కిమ్ జోంగ్ ఉన్ రైలులోనే ఎందుకు ప్రయాణిస్తారు, ఆ రైలు ఆకుపచ్చ రంగులోనే ఎందుకుంటుంది?

ఉత్తర కొరిాయా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యేక రైలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రత్యేక రైలులో అడుగుపెట్టేముందు (2019, మార్చి 2న) అభివాదం చేస్తున్న ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ (ఫైల్ ఫోటో)
    • రచయిత, భరత్ శర్మ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సాధారణంగా ఏ దేశపు అత్యున్నత నేత అయినా మరో దేశానికి వెళ్లాంటే విమానం లాంటి అత్యంత సౌకర్యవంతంగా ఉండే ప్రయాణసాధనాలను ఎంచుకుంటారు. కానీ కిమ్‌ జోంగ్ ఉన్ ఇందుకు భిన్నం.

చైనా రాజధాని బీజింగ్‌లో బుధవారం (సెప్టెంబర్ 3న) జరిగే 'విక్టరీ డే' పరేడ్‌లో పాల్గొనాలనే ఆహ్వానంతో ఆయన రెండు రోజుల ముందే సోమవారం (సెప్టెంబర్ 1న) ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి బయల్దేరారు. సరిహద్దు దాటి మంగళవారం చైనాలోకి ప్రవేశించారు.

ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి చైనా రాజధాని బీజింగ్ వరకు 1300 కిలోమీటర్ల ప్రయాణానికి ఆయన అత్యంత కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లున్న ప్రత్యేక రైలును ఉపయోగించారు.

‘విక్టరీ డే’ పరేడ్‌లో కిమ్ జోంగ్ ఉన్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ సహా పలువురు ప్రపంచ నాయకులతో కలిసి పాల్గొంటున్నారు.

దక్షిణకొరియా ఏజెన్సీ యోన్‌హాప్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ రైలులో అత్యంత ఆధునిక, కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. ఈ ఏర్పాట్ల వల్ల అది నెమ్మదిగా కదులుతుంది.

ఉత్తరకొరియాలో రైల్వే నెట్‌వర్క్ పాతకాలం నాటిది. కిమ్ రైలు తక్కువ వేగంతో ప్రయాణించడానికి ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్రత్యేక రైలులోనే 2023 సంవత్సరంలో కిమ్ జోంగ్ ఉన్ రష్యాకు వెళ్లారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రత్యేక రైలులో 2023 సంవత్సరంలో కిమ్ జోంగ్ ఉన్ రష్యాకు వెళ్లారు.

కిమ్ రైలులో ఏముంది?

సుదూర ప్రయాణాలకు సైతం రైలునే ఎంచుకోవడం ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్‌కు కొత్తేమీ కాదు. అంతకుముందు కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్, తాత కిమ్ ఇల్ సంగ్ కూడా ఎక్కువగా రైలులోనే ప్రయాణించేవారు. ఈ సంప్రదాయాన్ని ఆయన తాతే ప్రారంభించగా, కిమ్‌ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ కొనసాగించారు. ఆయనకు విమాన ప్రయాణం అంటే భయం కూడా.

కిమ్ బుల్లెట్ ఫ్రూప్ రైలుకు 90 కోచ్‌లు ఉన్నాయంటూ 2009, నవంబర్‌లో దక్షిణ కొరియా వార్తా పత్రికలు ప్రచురించాయి. ముదురు ఆకుపచ్చ రంగులో పసుపు రంగు చారలతో ఉండే ఈ రైలులో కాన్ఫరెన్స్ రూమ్‌లు, ఆడియన్స్ చాంబర్‌లు, బెడ్ రూమ్‌లు, శాటిలైట్ ఫోన్లు, ఫ్లాట్ స్క్రీన్ టీవీలు ఉంటాయి. కొన్ని ఫోటోలను బట్టి చూస్తే, ఆ రైలులో రెడ్ లెదర్ ఆర్మ్‌చైర్‌లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

బీబీసీ నివేదిక ప్రకారం, ఉత్తర కొరియా పాలకుడు ప్రయాణించే ప్రత్యేక రైలు వేగం గంటకు 50 కిలోమీటర్లు. కానీ లండన్‌లో హైస్పీడ్ రైలు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటే, జపాన్ బుల్లెట్ ట్రైన్ వేగం గంటకు 320 కిలోమీటర్లు.

