పోలండ్-బెలారుస్ సరిహద్దు సంక్షోభం: వేల మంది శరణార్ధులు ఎక్కడి నుంచి వస్తున్నారు?

ఫొటో సోర్స్, Reuters
బెలారుస్-పోలండ్ సరిహద్దుల్లో వలసల సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. బెలారుస్ నుంచి పోలండ్ ద్వారా యూరోపియన్ యూనియన్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న వలసదారులపై పోలండ్ దళాలు టియర్ గ్యాస్, జల ఫిరంగులను ప్రయోగించాయి.
ఇటు శరణార్ధులు కూడా పోలండ్ దళాలపై రాళ్లు రువ్వుతున్నట్లు వీడియోలలో కనిపించింది.
మరోవైపు పోలండ్‌తో సరిహద్దుల దగ్గర పెరుగుతున్న వలస సంక్షోభానికి తీవ్రంగా స్పందించిన యూరోపియన్ యూనియన్, బెలారుస్ పై ఆంక్షలను పెంచాలని నిర్ణయించింది.
యూనియన్ సీనియర్ దౌత్యవేత్త జోసెప్ బోరెల్ ఈ నిర్ణయాన్ని ధృవీకరించారు. హైబ్రిడ్ యుద్ధంలో అమాయకులైన వలసదారులు బలవుతున్నారని ఆయన విమర్శించారు.
గత కొద్ది రోజులుగా భారీ సంఖ్యలో వలసదారులు, శరణార్ధులు బెలారుస్, పోలండ్ సరిహద్దులకు చేరుకోగా, పోలండ్ దళాలు వారిని తమ దేశంలో ప్రవేశించకుండా అడ్డుకుంటున్నాయి. ఇటు బెలారుస్ సైన్యం, అటు పోలండ్ సైన్యం మధ్య వలసదారులు నలిగిపోతున్నారు.
మధ్యప్రాచ్యం, ఆఫ్రికా నుంచి వేలమంది ప్రజలు పోలండ్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండటంతో బెలారుస్, పోలండ్ సరిహద్దుల్లో వలసల సంక్షోభం మొదలైంది.
ఇంత మంది ప్రజలు సరిహద్దులు దాటడానికి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారన్న ప్రశ్నలకు సమాధానం కనుగొనేందుకు బీబీసీ ప్రయత్నించింది.

ఫొటో సోర్స్, Getty Images
సమస్యకు పునాదులు
బెలారుస్ అధ్యక్షుడు లుకషెంకో గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించినట్లు ప్రకటించుకున్న తరవాత నుంచి బెలారుస్, ఈయూల మధ్య సంబంధాలు దెబ్బతినడం ప్రారంభించాయి.
దేశంలో ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను లుకషెంకో తీవ్రంగా అణచివేసే చర్యలు చేపట్టారు.
ఈ ఎన్నికల తర్వాత యూరోపియన్ యూనియన్, అమెరికాలు బెలారుస్ పై ఆంక్షలు విధించడం మొదలు పెట్టాయి. ఇందుకు ప్రతిగా బెలారుస్ తమ దేశానికి వచ్చిన శరణార్ధులను యూరోపియన్ యూనియన్ దేశాలలోకి పంపే ప్రయత్నం చేస్తోందని ఈయూ దేశాలు ఆరోపిస్తున్నాయి.
అయితే బెలారుస్ వాటిని ఖండిస్తోంది.
ఈ నెలలో ఇప్పటి వరకు బెలారుస్ నుండి పోలండ్‌లోకి సరిహద్దును దాటడానికి 5 వేల కంటే ఎక్కువ మంది ప్రయత్నించారని, గత ఏడాది మొత్తంలో కేవలం 88 మందే ఇలా ప్రయత్నించారని పోలండ్ సరిహద్దు భద్రతా దళం వెల్లడించింది.
పిల్లలు, మహిళలు బెలారుస్ లో అధికంగా ఉన్న చలిలోనే తాత్కాలిక శిబిరాలు వేసుకుని జీవిస్తున్నారు. ఇటీవల వాయువ్య బెలారుస్ లోని గ్రోడ్నోకు దక్షిణంగా ఉన్న కుజ్నికా వద్ద వేలమంది శరణార్ధులు ఒక సరిహద్దు పాయింట్ వద్దకు చేరుకున్నారు.
