ఇటలీ: 87 రూపాయలకే ఇల్లు, అయినా ఎవరూ కొనడం లేదు

సిసిలీ, ఇటలీ

ఇటలీలోని 20 ప్రాంతాల్లో ఒక్క యూరోకే (దాదాపు 87 రూపాయలు) ఇల్లు పథకం ప్రవేశపెట్టారు.

ఇటలీలాంటి దేశంలో ఒక యూరోకే సొంతింటి కల నెరవేరుతుంటే ఆ ఇళ్లను కొనడానికి సహజంగా జనం ఎగబడాలి.

ఎందుకంటే ఇటలీలోని అందమైన పట్టణాలు రొమాంటిక్ ప్రాంతాలకు ప్రసిద్ధి. ఇక్కడి చారిత్రక కట్టడాలు, సహజ సంపద, మంత్రముగ్ధులను చేసే సహజ ఆకర్షణలెన్నో ఉన్నాయి. పైగా కాఫీ ధరకే సొంత ఇల్లు అంటే ఎవరు కూడా కాదనరు.

కానీ ఈ పథకం కొన్నిచోట్ల విజయవంతమైనా మిగతా చోట్ల ఆదరణకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా స్థానికులే ఇంటి కొనుగోలుకు ఆసక్తి చూపించడం లేదు.

ఇంత చౌకగా ఇళ్లు ఇస్తామన్నా ఇటలీవాసులే ఎందుకు ఆసక్తి చూపించడం లేదు. అసలు ఒక్క యూరోకే సొంత ఇంటి పథకం ఏంటి?

వీడియో క్యాప్షన్, హైదరాబాద్‌లోని అందరి ఇల్లు ఇది.. ఆకలి వేస్తే వచ్చి వండుకొని తినొచ్చు

గ్రామాలు, చిన్న పట్టణాలు ఖాళీ అవుతుండటంతో..

నగరాలు, విదేశాలకు ప్రజలు వలస వెళ్లిపోతుండటంతో ఇటలీలోని చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలు ఖాళీ అవుతున్నాయి.

జనాభాను పెంచేందుకు సంబూకా గ్రామ పాలక సంస్థ ఓ ఉపాయం ఆలోచించింది. ఖాళీగా ఉన్న పాతబడిపోయిన, శిథిలావస్థకు చేరిన ఇళ్లను కొత్తవారికి ఒక్క యూరో ధరకే అమ్మాలని నిర్ణయించింది.

ప్రపంచవ్యాప్తంగా ఎక్కడివారైనా ఈ ఇళ్లను కొనుక్కొని, సంబుకాలో నివసించవచ్చు. అయితే, కొనుగోలు విషయంలో ఓ షరతు ఉంది. కొన్నవారు మూడేళ్లలోగా ఆ ఇంటికి మరమ్మతులు చేయించుకోవాలి. ఆ ఖర్చు భారీగానే అయ్యే అవకాశం ఉంది.

ఒక్క యూరోకే ఇల్లు పథకానికి మంచి స్పందన వచ్చింది. ఇటలీలోని మిగతా గ్రామాలు కూడా సంబుకా నుంచి ప్రేరణ పొందుతున్నాయి. ఒక్క యూరోకే ఇల్లు పథకం తీసుకొచ్చాయి. ఇటలీలోని దాదాపు 20 చిన్న గ్రామాలు, పట్టణాలు ఈ ఒక్క యూరో ఇంటి పథకాన్ని ప్రవేశపెట్టాయి. వీటిలో ముస్సోమెలి, కాస్ట్రోపిగ్నానో, లసర్నా, సింక్ ఫాండీ, ఒళ్లొల్లాయి, ట్రాయినా, గాంగీ, బికారీ, జుంగోలి, సంబుకాలు ఉన్నాయి.

సంబూకా

సువర్ణ అవకాశంగా భావించా..

''అవకాశం దొరికితే ఇటలీలో వాలిపోవాలన్నది నా కల. ఒక్క యూరోకే ఇంటి పథకం విన్నప్పుడు ఇటలీకి వెళ్లిపోవడానికి లభించిన సువర్ణ అవకాశంగా భావించాను.

