పాము ఇంట్లో దూరితే ఏం చేయాలి?

ఇంట్లో పాము

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మురుగేశ్ మడ్‌కన్ను
    • హోదా, బీబీసీ తమిళ్

చిన్నప్పుడు మా ఇంటి చుట్టూ చెట్లు, పొదలు ఉండేవి. ఒక రోజు సాయంత్రం మేము భోజనం చేస్తున్నప్పుడు కరెంటు పోయింది. చీకట్లోనే భోజనం పూర్తిచేసి, ప్లేటు కడుక్కునేందుకు ఇంటి ముందు గోడ దగ్గర ఉన్న కుళాయి దగ్గరకు వెళ్లాను. అప్పుడే మూడు అడుగుల ఎత్తు ఉన్న ఆ గోడపై దాదాపు ఐదడుగుల పొడవున్న పాము కనిపించింది.

గోడపై నుంచి మా ఇంట్లోకి వచ్చింది. వెన్నెల వెలుగులో లావుగా, పొడవుగా కనిపిస్తుంది. కానీ, అది ఏ పామో అర్థం కాలేదు.

నేను భయంతో అక్కడే నిలబడిపోయాను. కుళాయి నుంచి నీళ్లు వస్తున్నాయి. ఒక చేతిలో ప్లేటు పట్టుకుని అక్కడే, అలాగే నిల్చున్నాను. చీకట్లో మసకమసకగా ఉన్నప్పటికీ నా కళ్లు మాత్రం ఆ పాముపైనే ఉన్నాయి. ఆ తర్వాత అది ఇంట్లో ఒక మూలన ఉన్న కొబ్బరికాయల కిందకు దూరింది. నా జీవితంలో పాముని చూడడం అదే తొలిసారి.

వీడియో క్యాప్షన్, పాము ఇంట్లో దూరితే ఏం చేయకూడదు?

మనుషుల భయమే పాములకు ముప్పు

పామును చూడగానే మనుషులు వణికిపోతారు. పాములను చంపడానికి ఈ భయమే ప్రధాన కారణం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, ఏటా 50 లక్షల మంది పాముకాటుకి గురవుతున్నారు. అందులో దాదాపు 81 వేల నుంచి లక్షా 38 వేల మంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నారు.

ప్రపంచంలో పాముకాటుకి గురై చనిపోతున్న వారి సంఖ్య భారత్‌లోనే అత్యధికంగా ఉంది. 2020లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, 2000 సంవత్సరం నుంచి 2019 వరకు 12 లక్షల మంది పాముకాటు కారణంగా చనిపోయారు.

వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, బాధితులు సహజ నివారణ పద్ధతులను పాటించడం వంటి వాటి వల్ల పాముకాట్లకు గురైన వారి సంఖ్య కచ్చితంగా తేలడం లేదు.

పాముల పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్లే ఈ మరణాలకు కారణమని పరిశోధకులు చెబుతున్నారు.

పాములను సంరక్షించాలనే ఉద్దేశంతో ప్రతి జులై 16న వరల్డ్ స్నేక్స్ డే (ప్రపంచ పాముల దినం) జరుపుకుంటారు.

పాములు

ఫొటో సోర్స్, Getty Images

ఇవన్నీ విషపూరిత పాములు

భారత్‌లో సుమారు 300 రకాల పాములు ఉన్నాయి. వాటిలో కేవలం 60 రకాల పాములు మాత్రమే విషపూరితమైనవి.

కట్లపాము : భారత్‌లో కనిపించే అత్యంత విషపూరిత పాముల్లో కట్లపాము ఒకటి. కట్ల పాము జాతిలో కొన్ని ఉప జాతులు కూడా ఉన్నాయి. ఇది సుమారు ఒకటిన్నర మీడరు పొడవు ఉంటాయి. తల వైపు లావుగా ఉండి తోక వైపు సన్నగా ఉంటుంది.

పింజరి : పింజరి, రక్త పింజరిగా పిలిచే ఈ పాములు కొండచిలువను పోలి ఉంటాయి. దాని శరీరంపై గొలుసు మాదిరిగా చారలు ఉంటాయి. తలకాయ కప్పను పోలి ఉండే ఈ పాము విషం కూడా ప్రమాదకరం.

కింగ్ కోబ్రా: ఇవి పొడవుగా ఉండే విషపూరిత పాములు. ఇవి దట్టమైన అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. చాలా అరుదుగా ఇవి కనిపిస్తుంటాయి. ఈ పాములు ఆలివ్ గ్రీన్, ముదురు గోధుమ, నలుపు రంగుల్లో ఉంటాయి. పొట్ట భాగం పసుపు, లేదా తెలుపు రంగులో ఉంటుంది. బాగా పెరిగిన కింగ్ కోబ్రా తల చాలా పెద్దదిగా ఉంటుంది.

