చంద్రుడి వద్దకు వెళ్ళిన 24 మంది వ్యోమగాముల్లో సజీవంగా ఉన్న 8 మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు?

చంద్రుడు

ఫొటో సోర్స్, POT

ఫొటో క్యాప్షన్, చంద్రుని మీద వెళ్లే మిషన్‌కు ముందు బజ్ ఆల్డ్రిన్ (కుడి), నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, మైకేల్ కోలిన్స్
    • రచయిత, బెన్ ఫెల్
    • హోదా, బీబీసీ న్యూస్

అంతరిక్ష పరిశోధనలకు వారు మార్గదర్శకులు. వారు మరెవరో కాదు చంద్రుని పైకి వెళ్లిన 24 మంది నాసా వ్యోమగాములు. 1960, 70 దశకాల్లో అపోలో మిషన్లలో వారు చంద్రుని దగ్గరకు వెళ్లారు.

రాబోయే రోజుల్లో చంద్రుని ఉపరితలం పైకి ప్రజల్ని పంపించే రేసు తీవ్రం కానుంది.

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఈ నవంబర్‌లో ఆర్టెమిస్ 2 మూన్ మిషన్‌ చేపట్టాల్సి ఉంది. 50 ఏళ్ల తర్వాత తొలిసారి మానవులను మరోసారి చంద్రుని వద్దకు ఈ మిషన్ ద్వారా పంపించనున్నారు. కానీ, ఈ మిషన్ 2025 సెప్టెంబర్ కన్నా ముందుగా చేపట్టే అవకాశం లేదని తాజాగా నాసా ప్రకటించింది.

మంగళవారం ఈ ప్రకటన చేసిన నాసా చీఫ్ బిల్ నీల్సన్ మరో విషయాన్ని కూడా చెప్పారు.

‘‘ఆర్టెమిస్ 3లో భాగంగా వ్యోమగాములు చంద్రుడిపై ల్యాండ్ అయ్యే తొలి ప్రయోగాన్ని 2025లో చేపట్టాలని ముందుగా అనుకున్నాం. కానీ, ఇది 2026 సెప్టెంబర్‌లో జరుగుతుంది’’ అని ఆయన వెల్లడించారు.

చైనా కూడా 2030 నాటికి చంద్రుని ఉపరితలానికి వ్యోమగాములను పంపాలని అనుకుంటోంది.

ఈ ప్రణాళికబద్ధమైన చంద్రుని ప్రయోగాలు ఒక చేదు నిజాన్ని హైలైట్ చేస్తున్నాయి. అపోలో మిషన్లలో పాల్గొన్న వ్యోమగాముల సంఖ్య తగ్గిపోతోంది.

కెన్ మాటింగ్లీ, ఫ్రాంక్ బోర్మన్ అనే ఇద్దరు వ్యోమగాములు నిరుడు కేవలం రోజుల వ్యవధిలోనే చనిపోయారు.

భూకక్ష్యను దాటి ప్రయాణించిన వారిలో 8 మంది మాత్రమే ఇప్పుడు జీవించి ఉన్నారు. వారు ఎవరు? వారి కథ ఏంటి?

చంద్రుడు

ఫొటో సోర్స్, Getty Images

బజ్ ఆల్డ్రిన్ (అపోలో 11)

మాజీ ఫైటర్ పైలట్ ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్ 1969 జులై 21న చంద్రుని ఉపరితల వాహకనౌక (లునార్ ల్యాండింగ్ క్రాఫ్ట్) నుంచి బయటకు వచ్చి చంద్రుని ఉపరితం మీద కాలు మోపిన రెండో వ్యక్తిగా నిలిచారు. వెంటనే ‘ఇది అందమైన దృశ్యం’ అని అన్నారు.

అంతకన్నా 20 నిమిషాల ముందు, దాని కమాండర్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై కాలు మోపారు.

‘‘ఇది అద్భుతంగా లేదూ?’’ అని ఆర్మ్‌స్ట్రాంగ్ అడగగానే ‘‘అత్యద్భుతమైన దృశ్యం ఇది. అద్భుతమైన నిర్జన ప్రదేశం’’ అని ఆల్డ్రిన్ బదులిచ్చారు.

