ఏపీ సీఎం జగన్: పోలవరం ప్రాజెక్టు ఖర్చుపై ఆడిట్ చేపడతాం - ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, YS JAGAN/FB
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటి వరకు జరిగిన ఖర్చు, పనుల పురోగతిపై ఆడిట్ చేపడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారని ఆంధ్రజ్యోతి తెలిపింది.
ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పరిధిలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆడిట్ చేస్తుందని జలవనరుల శాఖకు సీఎం తేల్చిచెప్పారు. ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ సాంకేతిక అంశాలతోపాటు ఇప్పటిదాకా అయిన వ్యయం, బిల్లుల చెల్లింపు, ప్రాజెక్టు పురోగతి, ఇతర అనేక అంశాలపై ఈ తనిఖీ చేపడుతుందని, ఇందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
పోలవరం ప్రాజెక్టును 2021 ఫిబ్రవరి నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని జగన్ ఆదేశించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, తొలిసారిగా గురువారం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు.
ఈ సందర్భంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అధికారులు సమర్పించిన నివేదికను పరిశీలన చేయకుండానే నిర్మాణాలు, ప్రత్యేకించి కాఫర్‌డ్యామ్, భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం వంటి అంశాలపై సీఎం ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.
సైట్ వద్దే కాఫర్‌డ్యామ్ ఎందుకు కట్టారని తొలుత అధికారులను ప్రశ్నించారు. గ్రావిటీ ద్వారా కాలువల నుంచి నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో గత సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కాఫర్‌డ్యామ్ నిర్మాణం చేపట్టామని అధికారులు ఆయనకు నివేదించారు. దీంతో ఒక్కసారిగా ముఖ్యమంత్రి గట్టిగా నవ్వారు.
''ప్రాజెక్టుకు సంబంధించి స్పిల్‌వే, స్పిల్‌వే చానల్ నిర్మించకుండా కాఫర్‌డ్యామ్ ఎలా కట్టారు? ఇప్పుడు వరద వస్తే దాన్ని ఎలా కాపాడుతారు?'' అని అధికారులను ప్రశ్నించారు. ఇందుకు సాంకేతిక నిపుణులు అభ్యంతరం చెప్పలేదా అని ప్రశ్నించినట్లు తెలిసిందని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో నాలుగేళ్లలో.. 49 లక్షల ఉద్యోగ దరఖాస్తులు
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. సర్కారీ కొలువుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థుల సంఖ్య పెరుగుతోంది. కొడితే ప్రభుత్వ కొలువే కొట్టాలన్న ఉద్దేశంతో నిరుద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ఈనాడు ఒక కథనంలో పేర్కొంది.
ఏటా డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు కొత్తగా ఈ కేటగిరీలోకి వచ్చిచేరుతున్నారు. ఉన్నత చదువులు చదివినప్పటికీ అర్హత ఉంటే చాలు.. ఏ చిన్న ఉద్యోగ ప్రకటన వచ్చినా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం దాదాపు 24.58 లక్షలమంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
ఒక్క టీఎస్‌పీఎస్సీ వద్ద నమోదైన ఉద్యోగార్థుల వన్‌టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. ఇప్పటివరకు కమిషన్ జారీచేసిన 101 ఉద్యోగ ప్రకటనలకు దాదాపు 49.04 లక్షల దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతోందని, తెలంగాణ పట్టణ యువతలో నిరుద్యోగం 32.8 శాతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నివేదికలో వెల్లడించింది.
టీఎస్‌పీఎస్సీ వెలువరించిన 101 ఉద్యోగ ప్రకటనల్లో సాంకేతిక, వైద్య, ప్రొఫెషనల్, సాధారణ అర్హతలు కలిగిన 36,601 పోస్టులు ఉన్నాయి. ఒక్కో పోస్టుకు సగటున రాష్ట్రంలో 133 మంది ఉద్యోగార్థులు పోటీపడ్డారు.
రెవెన్యూశాఖలో 700 వీఆర్‌వో పోస్టులకు అత్యధికంగా 10.58 లక్షలమంది దరఖాస్తు చేశారు. సాధారణ అర్హత కలిగిన అభ్యర్థులు ఎక్కువగా పోటీపడ్డారు. ఈ పోస్టులకు సగటున 1,511 మంది పోటీపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థుల సంఖ్యను పరిశీలిస్తే జిల్లాల వారీగా కరీంనగర్‌లో 3 లక్షలు దాటింది. తరువాత వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో మినహా మిగతా జిల్లాల్లో మహిళా ఉద్యోగార్థుల కన్నా పురుష ఉద్యోగార్థుల సంఖ్య ఎక్కువగా నమోదైందని ఈనాడు తెలిపింది.

ఫొటో సోర్స్, KIPL BARRAGE 2
నేడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం
తెలంగాణలోని కాళేశ్వర ఎత్తిపోతల పథకం నేటి నుంచి జాతికి అంకితం కానుందని సాక్షి వెల్లడించింది. ఈ బృహత్తర ప్రాజెక్టును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించనున్నారు.
మేడిగడ్డ పంప్‌హౌస్‌లోని 6వ నంబర్ మోటార్‌ను ఆన్ చేయడం ద్వారా గోదావరి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఘట్టానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తోపాటు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌లు హాజరుకానున్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ప్రాజెక్టు పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. గోదావరిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటితో తొలి ఎత్తిపోతలు మొదలు కానుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధికారులు మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్‌లలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద యాగశాలలు ఇప్పటికే సిద్ధమయ్యాయి.
