గోడకుర్చీ వేస్తే బీపీ తగ్గుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫిలిప్పా రాక్స్‌బీ
- హోదా, బీబీసీ హెల్త్ రిపోర్టర్
రక్తపోటు (బీపీ)ని తగ్గించడానికి ఉన్న ఉత్తమ మార్గాల్లో ప్లాంక్, వాల్ స్క్వాట్స్ (గోడ కుర్చీ) వంటి కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు కూడా భాగమని ఒక అధ్యయనం తేల్చింది.
బీపీని నియంత్రించడానికి చేసే అనేక సిఫార్సుల్లో చాలావరకు వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ వంటి ఏరోబిక్ ఎక్స్‌ర్‌సైజులే ఉన్నాయి.
బీపీని తగ్గించడానికి అన్ని రకాల వ్యాయామాలు మంచివేనని ‘బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్’లో ఒక విశ్లేషణను ప్రచురించారు. మొత్తం 16 వేల మందిపై పరిశోధన చేసి ఈ విశ్లేషణకు వచ్చారు.
అయితే, ఏరోబిక్ ఎక్స్‌ర్‌సైజుల కంటే కూడా గోడ సహాయంతో చేసే స్క్వాట్స్, నేలపై చేసే ప్లాంక్ వంటి వ్యాయామాలు మరింత మెరుగ్గా బీపీని తగ్గించడంలో సహాయపడతాయని ఆ అధ్యయనంలో తేల్చారు.
కండరాలు, కీళ్లను కదలించకుండా చేసే ప్లాంక్, స్క్వాట్స్ వంటి వ్యాయామాలు కండరపుష్టిని పెంచుతాయి.
పుషప్ భంగిమను పోలి ఉండే ప్లాంక్ వ్యాయామం వల్ల పొత్తికడుపు దృఢమవుతుంది.
కాలి వేళ్లు, మోచేతుల మీద భారం వేస్తూ ప్లాంక్ వ్యాయామం చేస్తారు.
స్క్వాట్స్ అంటే గోడకు వీపును ఆనించి, నేలకు తొడలు సమాంతరంగా ఉండేలా జారగిలబడి కూర్చున్నట్లుగా ఉంటుంది. అంటే దాదాపు గోడ కుర్చీ వేసినట్లుగా ఉంటుందిది.

ఫొటో సోర్స్, Getty Images
ఏరోబిక్ వ్యాయామాల కంటే ప్లాంక్, స్క్వాట్స్ కారణంగా శరీరంపై చాలా భిన్నమైన ఒత్తిడి కలుగుతుందని కాంటర్‌బరీలోని క్రైస్ట్ చర్చ్ యూనివర్సిటీకి చెందిన అధ్యయనకర్త డాక్టర్ జేమీ ఓ డ్రిస్కోల్ చెప్పారు.
‘‘రెండు నిమిషాల పాటు ఈ భంగిమలో ఉన్నప్పుడు కండరాపై ఒత్తిడి పెరుగుతుంది. భంగిమ నుంచి రిలాక్స్ అయిన వెంటనే ఒక్కసారిగా రక్త ప్రసరణ అవుతుంది. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. కానీ, ఇది చేసేటప్పుడు శ్వాస తీసుకోవడాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి’’ అని ఆయన వివరించారు.
అధిక రక్తపోటు వల్ల గుండె, ఇతర అవయవాల్లోని రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువ అవుతుంది.
సాధారణంగా ఇలాంటి సమస్యలకు మందులతో చికిత్స చేస్తారు. ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవడంతో పాటు ఆల్కహాల్, పొగ తాగడాన్ని తగ్గించాలని రోగులను హెచ్చరిస్తారు. ప్రతిరోజూ వ్యాయామం చేయాలని సూచిస్తారు.
40 ఏళ్లు దాటినవారు ప్రతి క్రమం తప్పకుండా రక్తపోటును తనిఖీ చేసుకోవాలనే సిఫార్సులు కూడా ఉన్నాయి.
ధమనుల్లో రక్తపోటును మిల్లీ మీటర్స్ ఆఫ్ మెర్క్యురీ (ఎంఎంహెచ్‌జీ) ప్రమాణాల్లో కొలుస్తారు.
తాజా అధ్యయనం ప్రకారం, రక్తపోటు 130/85 ఎంఎంహెచ్‌జీగా ఉంటే ఆరోగ్యకరమని, 140/90 ఎంఎంహెచ్‌జీగా ఉంటే అధిక బీపీ ఉన్నట్లు పరిగణిస్తారు.