చంద్రునిపై అడుగుపెట్టిన రెండో వ్యక్తిగా ఉండటం ఆల్డ్రిన్‌ను అంతగా నచ్చలేదు. చంద్రునిపై అడుగుపెట్టిన రెండో వ్యక్తిగా ప్రశంసలు పొందడానికి మించి చంద్రుని మీద అడుగుపెట్టిన తొలి వ్యక్తిగా నిలవలేకపోవడం ఆల్డ్రిన్‌కు ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేదని వారి సహచరుడు మైఖేల్ కోలిన్స్ చెప్పారు.

చంద్రుడు

ఫొటో సోర్స్, POT

ఫొటో క్యాప్షన్, చంద్రుని ఉపరిలం మీద కాలు మోపే తర్వాతి వ్యక్తి ఎవరో?

అయినప్పటికీ, తను సాధించిన ఘనత పట్ల ఆల్డ్రిన్ గర్వించేవారు. అపోలో 11 మిషన్ ఒక అబద్ధమంటూ వాదించిన ఒక వ్యక్తి దవడ మీద 72 ఏళ్ల ఆల్డ్రిన్ కొట్టాడు.

2012లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చనిపోయిన తర్వాత ఆల్డ్రిన్ మాట్లాడుతూ, ‘‘నిజమైన అమెరికా హీరో, నాకు తెలిసిన గొప్ప పైలట్ మరణానికి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు నాతో కలిసి సంతాపం తెలియజేస్తున్నారని నాకు తెలుసు’’ అని అన్నారు.

జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ సాహాసాల పట్ల ఆయన ఇష్టం చావలేదు. 86 ఏళ్ల వయస్సులోనూ ఉత్తర, దక్షిణ ధ్రువాల యాత్రల్లో ఆయన పాల్గొన్నారు.

సెలెబ్రిటీగా ఉంటూనే అంతరిక్ష కార్యక్రమాలకు, ముఖ్యంగా అంగారక గ్రహ పరిశోధనలకు ఆయన సలహాలు, సూచనలు అందిస్తున్నారు.

‘‘మనం అక్కడికి వెళ్లి ఊరికే తిరిగి రావాలని నేను అనుకోవట్లేదు. ఇలా అపోలో మిషన్‌లోనే మేం చేశాం. అంతకు మించి ఇంకా ఏదో చేయాలి’’ అని ఆయన అన్నారు.

‘టాయ్ స్టోరీ’ అనే యానిమేషన్ సినిమా సిరీస్‌లోని ‘బజ్ లైట్‌ఇయర్’ పాత్రకు ప్రేరణగా నిలిచిన ఆయన, కొత్త తరాలకు కూడా బాగా తెలిసిపోయారు.

93 ఏళ్ల వయస్సులో 2023 జనవరిలో ఆయన నాలుగోసారి పెళ్లి చేసుకున్నారు.

బిల్ ఆండర్స్

ఫొటో సోర్స్, POT

ఫొటో క్యాప్షన్, బిల్ ఆండర్స్

బిల్ ఆండర్స్ (అపోలో 8)

1968 డిసెంబర్‌లో బిల్ ఆండ్రూస్, అపోలో 8 మిషన్‌లో ప్రయాణించారు. లో-ఎర్త్ ఆర్బిట్‌ను దాటి మానవులు ప్రయాణించిన తొలి మిషన్ ఇదే. చంద్రుని కక్ష్యను చేరిన తొలి మానవ సహిత నౌక కూడా ఇదే.

అపోలో నౌక నాలుగోసారి చంద్రుని ముందు భాగాన్ని దాటుతుండగా అందులోని సిబ్బంది తొలిసారిగా అక్కడినుంచి భూమిని చూశారు. మానవ చరిత్రలో తొలిసారి ఇలా జరిగింది. ఆండర్స్ కెమెరాలో భూమి ఫొటోను తీశారు. ఇది ‘ఎర్త్‌రైజ్’ ఫోటోగా నిలిచిపోయింది.

అంతరిక్షం నుంచి తీసిన భూమి తొలి కలర్ ఫొటో, ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ఉద్యమాలకు, ‘ఎర్త్‌డే’ పుట్టుకకు దారి తీసింది.

