Sperm Facts: పురుషుడి వీర్యం ఈదుకుంటూ వచ్చి స్త్రీ అండంతో కలుస్తుందా? ఇది నిజమా? అపోహా?

వీర్యం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లారా ప్లిట్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మానవ శరీరంలో ఫలదీకరణ ప్రక్రియ గురించి మనందరం ఎన్నో విషయాలు చదువుకున్నాం. కొన్ని కల్పిత కథలు, కొన్ని శాస్త్ర విషయాలు నేర్చుకున్నాం. పురుషుడి శరీరం నుంచి విడుదలైన వేల కొలది వీర్య కణాలు వేగంగా ఈదుకుంటూ స్త్రీ అండాన్ని చేరుకోవడమే లక్ష్యంగా ప్రయాణిస్తాయని, అది చేరుకునే వరకు అండం ఓపికగా వేచి చూస్తుందన్న కథ మనందరం విన్నదే.

వేగంగా ఈదగల, అత్యంత చురుకైన వీర్య కణం ఈ మారథాన్‌లో మొదట నిలిచి బహుమతిని గెలుచుకుంటుంది. అండాన్ని జయించి, దాన్లోకి చొచ్చుకుపోతుంది. క్రమంగా పిండం ఏర్పడుతుంది.

ఫలదీకరణ ప్రక్రియ గురించి జనసామాన్యంగా తెలిసిన విషయం ఇదే. ఈ కథలో వీర్యం చురుకైన పాత్ర పోషిస్తుందని, అండం మందకొడిగా ఉంటుందన్నది మన అవగాహన.

అయితే, అది నిజం కాదు. వాస్తవంలో సంతానోత్పత్తి ప్రక్రియ అలా జరగదు. పునరుత్పత్తి ప్రక్రియలో వీర్యం, అండం రెండూ ముఖ్యమైన పాత్రలు పోషిస్తాయి.

వీర్యం

ఫొటో సోర్స్, Getty Images

అనేక చెక్ పాయింట్లు దాటాలి

పునరుత్పత్తి ప్రక్రియ పురుషుడి స్ఖలనంతో ప్రారంభమవుతుంది. స్ఖలనం కాగానే కోట్ల వీర్య కణాలు స్త్రీ యోనిలోకి ప్రవేశిస్తాయి. ఒక సగటు స్ఖలనంలో సుమారు 25 కోట్ల వీర్య కణాలు ఉంటాయని అంచనా.

అక్కడి నుంచి వీర్యం నేరుగా అండం వైపుకి పరిగెడుతుందని కదా అనుకుంటాం. కానీ, అలా జరగదు. దానికి చాలా చెక్ పోస్టులు ఉంటాయి. అవన్నీ దాటుకుని వెళ్లాలి.

మొదట అడ్డంకి గర్భాశయ ద్వారం.

"స్త్రీ కోణం నుంచి చెప్పాలంటే, పునరుత్పత్తి మార్గంలో అనేక 'చెక్ పాయింట్లు' ఉంటాయి. వీర్యం వాటన్నిటినీ దాటుకుని ఫలదీకరణం జరిగే ప్రదేశానికి వెళ్లాలి. అది ప్రవేశ స్థానానికి చాలా దూరంలో ఉంటుంది" అంటూ ఎవల్యూషనరీ బయాలజిస్ట్ క్రిస్టిన్ హూక్ వివరించారు. యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్‌లోని సైన్స్, టెక్నాలజీ అసెస్‌మెంట్ అండ్ ఎనాలిసిస్ టీంలో జీవశాస్త్రవేత్తగా వ్యవహరిస్తున్నారు క్రిస్టిన్ హూక్.

వీర్య కణాలలో లోపాలేమీ లేకపోతే ఈ అడ్డంకి దాటడం సులువే. కానీ, చాలా వీర్య కణాలలో డీఎన్ఏ డ్యామేజ్ లేదా ఇతర లోపాలు ఉంటాయి.

"ఇది చాలా ముఖ్యమైన ఎన్నిక ప్రక్రియ. స్ఖలనం ద్వారా ఉత్పత్తయిన కోట్ల కొద్దీ వీర్య కణాలలో కొన్ని వందలు మాత్రమే అండం వరకు వెళతాయి" అని బ్రిటన్‌లోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో రిప్రొడక్టివ్ మెడిసిన్ విభాగం డైరెక్టర్ డేనియల్ బ్రిసన్ వివరించారు.

