చంద్రుడిపై జపాన్ వ్యోమనౌక ‘స్లిమ్’ ల్యాండింగ్ నేడు.. ఇస్రో సరసన జాక్సా చేరుతుందా?

వ్యోమనౌక

ఫొటో సోర్స్, JAXA

    • రచయిత, జోనాథన్ అమోస్
    • హోదా, బీబీసీ సైన్స్ కరస్పాండెంట్

2023 ఆగస్టు 23- ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు మారుమోగిన రోజు. చంద్రయాన్ -3 ల్యాండర్ విక్రమ్ అత్యంత ఉత్కంఠ క్షణాల మధ్య చంద్రునిపై దిగిన రోజు అది.

ఇపుడు భారత్ సరసన చేరేందుకు జపాన్ కూడా ప్రయత్నిస్తోంది. చంద్రునిపై దిగేందుకు జపాన్ అంతరిక్ష అన్వేషణ సంస్థ(జాక్సా) సిద్ధమైంది. అది కూడా శుక్రవారమే. ఈ మిషన్ పేరే స్లిమ్ (స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్).

ఇప్పటివరకు అమెరికా, సోవియట్ యూనియన్, చైనా, ఇండియాల ప్రభుత్వ అంతరిక్ష సంస్థలే చంద్రుడి ఉపరితంలపై సాఫీగా దిగాయి. స్లిమ్ మిషన్ విజయవంతమైతే, జపాన్ ఈ జాబితాలో చేరిన ఐదో దేశం అవుతుంది.

చంద్ర మధ్య రేఖ బిలమైన షియోలి వాలు లక్ష్యంగా ల్యాండింగ్ చేయబోతోంది జపాన్.

ఈ నెలలోనే ఒక ప్రైవేట్ అమెరికన్ కంపెనీ చంద్రుని ఉపరితలం చేరుకోవడంలో విఫలమైంది. దాని తర్వాత జరుగుతున్న ప్రయోగమే ఇది.

గణాంకాలపరంగా పరిశీలిస్తే చంద్రుడిపైకి సురక్షితంగా దిగడం చాలా కష్టం. ఇప్పటివరకు జరిగిన ప్రయత్నాలలో సగం మాత్రమే విజయవంతమయ్యాయి.

ఇస్రో

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, గత సంవత్సరం ల్యాండర్ విక్రమ్ చంద్రునిపై దిగింది.

జపాన్ ఎలా సాధించాలనుకుంటోంది?

తనెగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి 2023 సెప్టెంబర్ 7న జపాన్ ఈ స్లిమ్ స్పేస్‌క్రాఫ్ట్ ప్రయోగించింది.

స్లిమ్‌లోని కచ్చితమైన 'మూన్ స్నైపర్' నావిగేషన్ సాంకేతికతలు ల్యాండింగ్ విషయంలో తోడ్పడతాయని జాక్సా భావిస్తోంది.

ర్యాపిడ్ ఇమేజ్ ప్రాసెసింగ్, క్రేటర్ మ్యాపింగ్‌ని ఉపయోగించి నిర్దేశిత టచ్ డౌన్ పాయింట్ నుంచి 100 మీటర్ల లోపలే దిగడానికి ల్యాండర్ ఆన్‌బోర్డ్ కంప్యూటర్ ప్రయత్నించనుంది.

భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8:30 గంటలకు (జపాన్‌లో శనివారం అర్ధరాత్రి) చంద్రునిపై 15 కి.మీ. ఎత్తు నుంచి ల్యాండింగ్ కావడానికి స్లిమ్ సిద్ధంగా ఉంది.

అంతా సవ్యంగా జరిగితే ప్రయోగం మొదలైన 20 నిమిషాల తర్వాత వ్యోమనౌక చంద్రునిపై మెల్లగా దిగుతుంది.

ఈ దేశాల సరసన నిలుస్తామని జపాన్ గట్టిగా నమ్ముతోంది. జాక్సా‌కు చెందిన యూట్యూబ్ చానల్‌లో ఈ ప్రయోగం ప్రసారం కానుంది.

రోవర్

చీకటి కమ్ముకుంటే ఎలా?

స్లిమ్ చంద్రుని ఉపరితలంపై ఎక్కువ కాలం ఉండలేదు. ఎందుకంటే వ్యోమనౌక దిగాలనుకుంటున్న షియోలీ బిలం ప్రస్తుతం సూర్యకాంతిలో ఉంది.

ఈ నెలాఖరులో అక్కడ చీకటి కమ్ముకోనుంది. ఇదే జరిగితే వ్యోమనౌక సౌర ఫలకాలు విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేవు. అనంతరం దాని భాగాలు విరిగిపోతాయి.

కానీ అంతకంటే ముందే చంద్రుని చుట్టూ ఉన్న రాళ్లను 'స్లిమ్' అధ్యయనం చేయాలనుకుంటుంది. దీంతో శుక్రవారమే వ్యోమనౌక ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తోంది.

అక్కడి రాళ్లను అధ్యయనం చేయడానికి సైంటిఫిక్ కెమెరాను స్లిమ్ వాడబోతోంది.

మిషన్‌లో రెండు చిన్న రోవర్లు పంపించారు. వాటిలో ఒకటేమో దాదాపు రెండు కేజీల బరువున్న హోపింగ్ రోబో. మరొకటి బంతి ఆకారంలో ఉండే పరికరం. ఇది ఫోటోలు తీయడం కోసం దాని ఆకారాన్ని మార్చుకుంటుంది.

ఈ రోవర్ డెవలప్ చేసిన కంపెనీలలో ట్రాన్స్‌ఫార్మర్స్ బొమ్మలను రూపొందించిన టామీ కూడా ఉంది.

జాక్సాకు గ్రహశకలాలపై దిగిన అనుభవం

జాక్సా సంస్థ రెండుసార్లు గ్రహశకలాలపై దిగింది. వీటి అనుభవం స్లిమ్‌‌కు ఉపయోగపడనుంది. అయితే, చంద్రుడిపై ల్యాండింగ్ సంక్షిష్టం కానుంది.

గత సంవత్సరం ఇస్పేస్ అనే ఒక ప్రైవేట్ జపనీస్ కంపెనీ చంద్రునిపై ల్యాండింగ్‌‌కు ప్రయత్నించింది.

అయితే, చంద్రుడిపై ఉన్న ఎత్తు విషయంలో ఆన్‌బోర్డ్ కంప్యూటర్ గందరగోళ పడటంతో దాని హకుటో-ఆర్ క్రాఫ్ట్ క్రాష్ అయింది.

వాస్తవానికి మిషన్‌కు ఇంకా ఐదు కి.మీ. వెళ్లాల్సి ఉండగా ఉపరితలం చేరుకుందని భావించి, దాని థ్రస్టర్ సిస్టమ్‌ను మూసివేసింది.

అమెరికన్ ప్రైవేట్ కంపెనీ అయిన ఆస్ట్రోబోటిక్ తయారు చేసిన పెరెగ్రైన్ ల్యాండింగ్ క్రాఫ్ట్‌ చంద్రుడిపై దిగేందుకు ప్రయత్నించి, విఫలమైంది.

క్రాఫ్ట్‌లోని ప్రొపల్షన్ లోపం కారణంగా దాని ల్యాండింగ్ సాధ్యపడలేదు. దీంతో గురువారం దానిని పసిఫిక్ మహాసముద్రంలో కూల్చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)