తెలంగాణ ఆర్టీసీ సమ్మె: ముగిసిన కేసీఆర్ డెడ్‌లైన్‌... విధుల్లో చేరింది 360 మందే- ప్రెస్ రివ్యూ

ఆర్టీసీ

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు విధుల్లో చేరికపై విధించిన గడువు ముగిసిందని 'ఈనాడు' కథనం తెలిపింది.

''గడువులోగా రాష్ట్రవ్యాప్తంగా కొద్దిమంది సిబ్బంది మాత్రమే విధుల్లో చేరారు. మంగళవారం అర్ధరాత్రిలోగా విధుల్లోకి చేరకపోతే మిగిలిన బస్సులను కూడా ప్రైవేటుపరం చేస్తామని శనివారం రాత్రి సీఎం కేసీఆర్ ప్రకటించారు.

మంగళవారం రాత్రి వరకు 360 మంది విధుల్లో చేరేందుకు లేఖలిచ్చినట్లు సమాచారం. ఇందులో బస్‌భవన్‌లోని పరిపాలన సిబ్బంది 200 మంది వరకు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో 62 మంది, హైదరాబాద్ జోన్‌లో 31, ఇతర డిపోల పరిథిలో మరికొందరు చేరడానికి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సమాచారాన్ని ప్రభుత్వం కానీ, ఆర్టీసీ కానీ అధికారికంగా ప్రకటించలేదు. బుధవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ప్రదర్శనలు, మానవహారాలు చేపట్టారు. సమస్యల పరిష్కారానికి వారు చేస్తున్న నిరవధిక సమ్మె 32వ రోజుకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం గడువు నిర్దేశించినా తాము విధుల్లో చేరేది లేదంటూ కార్మికులు పలు జిల్లాల్లో ప్రతిజ్ఞలు చేశారు.

మరోవైపు హైదరాబాద్‌లో కార్మిక సంఘాల ఐకాస, అఖిలపక్షం నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించార''ని ఆ కథనంలో తెలిపారు.

కేసీఆర్, హరీశ్ రావు

ఫొటో సోర్స్, Getty Images

మా సొమ్ము మాకివ్వండి: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు

తెలంగాణకు చట్టపరంగా, రాజ్యాంగపరంగా రావాల్సిన నిధులను ఇవ్వాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు కోరారంటూ 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.

''మంగళవారం హరీశ్‌రావు మూడు పేజీల లేఖ రాశారు. పన్నుల వాటా కింద రాష్ట్రాలకు పంపిణీ చేయకుండా 2017-18 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.1,76,688 కోట్లు మిగిలిపోయాయని వివరించారు. ఈ నిధులను కేంద్ర సంచిత నిధికి బదిలీ చేశారని చెప్పారు. ఇప్పటికీ ఆ నిధులపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని తెలిపారు. వాస్తవానికి రూ.35 వేల కోట్లను అడ్వాన్స్‌ సెటిల్‌మెంట్‌ కింద రాష్ట్రాలకు పంపిణీ చేయాలంటూ 2018 జనవరి 25న జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ కేంద్రానికి సూచించిందని వివరించారు. ఇలా చేసినా ఇంకా ఐజీఎస్టీ కింద రూ.1,76,688 కోట్లు పంపిణీ కాలేదని వివరించారు.

ఈ విషయాన్ని కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) 2019 నివేదికలో పేర్కొందన్నారు. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు సిఫారసు చేసిన 42 శాతం వాటా మేరకు రూ.1,76,688 కోట్లలో కేంద్రం రూ.67,998 కోట్లను రాష్ట్రాలకు పంపిణీ చేసిందని వివరించారు. ఇందులో పన్నుల వాటా(ట్యాక్స్‌ డివాల్యుషన్‌) కింద రాష్ట్రానికి రూ.1,652(2.437ు) కోట్లు వచ్చాయని తెలిపారు. కానీ... ఐజీఎస్టీ లో కేంద్రం, రాష్ట్రాలు చెరో 50 శాతం చొప్పున నిధులను పంచుకోవాల్సి ఉంటుందంటూ 'కాగ్‌' తన నివేదికలో స్పష్టం చేసిందని గుర్తు చేశారు.

రూ.1,76,688 కోట్లలో రాష్ట్రాల వాటా కింద రూ.88,344 కోట్లను పంపిణీ చేయాల్సి ఉందని తెలిపారు. ఈ రూ.88,344 కోట్లలో తెలంగాణ రాష్ట్ర వాటాగా రూ.3,560 కోట్లు రావాల్సి ఉందని వివరించారు. రాజ్యాంగ విరుద్ధమైన పంపిణీ ప్రకారమైనా(2.437 శాతం) రాష్ట్రానికి రూ.2,153 కోట్లు రావాలన్నారు. కేంద్రానికి 50 శాతం వాటా కింద దక్కిన రూ.88,344 కోట్లలో కూడా 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రాలకు 42 శాతం మేర వాటాలను పంచాల్సి ఉంటుందని తెలిపారు.