సంతానోత్పత్తి

ఫొటో సోర్స్, Getty Images

సంకోచాలు, స్రావాలు

అయితే, వీర్య కణాలు వాటంతట అవే ఫెలోపియన్ ట్యూబ్స్ (అండ వాహికలు) చివరలకు చేరుకోలేవు. వాటికి అంత బలం ఉండదు. ఫెలోపియన్ ట్యూబ్స్ చివర్న గర్భధారణ జరుగుతుంది.

వీర్య కణాలకు ఉండే తోక అటూ ఇటూ కదులుతూ ఉంటుంది. దానికున్న శక్తి, వీర్యం ముందుకు కదిలే శక్తి కన్నా పదింతలు ఎక్కువ ఉంటుంది.

"వీర్య కణాలు ఈత కొట్టవు. చాలావరకు గర్భాశయం సంకోచాల వలన ముందుకు సాగుతుంటాయి. ఈ మొత్తం ప్రక్రియలో స్విమ్మింగ్ కొద్దిసేపే జరుగుతుంది. అండానికి చేరువవుతున్న సమయంలోనే ఈదుతాయి" అని బ్రిసన్ వివరించారు.

మరోవైపు, గర్భాశయంలో, అండ వాహికలలో ఊరే స్రావాలు వీర్య కణాల కదలికలను నియంత్రిస్తాయి. అవి వాటిని ప్రోత్సహించవచ్చు లేదా నిరోధించవచ్చు.

"క్లుప్తంగా చెప్పాలంటే, గర్భధారణ ప్రక్రియ అండ వాహిక యాంత్రిక చర్యలు, దాని కెమిస్ట్రీపై ఆధారపడి ఉంటుంది. కెమిస్ట్రీ అంటే అందులో ఊరే స్రావాలు ఉప్పగా ఉన్నాయా లేక జిగట ద్రవాలా లేక pH స్థాయిలు ఎలా ఉన్నాయి మొదలైనవి. ఏ వీర్యం అండానికి చేరుతుందో నిర్ణయించేది ఇవే" అని అమెరికాలోని స్మిత్ కాలేజీలో బయాలజీ ప్రొఫెసర్ వర్జీనా హేసెన్ చెప్పారు.

"యోని వాతావరణంలోని pH స్థాయి స్పెర్మ్‌కు అనుకూలమైన దానికంటే తక్కువగా ఉంటుంది. కానీ, ఈ ఆమ్లత్వం వీర్యంలోని పొరలు, ఎంజైమ్‌లలో సంభవించే మార్పులకు చాలా అవసరం. ఇవే వాటి చలనశీలత, జీవక్రియ వేగం, అండంలోకి చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి" అని స్పెయిన్‌లోని యూగిన్ గ్రూప్‌లో పరిశోధకుడు ఫిలిప్పో జాంబెల్లి వివరించారు.

స్త్రీకి కలిగే భావప్రాప్తి వలన అంతర్గత కండరాలలో కలిగే సంకోచాలు కూడా వీర్యం పైకి వేగంగా పయనించడానికి తోడ్పడుతుందని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. కానీ, ఆ ప్రతిపాదనను నిర్థరించడానికి మరింత పరిశోధన జరగాల్సి ఉందని ఇతర శాస్త్రవేత్తలు అంటున్నారు.

సంతానోత్పత్తి

ఫొటో సోర్స్, Getty Images

అండం చేసే చిన్న ప్రయాణం

ఇదంతా జరిగేలోపు అండం ఓపికగా వేచి చూస్తూ ఉంటుందనుకుంటే పొరపాటే.

అండానికి దానంతట అది కదిలే సామర్థ్యం ఉండదు. కానీ, వాహికలలో ఉండే సిలియా (వెంట్రుకల వంటివి) అండం కిందకు ప్రయాణించడానికి సహాయపడుతుంది. అండాశయంలో ప్రారంభమయ్యే ఈ ప్రయాణం చిన్నదే.

"అండం ఫెలోపియన్ ట్యూబ్ వెంట గర్భాశయం వైపు కదులుతూ, కీమోఆట్రాక్టర్లు అని పిలిచే రసాయన అణువులను స్రవిస్తుంది. ఇవి వీర్య కణాలను ఆకర్షించి, అండ వైపుకి చురుకుగా నడిపిస్తాయి" అని జాంబెల్లి వివరించారు.

అంటే, అండంలోకి వీర్య కణం చొచ్చుకుపోయే ప్రక్రియలో రెండు పక్షాలూ క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. రెండింటిలో ఉండే రసాయనాలు, గ్రాహకాలు ఇందుకు దోహదపడతాయి.

