PrEP: హెచ్‌ఐవీ వ్యాప్తిని నిరోధించే మాత్ర... ఏప్రిల్ నుంచి ఇంగ్లండ్‌లో అందుబాటులోకి

ప్రెప్

ఫొటో సోర్స్, Getty Images

హెచ్‌ఐవీ వైరస్ వ్యాప్తిని నిరోధించే మాత్ర ఏప్రిల్ నుంచి ఇంగ్లాండ్‌లో అందుబాటులోకి రానుంది.

PrEP (ప్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్) వైరస్ వ్యాప్తిని నిరోధక ఔషధం. రోజుకో మాత్ర వాడితే, అసురక్షిత (కండోమ్ లేకుండా) శృంగారం ద్వారా హెచ్ఐవీ సంక్రమణను నిరోధిస్తుంది.

యూకేలో హెచ్‌ఐవీ బాధితులు దాదాపు 1,03,800 మంది ఉన్నారని అంచనా.

ఇంగ్లాండ్‌లో ఈ ఔషధం విడుదల చేయడం ద్వారా రానున్న పదేళ్లలో కొత్త హెచ్‌ఐవీ కేసులు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని యూకే ఆరోగ్య శాఖ మంత్రి మాట్ హాంకాక్ చెప్పారు.

ప్రస్తుతం వేల్స్‌లో ఈ మాత్రకు ట్రయల్స్ జరుగుతున్నాయి.

హెచ్‌ఐవీ సోకిన వారికి జీవితాంతం చికిత్స అందించేందుకు అయ్యే ఖర్చు కంటే ఈ మాత్రల ఖరీదు చాలా తక్కువే ఉంటుందని వైద్యులు అంటున్నారు.

హెచ్‌ఐవీ పరీక్ష

ఫొటో సోర్స్, Getty Images

ఈ మాత్ర 'విప్లవాత్మకమైనది' అని హెచ్‌ఐవీ బాధితులకు అండగా నిలిచే స్వచ్ఛంద సంస్థ టెర్రెన్స్ హిగ్గిన్స్ ట్రస్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇయాన్ గ్రీన్ అభివర్ణించారు.

అయితే, స్వలింగ, ద్విలింగ పురుషులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లకే కాకుండా ఇతరులకు ఈ ఔషధం ప్రయోజనాల గురించి మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఈ మాత్రను అందుబాటులోకి తేవాలన్న యూకే ప్రభుత్వ నిర్ణయాన్ని హెచ్ఐవీ నివారణకు, బాధితులకు చికిత్స అందించేందుకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు సర్ ఎల్టన్ జాన్ స్వాగతించారు.

"హెచ్‌ఐవీ వ్యాప్తిని ఈ ఔషధం నిరోధిస్తుంది. దాంతో కొత్త కేసులు నమోదు కాకుండా చేసే అవకాశం ఉంటుంది. ఇది అద్భుతంగా పనిచేస్తుంది" అని ఆయన అన్నారు.

"హెచ్‌ఐవీ వ్యాప్తిని అరికట్టేందుకు యూకే ప్రభుత్వం ఈ మాత్రను తీసుకురావడం ప్రశంసనీయం. ఇది ప్రజలకు మరింత విస్తృతంగా చేరువయ్యేలా చూస్తే అనేక మందిని హెచ్‌ఐవీ మహమ్మారి బారిన పడకుండా రక్షించవచ్చు" అని ఎల్టన్ జాన్ అభిప్రాయపడ్డారు.

హెచ్‌ఐవీ వైరస్

ఫొటో సోర్స్, SCIENCE PHOTO LIBRARY

PrEP అంటే ఏమిటి?

హెచ్‌ఐవీ సంక్రమణను నిరోధించేందుకు ఈ మాత్రను రోజూ లేదా సెక్స్‌లో పాల్గొనడానికి ముందు తీసుకోవాలి.

PrEP మాత్రను వాడిన స్వలింగ సంపర్క పురుషులపై, PrEP వినియోగించని వారిపై యూకే వైద్య పరిశోధనా మండలి అధ్యయనం నిర్వహించింది. ఈ మాత్రను వాడినవారికి హెచ్‌ఐవీ సంక్రమణలో 86 శాతం తగ్గుదల కనిపించింది.

ఈ మాత్రను సరిగా తీసుకుంటే దాదాపు 100% ప్రభావవంతంగా పనిచేస్తుందని సెక్స్ నిపుణులు, వైద్యులు అంటున్నారు.

ఇది కండోమ్ లేకుండా పురుషులతో లైంగిక చర్యలో పాల్గొనే పురుషులతో పాటు, హెచ్‌ఐవీ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న (హెచ్‌ఐవీ బాధితుల భాగస్వాములు) ఇతరులకు రక్షణ కల్పించడం ప్రధాన లక్ష్యంగా ఈ మాత్రను అభివృద్ధి చేశారు.

ఈ ఔషధానికి డిమాండ్ ఎలా ఉంటుంది? కొత్త హెచ్ఐవీ కేసుల సంఖ్యను ఎంతమేరకు తగ్గించగలుగుతుంది? అన్నదానిని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

కండోమ్‌లు

ఫొటో సోర్స్, Getty Images

అభ్యంతరాలు

ఈ మాత్ర విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నవారు కూడా ఉన్నారు. ఈ మాత్ర వల్ల కొందరు కండోమ్‌లను వాడకుండా బాధ్యతారహితంగా వ్యవహరించి, ఇతర రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుందని విమర్శకులు అంటున్నారు.

కండోమ్‌లు వాడితే సిఫిలిస్, గనోరియా లాంటి ఇతర సుఖ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. కానీ, PrEP మాత్రతో అలాంటి రక్షణ ఉండదు. ప్రస్తుతం ఈ అంటువ్యాధుల భారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)