సోమవారంనాడు ఆ వలసదారులలో చాలామంది కంచె విరగ్గొట్టి సరిహద్దులోని బెలారుస్ వైపున ఉన్న ఒక క్రాసింగ్ వద్దకు చేరారు. వారిని పోలండ్ దళాలు అడ్డుకున్నాయి. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది.
మంగళవారం ఉదయం నాటికి, కుజ్నికా వద్ద సరిహద్దు కంచెపై దాడి చేసిన వలసదారుల పై తమ బలగాలు అదుపు సాధించాయని పోలండ్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
"వలసదారులు మా సైనికులు, అధికారులపై రాళ్లతో దాడి చేశారు. కంచెను ధ్వంసం చేసి పోలండ్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు మా సేనలు టియర్ గ్యాస్‌ను ఉపయోగించాయి" అని మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
వలస సంక్షోభం ఎలా మొదలైంది
ఫ్లైట్ రాడార్ 24 వెబ్‌సైట్ ప్రకారం, రాబోయే ఏడు రోజుల్లో 21 విమానాలు ఇస్తాంబుల్ నుండి మిన్స్క్ (బెలారుస్ రాజధాని నగరం) కు చేరుకుంటాయి. దుబాయ్ నుండి 12, బాగ్దాద్ నుండి ఒక ఫ్లైట్ ఇందులో ఉన్నాయి.
ఈ వెబ్‌సైట్ చార్టర్ విమానాలను పరిగణనలోకి తీసుకోదు. ఆ విమానాలలో ప్రయాణీకులలో ఎక్కువమంది వలస వచ్చినవారు కావచ్చు.
వారు బెలారుస్ అధికారుల పరోక్ష మద్ధతుతో యూరోపియన్ యూనియన్ దేశాలలోకి ప్రవేశించేందుకు ఆ దేశాన్ని ట్రాన్సిట్ పాయింట్‌గా ఉపయోగించుకుంటున్నారు.
2020 నుండి, బెలారుస్ అధికారులు 76 దేశాలకు వీసా రిక్వైర్‌మెంట్‌ను రద్దు చేయడమో, లేక వీసాలను సరళీకృతమో చేశారు. వాటిలో సిరియా, లిబియా, ఇరాక్, అఫ్గానిస్తాన్ సహా అంతర్యుద్ధం, సాయుధ పోరాటాల వల్ల ప్రభావితమైన దేశాలు ఉన్నాయి.
ఈ దేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఇతర దేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు.
యూరోపియన్ యూనియన్‌లో ఇళ్లు, ఉద్యోగాలతోపాటు బెలారుస్ లో పర్యటనకు అవకాశం కల్పిస్తామంటూ సిరియా, ఇరాక్, టర్కీలలో ట్రావెల్ ఏజెన్సీలు అడ్వర్టయిజ్‌మెంట్లు ఇచ్చాయి. వాట్సాప్‌లలో కూడా ఇలాంటి అనేక ప్రకటనలు చక్కర్లు కొట్టాయి.
ఈ ట్రిప్‌లకు పరిస్థితులను బట్టి 10,000-20,000 (సుమారు రూ.74 లక్షల నుంచి 1.50 లక్షలు) డాలర్లను ఏజెన్సీలు వసూలు చేస్తున్నాయి.
బెలారుస్ కాన్సులేట్‌లు తమ పాస్‌పోర్ట్ ఉన్నవారికి బెలారుస్ వీసాలను ఇచ్చే అధికారాన్ని కూడా ట్రావెల్ ఏజెన్సీలకు అప్పగించాయని జర్మన్ న్యూస్ బ్రాడ్‌కాస్టర్ డాయిష్ వెల్లె తన పరిశోధనలో గుర్తించింది.
ఈ సంవత్సరం మిడిల్ ఈస్ట్‌కు బెలారుస్ విమానాల సంఖ్యను గణనీయంగా పెంచింది. ట్రావెల్ ఏజెన్సీలకు ఇలాంటి ఆఫర్‌ల వెనుక బెలారుస్ అధికారుల పాత్ర ఉందని ఫ్రాన్స్‌లాంటి యూరోపియన్ యూనియన్ దేశాలు అనుమానిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
వలసదారులు/శరణార్థులు ఎక్కడ నుండి వస్తున్నారు?
2021 వేసవిలో నుంచి ఇరాక్ నుంచి అత్యధిక సంఖ్యలో వలసదారులు రావడం ప్రారంభించారు. సెప్టెంబరులో యూరోపియన్ యూనియన్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి జోసెఫ్ బోరెల్ బెలారుస్ కు విమానాల సంఖ్యను తగ్గించేందుకు ఇరాకీ అధికారులతో చర్చలు జరిపారు.
