'మెటా': ఫేస్‌బుక్ కంపెనీకి కొత్త కార్పొరేట్ పేరు.. మార్క్ జుకర్‌బర్గ్ నిర్ణయానికి కారణాలేంటి? మెటావర్స్ అంటే ఏంటి?

కంపెనీ కొత్త లోగోతో మార్క్ జుకర్‌బర్గ్

ఫొటో సోర్స్, facebook/zuck

ఫొటో క్యాప్షన్, కంపెనీ కొత్త లోగోతో మార్క్ జుకర్‌బర్గ్

రీ బ్రాండింగ్‌లో భాగంగా ఫేస్‌బుక్ తన కార్పొరేట్ పేరును 'మెటా'గా మార్చింది.

సోషల్ మీడియాతోపాటూ వర్చువల్ రియాలిటీ వంటి రంగాల్లో కూడా తన పరిధిని విస్తరిస్తున్నందున, తాము నిర్వహించే అన్ని పనులను సూచించే పేరు ఉండటం మంచిదని కంపెనీ తెలిపింది.

ఫేస్‌బుక్, ఇన్​స్టాగ్రామ్, వాట్సాప్ వంటి వ్యక్తిగత ప్లాట్‌ఫాంలకు ఈ మార్పు వర్తించదు. కేవలం మాతృ సంస్థకు మాత్రమే వర్తిస్తుంది.

ఒక మాజీ ఉద్యోగి లీక్ చేసిన డాక్యుమెంట్ల ఆధారంగా ఫేస్‌బుక్‌పై నెగటివ్ కథనాలు వెలువడ్డాయి. ఈ సంఘటన తర్వాత కంపెనీ పేరు మార్పు నిర్ణయం తీసుకుంది.

కంపెనీ "భద్రత కంటే లాభాలకు" అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఫ్రాన్సెస్ హౌగెన్ ఆరోపించారు.

2015లో గూగుల్ తన కంపెనీ మాతృ సంస్థ పేరును 'ఆల్ఫాబెట్'గా మార్పు చేసింది. అయితే ఆ పేరుకి అంతగా గుర్తింపు లభించలేదు.

ఫేస్‌బుక్ మాతృసంస్థ పేరు మెటా గా మార్పు

ఫొటో సోర్స్, Getty Images

ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ "మెటావర్స్"ను రూపొందించే ప్రణాళికలను ఆవిష్కరించినప్పుడు ఈ కొత్త పేరును ప్రకటించారు. మెటావర్స్ అనేది వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌లతో గేమ్స్ ఆడటం, పని చేసుకోవడం, ఒకరితో మరొకరు కమ్యునికేట్‌ చేసుకునే ఆన్‌లైన్ ప్రపంచం.

ప్రస్తుతం ఉన్న బ్రాండ్‌ "బహుశా ఈ రోజు మనం చేస్తున్న ప్రతి పనికి భవిష్యత్తులో ప్రాతినిధ్యం వహించలేదు" అందుకే పేరు మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

"కాలక్రమేణా, మమ్మల్ని ఒక మెటావర్స్ కంపెనీగా చూస్తారని నేను ఆశిస్తున్నాను" అని జుకర్ బర్గ్ ఓ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు.

"మేం ఇప్పుడు మా వ్యాపారాన్ని రెండు వేర్వేరు విభాగాలుగా చూస్తున్నాం. ఒకటి ప్రస్తుత మా సొంత యాప్‌ల కోసం, మరొకటి భవిష్యత్ ప్లాట్‌ఫాంలలో చేయబోయే మా పని కోసం.’’

"దీనిలో భాగంగానే, మనం చేసే ప్రతి పనిని సూచించేలా కంపెనీ కొత్త బ్రాండ్ పేరు మార్చడానికి ఇది సరైన సమయం" అని జుకర్‌బర్గ్ అన్నారు.

కంపెనీ గురువారం కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్‌లోని ప్రధాన కార్యాలయంలో బ్లూ ఇన్ఫినిటీ ఆకారంలో ఉన్న కొత్త లోగోను కూడా ఆవిష్కరించింది.

కొత్త పేరు కాలక్రమేణా అందరికీ తెలుస్తుంది. కంపెనీ ఇతర సేవలను ఉపయోగించడానికి వినియోగదారులు ఫేస్‌బుక్‌ను వాడాల్సిన అవసరం లేదని జుకర్‌బర్గ్ అన్నారు.

మెటావర్స్ గురించి ఫేస్‌బుక్ ఇటీవల ప్రకటన చేయడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది

ఫొటో సోర్స్, Getty Images

మెటా అంటే ఏంటి? ఈ కంపెనీ ఏం చేస్తుంది?

"మెటా" అనే పదం గ్రీకు పదం నుండి వచ్చింది. దాని అర్థం "అంతకుమించి".

మెటావర్స్ ఓ వర్చువల్ రియాలిటీ వెర్షన్ లాగా కనిపించవచ్చు. కానీ కొంతమంది అది ఇంటర్నెట్‌ ప్రపంచానికి భవిష్యత్తుగా భావిస్తారు.

కంప్యూటర్‌ని వినియోగించడానికి బదులుగా, మెటావర్స్‌లోని వ్యక్తులు హెడ్‌సెట్‌ను ఉపయోగించి అన్ని రకాల డిజిటల్ ఎన్విరాన్‌మెంట్‌లను కనెక్ట్ చేసే వర్చువల్ ప్రపంచంలోకి ప్రవేశించవచ్చు.

