జలాంతర అణ్వస్త్ర వ్యవస్థను పరీక్షించిన ఉత్తర కొరియా... ఇది ఎంత ప్రమాదకరం?

ఉత్తర కొరియా జలాంతర అణ్వస్త్రాల ప్రయోగం

ఫొటో సోర్స్, RODONG SHINMUN

    • రచయిత, ఫ్రాన్సెస్ మావో
    • హోదా, బీబీసీ న్యూస్

జలాంతర అణ్వస్త్ర వ్యవస్థను పరీక్షించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. ఈ వారంలో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌లు రక్షణ డ్రిల్స్ నిర్వహించిన నేపథ్యంలో వారికి సమాధానంగా ఉత్తర కొరియా ఈ జలాంతర అణ్వస్త్రాలను పరీక్షించింది.

ఉత్తర కొరియా తూర్పు తీరానికి దూరంగా సముద్రంలో అణ్వస్త్రాలను మోసుకెళ్లగలిగే జలాంతర డ్రోన్‌ని పరీక్షించారని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది.

అయితే, ఇలాంటి పరీక్షలు నిర్వహించినట్లు వేరే ఆధారాలు ఏమీ లేవు. మరోవైపు దక్షిణ కొరియా ఇంతకుముందు ఉత్తర కొరియా తన డ్రోన్ సామర్థ్యాలను ఎక్కువ చేసి చెప్పుకొంటోందని పేర్కొంది.

తాజాగా పరీక్షలు చేసినట్లు చెప్పుకోవడం రెచ్చగొట్టడమేనని దక్షిణ కొరియా ప్రకటించింది.

‘కొరియా ద్వీపకల్పం, ప్రపంచంలో శాంతికి భగ్నం కలిగించేలా ఉత్తర కొరియా బెదిరింపు చర్యలకు దిగుతోంది’ అంటూ దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పింది.

ఒకవేళ ఉత్తర కొరియా కనుక తమను నేరుగా రెచ్చగొడితే అంతకుమించిన రీతిలో తాము వెంటనే ప్రతిస్పందిస్తామని దక్షిణ కొరియా పేర్కొంది.

కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, Getty Images

ఇంతకుముందు ‘హెయిల్ 5-23 సిస్టమ్’ను పరీక్షించినట్లు ఉత్తర కొరియా చెప్పింది. కానీ, ఈ తాజా పరీక్షలు ఉత్తర కొరియా తన సైనిక కదలికలు మరింత ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో చేపట్టారు.

ఘన ఇంధన మధ్యంతర దూర బాలిస్టిక్ క్షిపణిని మోహరించినట్లు ఆదివారం ఉత్తర కొరియా ప్రకటించింది. అంతకుముందు జనవరి మొదటి వారంలో దక్షిణ కొరియా సరిహద్దులలో సముద్ర తీరంలో లైవ్ ఫైర్ డ్రిల్స్ నిర్వహించింది ఉత్తరకొరియా.

శాంతిని కాపాడేందుకు ఉన్న అనేక ఒప్పందాలకు ముగింపు పలుకుతూ ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ ఇటీవలి కాలంలో నిర్ణయాలు తీసుకున్నారు.

అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌లు సంయుక్తంగా మిలటరీ విన్యాసాలు చేపట్టి తమను రెచ్చగొట్టారని.. అందుకే జలాంతర అణ్వస్త్ర ఆయుధాలను పరీక్షించినట్లు ఉత్తర కొరియా నాయకత్వం చెప్పినట్లుగా ఆ దేశ అధికారిక వార్తా ఏజెన్సీ కేసీఎన్‌ఏ రిపోర్ట్ చేసింది.

ఈ ప్రాంతంలో పరిస్థితులను అస్థిరపరిచేందుకు ఇలాంటి డ్రిల్స్ నిర్వహించారని, తమను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఉత్తర కొరియా ఆరోపించింది.

కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, Getty Images

కాగా ఐరాస ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఉత్తర కొరియా అణు బాలిస్టిక్ మిసైల్స్ పరీక్షిస్తోందని, కొత్త ఆయుధాలను లాంచ్ చేస్తోందని.. ఉత్తర కొరియా తరచూ చేపడుతున్న మిలటరీ యాక్షన్స్‌కు ప్రతిగా తాము గతంలోనూ సంయుక్త విన్యాసాలు చేపట్టామని అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌లు చెప్తున్నాయి.

మరోవైపు కొరియా ద్వీపకల్పంలో ఏ క్షణమైనా మొదలు కాబోయే యుద్ధానికి సన్నద్ధంగానే తమ ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నట్లు ఉత్తర కొరియా నేత కిమ్ తరచూ చెప్తున్నారు.

ఈ వారం ప్రారంభంలో కిమ్... దక్షిణ కొరియాతో ఏకీకరణ ఇక అసాధ్యమని.. తమ ప్రధాన శత్రువు దక్షిణ కొరియాయేనని ప్రకటించారు.

అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న జలాంతర్గామి తమ వద్ద ఉన్నట్లు గత ఏడాది సెప్టెంబర్‌లో కిమ్ ప్రకటించారు. గత ఏడాది మార్చిలో ఉత్తర కొరియా తమ వద్ద ఉన్న మానవ రహిత అణ్వస్త్ర జలాంతర డ్రోన్ల వ్యవస్థను హేల్‌ను పరీక్షించినట్లు చెప్పుకొంది. హేల్‌ అంటే కొరియా భాషలో సునామీ అని అర్థం.

ఈ ఆయుధాల సామర్థ్యం ఎంతన్నది బయట ప్రపంచానికి తెలియనప్పటికీ ఉత్తర కొరియా మాత్రం తమ ఆయుధాలు శత్రు దేశాల జలాల్లోకి వెళ్లి భారీ పేలుళ్లకు కారణం కాగలవంటోంది.

‘ఉత్తర కొరియా డిఫెన్స్ సైన్స్ స్థాయి, ఇప్పుడు పరీక్షించిన ఆయుధం కూడా ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయకపోవడంతో అప్పుడే అది మిగతా దేశాలకు ప్రమాదం కలిగించే స్థాయిలో ఉందని చెప్పలేం’’ అని ‘వరల్డ్ ఇనిస్టిట్యూట్ ఫర్ నార్త్ కొరియా స్టడీస్’లో రీసెర్చర అన్ చాన్ ఇల్ ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో అన్నారు.

అంతరిక్షంలోకి నిఘా ఉపగ్రహం ఒకటి పంపించినట్లు ఉత్తర కొరియా గత ఏడాది ప్రకటించింది.

ఉత్తర కొరియా ఈ ఉపగ్రహాన్ని రష్యా సాయంతో అంతరిక్షంలోకి పంపించిందని.. అందుకు ప్రతిఫలంగా యుక్రెయిన్‌లో యుద్ధం కోసం ఉత్తర కొరియా నుంచి రష్యాకు ఆయుధాలు అందాయని దక్షిణ కొరియా అంటోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)