రుత్వికులు, పండితులు ఇప్పటికే అక్కడ హోమాలకు సంబంధించి ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరుకానున్న గవర్నర్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలు, ఆయా రాష్ట్రాల మంత్రుల కోసం 5 హెలికాప్టర్‌లు సమకూర్చగా ఒక్కో ప్రాంతం వద్ద ఆరు హెలిప్యాడ్‌లు సిద్ధం చేసి ఉంచారు.
శుక్రవారం ఉదయం 7 గంటలకే ముఖ్యమంత్రి కేసీఆర్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతానికి సతీసమేతంగా చేరుకోనున్నారు. అక్కడ జరిగే జలసంకల్ప మహయాగ హోమంలో పాల్గొంటారు. ఉదయం 8:30 గంటలకు మరో హెలికాప్టర్‌లో గవర్నర్ నరసింహన్ సైతం హైదరాబాద్ నుంచి బయల్దేరనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి అమరావతి నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతానికి చేరుకోనున్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ముంబై నుంచి నేరుగా మేడిగడ్డకు చేరుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అనంతరం ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల మధ్య గవర్నర్, ముగ్గురు ముఖ్యమంత్రులు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అక్కడే ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారని సాక్షి వెల్లడించింది.

ఫొటో సోర్స్, Reuters
ఆరోగ్యం గాలిలో దీపం!
హైదరాబాద్ సహా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత నానాటికి క్షీణిస్తోంది. ఈ సూచి వార్షిక సగటు సంతృప్తికర స్థితి నుంచి ఓ మోస్తరుకు పడిపోయిందని ఈనాడు తెలిపింది.
ముఖ్యంగా ఏడాదిలో రెండు, మూడు నెలలపాటు గాలి నాణ్యత అధ్వాన స్థితికి దిగజారింది. అది ప్రజల ఆరోగ్యంపై పెను ప్రభావమే చూపుతోంది. అందుకే ఆయా సందర్భాల్లో కాలుష్య తీవ్రతను తగ్గించేలా దిల్లీ తరహా కార్యాచరణ ప్రణాళికను అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
అందుకు అనుగుణంగా సంబంధిత శాఖలు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఆమోదం తాజాగా లభించింది.
హైదరాబాద్‌తో పాటు పటాన్‌చెరు, ఇతర నగర శివారు పారిశ్రామిక వాడల్లో వాయు కాలుష్యం నానాటికీ పెరుగుతోంది. 2010లో జూబ్లీహిల్స్‌లో గాలి నాణ్యత సూచి 52గా ఉండేది. 2018 వచ్చే సరికే ఈ సూచి ఏకంగా 115కు పెరిగింది. అంటే గాలి నాణ్యత వందశాతానికి పైగా పడిపోయింది.
మాదాపూర్‌లో 74 నుంచి 92, చార్మినార్‌లో 78 నుంచి 113కి పెరిగింది. పాశమైలారంలో 2017లో 105గా ఉన్న సూచి 2018 నాటికి 113కి చేరింది. గతంలో 50-100 మధ్య ఉండే హైదరాబాద్ నగర సగటు సూచి 101-200కు, డిసెంబరు, జనవరి నెలల్లో సనత్‌నగర్, జూపార్క్ ప్రాంతాల్లో గాలి నాణ్యత 202-229కు క్షీణించింది. కొత్తూరు, మహబూబ్‌నగర్, మెదక్, రామగుండం, నల్గొండ వంటి ప్రాంతాల్లో కూడా గతంలో కంటే గాలి నాణ్యత తగ్గింది. ఈ నేపథ్యంలో సీపీసీబీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
దేశంలో కాలుష్య తీవ్రత అత్యంత అధికంగా ఉన్న నగరం దిల్లీ. చలి కాలంలో కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌ను దిల్లీలో అమలు చేస్తున్నారు. అదే తరహాలో హైదరాబాద్‌లో అమలు చేసేందుకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)తో పాటు జీహెచ్‌ఎంసీ, చుట్టుపక్కల పురపాలికలు, పోలీస్,(ట్రాఫిక్), రవాణా శాఖలు నిర్ణయించాయి. ఈ ప్రణాళికలను ఆయా శాఖలు అమలు చేయనున్నాయని ఈనాడు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- శ్రీలంక: యుద్ధంలో బద్ధ శత్రువులు ప్రేమలో పడ్డారు
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
- శాండ్విచ్ జనరేషన్ అంటే ఏమిటి? మీరు ఈ కోవలోకి వస్తారా?
- సానియా మీర్జా: ‘నేను పాకిస్తాన్ జట్టుకు తల్లిని కాదు’
- చెన్నైలో తాగునీటికి కటకట: వర్షాలు పడకుంటే మురుగునీరే దిక్కా?
- టర్కీ: ఇస్లాంను తిరస్కరిస్తున్న యువత
- "అమ్మాయిలు ఐస్‌క్రీమ్‌లను నాకుతూ తినొద్దు"
- శోభనం రాత్రి బెడ్షీట్లు ఏం నిరూపిస్తాయి? పురాతన వివాహ సంప్రదాయాలు నేటితరం మహిళల్ని ఎలా వెంటాడుతున్నాయి?
- హాంకాంగ్ నిరసనల ముఖ చిత్రం ఇతడే.. పేరు జాషువా.. వయసు 22 ఏళ్లు.. లక్షలాది మందిని ఎలా కదిలించాడు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








