భారతీయ సంస్కృతిలో స్వలింగ సంపర్కులకు ఆమోదం ఉందా

ఎల్ జి బి టి

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, భారతీయ సంస్కృతిలో స్వలింగ సంపర్కులకు ఆమోదం ఉందా?

"మన దేశం చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా అవకాశాలు ఉంటాయి. నాకు దేశం వదిలిపెట్టి వెళ్లాలని లేదు. ఇక్కడి చట్టాలు సేమ్ సెక్స్ వివాహాలకు‌ చట్టబద్ధత కల్పించకపోయినప్పటికీ, వివాహ చట్టాలను సవరించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేనప్పటికీ , నేను దేశం వదిలి వెళ్లాలని అనుకోవటం లేదు" అని రాఘవ్ బీబీసీకి చెప్పారు.

సేమ్ సెక్స్ మేరేజెస్‌కు చట్టబద్ధత కోరుతూ దాఖలైన అప్పీళ్లకు సంబంధించిన కేసులను ఇటీవల దిల్లీ హైకోర్టు విచారించింది. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పించడానికి వ్యతిరేకంగానే వాదించింది.

దేశంలో వివిధ మతాలకు చెందిన సంస్కృతులు, ఆచారాలకనుగుణంగా స్త్రీ పురుషుల మధ్య జరిగే వివాహాలకు చట్టబద్ధత ఉంది. "ప్రస్తుతం అమలులో ఉన్న వివాహ విధానంలో తల దూర్చి ఉన్న చట్టాలను సవరిస్తే అది అరాచకానికి దారి తీస్తుంది" అని కేంద్ర ప్రభుత్వం దిల్లీ హై కోర్టులో వేసిన అఫిడవిట్లో పేర్కొంది.

వివాహం చేసుకునే హక్కును ప్రాథమిక హక్కుల్లో చేర్చడానికి కూడా ప్రభుత్వం తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో స్వలింగ వివాహాలు భారతీయ విలువలు, సంస్కృతికి వ్యతిరేకమని పేర్కొంది.

సేమ్ సెక్స్ వివాహాలకు చట్టబద్ధత లేకపోవడం వలన చాలా మంది గే, లెస్బియన్ జంటలు విదేశాలకు వెళ్లి తమ వివాహాలను ఆ దేశాలలో నమోదు చేసుకుంటూ ఉంటారు. కొంత మంది విదేశాలలోనే స్థిరపడిపోతారు.

కానీ, రాఘవ్ అలా దేశం వదిలి వెళ్లిపోవాలని అనుకోవటం లేదు. ఆయన ఇక్కడే ఉండాలని అనుకుంటున్నారు. ఆయన మూడేళ్ళ పాటు భాగస్వామితో సంబంధంలో ఉన్న తర్వాత బెల్గామ్‌లో వివాహం చేసుకున్నారు. వారిరువురి కుటుంబాలు వారికి మద్దతిచ్చాయి.

వారిద్దరూ హిందూ సంప్రదాయ పద్దతిలో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వారికి వివాహం జరిగి 9 ఏళ్ళు కావస్తున్నా వారి వివాహం ఇంకా చట్టబద్ధంగా నమోదు కాలేదు.

సాధారణ దంపతులకు లభించే చట్టపరమైన హక్కులేవీ వారికి లభించవు. వారిద్దరూ వాళ్ల తల్లితండ్రులతోనే కలిసి ఉంటారు. వారి తల్లితండ్రులు కూడా వాళ్లని తమతోనే ఉండమని చెబుతారు.

lgbt

ఫొటో సోర్స్, AFP/Getty Images

ఫొటో క్యాప్షన్, భారతీయ సంస్కృతిలో స్వలింగ సంపర్కులకు ఆమోదం ఉందా?

"మన సమాజంలో ప్రేమ వివాహాలకు కూడా ఒక్కొక్కసారి వ్యతిరేకత ఎదురవుతుంది. సేమ్ సెక్స్ వివాహాలను గుర్తించడం ఇప్పట్లో తీరే లక్ష్యంగా కనిపించటం లేదు. మా ఊర్లో ఇప్పుడు వాతావరణం అంతా రెండు మతాల మధ్య విభజితమై ఉంది. ఈ పరిస్థితుల్లోసేమ్ సెక్స్ వివాహాలకు బహిరంగంగా మద్దతు తెలపడం కూడా ప్రమాదకరంగానే భావిస్తారు" అని రాఘవ్ అన్నారు.

రాఘవ్ వివాహం విషయం రహస్యంగానే ఉంచాల్సి వచ్చింది. వారిద్దరూ కేవలం స్నేహితులలాగే బయట తిరుగుతూ ఉంటారు. వారి వివాహానికి సాక్ష్యం లేదు. దీని వలన చాలా సమస్యలున్నాయని రాఘవ్ అంటారు.

"మా వివాహానికి చట్టబద్ధత లేకపోవడం వలన మేమిద్దరం కలిసి ఇల్లు కొనుక్కోలేం. మేము పిల్లలను సరోగసి ద్వారా కనేందుకు అనుమతి లేదు. మేము పిల్లలను పెంచుకోలేం".

"నా భాగస్వామితో కలిసి ఒక ఎల్ఐసి పాలసీ తీసుకోవాలని అనుకున్నాను. కానీ, మేము ఎల్ఐసి కి వెళ్లినప్పుడు మేమిద్దరం వివాహితులం కానీ, లేదా రక్త సంబంధీకులం కానీ అయి ఉండాలని చెప్పారు.

