వీర్యంలో శుక్ర కణాల సంఖ్య (స్పెర్మ్ కౌంట్) పెంచుకోవడం ఎలా? డాక్టర్ సమరం ఇస్తున్న 9 సూచనలు..

స్పెర్మ్ కౌంట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాజేశ్ పెదగాడి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కోవిడ్-19‌తో స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశముందని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా వీర్యం నాణ్యతపై కరోనావైరస్ ప్రభావం చూపుతుందని పేర్కొంది.

సగటున 35ఏళ్ల వయసున్న బెల్జియం వాసులపై ఈ అధ్యయనం జరిగింది. వైరస్ నుంచి కోలుకున్న తర్వాత వీరి నుంచి వీర్యాన్ని సేకరించి పరీక్షించారు.

60 శాతం మందిలో శుక్రకణాలు క్రియాశీలంగా కదిలే సామర్థ్యం (స్పెర్మ్ మొటిలిటీ), 37 శాతం మందిలో స్పెర్మ్ కౌంట్ తగ్గినట్లు అధ్యయనంలో తేలింది. బెల్జియంలోని యూనివర్సిటీ హాస్పిటల్ ఆంట్వెర్పిన్ పరిశోధకులు గిల్‌బర్ట్ జీజీ డాండెర్స్ నేతృత్వంలో నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలు ఫెర్టిలిటీ అండ్ స్టెరిలిటీ జర్నల్‌లో ప్రచురించారు.

కోవిడ్ నుంచి కోలుకున్న రెండు నెలల తర్వాత వీర్యాన్ని సేకరించిన వారిలో 28 శాతం మందిలో శుక్రకణాలు క్రియాశీలంగా కదిలే సామర్థ్యం తగ్గిందని, 6 శాతం మందిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందని వెల్లడైంది.

స్పెర్మ్ కౌంట్

ఫొటో సోర్స్, Getty Images

మూడు నెలల వరకు ఇలానే ఉంటుందా?

కోవిడ్-19 తీవ్రత, వీర్యం నాణ్యతల మధ్య ఎలాంటి స్పష్టమైన సంబంధం బయటపడలేదని దీనిలో పాలుపంచుకున్న పరిశోధకులు వివరించారు.

స్పెర్మ్ కౌంట్ మెరుగు పడేందుకు మూడు నెలల వరకు సమయం పట్టొచ్చని అధ్యయనంలో అంచనా వేశారు. అయితే, ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు లోతైన అధ్యయనం అవసరమని పేర్కొన్నారు. కొందరిలో వీర్యంపై ప్రభావం శాశ్వతంగా ఉంటుందా? అనే విషయాన్ని ధ్రువీకరించాల్సిన అవసరముందని వివరించారు.

అయితే, కోవిడ్-19 సోకిన వారిలో చాలా మందిలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతున్నప్పటికీ, ఇది ఏ మేరకు తగ్గుతుందో స్పష్టంగా అంచనా వేసేందుకు వారికి సంబంధించిన ఇదివరకటి సమాచారం అందుబాటులోలేదని అధ్యయనంలో స్పష్టంచేశారు. దీంతో వృషణాల పనితీరు పూర్వస్థితికి వచ్చిందా? లేదా అనే విషయంలో స్పష్టతలేదని పేర్కొన్నారు.

‘‘స్పెర్మ్ కౌంట్ అనేది వేరియబుల్‌గా ఉంటుంది. అంటే స్థిరంగా ఇలానే ఉంటుందని మనం చెప్పలేం. రిఫరెన్స్ వేల్యూస్ ఆధారంగానే దీన్ని అంచనా వేస్తుంటాం. ఒక స్థిరమైన వేల్యూ లేనప్పుడు స్పెర్మ్ కౌంట్ కచ్చితంగా ఇంత తగ్గిందని చెప్పడం చాలా కష్టం’’ అని ఐవీఎఫ్ క్లినిక్ వ్యవస్థాపకులు, గైనకాలజిస్ట్ జీఏ రామరాజు చెప్పారు.

‘‘ముఖ్యంగా వయసు, ఇదివరకు వారి స్పెర్మ్ కౌంట్ ఎలా ఉంది? కోవిడ్-19 వారి వృషణాలపై ప్రభావం చూపిందా?లాంటి అంశాలపై వారి స్పెర్మ్ కౌంట్ ఆధారపడుతుంది’’అని ఆయన వివరించారు.

స్పెర్మ్ కౌంట్

ఫొటో సోర్స్, Science Photo Library

జ్వరంతోనూ స్పెర్మ్ కౌంట్ మారుతుందా?

కోవిడ్-19 ఎంతమేరకు స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం చూపుతుందని చెప్పడానికి మరింత లోతైన అధ్యయనం అవసరమని రామరాజు అభిప్రాయపడ్డారు.

