వాతావరణ మార్పులు: వరి సాగు పర్యావరణానికి ప్రమాదమా? వ్యవసాయం వల్ల విడుదలయ్యే గ్రీన్‌హౌస్ వాయువులతో ప్రమాదం ఎంత?

ధాన్యం

ఫొటో సోర్స్, Getty Images

గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించే కొన్ని రకాల మార్గాల గురించి మనకు తెలుసు.

విమాన ప్రయాణాలు తగ్గించడం, ఎలక్ట్రిక్ కార్ల వాడకం వైపు మొగ్గు చూపడం, మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల భూతాపం కట్టడి చేయవచ్చు.

భూతాపాన్ని నియంత్రించే మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. కానీ వాటిని మనం ఇంతవరకు గుర్తించలేదు.

వాతావరణ మార్పులకు కారణమయ్యే కొన్ని అసాధారణ అంశాల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం.

రైస్ బౌల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచంలో దాదాపు 350 కోట్ల మంది బియ్యాన్నే ప్రధాన ఆహారంగా తీసుకుంటారు.

1. బియ్యం

ప్రపంచ జనాభాలో సగానికి పైగా జనాభా వరిని ప్రధాన ఆహరంగా తీసుకుంటారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. కానీ వ్యవసాయంలో సమస్యాత్మకమైన పంట కూడా ఇదే.

వరి సాగు కోసం పెద్ద మొత్తంలో నీటిని వినియోగించాల్సి ఉంటుంది. దీంతో తడి నేలలోని సూక్ష్మజీవులు మీథేన్ అనే వాయువును ఉత్పత్తి చేస్తాయి. గ్రీన్ హౌస్ వాయువుల్లో కార్బన్ డయాక్సైడ్ కంటే కూడా మీథేన్ అత్యంత శక్తిమంతమైనది.

వ్యవసాయం ద్వారా కేవలం 1 నుంచి 2 శాతం మాత్రమే గ్రీన్ హౌస్ వాయువులు విడుదల అవుతాయి. కానీ కొత్త 'సాగు ప్రాంతాల' కోసం చెట్లు నరికివేయడం, సాగు తర్వాత వ్యర్థాలను కాల్చివేయడం వంటి చర్యలు వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరుగుదలకు కారణమవుతున్నాయి.

గ్లోబల్ వార్మింగ్‌పై వ్యవసాయం ప్రభావాన్ని తగ్గించేందుకు వీలుగా కొత్త రకాలైన ధాన్యాన్ని పండించేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు శ్రమిస్తున్నారు. వ్యవసాయంలో నీటి వాడకాన్ని తగ్గించి, అధిక దిగుబడినిచ్చే ధాన్యం పండించేందుకు పరిశోధనలు చేస్తున్నారు.

లాప్ టాప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచ జనాభాలో 60 శాతం మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు.

2. ఇంటర్నెట్ సెర్చ్‌

ఇంటర్నెట్ వాడకం కూడా కార్బన్ డయాక్సైడ్ విడుదలకు కారణమవుతోంది. అంతర్జాలంలో మనం ఏదైన అంశం గురించి వెదికినప్పుడు... మన డివైస్ పనిచేయడానికి వినియోగించే శక్తితో పాటు, వైర్‌లెస్ నెట్‌వర్క్‌ కోసం వాడే శక్తి కారణంగా కొన్ని గ్రాముల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది.

చూడటానికి ఇది కొద్ది పరిమాణంలో ఉన్నట్లే అనిపిస్తుండొచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా 466 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులున్నట్లు తాజా అంచనా. ఈ ప్రకారం చూస్తే వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ మోతాదు రానున్న కాలంలో మరింత పెరగొచ్చు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు దాదాపు 100 కోట్ల గంటల పాటు యూట్యూబ్ వీడియోలు స్ట్రీమ్ అవుతున్నాయి.

యూట్యూబ్‌ను నడుపుతోన్న గూగుల్ సంస్థ, పర్యావరణం కోసం తన వంతుగా తమ సర్వర్లును పునరుత్పాదక శక్తితో నడిపిస్తోంది. కానీ యూట్యూబ్‌ను చూస్తోన్న వినియోగదారుల వైపు నుంచి కార్బన్ డయాక్సైడ్ విడుదల జరుగుతోంది.

యూట్యూబ్ వాడకం ద్వారా దాదాపు 1,11,30,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతోందని, ఇది దాదాపు గ్లాస్గో నగరం పరిమాణంలో ఉండే ఒక నగరం నుంచి విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువులతో సమానం అని యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ 2016లో చేసిన అధ్యయనంలో తేలింది.

రిజర్వాయర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రిజర్వాయర్లు, మీథేన్ ఉత్పత్తికి కారణమవుతున్నాయి.

3. రిజర్వాయర్స్

రిజర్వాయర్లను ఏర్పాటు చేసినప్పుడు నీటిలో మునిగిపోయిన మొక్కలతో పాటు ఇతర జీవసంబంధమైన పదార్థాలు కుళ్లిపోయి మీథేన్ వాయువు ఉత్పత్తవుతుంది. వరి సాగు తరహాలోనే ఇక్కడ కూడా మీథేన్ విడుదల అవుతుంది.