అక్కడికి వెళ్లి చూస్తే ఇంటి పైకప్పులు శిథిలావస్థలో ఉన్నాయి. గోడల్లో పగుళ్లు కనిపించాయి. ఒకవేళ తన ఇంటిని ఒక్క యూరో పథకం కింద పెట్టకపోతే, అది ముస్సోమెలిలోని మరో శిథిలమైన ఇంటిలా మారేది.

ఇక్కడ ఇన్ని సామానులు ఇలా ఉంచడం చూస్తుంటే కుతూహలం కలుగుతోంది. అయినా ఇటాలియన్లు మాత్రం ఈ డీల్‌పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు'' అని ఒక్క యూరో ఇంటి యజమాని డానీ మెక్ క్యుబిన్ అన్నారు.

2017లో ఒక్క యూరోకే ఇంటి పథకం

ఒక్క యూరోకే ఇంటి పథకం 2017లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ పథకం కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 170 మంది విదేశీయులకు ఈ ఇళ్లను అమ్మామని ముస్సోమెలి డిప్యూటీ మేయర్ టోటీ నైగేల్లీ తెలిపారు.

1968లో భారీ భూకంపం తర్వాత పట్టణాల్లో జనాభాను పెంచాలనే ఆలోచన పురుడు పోసుకుంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా జనాభా తగ్గుముఖం పట్టింది.

దీంతో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో పడ్డామని టోటీ నైగేల్లీ అన్నారు. 30 నుంచి 40 ఏళ్ల కిందట ముస్సోమెలి జనాభా 20వేలకు పైగా ఉండేది. ఇప్పుడు సగానికి పైగా ఇళ్లు ఖాళీ అయ్యాయి. పని చేయడానికి ఇతరదేశాలకు లేదా ఉత్తర ఇటలీకి వలస వెళ్లారు. దీంతో ఈ ఇళ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. కొందరు ఈ ఇళ్లకి పన్నులు కట్టే బదులు వారి బంధువులకు ఉచితంగా ఇచ్చేశారని టోటీ నైగేల్లీ తెలిపారు.

విదేశీ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకునే ఈ ప్రణాళికలు రచించామని ఆయన అన్నారు. ముస్సోమెలిలో ఇల్లు కొనుగోలు చేయడానికి ఇటాలియన్లు అంతగా ఆసక్తి చూపించరని అనుకున్నామని, విదేశీయులు మాత్రం ముస్సోమెలీ వచ్చి జీవించడానికి ఆసక్తిగా ఉన్నారని ఆయన వివరించారు.

''మొదటగా ఒక్క యూరోకే ఇల్లు అనే వార్తను ఆన్‌లైన్‌లో చూశాను. ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవన విధానం అంటే నాకిష్టం. అందమైన సూర్యోదయం, సముద్రం, ఎంతో రుచికరమైన ఆహారం, మంచి వైన్ ఉండగా ఇంకా ఏం కావాలి'' అని ఒక్క యూరో ఇంటి యజమాని డానీ మెక్ క్యుబిన్ అన్నారు.

''ఈ ప్రాంతం చాలా అద్భుతమైంది. ఎత్తైన శిఖరాలు, పచ్చటి వాతావరణం ఎంతో ఆకర్షణగా నిలుస్తాయి. సిసిలీలోని చాలా మంది ప్రజలు ఆత్మీయంగా ఉంటారని ఇప్పటికే నిరూపించారు.

మా ఇంటిని పూర్తిగా తిరిగి నిర్మించడానికి దాదాపు 7 వేల యూరోలు (దాదాపు 6లక్షల రూపాయలు) ఖర్చు అయింది. అయినా ఇంకా బాగుచేయాల్సింది ఉంది'' అని ముస్సోమెలి స్థానికురాలు టోనియా బ్రూవర్ పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, ఇవి అట్టపెట్టెలు కాదు.. మిని హోమ్స్

ఒక్క యూరోకే ఇల్లు.. అసలు విలువెంత?

ఇటాలియన్లు రెగ్యులర్ మార్కెట్లోనే ఇంటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇంటి పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చు, దానికి విధించిన గడువులాంటి నిబంధనలు వారికి నచ్చడం లేదు.

గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క యూరోకి ఇంటిని కొనుగోలు చేసి మరమ్మతులు చేయడం కన్నా, అంతకన్నా తక్కువ ధరకే ఒక మంచి ఇంటిని వారు కొనుగోలు చేసుకోవొచ్చు అని భావిస్తున్నారు.

అవును. ఇంటి ధర చాలా ఎక్కువే అవుతుంది. పేపర్ వర్క్, ఫీజులతో దీని రేటు ఒక్కసారిగా పెరిగిపోతుందని రియల్ ఎస్టేట్ ఏజెంట్ వలేరియా సోర్సే తెలిపారు.

ఓ విదేశీ కొనుగోలుదారుడు ఇటలీలో ఇల్లు కొనుగోలు చేయాలంటే దాదాపు 4వేల యూరోలు (దాదాపు 3,50,000 రూపాయలు) నోటరీయాక్ట్ ప్రకారం ఏజెన్సీ ఖర్చులకు చెల్లించాల్సి ఉంటుందని వలేరియా సోర్సే అన్నారు. అదనంగా 400 యూరోలు(దాదాపు 35000 రూపాయలు) వ్యాట్ ఇంటి పత్రాలకు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

కొన్ని ఇళ్లు మరీ శిథిలమై ఉన్నాయి. మూడేళ్లలోనే వాటిని పునర్నిర్మించడానికి మరింత గడువు ఇవ్వాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. ఇల్లును బట్టి దాని మరమ్మత్తులకు 20వేల యూరోలు (దాదాపు 17,50,000 రూపాయలు) నుంచి 80 వేల యూరోలు (దాదాపు 70,00,000 రూపాయలు) వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని వలేరియా సోర్సే వివరించారు.

''బయటి గోడలు తప్ప దాదాపు పూర్తి ఇంటిని పునర్నిర్మించాల్సి ఉంటుంది'' అని ఒక్క యూరో ఇంటి యజమాని మార్క్ కోపన్ అన్నారు.

ఇక ముస్సోమెలిలా మరిన్ని ప్రాంతాల్లో ఈ పథకం అనుకున్నంతగా విజయవంతం కావడం లేదు. కరేగా లీగర్‌లో ఈ ప్రాజెక్టు ప్రారంభానికి ముందే ఎన్నో అవాంతరాలను చవి చూసింది. తమ ఇళ్లను ఉచితంగా ఇచ్చే యజమానులు లభించడం లేదని స్థానికుడు ఒకరు తెలిపారు. ఇంటిని వదిలేసిన యజమానులను గుర్తించడం కూడా చాలా కష్టతరమైన పనిగా మారింది. అందుకే ఈ ప్రాజెక్టు మా దగ్గర అంత విజయవంతం కాలేకపోయింది అని తెలిపారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రా ఊటీ లంబసింగిలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

ఈ పథకంపై విమర్శలు

చిన్న పట్టణాలను తిరిగి జనాలతో కళకళలాడేలా చేయడంలో ఈ పథకం విఫలమైందని విమర్శలు వస్తున్నాయి. చాలా ఇళ్లలో కేవలం సెలవుదినాల్లో మాత్రమే మనుషులు కనిపిస్తున్నారు. కొన్ని చోట్ల రిటైర్ అయిన వారు మాత్రమే రావడంతో అక్కడి స్కూళ్లు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకోలేకపోతున్నాయని వాపోతున్నారు.

దీంతో దక్షిణ నగరమైన టోరా ఓ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది.

ఒక్క యూరోకు ఇంటి పథకం ప్రజలను టోరాకి వలస వచ్చేలా చేయలేకపోయింది. దీంతో ఈ గ్రామానికి వలస వచ్చే కుటుంబంలో ఒక్కరైనా స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే వారికి కిరాయి రాయితీలు, పన్ను రాయితీలు, పిల్లలకు ఉచిత ట్యూషన్ కల్పిస్తామని ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది.

దీంతో చాలా తక్కువ సమయంలోనే 32 మంది చుట్టు పక్కన ప్రాంతాల వారు టోరాకు వలస వెళ్లారు. బ్రెజిల్, అర్జెంటీనా, యూకే నుంచి కూడా ఇక్కడి వచ్చి స్థిరపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)