అణుబాంబుల ఆనవాళ్లు వెతుకుతుంటే కొత్త జీవులు బయటపడ్డాయి, ఎలాగంటే...

బ్లూ వేల్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రిచర్డ్ ఫిషర్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

కొన్ని తరాల నుంచీ దాదాపుగా మనుషుల కంట పడకుండానే పిగ్మీ బ్లూవేల్స్ సముద్రంలో తిరుగుతున్నాయి. వీటిలో కొన్ని 80 అడుగులు అంటే 24 మీటర్ల పొడవుతో 90 టన్నుల వరకూ బరువుంటాయి.

బహుశా ఈ భారీ జీవులు కొన్ని పడవలకు ఎదురువెళ్లి ఉండొచ్చు. కానీ, ఆ విషయాలనూ ఎవరూ రికార్డు చేయలేదు. అసలు ఇలాంటి జీవులు ఉన్నాయని కూడా నిన్నమొన్నటివరకూ ఎవరికీ తెలియదు.

2021లో ఇవి ప్రపంచానికి పరిచయం కావడం అనేది ముఖ్యమైన విషయం. అసలు ఇవి ఎలా వెలుగులోకి వచ్చాయనే అంశం చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. వీటి కోసం ఎవరూ గాలించలేదు. అణ్వాయుధ పరీక్షలపై నిఘా పెట్టుండకపోతే అసలు ఇవి మనకు తారసపడేవేకాదు.

ఈ తిమింగలం జాతికి అణ్వాయుధాలకు సంబంధం ఏమిటి? దీనికి సమాధానం కనుక్కోవాలంటే ‘‘గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ సెన్సర్స్’’ గురించి తెలుసుకోవాలి. దీనిలో భాగంగా కొన్ని సెన్సర్లను సముద్రాల్లో ఎవరూ సంచరించని ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు. దీని ఆపరేషన్ కంట్రోల్ రూమ్ ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది.

అనుమతుల్లేని అణ్వాయుధాల పరీక్షలను ఈ నెట్‌వర్క్ ఒక కంట కనిపెడుతూ ఉంటుంది. అయితే, ఏళ్ల నుంచీ సముద్రాలతోపాటు నేల, వాతావరణంలోని కొన్ని ఇతర శబ్దాలను కూడా ఈ సెన్సర్లు గుర్తిస్తున్నాయి. నేడు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసే జీవులనూ ఇవే వెలుగులోకి తీసుకొస్తున్నాయి.

సీటీబీటీవో

ఫొటో సోర్స్, CTBTO

అణు పరీక్షలతో ముప్పు

అసలు బ్లూ వేల్స్ ఎలా కనిపెట్టారో తెలుసుకోవాలంటే 1940ల వరకూ వెళ్లాలి. అప్పుడే పరిమాణువు విధ్వంసకర శక్తి గురించి అవగాహన పెరగడం మొదలైంది. అమెరికా ట్రినిటీ టెస్టు, ఆ తర్వాత జపాన్‌పై అణు బాంబు దాడుల భయాందోళనలు పెరిగాయి.

తమ అమ్ముల పొదిలో అణ్వాయుధాలు చేర్చుకోవాలని దేశాలు ఒకదానితో మరొకటి పోటీ పడటం మొదలుపెట్టాయి.

అయితే, ఈ అణ్వాయుధాల పరీక్షల విషయంలో పాదర్శకత అవసరమని చాలా దేశాలు భావించాయి. అసలు అణ్వాయుధాల దాడుల ముప్పు అడ్డుకోవాలంటే కొన్ని దేశాలు గుట్టుచప్పుడు కాకుండా చేపట్టే అణు పరీక్షల గురించి తెలియాలని భావించారు.