ప్రస్తుతం సిరియా నుంచి వచ్చిన కుర్ధులే అత్యధిక సంఖ్యలో యూరోపియన్ యూనియన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు.
లిబియా, అఫ్గానిస్తాన్, యెమెన్ దేశాలు, ఆఫ్రికన్ దేశాలైన కాంగో, ఇథియోపియా లాంటి సమస్యాత్మక దేశాల నుంచి రాజకీయ, మతపరమైన కల్లోలాల కారణంగా ప్రజలు వలసలు వస్తున్నారు.

బెలారుస్ సరిహద్దులకు ఎందుకు వస్తున్నారు?
బెలావియా, టర్కీ, ఖతార్ ఎయిర్‌వేస్‌తోపాటు బడ్జెట్ ఫ్లైట్‌లను నడిపే ఫ్లై దుబాయ్ లాంటి సంస్థలు శరణార్థులకు వరంగా మారాయి. ఇటీవలి కాలం వరకు శరణార్ధులకు ఎయిర్‌పోర్టులోనే వీసాలను ఇచ్చే ఏర్పాటు కూడా ఉండేది.
విమానాశ్రయాలలో ప్రయాణికులెవరో, వలసదారులు/శరణార్ధులెవరో గుర్తించడం దాదాపు అసాధ్యం. వారి దగ్గర డబ్బు ఉంటుంది, సరైన పత్రాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో విమానయాన సంస్థలు ప్రయాణికులను అడ్డుకోవడానికి సరైన కారణం ఉండదు.
బెలారుస్ రాజధాని మిన్స్క్‌కు చేరుకున్న తర్వాత వలసదారులు స్వయంగా చిత్రించిన వీడియోలలో వారిని బెలారుస్ కు ఆనుకుని ఉన్న పోలండ్, లిథువేనియ సరిహద్దులకు సురక్షితంగా చేర్చడం కనిపిస్తుంది.
అయితే, వీరిని ఇలా చేర్చే బాధ్యతను ఎవరు తీసుకున్నారన్నది మాత్రం తెలియడం లేదు.

ఫొటో సోర్స్, EPA
వలసదారులు, శరణార్థులు సరిహద్దును ఎలా దాటుతారు?
వలస సంక్షోభం ప్రారంభంలో, పోలండ్, లిథువేనియా సరిహద్దుల్లోని సైనికులు కొందరిని తమ దేశంలోకి అనుమతించారు. అయితే, బెలారుస్ కావాలని ఇలా వలసదారులను పంపిస్తోందని రెండు దేశాల విదేశాంగ మంత్రులు ఆరోపించారు.
రోజూ వందలు, వేలమంది ప్రజలు సరిహద్దును దాటడానికి ప్రయత్నిస్తుండటంతో పోలండ్, లిథువేనియా సైనికులు వారిని తమ దేశంలోకి రాకుండా అడ్డుకున్నారు. ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు.
ఇప్పుడు సరిహద్దును దాటడమంటే చట్టవిరుద్ధంగా దాటడమే. అయినా చాలామంది అందుకు ప్రయత్నిస్తున్నారు.
బోర్డర్ గార్డులను కూడా తోసుకుని వారు ఆ దేశాలలో ప్రవేశించే అవకాశం ఉంది. ( నవంబర్ 9న అలాంటి రెండు సంఘటనలు జరిగాయి) లేదంటే వారు ప్రమాదకరమైన పరిస్థితుల్లో అక్రమంగా ప్రవేశించే ప్రయత్నాలు చేయవచ్చు.
బెలారుస్, పోలండ్ సరిహద్దు దాదాపు 400 కి.మీ పొడవు ఉంటుంది. మధ్యలో పెద్ద అడవి, చిత్తడి ప్రాంతం ఉంటుంది.

వలసదారులు ఎక్కడికి వెళతారు?
పోలండ్, లిథువేనియాలు శరణార్థులు, వలసదారులకు యూరప్ లో ప్రవేశించేందుకు ట్రాన్సిట్ కంట్రీల్లాగా పనిచేస్తాయి. జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌కు వెళ్లాలని కోరుకునే శరణార్ధులు ఎక్కువమంది ఉంటారు. అక్కడ వారికి బంధువులు, పరిచయస్తులు ఉండవచ్చు.