కిమ్ రైలు పేరు తేహ్యంగ్. కొరియా భాషలో సూర్యుడు అని అర్థం. దీన్ని ఉత్తరకొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ జ్ఞాపకార్థంగానూ పరిగణిస్తుంటారు.

కిమ్ రైలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ రైలులో 90 కోచ్‌లు ఉన్నాయని దక్షిణ కొరియా మీడియా చెబుతోంది

రైలుతో ఉత్తరకొరియా నాయకుల అనుబంధం...

కిమ్ ఇల్ సంగ్ ఆ రోజుల్లో వియత్నాం, తూర్పు యూరప్‌ దేశాలకు రైలులోనే ప్రయాణించేవారు. ఈ రైలు భద్రతా ఏర్పాట్లను ఉత్తర కొరియా భద్రతా ఏజెంట్లు నిర్వహించేవారు. బాంబులు, ఇతరత్రా దాడులను దృష్టిలో ఉంచుకొని వారు రైలు మార్గాన్ని, ఆ మార్గంలో వచ్చే రైల్వేస్టేషన్లను ఆసాంతం పరిశీలించేవారు.

ఉత్తరకొరియాలో 2002 నుంచి 2004 వరకూ భారత దౌత్యవేత్తగా పనిచేసిన ఆర్‌పీ సింగ్ బీబీసీతో మాట్లాడుతూ, ఉత్తర కొరియా నేతలు రైలులో ప్రయాణించడం కొత్త విషయమేమీ కాదన్నారు. విమాన ప్రయాణం క్షేమం కాదనే ఉద్దేశంతో వారు సహజంగా వాటిల్లో ప్రయాణించరని చెప్పారు.

''ఉత్తర కొరియా పాలకులు రైలులో ప్రయాణిస్తారు. ఎందుకంటే, అది వారికి సురక్షితమని భావిస్తారు. కిమ్ జోంగ్ ఉన్ తండ్రి రైలులో ప్రయాణించేవారు. ఆయన తాత కొన్నిసార్లు విమానంలో ప్రయాణించినా, రైలుకే ప్రాధాన్యం ఇచ్చేవారు. ఈ రైలు ఆయన సొంతం, ప్రత్యేకం. ఆయన అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని తయారుచేశారు'' అని ఆర్ పీ సింగ్ చెప్పారు.

కిమ్ జోంగ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ 2001లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసేందుకు ఆ రైలులో 10 రోజుల పాటు ప్రయాణించి మాస్కో చేరుకున్నారు.

''కిమ్ జోంగ్ ఉన్ తండ్రి, ఆయన తాత పర్యటనలు తక్కువ సంఖ్యలోనే ఉన్నా, వారు రైలులో ప్రయాణానికే ప్రాధాన్యం ఇచ్చేవారు'' అని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ కొరియన్ లాంగ్వేజ్ అండ్ స్టడీస్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ వైజయంతి రాఘవన్ చెప్పారు.

''ఇది రహస్యంగా ఉండే దేశం. ఈ దేశ నాయకుడు తన జీవితాన్ని కూడా రహస్యంగానే ఉంచాలనుకుంటున్నారు. ఆయన ఏం తింటారో, ఏం చేస్తారో ఎవరికీ తెలియదు'' అని వైజయంతి రాఘవన్ అన్నారు. ఉత్తర కొరియా నాయకులు అనుసరిస్తున్న రాజకీయాల కారణంగా వారు స్వదేశంలోనూ, బయట దేశాల నుంచి ముప్పు ఉందని భావిస్తారని చెప్పారు.

అయితే, కిమ్ జోంగ్ ఉన్‌కు మాత్రం ఆయన తండ్రి మాదిరిగా విమాన ప్రయాణమంటే భయమేమీ లేదు. ఆయన అనేక ప్రయాణాలకు రష్యా తయారీ ప్రైవేట్ జెట్‌లను ఉపయోగిస్తుంటారు.

ఉత్తర కొరియా నాయకుడు కిమ్ ప్రత్యేక రైలు

ఫొటో సోర్స్, Getty Images

ఆ రైలులో ప్రయాణించినవారి అనుభవం ఏమిటి?

