వైట్ మ్యారేజ్: ఇరాన్ జంటల్లో పెరుగుతున్న ఈ ధోరణి ఏమిటి.. వీరికి పుట్టే పిల్లలను అధికారికంగా గుర్తించరా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సర్బాస్ నజారీ
- హోదా, బీబీసీ న్యూస్
"నా కడుపులో ఉన్న బిడ్డను ఎలాగో ఒకలా వదిలించుకోవాలి. ఇప్పటి వరకు నేను జీవితంలో తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయం ఇదే" అని మిత్ర అన్నారు. ఈ 27 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్ టెహ్రాన్‌లో ఆమె భాగస్వామితో కలిసి నివసిస్తున్నారు.
మిత్ర 32 ఏళ్ల మోహ్సెన్‌తో కలిసి జీవిస్తున్నారు. ఆయన డాక్టర్. వారిద్దరూ "వైట్ మ్యారేజ్" అనే ఒప్పందంలో భాగంగా సహజీవనం చేస్తున్నారు.
ఒక అబ్బాయి అమ్మాయితో కలిసి సహజీవనం చేసేందుకు వారిద్దరి మధ్యా జరిగే ఒప్పందాన్ని వైట్ మ్యారేజ్ అని అంటారు.
ఇలాంటి సహజీవనాన్ని ఇరాన్‌లో ఉన్న కఠినమైన ఇస్లామిక్ చట్టాలు అంగీకరించవు. వైట్ మ్యారేజ్ ఒప్పందాలను వివాహానికి ముందు సెక్స్ తరహాలో చట్టవ్యతిరేకమైనవిగా పరిగణిస్తారు.
"మేం ఈ విధానంలో ఉండే సవాళ్ళను ముందుగానే అర్థం చేసుకున్నాం. కానీ, అప్పట్లో పిల్లలను కనే ఆలోచన లేదు" అని మిత్ర చెప్పారు.
కానీ, వారు మనసు మార్చుకున్నారు. న్యాయపరమైన సవాళ్ళను అధిగమించి పుట్టబోయే బిడ్డకు జన్మ ధ్రువీకరణ పత్రాన్ని పొందవచ్చని భావించారు. వారెంత ప్రయత్నించినప్పటికీ వారి ఆలోచన సఫలం కాలేదు. దాంతో, ఆమె అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్ సివిల్ కోడ్ 1167 ప్రకారం "వివాహేతర బంధాల ద్వారా జన్మించిన సంతానం ఆ జంటకు చెందదు".
అంటే అలా జన్మించిన బిడ్డపై ఆ తల్లితండ్రులకు ఎలాంటి హక్కులూ ఉండవు.
బిడ్డ బర్త్ సర్టిఫికేట్‌పై తన పేరు నమోదు చేయమని కోరే అవకాశం మాత్రం తల్లికి ఉంటుంది.
ఇలా జన్మించిన శిశువుల వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతారు. ఈ వివరాలు అధికారికంగా లేకపోవడంతో, అలాంటి పిల్లలు భవిష్యత్తులో కొన్ని రకాల ఉద్యోగాలు పొందేందుకు అర్హత కోల్పోతారు.
అయితే, ఇరాన్‌లో వైట్ మ్యారేజ్ సంబంధాల్లో ఉన్న వారి సంఖ్య గురించి అధికారిక లెక్కలేమీ లేవు. కానీ, ఇలాంటి సంబంధాలు ప్రస్తుతం సాధారణంగా మారిపోయాయి. ఇరాన్‌లో అధికారంలో ఉన్న అతివాద ప్రభుత్వానికి ఇవి పెద్ద సమస్యగా మారాయి.
ప్రస్తుతం వివాహేతర సంబంధాలలో పుట్టిన పిల్లల విషయంలో ఏం చేయాలనే సందిగ్థత అధికారులకు ఉంది.
"ఆ పిల్లలు స్కూలులో చేరాలంటే ఎప్పటికైనా వారి జనన ధ్రువీకరణ పత్రాలను తీసుకోవడం అవసరం. ఈ అంశం గురించి పట్టించుకోకపోవడం దారుణమైన పరిణామాలకు దారి తీయవచ్చు’’ అని యూత్ అఫైర్స్ డిప్యూటీ మినిస్టర్ మొహమ్మద్ మెహదీ టోన్డ్ గౌయాన్ ఐఎల్‌ఎన్‌ఏ వార్తా సంస్థతో అన్నారు.
‘గర్భస్రావం తప్ప వేరే మార్గం లేదా?’’