అలా 1990లో బ్రిటన్ సహా కొన్ని పశ్చిమ దేశాలు కాంప్రహెన్సి‌వ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ (సీటీబీటీ) ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే, చైనా, అమెరికా, భారత్ లాంటి కొన్ని దేశాలు ఈ ఒప్పందాన్ని ఆమోదించలేదు. దీంతో ఇది అమలులోకి రాలేదు.

అయినప్పటికీ, ఇష్టానుసారం నిర్వహించే అణు పరీక్షలను కనిపెట్టేందుకు దీనిలో ఒక వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఫలితంగా భూమిపై ఎక్కడైనా అణు పరీక్షలు నిర్వహిస్తే తెలుసుకునేందుకు మార్గం సుగమమైంది.

ప్రపంచ వ్యాప్తంగా సెన్సర్లతో ‘‘ద ఇంటర్నేషనేల్ మానిటరింగ్ సిస్టమ్’ను ఏర్పాటు చేసింది సీటీబీటీ. మొదట వియన్నా కేంద్రంగా ఏర్పాటైన ఈ నెట్‌వర్క్ ప్రస్తుతం 300కుపైగా కేంద్రాల ద్వారా పనిచేస్తోంది. అణు పరీక్షల అనంతరం వెలువడే రేడియో ధార్మిక పదార్థాలు, షాక్‌వేవ్స్, ధ్వని తరంగాలను ఇది గుర్తిస్తుంది.

ఈ నెట్‌వర్క్‌లో భాగంగానే సముద్రంలోనూ 120 సైస్మిక్ స్టేషన్లు, 11 హైడ్రో-అకోస్టిక్ మైక్రోఫోన్లు, 60 ఇన్‌ఫ్రాసౌండ్ స్టేషన్లను ఏర్పాటుచేశారు. మనం చెవులతో వినలేని చిన్నచిన్న శబ్దాలను కూడా ఇవి గుర్తించగలవు.

అయితే, చాలా ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ఈ సెన్సర్‌ల నుంచి ఎలాంటి శబ్దాలూ వినిపించవు. ఉదాహరణకు పసిఫిక్ మహాసముద్రంలోని అమెరికాకు చెందిన మారుమూల వేక్ ఐలండ్ దీవిలోనూ ఒక స్టేషన్‌ను ఏర్పాటుచేశారు. అంటార్కిటికాలోనూ ఇలాంటి కేంద్రాలు ఉన్నాయి.

అయితే, కొన్నింటిని ప్రజలు జీవించే ప్రాంతాలకు సమీపంలోనూ ఏర్పాటుచేశారు. టెక్సస్‌లోని లాజిటస్ ప్రాంతంలో ఏర్పాటుచేసిన స్మిస్మిక్ అరే స్టేషన్‌ ఇలాంటిదే.

సీటీబీటీవో

ఫొటో సోర్స్, CTBTO

చీమ చిటుక్కుమన్నా..

భూమిపై చాలా ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడంతో ఎక్కడ అణు పరీక్ష నిర్వహించినా వియన్నాలోని ప్రధాన కేంద్రానికి తెలుస్తుందని ఆస్ట్రియాలోని సీటీబీటీవోకు చెందిన ఇంటర్నేషనల్ మానిటరింగ్ సిస్టమ్ డివిజన్ (ఐఎంఎస్) డైరెక్టర్ షియోలీ పెరుజ్ కాంపోస్ చెప్పారు.

‘‘ఎక్కడ ఏం జరిగినా కనిపెట్టే టెక్నాలజీ మన దగ్గర ఉంది. భూగర్భంలోని అణు పరీక్ష అయితే, సిస్మిక్ టెక్నాలజీ కనిపెడుతుంది. అదే సముద్రంలో అయితే, హైడ్రో అకోస్టిక్ స్టేషన్లు గుర్తిస్తాయి. ఒకవేళ వాతావరణంలో నిర్వహిస్తే ఇన్‌ఫ్రాసౌండ్ టెక్నాలజీ గుర్తిస్తుంది’’ అని ఆమె చెప్పారు.