కాన్‌స్టాంటిన్ పులికోవస్కీ అనే ఒక రష్యన్ మిలిటరీ కమాండర్ 2001లో కిమ్ జోంగ్-2తో కలిసి ఆ ప్రత్యేక రైలులో ప్రయాణించారు. ''రష్యా, చైనా, కొరియా, జపాన్, ఫ్రాన్స్ దేశాలకు చెందిన ఏ వంటకమైనా సరే ఆ రైలులో ఆర్డర్ ఇవ్వవచ్చు'' అని ఆయన తన పుస్తకంలో రాశారు.

ఈ కిమ్ రైలులో ఉన్నన్ని సౌకర్యాలు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రైవేట్ రైలులో కూడా లేవని ఆ రష్యన్ మిలిటరీ కమాండర్ చెప్పారు.

మరో రష్యన్ దౌత్యవేత్త జార్జియో టోలొరాయ్ కూడా ఈ రైలులో 2019లో తన ప్రయాణ అనుభవాల గురించి రాశారు. విభిన్న రకాల మాంసాహారం, మద్యం ఈ రైలులో అందిస్తారని, రష్యా ప్రత్యేకమైన వోడ్కా కూడా అందుబాటులో ఉందని ఆయన గుర్తుచేసుకున్నారు.

కిమ్ జోంగ్ ఇల్ 2011లో ఈ రైలులోనే ప్రయాణిస్తూ, గుండెపోటుతో చనిపోయారని ఉత్తరకొరియా జాతీయ మీడియా వెల్లడించింది.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కిమ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కిమ్

రష్యా, చైనాకే ఎందుకు?

ఉత్తర కొరియా పాలకులు రష్యా, చైనాలో మాత్రమే ఎందుకు పర్యటిస్తారన్న ప్రశ్నకు వైజయంతి రాఘవన్ స్పందిస్తూ, ''రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కొరియా యుద్ధం జరిగింది. కొరియా రెండు స్వతంత్ర దేశాలుగా అవతరించింది. ఆ తర్వాత కోల్డ్ వార్‌ ప్రారంభమవ్వడంతో ఉత్తరకొరియా సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా) గ్రూప్‌లో చేరగా, దక్షిణ కొరియా అమెరికా వైపు మొగ్గుచూపింది'' అని బీబీసీకి చెప్పారు.

''రష్యా, చైనా దేశాలతో సరిహద్దును పంచుకోవడమే గాకుండా, సైద్ధాంతికపరంగానూ ఆ రెండు దేశాలతో ఉత్తర కొరియాకు సారూప్యం ఉంది. ప్రపంచంలో పెద్ద శక్తులు ఈ దేశాలను విడదీశాయి. ఈ విభజన భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోవడంకంటే భిన్నం'' అని వైజయంతి రాఘవన్ అన్నారు.

''ఇప్పుడే కాదు గతంలో కూడా ఉత్తర కొరియా పాలకుల విదేశీ పర్యటనలు అరుదు. కొరియా చిన్న దేశం. 1910 నుంచి 1945 వరకూ జపాన్ వలసదేశంగా ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా నాయకులు అప్పట్లో సోవియట్ యూనియన్‌కు, ఇప్పడు రష్యాకు, చైనాకు అదీ రైలులో పర్యటనలకు వెళ్తున్నారు'' అని వైజయంతి రాఘవన్ చెప్పారు.

కిమ్ రైలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కిమ్ రైలు

ఆ రైలుకు ఆకుపచ్చ రంగే ఎందుకు?

ఉత్తర కొరియా పాలకుడు ప్రయాణించే ఆ రైలు ముదురు ఆకుపచ్చ రంగులో ఎందుకుందన్న ప్రశ్నకు వైజయంతి రాఘవన్ స్పందిస్తూ, స్పష్టమైన కారణమైతే తానూ చెప్పలేనని, బహుశా శత్రువులను మభ్యపెట్టడానికి కావచ్చని చెప్పారు.

అంటే అడవులు, భూభాగాల మధ్య వెళ్తున్నప్పుడు ముదురు ఆకుపచ్చ రంగు కారణంగా శత్రువులు ఈ రైలును గుర్తుపట్టకుండా ఉండటానికి కావచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)