వైట్ మ్యారేజ్ వల్ల పుట్టిన పిల్లలకు సంబంధించిన అంశాలపై గత సెప్టెంబరులో సంఘ సంస్కర్త, ఫెమినిస్ట్ పర్వనేహ్ సలాహ్‌షౌరి హెచ్చరించారు.
చట్టం కఠినంగా ఉన్న పక్షంలో ఈ సంబంధాల్లో గర్భం దాల్చిన మహిళల ముందు గర్భస్రావం చేయించుకోవడం తప్ప వేరే మార్గం ఉండదని ఆమె అన్నారు.
ఆర్ధిక సవాళ్లు, వివాహానికి ముందు పూర్తి చేయాల్సిన కొన్ని క్లిష్టమైన తంతుల కారణంగా సంప్రదాయ తరహాలో వివాహాలు చేసుకోవడానికి ఇరాన్ యువత వెనుకాడుతోందని ఇరాన్‌లో అధికార వ్యవస్థ అభిప్రాయపడుతోంది.
అయితే, అలాంటివారు వివాహాలు చేసుకునేలా ప్రోత్సహించేందుకు, ఖర్చుల కోసం వడ్డీ లేని రుణాలను కూడా ఇస్తున్నట్లు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Borna News
"అది కేవలం పెయిన్ కిల్లర్ మాత్రమే" అని 31 సంవత్సరాల షీనా అంటారు. ఆమె హమేదాన్ నివాసి.
"గత కొన్నేళ్లుగా ఆకాశాన్నంటుతున్న ఇంటి అద్దెల గురించి మాట్లాడుతూ మెడలు విరిచే అద్దెల సంగతేమిటి" అని ఆమె ప్రశ్నించారు.
షీనా గత పదేళ్లుగా తన భాగస్వామి సదేగ్‌తో కలిసి సహజీవనం చేస్తున్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌లో అధికారులపై తిరుగుబాటు చేసేందుకు సహజీవనాన్ని ఒక విధానంగా మలుచుకుంటున్నారని ఆమె భావిస్తున్నారు.
"బలవంతపు వివాహపు ఒప్పందాలకు మేము లొంగడం లేదు" అన్నారామె.
"కొన్ని ప్రమాణాలు చేసుకోవడాన్ని తిరస్కరించినంత మాత్రాన మా సంబంధం చట్టబద్ధం కాకుండా పోతుందా?" అని ఆమె ప్రశ్నించారు.
ఇరాన్‌లో సహజీవనం చేసే జంటలు పెరుగుతున్నారనడానికి సోషల్ మీడియా వేదికలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే, ఇటువంటి సంబంధాల పట్ల ఉన్న సామాజిక భయం కూడా పోతున్నట్లు తెలుస్తోంది.
చాలా మంది తమ భాగస్వాముల కోసం వెతుక్కునేందుకు టెలిగ్రామ్ లాంటి యాప్‌లలోని చానళ్లు వేదికలుగా పని చేస్తున్నాయి.
అందులో ఒక చానల్‌కు 45,000కు పైగా మంది సబ్‌స్క్రై బర్లు ఉన్నారు. వారు తమకు తగిన భాగస్వామి దొరుకుతారనే ఆశతో వారి వ్యక్తిగత సమాచారాన్ని కూడా షేర్ చేస్తారు.
అయితే, ఇరాన్‌లోని అతివాదులు నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత వల్ల ఇలాంటి వర్చ్యువల్ సమాజాల భవితవ్యం మాత్రం ఊగిసలాడుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్ అధ్యక్షునిగా సంప్రదాయవాది ఇబ్రహీం రైసీ ఎన్నిక కావడంతో అతివాదులకు దేశ వ్యవహారాల్లో మరింత బలం చేకూరింది.
సైబర్ స్పేస్ సురక్షత, భద్రత కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన రెండు వారాల క్రితమే ఇరాన్ అత్యున్నత ఇంటర్నెట్ సూపర్ వైజరీ సంస్థకు ఆదేశాలిచ్చారు. మరిన్ని కఠినమైన నియంత్రణలు అమలులోకి రావడానికి ఇది సూచికగా కనిపిస్తోంది.
"మా కలలను చంపేశారు"
ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలు షీనా, సదేగ్‌కు మాత్రం చాలా నష్టం కలిగించాయి.
2016లో షీనా గర్భం దాల్చినప్పుడు పిల్లల్ని కనేందుకు ఇరాన్‌లో ఉన్న చట్టపరమైన సమస్యల వల్ల జర్మనీ వీసా కోసం దరఖాస్తు చేశారు. కానీ, వారికి వీసా లభించలేదు.
