గైనెకోమాస్టియా: ఆడవాళ్ల మాదిరిగా కొందరు మగవాళ్లలో రొమ్ములు పెద్దగా ఎందుకు ఉంటాయి?

వ్యాయామం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మురుగేష్ మడ్కను
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"ఇంతకుముందు నేను అందరితో కలిసి ఉండేవాడిని. కానీ, ఈ విషయం నాకు తెలియగానే అంతా మారిపోయింది. బయటకు వెళ్లడం మానేశాను. నా స్వభావం మారిపోయింది" అన్నారు మాథ్యూ.

తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు అతని ఛాతి పరిమాణం సాధారణం కంటే ఎక్కువగా ఉండటం గమనించారు.

10వ తరగతి తర్వాత జిమ్‌కి వెళ్లి స్లిమ్‌గా మారాలని అనుకున్నారు. అయితే మంచి వ్యాయామం చేసినా ఛాతి పరిమాణం తగ్గకపోవడం మాథ్యూ గమనించారు.

శరవణన్ (పేరు మార్చాం) 14 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించకుండా నిలిపివేశారు.

మీ ఛాతి స్త్రీ ఆకారంలో ఉందని అతనికి చెప్పారు. విచారణ అనంతరం శరవణన్‌ను ఆలయంలోకి అనుమతించారు.

శ‌రవణన్‌‌కు అప్పుడు చిన్న‌వ‌య‌స్సు వ‌ల్ల ఆ విష‌యం అంత‌గా తెలియ‌దు. ఆలయ ప్రవేశ నిరాకరణ అతన్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు.

కానీ తరువాతి సంవత్సరాలలో ఛాతి స్త్రీల మాదిరి మారడంతో ఆయనలో ఆందోళన పెరిగింది.

డాక్టర్ కార్తిక్ రామ్

ఫొటో సోర్స్, KARTHICK RAM

ఫొటో క్యాప్షన్, డాక్టర్ కార్తిక్ రామ్

పురుషులలో ఛాతి ఎందుకు ఆ విధంగా పెరుగుతుంది?

గైనెకోమాస్టియా అనేది వ్యాధి కాదని శరీరంలో వచ్చే మార్పు అని 'చెన్నై ప్లాస్టిక్ సర్జరీ'లో ప్రిన్సిపల్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ కార్తీక్ రామ్ తెలిపారు.

గైనెకోమాస్టియా అంటే పురుషుల రొమ్ములు మహిళల రొమ్ముల ఆకారంలో ఉండే పరిస్థితి. ఇది హార్మోన్ల అసమతుల్యత కారణంగా జరుగుతుంది.

ఈ పరిస్థితిలో నాలుగు దశలు ఉన్నాయి. మొదట చనుమొనలు పెరుగుతాయి. రెండో దశలో చనుమొన కింద ఉన్న ప్రాంతంలో కూడా పెరుగుదల ప్రారంభమవుతుంది.

మూడో దశలో రొమ్ముల పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. ఇది స్త్రీ రొమ్ము ఆకారంలో ఉంటుంది. నాలుగో దశలో మొత్తం ఛాతీ పరిమాణం భారీగా పెరుగుతుంది.

ఈ పరిస్థితి మూడు వేర్వేరు వయస్సుల వారిలో సంభవిస్తుంది. పుట్టినప్పుడు, 10 నుంచి 13 ఏళ్ల వయస్సుగల వారు, వృద్ధాప్యంలో ఉన్న వారు ఈ పరిస్థితిని ఎదుర్కొంటారు.

అయితే వృద్ధులు ఈ పరిస్థితి గురించి పెద్దగా ఆందోళన చెందరు. అసలు అదొక సమస్య అనుకోరు.

యుక్త వయసు వారు, చిన్న వయసులోని వారు ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు ఆందోళన చెందుతారు.

ఇది ఆహారం వల్ల తలెత్తే సమస్య కాదని డాక్టర్ కార్తీక్ చెప్పారు. అయితే ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని సలహా మాత్రం ఇస్తామన్నారు.

ఈ సమస్య తను ఇతరులతో మాట్లాడే విధానాన్ని మార్చిందని మాథ్యూ అంటున్నారు.

“నాకు మాట్లాడటమంటే ఇష్టం. కానీ ఈ పరిస్థితి వల్ల దూరంగా ఉన్నవాళ్లతోనే మాట్లాడేవాణ్ని. నా ఛాతి పరిమాణం చూసి నన్ను ఎవరూ ఎగతాళి చేయడం ఇష్టం లేదు.

స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టడానికి వెళ్లినపుడు నా స్నేహితుల కంటే ముందే నేను నీటిలో దిగుతాను. నా శరీరాన్ని ఎవరినీ తాకనివ్వను. ఎవరితోనూ మాట్లాడను.

ఎవరైనా నా దగ్గరికి వచ్చి అడిగితే సమాధానం చెబుతాను. అది నా స్వభావమైతే కాదు. కానీ, ఏం చేయాలో నాకు తెలియదు” అని మాథ్యూ వివరించారు.

వీడియో క్యాప్షన్, ఆడవాళ్ల మాదిరిగా కొందరు మగవాళ్లలో రొమ్ములు పెద్దగా ఎందుకు ఉంటాయి?

వ్యాయామం చేస్తే తగ్గుతాయా?