చంద్రుడు

ఫొటో సోర్స్, POT

ఫొటో క్యాప్షన్, ఈ కలర్ ఫోటో కన్నా ముందు ఆండర్స్ బ్లాక్ అండ్ వైట్‌లో భూమి ఫోటో తీశారు

‘‘మేం చంద్రున్ని అన్వేషించడానికి ఇక్కడకు వచ్చాం. కానీ, మేం కనిపెట్టిన అత్యంత ముఖ్యమైన విషయం భూమి’’ అని ఆ క్షణం గురించి మాట్లాడుతూ ఆండర్స్ చెప్పారు.

1969లో అంతరిక్ష కార్యక్రమాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత అనేక దశాబ్దాల పాటు ఏరోస్పేస్ పరిశ్రమలో ఆయన పనిచేశారు.

1970లలో నార్వేలో అమెరికా రాయబారిగా ఏడాది పాటు పనిచేశారు.

చార్లెస్ డూకే

ఫొటో సోర్స్, POT

ఫొటో క్యాప్షన్, అపోలో 11 మిషన్ ప్రయోగం సందర్భంగా మిషన్ కంట్రోల్ రూమ్‌లో చార్లీ డూకే, జిమ్ లోవెల్, ఫ్రెడ్ హైస్

చార్లెస్ డూకే (అపోలో 16)

చంద్రుని మీద నడిచిన వారిలో నలుగురే జీవించి ఉన్నారు. వారిలో ఒకరు చార్లీ డూకే.

36 ఏళ్ల వయస్సులో ఆయన చంద్రునిపై నడిచారు. చంద్రుని ఉపరితలం మీద పాదం మోపిన చిన్న వయస్కుడు చార్లీ డూకే.

చంద్రుని మీది ‘అత్యద్భుత ప్రాంతం’’ గురించి బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

‘‘దాని అందం, అంతరిక్షంలోని చీకటికి చంద్రుని హారిజన్‌కు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. దాన్ని నేనెప్పుడూ మర్చిపోను. అది చాలా నాటకీయంగా ఉంది’’ అని చెప్పారు.

1969లో అపోలో 11 ల్యాండ్ అయినప్పుడు, మిషన్ కంట్రోల్ రూమ్‌లో క్యాప్సూల్ కమ్యూనికేటర్‌గా డూకే ఉన్నారు.

‘‘హ్యూస్టన్, ఇక్కడ ట్రాంకిలిటీ బేస్ ఉంది. ఈగల్ కిందకు దిగింది’’ అని నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చెప్పినప్పుడు, లైన్‌లో అవతలివైపు డూకే ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

‘‘మీరు చెప్పింది మేం విన్నాం. ప్రాణాలు బిగదీసుకొని ఉన్న చాలా మంది ఇప్పుడే మళ్లీ శ్వాస తీసుకోగలుగుతున్నారు’’ అని డూకే చెప్పారు.

ఆ క్షణం కోసం తాను ఊపిరి బిగబట్టుకొని ఎదురుచూశానని బీబీసీతో డూకే అన్నారు.

నాసా చేపడుతున్న ఆర్టెమిస్ మిషన్ పట్ల ఉత్సాహంగా ఉన్నానని 2022లో బీబీసీతో డూకే చెప్పారు. కొత్త తరపు వ్యోమగాములకు ఇది అంత సులభం కాదని ఆయన హెచ్చరించారు.

టెక్సస్‌లోని శాన్ ఆంటోనియా శివార్లలో తన భార్య డోరోంతితో కలిసి చార్లీ డూకే జీవిస్తున్నారు. వారి పెళ్లి జరిగి 60 ఏళ్లు అయింది.

ఎర్త్

ఫొటో సోర్స్, POT

ఫొటో క్యాప్షన్, భూమ్మీదకు తిరిగొచ్చాక తమను సెలెబ్రిటీలుగా చూడటంతో ఫ్రెడ్ హైస్, తన బృందం ఆశ్చర్యపోయారు

ఫ్రెడ్ హైస్ (అపోలో 13)

1970లో త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకున్న అపోలో 11లో ప్రయాణించిన సిబ్బందిలో ఒకరు ఫ్రెడ్ హైస్. వ్యోమనౌక భూమికి 2 లక్షల మైళ్ల దూరంలో ఉన్నప్పుడు అందులో సంభవించిన ఒక పేలుడు కారణంగా ఆ మిషన్‌ను రద్దు చేశారు.

