అల్లు అర్జున్‌కు లీగల్ నోటీసు పంపిస్తాం - టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్

ర్యాపిడో బైక్ ట్యాక్సీ ప్రకటనలో అల్లు అర్జున్

ఫొటో సోర్స్, youtube/Rapido Bike-Taxi

    • రచయిత, సురేఖ అబ్బూరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను కించపర్చేలా ఒక ద్విచక్ర వాహన సేవల సంస్థ ప్రకటనలో నటించినందుకు ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌కు లీగల్ నోటీసు పంపనున్నట్లు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు.

ఈ మేరకు టీఎస్ఆర్టీసీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

ర్యాపిడో బైక్ ట్యాక్సీ ప్రచార ప్రకటనలో అల్లు అర్జున్ నటించారు. వీరవాసం బస్సులో ప్రయాణం అంటే కుర్మావేసి, కైమా కొట్టి, మసాలా దోశ చేసి దింపుతారని అల్లు అర్జున్ అన్నారు. అదే ర్యాపిడో బుక్ చేసుకుంటే దోశ తీసినంత సులభంగా, చెమట పట్టకుండా వెళ్లిపోవచ్చునని, డబ్బు ఆదా చేసుకోవచ్చునని అన్నారు.

ఈ ప్రకటన చూసిన ఆర్టీసీ ప్రయాణీకులు, ఉద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారని, ర్యాపిడోతో పోల్చి ఆర్టీసీని తక్కువగా చూపించటాన్ని ఖండిస్తున్నారని పేర్కొన్నారు.

టీఎస్ఆర్టీసీని తక్కువగా చూపిస్తే తాము సహించబోమని వెల్లడించారు.

బీబీసీ ప్రతినిధికి ఆర్టీసీ పంపించిన పత్రికా ప్రకటన

ఉత్తమమైన, పర్యావరణ అనుకూలమైన సమాజం కోసం ప్రజా రవాణాను ప్రోత్సహించేలా, ప్రజలకు మేలు చేసే ప్రకటనల్లో నటీనటులు నటించాలని సజ్జనార్ అభిప్రాయపడ్డారు.

ఈ ప్రకటనలో నటించినందుకు అల్లు అర్జున్‌కు, ప్రకటన ద్వారా ప్రచారం పొందుతున్న ర్యాపిడో సంస్థకు కూడా లీగల్ నోటీసులు పంపుతామని తెలిపారు.

ఇప్పటికే ఆర్టీసీ బస్సుల లోపల, బయట, బస్టాండుల్లోనూ స్టికర్లు, పాంప్లెట్లు అంటించే వారిపైన, పాన్, గుట్కాలు ఊసేవారిపైన ఇప్పటికే కేసులు నమోదు చేశామని సజ్జనార్ వివరించారు.

ర్యాపిడో బైక్ ట్యాక్సీ ప్రకటనలో ఆర్టీసీ బస్సు

ఫొటో సోర్స్, youtube/Rapido Bike-Taxi

కాగా, ఈ ప్రకటనలో తెలంగాణ అనికానీ, ఆర్టీసీ అనికానీ ఎక్కడా పేర్కొనలేదు. వీరవాసరం పేరు చెప్పి, వీరవాసరం-శివదేవుని చిక్కాల మధ్య ప్రయాణించే బస్సు అంటూ ఆర్టీసీని పోలిన ఒక బస్సును చూపించారు.

ఆ బస్సు నంబర్ AP28Z 4775 అని పేర్కొన్నారు. రాష్ట్రం, జిల్లా ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ సిరీస్‌ను బట్టి ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినది అని, Z అని పేర్కొన్నందువల్ల ఇది ఆర్టీసీ బస్సు అని స్పష్టంగా తెలుస్తోంది.

అల్లు అర్జున్ నటించిన ఈ ప్రకటనను తమిళం, కన్నడ భాషల్లో కూడా డబ్బింగ్ చేశారు. వాటిలో కూడా ఇదే బస్సును చూపించారు.

వాస్తవానికి హిందీలో ఇదే ప్రకటనను రణ్‌వీర్ సింగ్‌తో రూపొందించారు. కానీ, అందులో 386 నంబర్ బస్సు అని మాత్రమే పేర్కొన్నారు. దాని రిజిస్ట్రేషన్ నంబర్‌ను కానీ, అది ఎక్కడి నుంచి ఎక్కడకు వెళుతుంది అని కానీ చూపించలేదు.

దీనిపై మరింత వివరణ కోసం టీఎస్ఆర్టీసీ అధికారులను, ప్రకటన రూపొందించిన బైక్ ట్యాక్సీ సంస్థను బీబీసీ సంప్రదించింది. అయితే, వారి నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందనా రాలేదు. వారి స్పందన రాగానే ఇక్కడ పేర్కొంటాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)