్టమైన సందేశాన్ని పంపడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆ సందేశం ఏమిటంటే మీరు అమెరికాను మళ్లీ గొప్పగా మార్చాలనుకుంటున్నారా? అమెరికా ఫస్ట్, అవునా?. సరే, అయితే, అమెరికా నేతృత్వంలోని ఆర్డర్‌కు మేం ప్రత్యామ్నాయాన్ని అందిస్తాం అంటూ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో చైనా, రష్యా, ఇండియా నాయకులు కలిసి కనిపించారు.

  • గతవారం జిన్‌‌పింగ్‌ను పుతిన్ 'నిజమైన మిత్రుడు' అన్నారు. పుతిన్ తనకు 'పాత మిత్రుడు' అని జిన్‌‌పింగ్‌ అన్నారు. అందుకే బుధవారం జరిగిన సైనిక కవాతులో షీ, పుతిన్, కిమ్ కలిసి నిలబడ్డారు.
  • సంక్షిప్తంగా చెప్పాలంటే, అమెరికా ఆధిపత్యాన్ని బ్యాలెన్స్ చేయడానికి వివిధ శక్తులు కలిసి వస్తున్నాయి. దీనర్థం ఈ దేశాలు ఒకదానితో ఒకటి పూర్తిగా ఏకీభవిస్తున్నాయని కాదు, వారిలో ఇప్పటికీ విభేదాలున్నాయి. కానీ, వారి ధోరణి స్పష్టంగా ఉంది.
  • రష్యా, చైనా, భారత్‌ల గురించి రష్యన్ వార్తాసంస్థ కొమ్సోమోల్స్కాయ ప్రావ్దా హెడ్‌లైన్ చెప్పినట్లుగా: "మేం కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తాం".
బీజింగ్, ఆయుధాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కవాతులో బీజింగ్ కొత్త ఆయుధాలను ఆవిష్కరించింది.

పశ్చిమ దేశాలకు ఆందోళన

ఫ్రాంక్ గార్డ్‌నర్, సెక్యూరిటీ కరస్పాండెంట్

నీటి అడుగున టార్పెడోల నుంచి డ్రోన్లను కూల్చివేసే అత్యాధునిక లేజర్ ఆయుధాల వరకు చైనా సైనిక కవాతును ఇప్పుడు అమెరికా రక్షణ నిపుణులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అధికారులు నిశితంగా అధ్యయనం చేస్తారు.

చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఆధునీకీకరణ దిశగా వేగంగా అడుగులేస్తోంది, కొన్ని విషయాలలో అమెరికాను కూడా అధిగమిస్తోంది. ధ్వని కంటే ఐదు రెట్లు వేగంతో ప్రయాణించగల హైపర్‌సోనిక్ క్షిపణులలో చైనా ముందుంది.

వైజే-17 హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికిల్, వైజే-19 హైపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్ కీలక ఉదాహరణలుగా లండన్ థింక్ ట్యాంక్ రుసికి చెందిన క్షిపణుల నిపుణుడు డాక్టర్ సిద్ధార్థ్ కౌశల్ చెబుతున్నారు.

  • చైనా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటానమస్ వెపన్స్‌లో భారీగా పెట్టుబడులు పెడుతోంది, ఉదాహరణకు ఏజేఎక్స్002 - ఇది 60 అడుగుల నీటి అడుగున అణు సామర్థ్యం గల భారీ డ్రోన్.
  • చైనాలో రష్యా, అమెరికాల కంటే తక్కువ అణ్వాయుధాలు ఉన్నప్పటికీ అది కొత్త, వినూత్న డెలివరీ వ్యవస్థలతో వేగంగా అభివృద్ధి చెందుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)