మానవ చర్యల కారణంగా ఏటా విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లు 1.3 శాతం మేర కారణమవుతున్నాయని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు.

ఇలా విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువుల పరిమాణం, కెనడా నుంచి విడుదలయ్యే మొత్తం ఉద్గారాల పరిమాణానికి సమానమని చెప్పారు.

కానీ చాలా రిజర్వాయర్లు, హైడ్రోపవర్ డ్యామ్స్‌గా కూడా మనకు సేవలందిస్తుంటాయి.

ఈ రిజర్వాయర్ల వల్లే మనం పునరుత్పాదక, తక్కువ కార్బన్ స్థాయిలున్న విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాం. శిలాజ ఇంధనాల స్థానంలో విద్యుత్‌ను ఉపయోగించి ఉద్గారాలను తగ్గించవచ్చు.

చీజ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాంసం, పాడి పరిశ్రమంలో చీజ్ మూడో అత్యధిక కర్బన ఉత్పత్తిదారు.

4. చీజ్

కర్బన ఉద్గారాలకు అధిక శాతం కారణమయ్యే వాటిలో చీజ్ కూడా ఉంది. కానీ మాంసం, పాడి పరిశ్రమలో బీఫ్, గొర్రె మాంసం తర్వాత కర్బన ఉద్గారాల ఉత్పత్తిలో చీజ్‌ మూడో స్థానంలో ఉంది.

ప్రతీ కిలోగ్రామ్‌కు చీజ్ వల్ల 13.5కేజీల కార్బన్ డయాక్సైడ్‌కు సమానమైన కర్బన ఉద్గారాలను ఉత్పత్తి అవుతాయి. వాతావరణ మార్పుకు కారణమయ్యే వాటి జాబితాలో చికెన్, పోర్క్, సాల్మన్‌ల కంటే చీజ్ అగ్రస్థానంలో ఉంటుంది.

ఒక కేజీ చీజ్ తయారీకి దాదాపు 10 లీటర్ల పాలను వినియోగిస్తారు. మృదువుగా ఉండే చీజ్‌లో పాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. అందుకే పర్యావరణంపై తక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా పాడి పరిశ్రమ 4 శాతం మానవ నిర్మిత గ్రీన్ హౌస్ ఉద్గారాలకు కారణమవుతుంది. పాలను ఉత్పత్తి చేసే జంతువులకు కూడా ఇందులో స్వల్ప భాగముంటుంది. ఎందుకంటే అవి పెద్ద మొత్తంలో మీథేన్‌ను విడుదల చేస్తాయి. వాతారణానికి కార్బన్ డయాక్సైడ్ కంటే కూడా మీథేన్ అధిక హాని కలిగిస్తుంది.

బాలికల విద్య

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాలికలకు, మహిళలకు విద్యతో పాటు సమాన అవకాశాలను అందించడం ద్వారా వాతావరణ వ్యూహాలను పటిష్టం చేయొచ్చు.

5. బాలికలకు చదువుతో పర్యావరణానికి మేలు

బాలికలకు, మహిళలకు విద్యతో పాటు సమాన అవకాశాలను అందించడం ద్వారా వాతావరణ వ్యూహాలను వివిధ పద్ధతుల్లో పటిష్టం చేయొచ్చని పరిశోధనల్లో తేలింది.

ప్రైమరీ స్కూల్ విద్యను పూర్తి చేసిన వారితో పోలిస్తే, సెకండరీ స్కూల్ విద్యను పూర్తి చేసిన మహిళలు తమ జీవిత కాలంలో ఒక బిడ్డను తక్కువగా కలిగి ఉంటున్నారు.

బర్త్ రేట్‌ తగ్గడం వల్ల ఈ గ్రహానికి మేలు జరుగుతుంది. అధిక జనాభా వల్ల కర్బన ఉద్గారాల స్థాయి అధికంగా పెరుగుతుంది. జనాభాను కాస్త నియంత్రించడం వల్ల ఉద్గారాల పెరుగుదలను తగ్గించవచ్చు.

వాతావరణాన్ని సంరక్షించే నాయకులుగా మహిళలు, బాలికలు ఎదగడానికి విద్య ఉపయోగపడుతుంది. పార్లమెంట్‌లో ఎక్కువ సంఖ్యలో మహిళా సభ్యులు ఉన్న దేశాలు... అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలను ఆమోదించడంలో, సురక్షితమైన భూభాగాలను సృష్టించడంలో, కఠినమైన వాతావరణ మర్పు విధానాలను అమలు చేయడంలో ముందున్నట్లు అనేక పరిశోధనలు తెలిపాయి.

''సమాజంలో మహిళా విద్య, సాధికారత ఈ గ్రహానికి చాలా ముఖ్యమైనది. కేవలం వాతావరణ మార్పుల కోసం మాత్రమే వారికి ఈ అవకాశాలు దక్కకూడదు. ఇది నేను బతకాలి అనుకుంటున్న ప్రపంచం కాబట్టి వారికి ఈ అవకాశాలు దక్కాలి'' అని సుస్థిరత శాస్త్రవేత్త, ప్రొఫెసర్ కింబర్లీ నికోలస్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)