ఉత్తర కొరియా నిర్వహించే అణు పరీక్షలను ఐఎంఎస్‌కు చెందిన సైస్మిక్ సెన్సర్లు గుర్తిస్తుంటాయి. పేలుళ్ల నుంచి వచ్చే తరంగాలతోపాటు వాతావరణంలోని ఐసోటోపుల విశ్లేషణల ద్వారా ఇవి అణు పరీక్షలేనని నిర్ధారిస్తారు.

భారీ ఇతర పేలుళ్లను కూడా ఈ నెట్‌వర్క్ గుర్తించింది. బేరూత్‌లో 2020నాటి పేలుళ్లు లేదా 2022నాటి టోంగా అగ్నిపర్వత విస్ఫోటం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

బేరూత్ పేలుళ్లు

ఫొటో సోర్స్, Getty Images

పరిశోధకులకు డేటా ఇవ్వండంతో

ఈ ఐఎంఎస్ న్యూక్లియర్ నెట్‌వర్క్ ‘‘బిగ్‌ బ్యాంగ్స్’’ కంటే ఎక్కువ విషయాలను మనకు తెలియజేసింది. గత దశాబ్దంలో పరిశోధకులకు ఈ డేటాను ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో అసలు ఎవరూ పట్టించుకోని అంశాలపై పరిశోధనకు ఇది మార్గం సుగమం చేసింది. దీనిలో భాగంగానే తిమింగలాల శబ్దాలు సహా చాలా ధ్వనులు వెలుగులోకి వచ్చాయి.

గత జూన్‌లో వియన్నా కేంద్రంగా వందల మంది శాస్త్రవేత్తలు సమావేశమయ్యారు. అప్పుడే జర్మనీకి చెందిన పరిశోధకులు హైడ్రో-అకోస్టిక్ సెన్సర్ల సాయంతో నౌకల నుంచి వచ్చే శబ్దాలను ఎలా కనిపెట్టొచ్చో వివరించారు.

జపాన్‌కు చెందిన పరిశోధకులు కూడా సముద్రం అడుగున అగ్నిపర్వతాలపైనా ఈ డేటాతో అధ్యయనం చేయగలిగామని చెప్పారు. మరోవైపు బ్రెజిల్ పరిశోధకుడు ఒకరు అరోరా బరెయాలిస్, అరోరా ఆస్ట్రేలిస్ లాంటి ఆకాశంలో కనిపించే రంగురంగుల కాంతి నుంచి వచ్చే ఇన్‌ఫ్రాసౌండ్‌ను ఎలా కనిపెట్టొచ్చో వివరించారు.

న్యూమెక్సికో అల్‌బుకరెక్‌కు చెందిన శాండియా నేషనల్ లేబరేటరీస్ పరిశోధకురాలు ఎలిజబెత్ సిల్బెర్ అయితే, 2020 సెప్టెంబరు 22న భూమి వాతావరణంలోకి దూసుకొచ్చిన గ్రహశకలం ఎలాంటి షాక్‌వేవ్స్ సృష్టించిందో ఐఎంఎస్ డిటెక్టర్ల సాయంతో అధ్యయనం చేయగలిగామని చెప్పారు.

పిగ్మీ బ్లూవేల్స్

ఫొటో సోర్స్, Getty Images

పిగ్మీ బ్లూవేల్స్ ఎలా..

ఇక పిగ్మీ బ్లూ వేల్స్ విషయానికి వస్తే.. ఇవి నీలి తిమింగాల జాతిలో ఒక ఉపజాతి (సబ్ స్పీషీస్). ఐఎంఎస్ హైడ్రో-అకోస్టిక్ నెట్‌వర్క్ శబ్దాలను వింటున్న ఆస్ట్రేలియా పరిశోధకులు వీటిని కనిపెట్టారు.