"మా కలలు భగ్నమయ్యాయి. ఇక మాకు అబార్షన్ చేయించుకోవడం ఒక్కటే మార్గంగా మిగిలింది" అని షీనా గుర్తు చేసుకున్నారు.
ఇరాన్‌లో అబార్షన్ చట్ట వ్యతిరేకం. గర్భం దాల్చడం తల్లి ప్రాణానికి హాని కలిగిస్తున్నా, లేదా పిండంలో తీవ్రమైన లోపాలు ఉన్నప్పుడు మాత్రమే గర్భస్రావం చేయించుకునేందుకు అనుమతిస్తారు. ఇటువంటి ఆంక్షలు ఉండటంతో మార్కెట్‌లో అబార్షన్ పిల్ కూడా లభించదు. దాంతో, చాలా మంది మహిళలు చట్ట వ్యతిరేకంగా చేసే, ఏమాత్రం సురక్షితం కాని గర్భస్రావాలు చేయించుకుంటూ ఉంటారు.
సహజీవనంలో ఉన్న కొంత మందికి తన ప్రైవేటు క్లినిక్‌లో చట్ట వ్యతిరేకంగా మూడు గర్భస్రావాలు చేసినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక స్త్రీ వైద్య నిపుణులు చెప్పారు.
అలాంటి జంటలకు అవకాశం ఉంటే ఇరాన్ వదిలి పెట్టి వెళ్ళడమొక్కటే మార్గం.
35 సంవత్సరాల పరి, ఆమె భాగస్వామి యాసిన్ దాచుకున్న డబ్బంతా టర్కీలో ఇస్తాంబుల్‌లో ఇల్లు కొనుక్కునేందుకు ఖర్చు పెట్టేశారు. ఇరాన్‌లో కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ, సాంఘిక రాజకీయ వాతావరణం కల్పిస్తున్న నిరుత్సాహం నుంచి తప్పించుకునేందుకు ఇస్తాంబుల్ ప్రముఖ కేంద్రంగా మారింది.
"నేను గర్భం దాల్చానని తెలిసిన మరుక్షణమే నేను ఆ బిడ్డను కనాలని నిర్ణయించుకున్నాను" అని పరి చెప్పారు. అంతకుముందొకసారి ఆమె గర్భస్రావం చేయించుకోవల్సి వచ్చింది.
"స్వదేశం వదిలిపెట్టి వెళ్లడం అంత సులభమైన విషయమేమి కాదు. కానీ, మాకు పుట్టిన బిడ్డను మేం పెంచాలని నిర్ణయించుకున్నాం" అని ఆమె గర్వంగా చెప్పారు.
"కానీ, నాలా సహజీవనం చేస్తూ పిల్లల్ని కనాలని కోరుకుంటున్న స్నేహితులకు ఆ అవకాశం దక్కడం లేదు. వారి గురించి మాత్రం ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- సెక్స్: మీ భార్య/భర్తను ఎలా ఆకట్టుకోవాలో మీకు తెలుసా?
- సెక్స్‌లో ఎంతసేపు పాల్గొన్నా భావప్రాప్తి కలగకపోవడానికి కారణమేంటి? ఇది వ్యాధి లక్షణమా?
- ‘డబ్బులు ఇవ్వకపోతే మీ కంప్యూటర్లో ఉన్న పోర్న్ వీడియోలు బయటపెడతాం’
- మెనోపాజ్: మలి వయసు మహిళల పోరాటమే ప్రధానాంశంగా నెట్‌ఫ్లిక్స్ సిరీస్, భారత సమాజం దీని గురించి ఎప్పటికి మాట్లాడగలదు?
- సెక్స్‌కు ఒకసారి ఒప్పుకుంటే... ప్రతిసారీ ఒప్పుకున్నట్లేనా?
- భారతీయ సంస్కృతిలో స్వలింగ సంపర్కులకు ఆమోదం ఉందా
- ఆన్లైన్ సెక్స్: స్పర్శ లేని లోటును తీరుస్తుందా?
- మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
- సెక్స్ వర్కర్స్‌ను కార్మికులుగా గుర్తించాలా... వారి వృత్తిని చట్టబద్ధం చేయడం సాధ్యమేనా?
- మగవాళ్ల ‘శీలం కాపాడే’ పరికరాన్నిసైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి లాక్ చేసే ప్రమాదం
- 'ఈ మగాళ్లంతా కేవలం నిన్ను కోరుకోగలరు... నేను మాత్రమే అనుభవించగలను'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