ఈ లెక్కన రాష్ట్రాలకు రూ.37,104 కోట్లు దక్కుతాయని, ఇందులో తెలంగాణకు 2.437 శాతం వాటా ప్రకారం రూ.904 కోట్లు రావాల్సి ఉంటుందని వివరించారు. ఇలా రాష్ట్రానికి రూ.3560 కోట్లతో పాటు రూ.904 కోట్లు... మొత్తం రూ.4,464 కోట్లు రావాల్సి ఉంటుందన్నారు. అయితే, రాష్ట్రానికి రూ.1,652 కోట్లు మాత్రమే వచ్చాయని, ఇంకా రూ.2,812 కోట్లు రావాల్సి ఉందని వివరించార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

పవన్

ఫొటో సోర్స్, janasena

పులివెందులనే రాజధానిగా చేసుకోండి: జగన్‌పై పవన్ వ్యాఖ్యలు

''పులివెందులను ఏపీ రాజధానిగా మారిస్తే అసలు గొడవే ఉండదు. హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తే వాయిదాలకు పులివెందుల నుంచి హాజరయ్యేందుకు దగ్గరగా ఉంటుంది'' అని సీఎం జగన్‌ను ఉద్దేశించి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారని 'ఈనాడు' కథనం తెలిపింది.

''మంత్రి బొత్సకు అవకాశం ఇస్తే చీపురుపల్లిలో రాజధాని పెడతానంటారు. 151 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ ఒక్క ఎమ్మెల్యే ఉన్న జనసేనతో గొడవ పెట్టుకుంటుందంటే ప్రజల్లో బలం ఎవరికి ఉందో ఆలోచించాలి. నేను సినిమాల్లో నటిస్తున్నానని కొందరు విమర్శిస్తున్నారు. జగన్మోహనరెడ్డికి భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ లేవా?'' అని పవన్ వ్యాఖ్యానించారని ఆ కథనంలో పేర్కొన్నారు.

జగన్

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGANMOHANREDDY

ఇక ఇంగ్లిష్‌ మీడియం

ఏపీలోని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లోని అన్ని తరగతులను ఇంగ్లిష్‌ మీడియంలోకి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని 'సాక్షి' పత్రిక తెలిపింది.

''ఒకటి నుంచి ఎనిమిది తరగతులను వచ్చే విద్యా సంవత్సరం (2020-21) నుంచి, తొమ్మిదో తరగతికి 2021-22 నుంచి, పదో తరగతికి 2022-23 నుంచి ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఆయా తరగతుల్లో తెలుగు లేదా ఉర్దూను తప్పనిసరి సబ్జెక్టుగా చదవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ మం గళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని స్కూ ళ్లలో ఇంగ్లిష్‌ మీడియంను అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌కు అప్పగించి అందుకు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చార''ని అందులో వివరించారు.

జ్వర పీడితులు

ఫొటో సోర్స్, Getty Images

ప్రతి నలుగురిలో ఒకరికి డెంగీ

తెలంగాణలో డెంగీ విజృంభించిందని 'సాక్షి' కథనం తెలిపింది.

''ఇటీవల మంచిర్యాల జిల్లాలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. డెంగీ అనుమానంతో రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో ప్రతీ నలుగురిలో ఒకరికి డెంగీ ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా ప్రభుత్వానికి ఆ శాఖ అధికారులు ఒక నివేదిక అందజేశారు. దాని ప్రకారం రాష్ట్రంలో 40,434 మంది రక్తనమూనాలు సేకరించి వైద్య పరీక్షలు నిర్వహించగా, అందులో 10,237 మంది కి డెంగీ ఉన్నట్లు నిర్ధారణ జరిగిందని తెలిపారు. మరణాలు మాత్రం రెండే సంభవించినట్లు పేర్కొన్నారు. అనధికారిక లెక్కల ప్రకారం 20 వేల మంది వరకు డెంగీకి గురయ్యారని, 150 మందికిపైగా చనిపోయారని వైద్య ఆరోగ్యశాఖ లోని కొందరు చెబుతున్నారు. డెంగీ కేసుల సంఖ్యను, మరణాలను తక్కువ చేసి చూపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సర్కారు నివేది క ప్రకారం అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 2,709 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో 1,847 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 713 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో ఒకరు, ఖమ్మం జిల్లాలో ఒకరు చనిపోయారని నివేదిక తెలిపింద''ని ఆ కథనంలో వివరించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)