జర్మనీ అధికారుల అంచనా ప్రకారం, బెలారుస్ ద్వారా కనీసం 5,000 మంది ఇప్పటికే జర్మనీకి చేరుకున్నారు.
బెలారుస్ లో ఎంతమంది ఉంటున్నారు?
ఎంతమంది ఉంటున్నారనేది అధికారులు కచ్చితంగా చెప్పలేక పోతున్నారు. మిన్స్క్ నగరంలోని స్థానిక ప్రజలు చెబుతున్న దానినిబట్టి వందలాది మంది శరణార్ధులు షాపింగ్ సెంటర్‌లు, సబ్‌వేలు, నివాస ప్రాంతాల దగ్గర క్యాంప్‌లు ఏర్పాటు చేసుకున్నారు.
వ్యవహారం ఇలాగే కొనసాగితే పరిస్థితి అదుపు తప్పుతుందనే భయంతో, ఇటీవలి రోజుల్లో బెలారుస్ అధికారులు కూడా తమ దేశంలోకి వచ్చే వారికి అనుమతులపై నిబంధనలను కఠినం చేశారు.
ముఖ్యంగా అత్యంత సమస్యాత్మక దేశాల పౌరులకు ఆన్ అరైవల్ వీసాల జారీని నిలిపి వేశారు. సిరియా, ఇరాన్, అఫ్గానిస్తాన్, నైజీరియా, యెమెన్ లాంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Reuters
ఈ సంక్షోభంలో రష్యా పాత్ర ఉందా?
యూరోపియన్ యూనియన్‌లోని కొన్ని దేశాలను రష్యా పాత్ర ఉందని అంటున్నాయి. "లుకాషెంకో నిర్వహిస్తున్న ఈ దాడికి మాస్కోలో సూత్రధారి ఉన్నాడు. ఆ సూత్రధారి మరెవరో కాదు, అధ్యక్షుడు పుతిన్" అని పోలండ్ ప్రధాన మంత్రి మాట్యూస్జ్ మొరావికీ ఆరోపించారు.
అయితే, రష్యా అధికారులు ఈ ఆరోపణలను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. రష్యా అధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీ డిమిత్రి పెస్కోవ్ ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోరావికీ మాటలు బాధ్యతా రహితమైనవి, ఆమోదయోగ్యం కానివని పేర్కొన్నారు.
ఏది ఏమైనా ఈ సంక్షోభంలో జోక్యం చేసుకోవాలని జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇది తమ కూటమిని అస్థిరపరిచే లక్ష్యంతో జరుగుతున్న హైబ్రిడ్ దాడి అని యూరోపియన్ యూనియన్ ఆరోపించింది.
ఇవి కూడా చదవండి:
- అంతరిక్షంలో శాటిలైట్‌ను పేల్చేసిన రష్యా.. కాప్స్యూల్స్లోకి వెళ్లి దాక్కున్న స్పేస్ స్టేషన్ సిబ్బంది
- భూమికి అతి సమీపంలో తిరుగుతున్న భారీ రాతి ముక్క.. ఇది చంద్రుడిదేనా? మరి ఎర్రగా ఎందుకు ఉంది?
- ఫిల్మీమోజీ: మారుమూల పట్నం కుర్రోళ్లు కోట్లాది హిట్లు ఎలా కొట్టేస్తున్నారు..
- భారత్‌తో విభేదాలు కోరుకోవడం లేదు - బీబీసీ ఇంటర్వ్యూలో తాలిబాన్ విదేశాంగ మంత్రి
- ఇంటర్నెట్ వాడుతున్న మీ పిల్లలు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసా
- వాతావరణ మార్పులను అరికట్టడానికి 7 మార్గాలు
- అల్లు అర్జున్‌కు లీగల్ నోటీసు పంపిస్తాం - టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
- పాకిస్తాన్‌కు సహాయం చేస్తే సౌదీ అరేబియాకు ఏంటి లాభం?
- విశాఖపట్నం లైన్‌మన్ హత్య కేసు: మంత్రి మేనల్లుడిపై ఆరోపణలు
- పునీత్ రాజ్‌కుమార్ మృతి... మాస్ సినిమాలతో ‘శాండల్‌వుడ్ ‘పవర్ స్టార్’గా ఎదిగిన కన్నడ నటుడు
- బంగ్లాదేశ సరిహద్దుల్లో ఉన్న త్రిపుర రాష్ట్రంలో ముస్లింలపై దాడులు.. కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









