ఎలక్ట్రిక్ వాహనాలు: కాలుష్యం, పెట్రోల్ ధరల వల్ల భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లు పెరుగుతున్నాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అపర్ణ అల్లూరి , వికాస్ పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధులు
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఈ ఏడాది సెప్టెంబరులో అధికంగా జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వీటి అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది అమ్మకాల విలువ, గతేడాదిలో జరిగిన అమ్మకాల మొత్తం విలువకు దాదాపుగా సమీపించింది.
ఇదంతా చూస్తుంటే ప్రపంచ వ్యాప్తంగా సెమీకండక్టర్ చిప్స్ కొరతతో సతమతమవుతున్న పరిశ్రమ కాస్త పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది.
కానీ, ఇది కేవలం ఒక చిన్న మెరుపు మాత్రమే. ఈ ఆర్ధిక సంవత్సరంలో 1,21,000 ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకం జరిగింది.
భారతదేశంలో జరిగిన మొత్తం 2 కోట్ల వాహనాల అమ్మకాల్లో ఇది కేవలం 1.66 శాతం మాత్రమే అని దిల్లీ కి చెందిన కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ సంస్థ తెలిపింది.
కొన్ని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు, ముఖ్యంగా టూవీలర్స్ తయారు చేసే సంస్థలు ఈ మార్కెట్ కోసం భారీ స్థాయిలో పోటీ పడుతున్నాయి. కార్లు, లారీల లాంటి వాటికి పెద్దగా డిమాండ్ ఉండటం లేదు. వీటి ఉత్పత్తిని పెంచేందుకు భారత ప్రభుత్వం 3.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 26,000 కోట్ల) పథకాలను ప్రకటించింది.
ఎలక్ట్రిక్ వాహనాలు కార్బన్ ఉద్గారాల విడుదలను కూడా తగ్గిస్తాయి. భారతదేశం కార్బన్ వ్యర్ధాలను విడుదల చేస్తున్న దేశాల జాబితాలో ప్రపంచంలోనే మూడవ పెద్ద దేశంగా ఉంది. దీంతో ప్రతిష్టాత్మకమైన వాతావరణ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని భారత్ చూస్తోంది.
ఒక వైపు ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశానంటుతున్నాయి.
భారతదేశపు ఇంధనపు దిగుమతుల ఖర్చు 24.7 బిలియన్ డాలర్లు ఉన్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి.
"దీనికి సగం వాతావరణ మార్పులు, సగం ఆర్ధిక అంశాలు కారణం " అని సిఈఈడబ్ల్యూ లో సెంటర్ ఫర్ ఎనర్జీ ఫైనాన్స్ డైరెక్టర్ గగన్ సిద్ధు చెప్పారు.
ఎలక్ట్రిక్ వాహనాలు పుట్టుకొచ్చి ఒక శతాబ్దం దాటింది. ఇప్పుడు ఈ పరిశ్రమలో విప్లవాన్ని తీసుకొని రావడానికి భారతదేశం సిద్ధంగా ఉందా?
కల
"వినియోగదారులు ఇవి కావాలని అడుగుతున్నారు. ప్రభుత్వం కూడా వీటిని తయారు చేసేందుకు ప్రోత్సహిస్తోంది" అని ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వరుణ్ దూబే చెప్పారు. ఇది ఓలాకు అనుబంధ సంస్థ
భారతదేశంలో ఈ సంస్థ ఇటీవల 320 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2400 కోట్ల) విలువైన స్కూటర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని ప్రకటించింది.
ఈ సంస్థ ద్ద్వారా ఏడాదికి ఒక కోటి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారు చేసే ప్రణాళికలను రూపొందించింది. ప్రపంచ ఉత్పత్తిలో ఇది 15 శాతం ఉంటుంది.
"పరిశుభ్రమైన గాలి గురించి ఎవరూ చర్చించటం లేదు. కానీ, ఆ స్థితికి చేరుకోవడం ఎలా?" అని దూబే ప్రశ్నించారు.