1990-2023 మధ్య 270 క్లినికల్ ట్రయల్స్‌లో 15,827 మంది వ్యక్తుల నుంచి సేకరించిన డేటాను క్రైస్ట్ చర్చ్ యూనివర్సిటీ, లీసెస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
వ్యాయామం వల్ల బీపీ ఎంత వరకు తగ్గిందో ఈ అధ్యయనం పోల్చి చూసింది.
- జాగింగ్, సైక్లింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాల తర్వాత బీపీ 4.49/2.53 ఎంఎంహెచ్‌జీ తగ్గింది
- బరువులెత్తడం వంటి వ్యాయామం తర్వాత 4.55/3.04 ఎంఎంహెచ్‌జీ,
- ఏరోబిక్, వెయిట్ ట్రైనింగ్ రెండూ చేసిన తర్వాత 6.04/2.54 ఎంఎంహెచ్‌జీ,
- హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ఎక్స్‌ర్‌సైజుల తర్వాత 4.08/2.50 ఎంఎంహెచ్‌జీ,
- ప్లాంక్, వాల్ స్క్వాట్స్ వంటి ఐసోమెట్రిక్ వ్యాయామాల తర్వాత 8.24/4 ఎంఎంహెచ్‌జీ తగ్గినట్లు అధ్యయనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
సాపేక్షంగా వీటి మధ్య తేడాలు చాలా స్వల్పమే అయినప్పటికీ, అవి రోగుల్లో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించగలవు అని డాక్టర్ డ్రిస్కోల్ చెప్పారు.
ఆరోగ్యంగా ఉండటానికి వయోజనులు వారానికి 150-300 నిమిషాల పాటు ఒక మోస్తరు, 75-150 నిమిషాల పాటు తీవ్రమైన ఏరోబిక్ శారీరక వ్యాయామాలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తన మార్గదర్శకాల్లో సిఫార్సు చేసింది.
వారానికి మూడుసార్లు రెండు నిమిషాల వాల్ స్క్వాట్స్ లేదా ప్లాంక్ సెషన్లు చేయాలని డిస్కోల్ సూచించారు. ఈ వ్యాయామాల మధ్య రెండు నిమిషాల చొప్పున విశ్రాంతి తీసుకుంటూ నాలుగుసార్లు పునరావృతం చేయాలని చెప్పారు.
హృదయ సంబంధ వ్యాధులు రావడానికి గల ప్రధాన కారణాల్లో శారీరక శ్రమ లేకపోవడం కూడా ఒకటని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.
రోజుకు 30 నుంచి 60 నిమిషాల పాటు నడవడం ద్వారా ఈ వ్యాధులను నివారించవచ్చని చెప్పింది.
గుండె వ్యాధులకు కారణమయ్యే ఇతర కారకాలను కూడా శారీరక శ్రమ ప్రభావితం చేస్తుంది.
బరువు నియంత్రించడంతో పాటు, ఒత్తిడిని తగ్గించడం, యాంగ్జైటీ, డిప్రెషన్, డయాబెటిస్ లక్షణాలను శారీరక శ్రమతో నియంత్రించవచ్చని డబ్ల్యూహెచ్‌వో తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ఎక్స్‌ర్‌సైజ్ చేయడంతో పాటు పొగ తాగడాన్ని మానుకోవాలని డబ్ల్యూహెచ్‌వో సిఫార్సు చేస్తోంది. వయస్సు పెరుగుతున్న కొద్ది ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మంచి ఆహరాన్ని తీసుకోవడం, ఎత్తుకు తగిని బరువు ఉండేలా చూసుకోవాలని చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- కడప స్టీల్ ప్లాంట్: కేంద్రం లాభం లేదంటోంది.. జగన్ సొంత జిల్లాలో ఉక్కు కర్మాగారం భవిష్యత్తేమిటి
- పాము ఇంట్లో దూరితే ఏం చేయాలి?
- ప్రోడ్రగ్స్: పోలీసులను బురిడీ కొట్టిస్తున్న ఈ డ్రగ్స్ ఏమిటి
- అబ్దుల్ కలాం: చనిపోవడానికి ముందు ఆ చివరి ఐదు గంటల్లో ఏం జరిగింది
- రేటింగ్, రివ్యూ, లైక్ ఫ్రాడ్స్: భారతీయుల నుంచి రూ.712 కోట్లు దోచుకున్న చైనా ముఠా, ఆ డబ్బు మిలిటెంట్ సంస్థ హిజ్బొల్లాకు ఎలా చేరింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