వర్చువల్ ప్రపంచం పని, ఆట, కచేరీల నుండి స్నేహితులు, కుటుంబ సభ్యులతో ముచ్చటించడం వరకూ ఆచరణాత్మకంగా దేనికైనా ఉపయోగించొచ్చని భావిస్తున్నారు.

డిసెంబర్ 1 నుంచి కొత్త స్టాక్ టిక్కర్ ఎంవీఆర్​ఎస్​ కింద తన షేర్ల ట్రేడింగ్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఫేస్ బుక్ తెలిపింది.

లీకైన పత్రాలు

కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో వ్యాక్సీన్ గురించిన తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి పాలసీ మేకర్ల ముఖ్యమైన సమాచారాన్ని ఫేస్‌బుక్ నిలిపివేసిందని వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురించడంతో కంపెనీ అపఖ్యాతి పాలైంది.

తాజాగా మాజీ ఉద్యోగి హౌగెన్ మీడియాకు లీక్ చేసిన కంపెనీ అంతర్గత పత్రాల ఆధారంగా కథనాలు వెలువడ్డాయి. ఇతర విషయాలతోపాటు, ఇన్‌స్టాగ్రామ్ టీనేజర్ల మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తుందనే పరిశోధనపై మాత్రమే ఫేస్ బుక్ దృష్టి పెట్టినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అమెరికా వెలుపల తన ప్లాట్ ఫాంల నుంచి ద్వేషపూరిత ప్రసంగాలను తొలగించడంలో ఫేస్ బుక్ విఫలమైంది.

జుకర్‌బర్గ్ ఈ నివేదికలను "మా కంపెనీని తప్పుడుగా చిత్రించడానికి లీక్ అయిన డాక్యుమెంట్‌లను ఉపయోగించుకునేందుకు సమన్వయంతో చేసే ప్రయత్నం"గా అభివర్ణించారు.

కంపెనీ కొత్త లోగోతో మార్క్ జుకర్‌బర్గ్

ఫేస్‌బుక్ పేరును జుకర్‌బర్గ్ ఎందుకు మార్చారు?

బీబీసీ ఉత్తర అమెరికా టెక్నాలజీ రిపోర్టర్‌ జెమ్స్‌ క్లేటన్‌ విశ్లేషణ

ఓ కంపెనీకి పేరు పెట్టడానికి ప్రయత్నించడం కష్టం. గ్రీకులో దాని అర్థం "అంతకు మించి" అందుకే మెటాను ఎంచుకున్నట్లు జుకర్‌బర్గ్ చెప్పారు. ఇది ఆయన నిర్మించాలనుకుంటున్న ఆన్‌లైన్ వర్చువల్ ఒయాసిస్ అయిన "మెటావర్స్"ని కూడా సూచిస్తుంది.

ఫేస్‌బుక్‌ను మెటా అని పిలవడంలో ఎలాంటి సమస్యలు ఎదురుకానున్నాయో చూద్దాం.

ముందుగా, ఈ ప్రకటన వెలువడిన సమయం.. దీన్ని ఒక రీ-బ్రాండింగ్ ప్రక్రియలా మాత్రమే చూసేలా ఉంది. ప్రస్తుతం కంపెనీని చుట్టుముట్టిన ప్రతికూల కథనాల నుండి దృష్టిని మరల్చడం దీని ఉద్దేశం. బ్రాండ్‌పై ప్రతికూలత వచ్చినందున ఫేస్‌బుక్ ఇలా చేసిందని విమర్శకులు భావిస్తున్నారు. అందరూ రీ-బ్రాండ్‌ని గుర్తించకపోవచ్చు.

రెండోది, మెటావర్స్ ఇంకా ఉనికిలో లేదు. ఇది దీర్ఘకాలంలో ఉనికిలోకి వస్తుందని జుకర్‌బర్గ్ నొక్కి చెప్పారు. కాబట్టి ప్రధాన వ్యాపారానికి పూర్తిగా సంబంధం లేని పేరు కలిగి ఉండటం బహుశా కొంత వింతగా ఉంటుంది. ఫేస్‌బుక్‌ కంపెనీకి దాదాపుగా మొత్తం ఆదాయం ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్‌ల నుండి వెలువడే ప్రకటనల ద్వారా వస్తుంది.

మూడోది, ఇతర బిగ్ టెక్ రీ-బ్రాండ్‌లు విఫలమయ్యాయని మనకు తెలుసు. దాదాపు ఎవరూ గూగుల్‌ను"ఆల్ఫాబెట్" అని పిలవరు. 2015లో దాని పేరుని రీ-బ్రాండ్ చేశారు.

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను నడపడం మాత్రమే జుకర్‌బర్గ్‌కు ఆసక్తి కలిగించే విషయం కాదు. ఆయన కొత్త వర్చువల్ రియాలిటీ ఆన్‌లైన్ ప్రపంచాన్ని సృష్టించడంపై ఆసక్తిగా ఉన్నారు. ఆయన తన సోషల్ మీడియా సంస్థలను నడుపుతున్న తీరుపై వస్తున్న విమర్శలు పోవాలి. ఈ మార్పు, ఆయన ఆసక్తి చూపించే విభాగాలపై మరింత దృష్టి కేంద్రీకరించే సామర్థ్యాన్నిస్తుంది.

ఆ విషయంలో విభజన సమంజసమే. ఏది ఏమైనా జనాలు దానికి అండగా ఉంటారో లేదో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)