అయితే, ఈ స్థితికి చేరుకునేందుకు భారత ప్రభుత్వం తొందరపడుతున్నట్లే కనిపిస్తోంది. 2030 నాటికి భారతదేశం రోడ్ల పై ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే తిరగాలని అప్పటి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2017లో ప్రకటించారు. కానీ, ఇది సాధ్యమయ్యే లక్ష్యంలా కనిపించకపోవటంతో ఈ ప్రణాళికను పునః పరిశీలించారు.
2030 నాటికి దేశంలో 30 శాతం ప్రైవేటు కార్లు, 70 శాతం కమర్షియల్ వాహనాలు, 40 శాతం బస్సులు, 80 శాతం ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు.
అయితే, ద్విచక్ర, త్రిచక్రవాహనాలు ఇప్పటికే ఆ లక్ష్యానికి దగ్గరగా ఉన్నాయి.
భారతదేశంలో అత్యధికంగా బ్యాటరీ స్కూటర్లను ఉత్పత్తి చేసే హీరో-ఎలక్ట్రిక్ సంస్థ గాసోలీన్ ద్వారా నడిచే ద్విచక్ర వాహనాల అమ్మకాలను 2027 కల్లా నిలిపేస్తామని ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
"ప్రపంచం ద్విచక్ర వాహనాలపైనే నడుస్తోందని చెప్పవచ్చు. ద్విచక్ర వాహనాలను మార్చకపోతే ఎలక్ట్రిక్ వాహనాలకు మారలేం" అని దూబే చెప్పారు.
2019-20లో భారతదేశంలో 1 కోటి 74 లక్షల ద్విచక్ర వాహనాలు అమ్మకం కాగా అందులో కార్ల అమ్మకం కేవలం 27 లక్షలు మాత్రమే ఉందని సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ పేర్కొంది.
దక్షిణ, తూర్పు దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల్లో కార్ల సంఖ్య కంటే ద్విచక్ర వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో బ్యాటరీతో నడిచే మోటార్ సైకిళ్లకు విస్తృతమైన మార్కెట్ ఉన్న ఈ దేశాలపై ఓలా దృష్టిపెట్టింది.
గత నెలలో రెండు రోజుల పాటు సంస్థ నిర్వహించిన ఆన్ లైన్ అమ్మకాల్లో భారతదేశంలో 1,00,000 స్కూటర్లను అమ్మినట్లు సంస్థ తెలిపింది. ఒక ఆర్ధిక సంవత్సరంలో ఇన్ని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారతదేశం గతంలో ఎన్నడూ జరగలేదు.
"దీనికి డిమాండ్ పెరిగింది అని స్పష్టంగా తెలుస్తోంది" అని దూబే అన్నారు.
వాస్తవం
అయితే, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల విషయంలో ఇంత పురోగతి లేదు. ఈ ఆర్ధిక సంవత్సరంలో వీటి అమ్మకాలు మొత్తం కార్ల అమ్మకాల్లో 4 శాతం కంటే తక్కువగా ఉన్నాయి.
"అక్కడ అందుబాటులో ఉన్నవి మాత్రమే అమ్మగలం" అని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ అధ్యక్షుడు వింకేష్ గులాటీ చెప్పారు. ఇక్కడ సమస్య డిమాండ్ కంటే కూడా సరఫరాతో కూడుకుని ఉందని అన్నారు.
భారత్‌లో అతి తక్కువ సంఖ్యలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ మార్చుకునే సదుపాయం, వీటి రీ సేల్ విలువ ఇలా కార్ల విషయంలో అనేక సవాళ్లు ఉన్నాయి. చైనాలో 9,00,000 ఛార్జింగ్ స్టేషన్లు ఉండగా, దేశంలో 2000 లోపే ఉన్నాయి. భారతదేశంలో సెకండ్ హ్యాండ్ కార్లకు భారీ మార్కెట్ ఉంది.
వీటితో పాటు కార్ల రేటు మరో సవాలుగా నిలుస్తోంది. భారతదేశంలో కారు సగటు ధర 7,00,000 రూపాయలు ఉంది. కానీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలలో అత్యంత తక్కువలో లభిస్తున్న కారు ధర రూ. 12 లక్షలు ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
"దీంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేసేందుకు అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి" అని గులాటి అన్నారు.