వీర్యానికి ప్రతికూల వాతావరణం?

వీర్యం స్త్రీ యోనిలో ప్రవేశించిన దగ్గర నుంచి ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కుంటుందన్నది నిజమేనా?

ఇది తప్పుడు అవగాహన అంటున్నారు హేసెన్. పురుషుడి కోణం నుంచి చూస్తూ ఇలాంటి వివరణలు ఇస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

"ఈ ప్రక్రియను వీర్య కణాల మధ్య సహకారంగా కాకుండా, పోటీగా చూస్తే ప్రతికూల వాతావరణం లాగానే కనిపిస్తుంది" అని హేసెన్ అన్నారు.

"ఈ మొత్తం ప్రక్రియ లక్ష్యం ఒక చక్కటి బిడ్డను మనకు అందించడం. అలా చూస్తే వీర్యానికి ఇది ప్రతికూల వాతావరణం కాదు. ఆ వాతావరణం ఉత్తమ సంతానాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది. స్త్రీ కోణం నుంచి చూస్తే, చక్కటి బిడ్డను పొందడానికి, తల్లికి ప్రయోజనం చేకూర్చడానికి, గర్భాశయం చేయాల్సినదంతా కచ్చితంగా చేస్తుంది" అని హేసెన్ వివరించారు.

సంతానోత్పత్తి

ఫొటో సోర్స్, BERNIE_PHOTO

కొత్త సాంకేతిక, పాత ఆలోచనలు

గర్భధారణ ప్రక్రియపై ఇటీవల కాలంలో జరిగిన శాస్త్రీయ పరిశోధనల ద్వారా కొత్త అవగాహన వచ్చినప్పటికీ, వీర్యం కదలికలకు అంత ప్రాముఖ్యం లేదన్న సంగతి మనకు ఎన్నో దశాబ్దాలుగా తెలుసు.

ఈ నేపథ్యంలో, అమెరికన్ ఆంత్రోపాలజిస్ట్ ఎమిలీ మార్టిన్ పునరుత్పత్తి ప్రక్రియ గురించి చెప్పడానికి ఉపయోగించే భాషపై దృష్టి సారించారు. శాస్త్ర విషయాలను వివరించే ప్రక్రియలో సంస్కృతి, సంప్రదాయాలు ఎలా ప్రవేశిస్తాయో పరిశీలించారు.

1990లలో ఆమె రాసిన పరిశోధనా పత్రాలలో, శాస్త్ర గ్రంథాలలో జెండర్ పరమైన మూసధోరణులు ఎలా దాగి ఉన్నాయో వివరించారు. స్త్రీవాదానికి ఇదొక ముఖమైన పాయింట్‌గా మారింది.

సైన్స్‌లో, విద్యా పరమైన విషయాలలో మహిళల ప్రాతినిధ్యం లేకపోవడమనే కొరత ఉందని బీబీసీతో మాట్లాడిన కొందరు నిపుణులు కూడా అంగీకరించారు.

"విభిన్న దృక్కోణాలు కలిగిన వ్యక్తుల ప్రాతినిధ్యం లేకపోతే సైన్స్‌లో అడిగే ప్రశ్నలు, కనుగొనే సమాధానాలలో వైవిధ్యం కొరవడుతుంది" అని క్రిస్టిన్ హూక్ అన్నారు.

మనం వాడే భాష, పదజాలాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని హేసెన్ నొక్కిచెప్పారు.

"శాస్త్రీయ విషయాలు చెప్పేటప్పుడు తటస్థ భాషను ఉపయోగించాలి. ఉదాహరణకు, మనం "కాన్సెప్షన్ (గర్భధారణ) అని వాడాలి. ఫెర్టిలైజేషన్ (ఫలదీకరణం) కాదు" అన్నారు హేసెన్.

మూస ధోరణులను, జెండర్ అసమానతలను తొలగించడం వలన జీవ ప్రక్రియలను సరిగ్గా, కచ్చితంగా వివరించగలగడమే కాకుండా, సంతానోత్పత్తి చికిత్సలను మెరుగుపరచడానికి, కొత్త సాంకేతికతలకు మార్గం తెరవడానికి సహకరిస్తుందని నిపుణులు అంటున్నారు.

వీడియో క్యాప్షన్, సంతానలేమికి దోశ పెనం, పిజ్జా బాక్స్ కూడా కారణం అవుతోందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)