బంపర్ ఆఫర్: 50 లక్షలు ఇస్తాం... నగరాలకు దూరంగా దీవుల్లో జీవించడానికి వెళ్లిపోతారా?

సౌత్ యుయిస్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సౌత్ యుయిస్ట్

"50వేల పౌండ్లు (సుమారు 52 లక్షలు) ఇస్తాం.. నగరాలకు దూరంగా, దీవులకు వెళ్లి జీవించండి" అంటూ స్కాటిష్ ప్రభుత్వం తమ దేశ ప్రజలకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది.

ముఖ్యంగా యువత, అప్పుడే జీవితాల్లో స్థిరపడుతున్న కుటుంబాలు దీవులకు తరలి వెళ్లేందుకు ఈ ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం తెలిపింది.

స్కాటిష్ దీవుల్లో జనాభా రోజురోజుకూ తగ్గిపోతోంది. ఆ దేశ ప్రభుత్వం దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్య ఇది.

దీన్ని నివారించేందుకు జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఓ ప్రణాళికను రూపొందించింది. 'నేషనల్ ఐలాండ్స్ ప్లాన్‌'లో భాగంగా 'ఐలండ్స్ బాండ్‌'ను ప్రవేశపెట్టింది.

'అప్పుడు నాకు ఈ ఆర్థిక సహాయం అంది ఉంటే బాగుండేది'

కెవిన్ మోరిసన్ ఐదేళ్ల క్రితం గ్లాస్గో నుంచి వెస్ట్రన్ ఐల్స్‌లో ఉన్న సౌత్ యుయిస్ట్‌కు వచ్చేశారు.

అప్పట్లో తనకు 50వేల పౌండ్లు ఇచ్చి ఉంటే ఆ దీవిలో కుటుంబంతో సహా స్థిరపడడానికి ఎంతో సౌకర్యంగా ఉండేదని కమ్యూనిటీ స్పోర్ట్స్ హబ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కెవిన్ అభిప్రాయపడ్డారు.

"నా భార్య సొంతూరు సౌత్ యుయిస్ట్. మేం పిల్లల్ని కనాలని అనుకున్నప్పుడు, దీవులకు వెళిపోతే బాగుంటుందని భావించాం."

అయితే, దానివల్ల కెవిన్ జంట ఊళ్ళో తమకున్న ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. సౌత్ యుయిస్ట్ వెళ్లాక కెవిన్ ఓ పార్ట్ టైం ఉద్యోగంలో చేరారు.

"మేము ధైర్యంగా ఓ నిర్ణయం తీసుకున్నాం. దాని గురించి ఇప్పుడు కూడా మాకు ఏ చింతా లేదు."

"అయితే, అక్కడకు వెళ్లాక ఇల్లు వెతుక్కుని స్థిరపడడానికి కొంత కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన 50వేల పౌండ్లు అప్పుడు నాకు దక్కి ఉంటే ఎంతో పనికివచ్చేది. ఐలండ్స్‌లో రవాణా సౌకర్యాలు, ఇల్లు దొరకడం అన్నిటికన్నా కష్టమైన విషయాలు" అని కెవిన్ అన్నారు.

హారిస్

ఫొటో సోర్స్, Getty Images

'ఇది సరైన పథకం కాదు'

ఐలాండ్స్ బాండ్‌ను వచ్చే ఏడాది ప్రవేశపెట్టేందుకు స్కాటిష్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

అయితే, అంత మొత్తాన్ని ప్రోత్సాహకాలుగా అందించే బదులు, ఐలండ్స్‌లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేందుకు, ఉద్యోగాలు కల్పించేందుకు, సరసమైన ధరల్లో గృహాలు అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగిస్తే మేలని వెస్ట్రన్ ఐల్స్ న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ 'యామ్ పెయిపెర్' ఎడిటర్ ఇయాన్ స్టీఫెన్ మోరిసన్ అభిప్రాయపడ్డారు.

"ఈ పథకం వెనుక ఉద్దేశం అర్థం చేసుకోగలను. కానీ, నాకు ఇది నచ్చలేదు. దీన్ని వల్ల పెద్ద ప్రయోజనం ఉంటుందని నేను భావించట్లేదు" అని ఆయన అన్నారు.

స్కాట్లండ్‌లో 90 కన్నా ఎక్కువ జనావాస దీవులు ఉన్నాయి. వెస్ట్రన్ ఐల్స్, హైలాండ్స్, ఓర్క్నీ, షెట్‌లండ్, ఆర్గైల్, బ్యూట్‌తో సహా అనేక ప్రాంతాలలో ప్రజలు విస్తరించి ఉన్నారు.

"దీవులకు వెళ్లేందుకు సిద్ధపడే ప్రజలకు కొరత లేదు. ఉన్నదల్లా ఉద్యోగాల కొరత, ఇళ్ల కొరత" అని ఇయాన్ స్టీఫెన్ అన్నారు.

స్కాట్లండ్‌లో ఈ పథకం అమలుపై అభిప్రాయ అసేకరణ అక్టోబర్ వరకు కొనసాగుతుంది.

నేషనల్ ఐలండ్స్ ప్లాన్ వాగ్దానాలను నెరవేర్చడంలో ఈ బాండ్స్ కొంతమేరకు ఉపయోగపడతాయని ఐలండ్స్ సెక్రటరీ మయిరీ గౌజియన్ అన్నారు.

"దీవుల్లో నివసించాలనుకునే ప్రజలకు కొన్ని ముఖ్యమైన ఆర్థిక ఇబ్బందును తొలగించేందుకు ఈ పథకం దోహదపడుతుంది. స్కాట్లండ్ ప్రజలంతా ముఖ్యంగా దీవుల్లో నివసిస్తున్న ప్రజలు ఈ పథకంపై తమ అభిప్రాయాలను తప్పక తెలియజేయాలని, తద్వారా ప్రభుత్వ బాండ్లను మెరుగుపరిచేందుకు సహాయపడాలని కోరుతున్నాను" అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)