దెబ్బతిన్న ఆ వ్యోమనౌకను, అందులోని సిబ్బందిని క్షేమంగా తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నించినప్పుడు ప్రపంచం మొత్తం ఆందోళనగా వారి కోసం ఎదురుచూసింది.

సురక్షితంగా భూమికి చేరిన తర్వాత ఫ్రెడ్ హైస్‌తో పాటు ఆయన సహచరులు జేమ్స్ లోవెల్, జాక్ స్విగర్ట్ సెలెబ్రిటీలు మారారు.

‘‘నేను అక్కడేదో కోల్పోయానని నాకు అనిపిస్తుంటుంది’’ అని అమెరికా టీవీ ప్రోగ్రామ్ ‘ద టునైట్ షో’లో ఫ్రెడ్ చెప్పారు. ఈ కార్యక్రమానికి తన బృందంతో కలిసి ఆయన హాజరయ్యారు.

ఫ్రెడ్ ఎప్పుడూ చంద్రుని మీదకు వెళ్లలేదు. అపోలో 19 మిషన్‌కు ఆయనను కమాండర్‌గా అనుకున్నారు. కానీ, బడ్జెట్ కోతలు కారణంగా ఆ మిషన్ రద్దు అయింది. అపోలో 17 తర్వాత చాలా మిషన్లు ఇలాగే అయ్యాయి.

తర్వాత, ఆయన స్పేస్ షటిల్ ఎంటర్‌ప్రైజెస్‌లో ప్రొటోటైప్ టెస్ట్ పైలట్‌గా పనిచేశారు.

నాసా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫ్రెడ్ కూడా తన రిటైర్మెంట్ వరకు ఏరోస్పేస్ రంగంలో పని చేశారు.

లోవెల్

ఫొటో సోర్స్, POT

ఫొటో క్యాప్షన్, లోవెల్ చివరి మిషన్ అపోలో 13

జేమ్స్ లోవెల్ (అపోలో 8, అపోలో 13)

తొలి లునార్ మిషన్‌ అపోలో 8లో పాల్గొనడం ద్వారా లోవెల్, బోర్మన్, ఆండెర్స్ చరిత్ర సృష్టించారు. ఆ తర్వాతో అపోలో 11 ల్యాండింగ్ కోసం కమాండ్ సర్వీస్ మాడ్యూల్, దాని లైఫ్ సపోర్ట్ వ్యవస్థలను వీరు పరీక్షించారు.

నిజానికి, తిరుగుముఖం పట్టే ముందు వారి వ్యోమనౌక చంద్రుని చుట్టూ 10 రౌండ్లు కొట్టింది.

అపోలో 13 కమాండర్‌గా చంద్రుని మీద నడిచిన అయిదో వ్యక్తిగా లోవెల్ నిలుస్తాడని అనుకున్నారు. కానీ, అది జరుగలేదు.

అయితే, అపోలో 13 సినిమాలో ఆయన పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది. అందులో ఆయన చావు అంచుల్లోకి వెళ్లినట్లుగా చూపించారు. ఆయన పాత్రను టామ్ హాంక్స్ పోషించారు.

1973లో నాసా నుంచి రిటైరైన తర్వాత లోవెల్, టెలీకమ్యూనికేషన్స్ పరిశ్రమలో పనిచేశారు.

చంద్రుని వరకు రెండుసార్లు ప్రయాణించిన ముగ్గురిలో జిమ్ లోవెల్ ఒకరు. 2023లో ఫ్రాంక్ బోర్మన్ చనిపోవడంతో, జీవించి ఉన్న పెద్ద వయస్కుడైన వ్యోమగామిగా జిమ్ లోవెల్ నిలిచారు.

ష్మిట్

ఫొటో సోర్స్, ENCYCLOPAEDIA BRITANNICA/UIG VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, 1971 నాటి ష్మిట్ ఫోటో

హ్యారిసన్ ష్మిట్ (అపోలో 17)

ఆనాటి చాలామంది వ్యోమగాముల్లా కాకుండా, ష్మిట్ ఎప్పుడూ అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేయలేదు.