అంతే కాకుండా, ఇవి మెట్రో నగరాలైన దిల్లీ, ముంబయి, బెంగళూరు దాటి అవతల కనిపించవు. అంటే, మొత్తం మార్కెట్ లో ఇవి ఐదో వంతు మాత్రమే. "దాంతో, సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్ సృష్టించాల్సిన అవసరం ఉంది" అని అన్నారు.
‘‘భారతదేశంలో కారు వినియోగదారులను సంతోషపెట్టడం చాలా కష్టం. అన్నీ కావాలనుకుంటారు కానీ, డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త వహిస్తారు. అందుకే, వీటి ధర ఎక్కువగా ఉండటంతో భారతదేశంలో అత్యంత పెద్ద కార్ల ఉత్పత్తి సంస్థ మారుతి కూడా ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసేందుకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు.
ధర ఎక్కువగా ఉండటం వల్లే, విదేశీ బ్రాండులు కూడా మార్కెట్‌ను పట్టుకోలేకపోయాయి. కొన్ని సంస్థలు మూతపడ్డాయి కూడా.
భారతదేశంలో కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ఫోర్డ్ గత నెలలో ప్రకటించింది. అమెరికాలో ఈ సంస్థ ఎలక్ట్రిక్ కార్ల తయారీకి 11 బిలియన్ డాలర్ల (రూ. 81,410 కోట్లు) పెట్టుబడి పెట్టింది.
టెస్లా త్వరలోనే భారతీయ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. అయితే, భారతదేశంలో ఉన్న అధిక దిగుమతి టారిఫ్ ల గురించి ఈ సంస్థ ఫిర్యాదు చేసింది. సంస్థకు కావాల్సిన సహకారాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని గడ్కరీ హామీ ఇచ్చారు. అయితే, సంస్థ ఉత్పత్తులను స్థానికంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కోరింది. అంతే కాకుండా, చైనాలో తయారైన కార్లను భారతదేశంలో అమ్మకూడదని షరతు పెట్టింది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ పెరిగితే, మరిన్ని విదేశీ సంస్థలు మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది" అని ఐహెచ్ఎస్ ఆటో రంగ విశ్లేషకుడు పునీత్ గుప్తా చెప్పారు. అయితే, ఇది 2030 లోపు జరుగుతుందని ఆయన భావించడం లేదు.
ప్రభుత్వం వీటి గురించి కఠినమైన విధానం తెస్తే తప్ప ఇప్పటికిప్పుడు ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో పెరుగుదల పట్ల గులాటి కూడా అనుమానంగానే ఉన్నారు.

అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన పద్ధతి అవలంబించడం బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కానీ, అమ్మకాలు పెరుగుతున్నాయి. "మొదట్లో 300 కార్లు బుక్ చేయడానికి చాలా కష్టపడేవాళ్ళం. ప్రస్తుతం రోజుకు 3000 కార్లు బుక్ అవుతున్నాయి" అని టాటా మోటార్స్‌లో ప్యాసెంజర్ వాహనాల విభాగం అధ్యక్షుడు శైలేష్ చంద్ర చెప్పారు.
"వినియోగదారుల మనస్తత్వాలలో వచ్చిన మార్పు మార్కెట్ ను ప్రభావితం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది".
ఈ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల్లో 2 బిలియన్ డాలర్ల (రూ. 14,805 కోట్లు) పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం అబుదాబి హోల్డింగ్ సంస్థ , శాన్‌ఫ్రాన్సిస్కో కు చెందిన క్లైమేట్ ఫండ్ టిపిజి రైస్ నుంచి 1 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ఆహ్వానించింది.
ఈ సంస్థ కొత్త మోడళ్లతో, ఛార్జింగ్ ప్లాట్ ఫార్మ్స్, బ్యాటరీ సాంకేతికతలో పెట్టుబడి పెట్టి ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని పెంచాలని ప్రణాళికలు చేస్తోంది. 2025 నాటికి కనీసం 10 కొత్త రకాలను మార్కెట్ లోకి విడుదల చేయాలని చూస్తోంది.
భవిష్యత్తు
"ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచం భిన్నంగా ఉంటుంది" అని గుప్తా చెప్పారు. దీనికి చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ సహకారం అందించాలని అన్నారు.