శరవణన్ బీబీసీతో మాట్లాడుతూ “ఈ పరిస్థితి కారణంగా, నేను కాలేజీకి వెళ్లడం మానుకున్నాను. బయటకు వెళ్లడం తగ్గించాను. బరువు పెరగడంతో జిమ్‌కి వెళ్లడం మొదలుపెట్టాను. జిమ్‌కి వెళితే నా ఛాతి పరిమాణం తగ్గుతుందని, బరువు అదుపులో ఉంటుందని అనుకున్నాను. బరువైతే తగ్గాను. కానీ ఛాతీ సైజు అలాగే ఉంది’’ అన్నారాయన.

శరవణన్ చెప్పినట్లే తనకు కూడా జరిగిందని మాథ్యూ అన్నారు.

వ్యాయామంతో పెద్ద రొమ్ములను తగ్గించవచ్చా? అని డాక్టర్ కార్తీక్‌‌ను సంప్రదించగా ఆయన మాట్లాడుతూ..

''వ్యాయామం చేయడం వల్ల కొవ్వు తగ్గుతుంది తప్ప క్షీర గ్రంథులు కాదు.జిమ్‌కి వెళ్లడం పరిష్కారం కాదు, శస్త్రచికిత్స పరిష్కారం'' అని అన్నారు.

మాథ్యూ కూడా వైద్యుడే. తల్లిదండ్రుల్లో ఒకరు వైద్య రంగంలో పనిచేస్తున్నారు. అందుకే ఈ పరిస్థితి గురించి కుటుంబ సభ్యులకు చెప్పడానికి వెనుకాడలేదు.

నేను మెడికల్ కాలేజీలో చదువు ప్రారంభించిన తర్వాత ఈ పరిస్థితి గురించి తెలుసుకున్నాను.

అయితే శరవణన్ మాత్రం తన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు చెప్పలేకపోయారు.

అర్థం చేసుకుంటారో, ఏమంటారో అని భయపడి ఎవరితోనూ చెప్పుకోలేదు.

మగవారిగా పుట్టి ఆ తర్వాత స్త్రీగా మారిన వారిని ట్రాన్స్‌జెండర్స్ అంటారు. మరి ఇలాంటి పరిస్థితిని ఏమంటారు?

దీని గురించి డాక్టర్ కార్తీక్‌ని అడగ్గా '' రొమ్ము విస్తరణ అంటే స్త్రీగా మారడం కాదు. ఈ పరిస్థితి ఉన్నవారికి హార్మోన్ పరీక్ష అవసరం లేదు. గైనెకోమాస్టియా అనేది రొమ్ము కణజాలం. స్త్రీగా మారడానికి దానితో సంబంధం లేదు" అని అన్నారు.

గైనెకోమాస్టియా

ఫొటో సోర్స్, Getty Images

'ఇదేం వ్యాధి కాదు, ఒక పరిస్థితి'

''ఇది ప్రాథమికంగా వ్యాధి కాదు కానీ ఒక పరిస్థితి. అందుకే బీమా వర్తించదు. ఒక వ్యక్తి అటువంటి ఛాతితో జీవించాలని అనుకుంటే అతనికేమీ ఇబ్బంది ఉండదు. కొందరు పురుషుల ఛాతి స్త్రీల మాదిరిగానే ఉంటుంది. కొందరు పట్టించుకోరు. ఇది మానసికమైనది. సర్జరీ తర్వాత కొందరికి మంచి అనుభూతి కలుగుతుంది'' అని డా. కార్తీక్ అన్నారు.

డాక్టర్ కావడంతో మాథ్యూకి ఈ పరిస్థితి గురించి చాలా తెలుసు. సర్జరీ తర్వాత మునుపటిలా అనిపిస్తుందని మాథ్యూ చెప్పారు.

‘‘నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు నా ఛాతి పరిమాణం సాధారణంగా ఉండేది. ఇప్పుడు మళ్లీ ఆ స్థితికి వచ్చాను. నా పరిస్థితి గురించి తెలియకుండా ఉండేందుకు నేను గుండ్రని ఆకారపు బట్టలు వేసుకునేవాడిని. ఇప్పుడు నేను నా శరీరానికి సరిపోయే దుస్తులు ధరిస్తున్నాను" అని అన్నారు మాథ్యూ.

పరిష్కారం ఏంటో అర్థం చేసుకోవడానికి ఇంటర్నెట్‌లో వెతికానని శరవణన్ తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా సర్జరీ చేయించుకున్నానని చెప్పారు.

అది జబ్బు కాదని, కండీషన్ అని తెలిసి కూడా సర్జరీ ఎందుకు చేసుకున్నారని శరవణన్ని అడిగాం.

దీనికి అతను ''ఈ పరిస్థితికి నన్ను ఎగతాళి చేశారు. దైవదర్శనం కోసం ఆలయానికి వెళ్లినపుడు నా టీ-షర్ట్ తీసేసేవారు. ఆ సమయంలో నాకు చాలా అసౌకర్యంగా, వింతగా అనిపించింది. నేను బిగుతుగా ఉన్న టీ-షర్ట్ వేసుకోలేకపోయాను. ప్రజలతో తేలిగ్గా కలిసిపోలేకపోయాను. కాబట్టి నేను శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు గుడికి వెళ్లాలంటే భయం లేదు. ఇప్పుడు నేను నా సైజులో ఉండే వాటిని ధరిస్తా. సంతోషంగా ఉన్నా కూడా" అని అన్నారు.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)