నిర్లక్ష్యంతోనే పాముకాటు మరణాలు

పాములు చాలా ప్రమాదకరమైనవని భావిస్తారు. పాములకు కూడా మనుషులంటే భయం ఉంటుందని, అయితే మరణాలు మాత్రం కేవలం మనుషుల నిర్లక్ష్యం వల్లే సంభవిస్తున్నాయని పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తున్న కళింగ ఫౌండేషన్ రీసెర్చ్ డైరెక్టర్ ఎస్.ఆర్ గణేష్ అన్నారు.

పాములు మనుషులను కాటు వేయాలని అనుకోవు. ఆరడుగులు పొడవు ఉండే నాగుపాము సుమారు ఒక కేజీ బరువు ఉంటుంది. కానీ 60 - 70 కేజీల బరువు ఉండే మనిషి వాటిని తొక్కితే ఏమవుతుందో ఒకసారి ఊహించుకోండి. అలాంటి పరిస్థితుల్లో మాత్రమే పాము తనను తాను కాపాడుకోవడం కోసం కాటు వేస్తుంది. తన నోటిని అది ఆయుధంగా వాడుతుంది. మనిషి కాలు వేసినా, లేదా ఒక కుక్క కాలు వేసినా పాములు అలాగే స్పందిస్తాయి.

''పొలాల్లో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. రైతులు భూమిని దైవంగా భావిస్తారు. అందువల్ల పాదరక్షలు లేకుండా ఒట్టి పాదాలతో నడుస్తుంటారు. అలాంటప్పుడు ప్రమాదవశాత్తూ పాముపై కాలు వేస్తే అది కాటు వేస్తుంది.''

''పాములు మనుషులకు భయపడతాయి. వారి నుంచి దూరంగా ఉండేందుకే అవి ప్రయత్నిస్తాయి. కానీ, వాటికి ఇబ్బంది కలిగితే మాత్రమే మాత్రమే అవి ప్రతిఘటిస్తాయి'' అని ఆయన విరించారు.

ఒకవేళ పాము ఇంట్లోకి వస్తే, అది బయటికి వెళ్లేందుకు వీలుగా తలుపులు, కిటికీలు తీసి ఉంచాలని గణేష్ అన్నారు.

కానీ, తలుపులు, కిటికీలు మూసేసి కర్ర తీసుకుని కొట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం, తనను తాను రక్షించుకోవడానికి మరో మార్గం ఉండదు.

నివాసాలకు దగ్గరగానే ఉండే పాములకు మనుషుల లక్షణాలు తెలుసని ఆయన చెప్పారు.

''వివరంగా చెప్పాలంటే, మీరు పామును చూడకముందే అది మిమ్మల్ని చాలా సార్లు చూసి ఉంటుంది. ఉదాహరణకు కొన్ని ఇళ్లలో పాములు గుడ్లు పెడతాయి. వాటిని పొదుగుతాయి. అది ఒక్కరోజులో జరిగే పని కాదు. అవి అక్కడే ఉంటాయి. ఏ సమయంలో అటువైపు మనుషుల అలికిడి ఉంటుందో, ఎప్పుడు ఉండదో పసిగడతాయి.''

భారత్‌లో నమోదవుతున్న పాముకాట్లలో 70 శాతం విషం లేని పాములవే. మిగిలిన 30 శాతం విషపూరిత పాముకాట్లు. అలాగే, కేవలం నాలుగు రకాల పాముల వల్లే దాదాపు 90 శాతం పాముకాట్లు నమోదవుతున్నాయి.

ప్రతి విషపూరితమైన పాముని అత్యంత ప్రమాదకరమైన ఇండియన్ కోబ్రా (నాగుపాము)గా భావిస్తారు. అందువల్లే పాములన్నీ ప్రమాదంలో పడుతున్నాయి.

పాములు

ఫొటో సోర్స్, Getty Images

పాము ఇంట్లోకి వస్తే ఏం చేయాలి?

పాములను చూసిన వెంటనే భయాందోళనకు గురికాకూడదని పాములను సంరక్షించే విశ్వ చెప్పారు. ఆయన పాములను పట్టుకోవడం, వాటిని సురక్షితంగా ఇతర ప్రాంతాల్లో వదిలేయడం తదితర విషయాల్లో ఉర్వాణం సంస్థలో శిక్షణ పొందారు.

''పాము కనపడగానే కొంతమంది వెంటనే ఇంటి తలుపులు, కిటికీలు సహా బయటికి వెళ్లేందుకు వీల్లేకుండా అన్నింటినీ మూసేస్తారు. దీంతో అవి ఇంట్లోనే ఏదో ఒక చోట దాక్కుంటాయి. అప్పుడు వాటిని పట్టుకోవడం కష్టమవుతుంది'' అని ఆయన అన్నారు.

నేను తొలిసారి నాగుపాముని చూసినప్పుడు కూడా అలాగే జరిగింది. ఆ రోజు నేను భయంభయంగా నిద్రలేచాను. ఆ వెంటనే ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పాను. ఆ తర్వాత కొద్దిసేపటికే పాముని చంపేందుకు కర్రలు తీసుకుని వచ్చిన వాళ్లతో ఆ రోడ్డంతా నిండిపోయింది.