భూవిజ్ఞాన శాస్త్రవేత్త, విద్యావేత్త అయిన ఆయన 1965లో సైంటిస్ట్-ఆస్ట్రోనాట్‌గా మారారు.

చివరి మానవ సహిత ప్రయోగం అపోలో 17లో ష్మిట్ సభ్యుడు.

1975లో నాసా నుంచి నిష్క్రమించిన తర్వాత సొంత రాష్ట్రం న్యూ మెక్సికో నుంచి అమెరికా సెనెట్‌కు ఎన్నికయ్యారు. ఒక పర్యాయం మాత్రమే ఆయన పనిచేశారు.

అప్పటినుంచి అనేక రంగాలకు కన్సల్టెంట్‌గా పనిచేశారు. విద్యారంగంలో కొనసాగుతున్నారు.

డేవిడ్ స్కాట్

ఫొటో సోర్స్, POT

ఫొటో క్యాప్షన్, చంద్రునిపై నడిచిన ఏడో వ్యక్తి డేవిడ్ స్కాట్

డేవిడ్ స్కాట్ (అపోలో 15)

అపోలో 15 వ్యోమనౌక కమాండర్ డేవిడ్ స్కాట్. చంద్రునిపై నడిచి ఇప్పుడు జీవించి ఉన్న నలుగురిలో డేవిడ్ స్కాట్ ఒకరు. చంద్రుని మీద డైవ్ చేసిన మొదటి వ్యక్తి కూడా.

1971లో స్కాట్, తన సహచరుడు జేమ్స్ ఇర్విన్‌తో కలిసి ‘లునార్ రోయింగ్ వెహికల్ (ఎల్‌ఆర్‌వీ)’ని పరీక్షించారు.

గంటకు 12 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ ల్యాండర్ నుంచి వ్యోమగాములు వేగంగా, చాలా దూరం ప్రయాణించడానికి ఎల్‌ఆర్‌వీ సహకరించింది.

‘‘అది పనిచేస్తుందో లేదో మొదటి మిషన్‌లో ఎవరికీ తెలియదు. దాన్ని బయటకు తీసి, ఆన్ చేసినప్పుడు అది నిజంగా పని చేయడం ప్రారంభించింది. అదే పెద్ద థ్రిల్’’ అని ఆయన గుర్తు చేసుకున్నారు.

నాసాలో వేర్వేరు స్థానాల్లో డేవిడ్ పని చేశారు. ఆ తర్వాత ప్రైవేట్ సెక్టార్‌కు మారిపోయారు.

థామస్

ఫొటో సోర్స్, POT

థామస్ స్టాఫోర్డ్ (అపోలో 10)

థామస్ స్టాఫోర్డ్, అపోలో 11 ల్యాండింగ్‌కు ముందు చివరి టెస్ట్ మిషన్‌కు నాయకత్వం వహించారు.

ఆ మిషన్‌లో భాగంగా భూకక్ష్య బయట లునార్ ల్యాండర్‌లో ప్రయాణించిన మొదటి సిబ్బందిగా స్టాఫోర్డ్, పైలట్ యూజీన్ సెర్నాన్ నిలిచారు.

తిరిగి వచ్చిన కొద్దికాలానికే ఆస్ట్రోనాట్ కార్యాలయానికి స్టాఫోర్డ్ హెడ్‌గా నియమితులయ్యారు. ఆ పదవిలో రెండేళ్లు పని చేశారు.

1975లో అపోలో-సోయుజ్ టెస్ట్ ప్రాజెక్టు ఫ్లైట్‌కు ఆయన నాసా కమాండర్‌గా ఉన్నారు. అమెరికా, సోవియట్ యూనియన్ చేపట్టిన తొలి ఉమ్మడి స్పేస్ మిషన్ ఇదే.

సోవియట్ యూనియన్‌కు చెందిన జీవితకాల స్నేహితుడైన అలెక్సీ లియోనోవ్‌తో స్పేస్‌లో ఆయన షేక్‌హ్యాండ్ ఇవ్వగలిగారు. ఇది ఊహించలేనిది.

తర్వాతి తరం లునార్ సాహసికులు ఏం సాధిస్తారో?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)