2021లో సిడ్నీ న్యూసౌత్ వేల్స్‌ యూనివర్సిటీకి చెందిన బయోఅకోస్టీషియన్ ఎమ్మనుయెల్ లారోయ్, ఆయనతో పనిచేస్తున్న కొంతమంది పరిశోధకులు మధ్య హిందూ మహాసముద్రంలోని కొన్ని తిమింగలాల శబ్దాలను విశ్లేషించారు.

దీనికి కొన్ని ఏళ్ల ముందే ఒక కొత్త శబ్దాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్నే ‘‘చాగోస్ సాంగ్’’ లేదా ‘‘డీగో గార్సియా డౌన్‌స్వీప్’’గా పిలిచేవారు. వీటిని కనిపెట్టిన డీగో గార్సియా పేరునే దీనికి పెట్టారు.

అప్పట్లో హిందూ మహాసముద్రంలో ఐదు బ్లూ వేల్ సమూహాలతోపాటు ఒమూరా వేల్స్ సమూహం ఒకటి ఉన్నట్లు గుర్తించారు. అయితే, చాగోస్ సాంగ్ వీటిలో ఏ బృందం నుంచి వచ్చిందో మొదట్లో స్పష్టత ఉండేదికాదు. ఇక్కడ ఒక్కో బృందం ఒక్కోలా శబ్దాలు చేస్తుంది. అయితే, వేటితోనూ ఆ శబ్దం సరిపోలేది కాదు.

శ్రీలంక నుంచి పశ్చిమ ఆస్ట్రేలియా వరకూ వేర్వేరు ప్రాంతాల్లో ఈ చాగోస్ సాంగ్‌పై అధ్యయనానికి ఐఎంఎస్ నెట్‌వర్క్ సాయం చేస్తుందని లెరోయ్ భావించారు. అప్పుడే ఈ శబ్దం పిగ్మీ బ్లూవేల్స్‌గా పిలిచే ఒక కొత్త జాతి నుంచి వచ్చిందని తెలిసింది.

ఈ కొత్త వేల్స్ బృందాన్ని కనుగొనడం చాలా ముఖ్యమైన వార్త. ఇవి అరుదైన తిమింగలాలు మాత్రమే కాదు. 20వ శతాబ్ధంలో వేటాడటం వల్ల బ్లూ వేల్స్ అంతరించిపోయే దశకు వచ్చేశాయి. 1920ల్లో వీటి సంఖ్య 2,39,000 ఉండేది. 1970ల నాటికి వీటి సంఖ్య 360కి పడిపోయింది.

పిగ్మీ బ్లూ వేల్స్

ఫొటో సోర్స్, ALAMY

ఎవరూ ఊహించలేదు..

ఐఎంఎస్ నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేసినప్పుడు ప్రపంచాన్ని సురక్షితంగా మార్చడమే దీని లక్ష్యం. ‘‘అణు పరీక్షలతో ముప్పుందని అప్పట్లోనే గుర్తించారు. ఈ పరీక్షలను అడ్డుకునేందుకు ఒక ఒప్పందాన్ని తీసుకొచ్చారు. అంతేకాదు నిఘా పెట్టేందుకు టెక్నాలజీలను తీసుకొచ్చారు’’ అని పెరెజ్ చెప్పారు.

అయితే, అంత ముందుచూపుతో ఆలోచించినప్పటికీ ఈ టెక్నాలజీతో ఎలాంటి ఉపయోగాలు ఉండొచ్చో వారు ఊహించలేదు. నేడు 300పైకి ఉన్న కేంద్రాలు ప్రకృతి నుంచి వచ్చే శబ్దాలు, జీవుల పాటలనూ కనిపెడుతున్నాయి.

బహుశా మనకు ఆ తిమింగాల గుంపు కనిపించకపోవచ్చు. కానీ, వాటి శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి.

వీడియో క్యాప్షన్, కేరళలో మిణుగురు పురుగుల అద్భుతం.. దీన్ని చూడాలంటే కారు చీకట్లో వేచి ఉండాల్సిందే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)