పాము ఉన్న ప్రదేశం చుట్టూ ఉన్న దారులన్నీ మూసివేశారు. ఆ ప్రదేశం చుట్టూ జనం గుమిగూడారు. ప్రతి మూలలో స్పష్టంగా కనిపించేలా లైట్లు ఏర్పాటు చేశారు.

ఒక యువకుడు ధైర్యంగా తన చేతులతో పామును పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అప్పట్లో అతను ఎంత ధైర్యవంతుడో అనిపించింది. కానీ, అలా చేయడం మంచిది కాదని విశ్వ అన్నారు.

''కొందరు ఎలాంటి శిక్షణ లేకుండా పాములు పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ, ప్రమాదవశాత్తూ పాముకాటుకి గురై చనిపోతుంటారు. మీరు పాముని చూస్తే, దాని నుంచి వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.'' అని ఆయన చెప్పారు.

పాములు సంచరించే ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వాళ్లు పాములు పట్టుకునే వారు, అగ్నిమాపక దళ సిబ్బంది ఫోన్ నంబర్లు దగ్గర ఉంచుకోవాలన్నారు.

పాము కరిస్తే ఏం చేయాలి?

పాము కరించిన వెంటనే ఆందోళన పడడం వల్ల పరిస్థితి దిగజారుతుంది.

కొంతమంది పాము కాటు వేసిన శరీర భాగం వద్ద బలంగా కట్టు కడుతుంటారు. కొందరు అక్కడే గాయం చేసి రక్తం బయటికి పోయేలా చేస్తుంటారు. అలాగే, పాముని చంపడం కోసం సమయం వృథా చేస్తుంటారు. ఆ పాముని చంపి ఏ పాము కరిచిందో డాక్డర్‌కి చూపించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, అలా చేయకూడదు.

పాముకాటు తర్వాత వీలైనంత త్వరగా బాధితుడిని వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి.

కొన్నిసార్లు విషపూరితం కాని పాములు కాటువేస్తాయి. కానీ, పాము కాటువేస్తే చనిపోవడం ఖాయమని కొందరు తీవ్ర ఆందోళనకు గురవుతారు. దీంతో రక్తస్రావం ఎక్కువగా జరుగుతుంది. అది ప్రాణాలు పోయేందుకు కారణమయ్యే అవకాశం ఉంది.

''కాబట్టి, విషపూరితమైనవైనా, విషపూరితం కాని పాములైనా కాటు వేసినప్పుడు భయాందోళన చెందకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. మీ పక్కనున్న ఎవరినైనా పాము కాటువేస్తే కనీసం మీరైనా ఆందోళన చెందకుండా, జాగ్రత్తగా వ్యవహరించాలి.'' అని విశ్వ చెప్పారు.

పాము

ఫొటో సోర్స్, Getty Images

పాముకాటుకు గురవకుండా ఉండడమెలా?

పాములను దూరం చేయలేం కానీ, పాముకాట్లను దూరం చేయొచ్చు.

''మన ఇంటి చుట్టు పక్కల ప్రాంతాలన్నీ ఒకప్పుడు జంతువులకు ఆవాసాలే. ఇప్పుడు ఆ ప్రాంతాల్లోనే మనం ఇళ్లు కట్టుకుంటున్నాం. కాబట్టి పాములు వస్తాయని అందరూ తెలుసుకోవాలి. మన పూర్వీకులు దానిని బాగా అర్థం చేసుకున్నారు.''

అందువల్లే వాళ్లు పామును చూసినా చంపేవారు కాదు. అవి ఉంటాయని తెలిసినా వాటితో కలిసి జీవించడం నేర్చుకున్నారు అని ఎస్.ఆర్ గణేష్ చెప్పారు.

''భారత్‌లోని చాలా సర్పజాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. వాటి ఆవాసాలు నాశనమయ్యాయి. ఈ పరిస్థితిని మనం మెరుగుపరచాలంటే, పాములు మనకు ఇబ్బంది కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి'' అని ఆయన అన్నారు.

కారు ప్రమాదాలు జరుగుతున్నాయని కార్లను మనం వాడకుండా ఉంటామా? అలాగే, పాములను దూరం చేయాల్సి అవసరం లేదు. పాముకాటుకు గురవకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని గణేష్ చెప్పారు.

బహుశా మనుషులకు భయపడి, తప్పించుకోవడం కోసమే ఆ రోజు పాము కొబ్బరికాయల కింద దాక్కుని ఉంటుంది.

కానీ, దాన్ని చూసిన వెంటనే నేను భయంతో నిశ్చేష్టుడినైపోయాను. నేను కొద్దిసేపు అలాగే పక్కన కూర్చుని ఉండి ఉంటే అది అక్కడి నుంచి వెళ్లిపోయి ఉండేదేమో.

పాము అలా ఎందుకు దాక్కుందో తెలియదు. అందువల్లే పాము తప్పించుకోకుండా చుట్టుముట్టి అందరూ కలిసి చంపేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)