ఉత్పత్తిదారులు కార్లను తయారు చేస్తారు. కానీ, అవి నడిచేందుకు ఇతర కంపెనీలు బ్యాటరీలను తయారు చేస్తాయి. ఇంధన సరఫరా సంస్థలు దానిని ఛార్జ్ చేసేందుకు తగిన శక్తిని సరఫరా చేస్తాయి.
ఈ సంస్థలన్నీ ఒకదానితో ఒకటి సమన్వయంతో వ్యవహరిస్తూ ఈ రంగంలో ఎప్పటికప్పుడు వచ్చే నూతన ఆవిష్కరణలు తీసుకురావాలి.
"లాభాలను ఆర్జించేందుకు భారతదేశం చాలా గమ్మత్తైన మార్కెట్" అని శైలేష్ చంద్ర అన్నారు.
ఖర్చులను ఆదా చేసి నష్టాలను తగ్గించేందుకు ఒకరితో ఒకరికి సమన్వయం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.
అయితే, ఈ రంగంలో మరిన్ని భారీ మార్పులొస్తాయని దూబే ఊహిస్తున్నారు. "ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తుంటే ప్రజలు ఆన్ లైన్ లో కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు" అని అన్నారు.
"వివిధ సంస్థల మధ్య అనుసంధానం ఉండటం వల్ల అవి పని చేసే విధానం గురించి మరింత సమాచారం లభిస్తుంది. దాంతో పారదర్శకత పెరిగి, ఇన్సూరెన్సు , రుణాలు పొందటాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో, అవి మరింత సమర్ధవంతంగా, అందుబాటులో ఉండే ధరలకు లభిస్తాయి.’’

ఫొటో సోర్స్, Getty Images
ఒక వైపు ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం పెరుగుతూ ఉండగా, మరో వైపు ఇతర సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. భారతదేశం ఇప్పటికీ చైనా నుంచి దిగుమతి అయ్యే బ్యాటరీల పై ఆధారపడుతోంది. ఇది ఇంధన భద్రత విషయంలో ఇది దేశానికి ఆటంకంగా మారే అవకాశం ఉంది.
బ్యాటరీ ప్రత్యామ్నాయాలైన అల్యూమినియం లాంటి లోహాల కోసం గనులు తవ్వడం, వ్యర్ధాలను వదిలిపెట్టడం లాంటివి పర్యావరణానికి హాని చేస్తాయి. ఈ నష్టాలు మరో చోట చేకూరిన లాభాలను మింగేస్తాయి.
"వీటిని రీ-సైకిల్ చేయడం కూడా పెద్ద సమస్య. కానీ, సర్క్యులర్ ఆర్ధిక వ్యవస్థ కూడా ఒక వ్యాపార అవకాశం" అని సిద్ధు అన్నారు.
ఇప్పటికే సాధారణ వాహనాల వాడకం నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లే ప్రక్రియ భారతదేశంలో మొదలయిందని ఆయన అన్నారు.
"ఇంధన పరివర్తన ఇప్పటికే మొదలయింది. మన ఇంట్లోకి ప్రవేశిస్తున్న ఎలక్ట్రాన్ రంగెలా ఉంటుందో మనకు తెలియదు. కానీ, ఈ ఎలక్ట్రిక్ వాహనాలు మన చుట్టూ చేరుతున్నాయి. ప్రతీ పది మంది డెలివరీ ఉద్యోగుల్లో కనీసం ఒకరు ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతున్నారు".
ఇవి కూడా చదవండి:
- ASMR: ఈ వీడియోలు చూస్తే ఉల్లాసం... ఈ శబ్దాలు వింటే సంతోషం
- 'మన పెద్దాపురం': 'కిలో ప్లాస్టిక్ తెస్తే... కిలో బియ్యం ఇస్తాం'
- మగాళ్ల ఆత్మహత్యకు ఈ ఐదు విషయాలే కారణమా
- పేరెంటింగ్: తల్లిదండ్రుల తగవులు పిల్లలపై ఎలా ప్రభావం చూపుతాయో మీకు తెలుసా?
- పది నిమిషాల్లో ఆనందాన్ని పెంచుకోవడం ఎలా?
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- జయలలిత తమిళనాడులో సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగించినప్పుడేం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