మరోవైపు సాధారణ జ్వరంతో కూడా స్పెర్మ్ కౌంట్‌లో తేడా వచ్చే అవకాశముందని వైద్యులు గోపరాజు సమరం వివరించారు. స్పెర్మ్ కౌంట్‌ను ఎలా మెరుగు పరుచుకోవాలో ఆయన వివరించారు.

‘‘కోవిడ్-19తో శరీరం మొత్తం మీద ప్రభావం పడుతోంది. దీనిలోనే స్పెర్మ్ కౌంట్ తగ్గడం కూడా ఒకటిగా చూడొచ్చు. కోవిడ్ అనంతర సమస్యల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. మంచిగా ఆహారం తీసుకోడం, వ్యాయామం చేయడం, సరిగ్గా నిద్రపోవడంతో ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు’’అని ఆయన తెలిపారు.

‘‘స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గితే, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-ఏ, విటమిన్-డీ లాంటివి ఇస్తాం. ఈ ఔషధాల ప్రభావం అనేది శరీరం స్పందించే తీరుబట్టి ఉంటుంది. అయితే, ఈ ఔషధాలు తీసుకున్న తర్వాత, చాలావరకు ఫలితాలు కనిపిస్తాయి’’అని ఆయన వివరించారు.

ప్రముఖ సెక్స్ స్పెషలిస్ట్ డాక్టర్ గోపరాజు సమరం

ఫొటో సోర్స్, facebook/Dr.G.Samaram

ఫొటో క్యాప్షన్, డాక్టర్ జి సమరం

మనం చేయాల్సింది ఏమిటి?

స్పెర్మ్ కౌంట్‌ను మెరుగుపరచుకునేందుకు డాక్టర్ సమరం కొన్ని సూచనలు ఇచ్చారు.

  • రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.
  • 8 గంటలు నిద్ర పోవాలి.
  • ధూమపానానికి దూరంగా ఉండాలి.
  • ఆల్కహాల్‌ను అతిగా తీసుకోకూడదు.
  • వైద్యుల సూచనలు లేకుండా ఔషధాలు తీసుకోకూడదు.
  • యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
  • అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
  • పళ్లు, తాజా కాయగూరలను ఎక్కువగా తీసుకోవాలి.
  • ఒత్తిడిని వీలైనంత తగ్గించుకోవాలి.
స్పెర్మ్ కౌంట్

ఫొటో సోర్స్, Getty Images

ఐవీఎఫ్ ఎవరికి అవసరం?

కోవిడ్-19తో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందనే వార్తలను చూపించి చాలా ఐవీఎఫ్ క్లినిక్‌లు ప్రజలను దోచుకునే ముప్పుందని రామరాజు ఉన్నారు.

‘‘కోవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత తమ దగ్గరకు వచ్చే దంపతులకు అవసరమున్నా, లేకపోయినా ఐవీఎఫ్‌కు ప్రయత్నించమని చాలా క్లినిక్‌లు చెబుతుంటాయి. ముఖ్యంగా కోవిడ్-19 వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందని చెబుతుంటాయి. కానీ మనం అప్రమత్తంగా ఉండాలి.’’

‘’12 నెలలపాటు సాధారణ పద్ధతుల్లో ప్రయత్నించిన తర్వాత మాత్రమే ఐవీఎఫ్ లాంటి పద్ధతులను ఆశ్రయించాలి. ఈ 12 నెలలు కూడా వరుసగా లెక్కపెట్టాల్సిన అవసరం లేదు. కోవిడ్-19 వల్ల మీ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయిందని చెబితే, ముఖ్యంగా కంగారు పడకూడదు’’అని ఆయన వివరించారు.

మరోవైపు పోస్ట్ కోవిడ్ అనంతరం వచ్చే ఎలాంటి సమస్యలకైనా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడమే ఉత్తమ మార్గమని సమరం వివరించారు.

‘‘కోవిడ్ సోకిన తర్వాత దీర్ఘకాలంలో కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటి విషయంలో వైద్యుల సూచనల మేరకు జాగ్రత్త వహించాలి. అంతేకానీ గందరగోళానికి లోనుకాకూడదు’’అని ఆయన చెప్పారు.

‘‘అనవసరంగా స్పెర్మ్ కౌంట్ తగ్గిందని మీకు మీరే నిర్ధారించుకొని ఐవీఎఫ్ క్లినిక్‌ల చుట్టూ తిరగాల్సిన అసవరం లేదు. కొన్ని అనారోగ్య సమస్యల విషయంలో మనం చేసేది ఏమీ ఉండదు. శరీరం తనంతట తానుగానే పరిస్థితులను చక్కబెట్టుకుంటుంది.’’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)