ఇద్దరూ కేవలం స్నేహితులే అయితే కలిసి పాలసీ తీసుకోవాల్సిన అవసరమేమిటని అధికారులు ప్రశ్నించినట్లు చెప్పారు. దాంతో, ఇద్దరూ పాలసీలను విడి విడిగా కొనుక్కునట్లు చెప్పారు.

అలాగే, వారిద్దరూ ఒకరి పేర్లను ఒకరు నామినేట్ కూడా చేసుకోలేరు. దాంతో నామినేషన్లో వారి తల్లితండ్రుల పేర్లు పెట్టాల్సి వచ్చింది.

"ఈ వివక్ష అధికారిక పత్రాల నుంచే మొదలయింది. ఇది ప్రతి చోటా ఉంది. మాకు ఒక సాధారణ దంపతులకుండే హక్కులేవీ ఉండవు" అని రాఘవ్ అన్నారు.

భారతీయ సంస్కృతిలో స్వలింగ సంపర్కులకు ఆమోదం ఉందా?
ఫొటో క్యాప్షన్, భారతీయ సంస్కృతిలో స్వలింగ సంపర్కులకు ఆమోదం ఉందా?

"మా ఊర్లో చాలా మంది సంకుచిత మనస్తత్వంతో ఉంటారు. మతం ప్రభావం పెరుగుతున్న రోజుల్లో మా సంబంధం గురించి బయటకు చెప్పాలంటే కూడా భయంగా ఉంటోంది. ఎల్‌జి‌బి‌టి హక్కులు పెద్ద నగరాలకే పరిమితం. నా గురించి ఆఫీసులో చెప్పినప్పుడు నన్ను తక్కువ చేసి చూడటం మొదలుపెట్టారు. దాంతో నేను ఉద్యోగం మారాల్సి వచ్చింది" అని రాఘవ్ చెప్పారు.

రాఘవ్ భాగస్వామి ఒక సీనియర్ హోదాలో ఉన్నారు. ఆయన కింద చాలా మంది పని చేస్తూ ఉంటారు. ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితానికి మధ్య పూర్తి విభజన పెట్టుకున్నారు.

ట్రాన్సజెండర్ కి స్వలింగ సంపర్కులకు మధ్య ఉండే తేడా కూడా చాలా మందికి తెలియదు. దీని గురించి బ్లాగ్ రాసి అవగాహన పెంచాలని రాఘవ్ అనుకున్నారు. కానీ, ఆయన తన ఆలోచనను విరమించుకున్నారు.

2017 - 2018 ప్రాంతంలో నగరంలో స్వలింగ సంపర్కులు ఎక్కువయ్యారని వారు సాధారణ ప్రజలను స్వలింగ సంపర్కులుగా మార్చేందుకు ఎర వేస్తున్నారనే లాంటి వార్తలు వచ్చాయి. నేను ఇది చదివి దిగ్భ్రాంతికి గురయ్యాను" అని రాఘవ్ చెప్పారు.

"ప్రస్తుతం మాకు చాలా భయంగా ఉంది. మేము మా కుటుంబాలతో చాలా నిజాయితీగా ఉన్నాము. కానీ, మేమెప్పుడూ ఒత్తిడితోనే ఉంటాం. మాకు కూడా సామాజిక ఆమోదం లభించేందుకు అవసరమైన చట్టాలు కావాలి. చట్టాలు ఉంటే మాకు కొన్ని హక్కులు వస్తాయి" అని రాఘవ్ అభిప్రాయ పడ్డారు.

ఇంద్రజీత్ ఘోర్పడే పూణెలో ఐటి ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఆయన గత మూడేళ్ళుగా ఒక వ్యక్తితో సంబంధంలో ఉన్నారు.

కానీ, దేశంలో సేమ్ సెక్స్ వివాహాలకు చట్టబద్ధత లేకపోవడం వలన ఆయనకు వృత్తిపరంగా ప్రభావం చూపింది.

రెండేళ్ల క్రితం ఆయనకు ఐర్లాండ్‌లో ఒక సంస్థ లో ఉద్యోగం లభించింది. అయితే, ఆయన భాగస్వామి గురించి చట్టపరమైన పత్రాలను చూపించమని ఆ సంస్థ కోరింది.

"మా బంధం గురించి నేను ఎటువంటి రుజువులు చుపించలేకపోయాను. దేశంలో సేమ్ సెక్స్ సంబంధాలను గుర్తించే చట్టాలు లేవు. మా బంధం నమోదు చేసుకునేందుకు ఎటువంటి చట్టాలు లేవు. దాంతో నేనా ఉద్యోగం వదులుకోవాల్సి వచ్చింది" అని చెప్పారు.

ఈ వివాహాలను నమోదు చేసుకునే వీలు లేకపోవడంతో మేము వివాహం కూడా చేసుకోలేం. దీంతో, ఇంద్రజిత్ విదేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడాలని అనుకుంటున్నారు. ఇది కేవలం సామాజిక వాతావరణం గురించే కాదు, దీని వలన మానసికమైన ప్రభావం కూడా ఉంటుంది" అని అన్నారు.

Inderjeet Ghorpade

ఫొటో సోర్స్, Inderjeet Ghorpade

ఫొటో క్యాప్షన్, ఇంద్రజీత్ ఘోర్పడే పూణెలో ఐటి ఇంజనీర్ గా పని చేస్తున్నారు

"మీ బంధానికి చట్టబద్ధత లేకపోవడం వలన మానసికంగా వేదనకు గురవుతాం. మేము బంధువులను కలిసినప్పుడు నా భాగస్వామిని నా బాయ్ ఫ్రెండ్ అని పరిచయం చేయాల్సి వస్తుంది. కానీ, మా బంధం అంత కంటే ఎక్కువ.

ఇప్పుడిప్పుడే తను నా భాగస్వామి అని పరిచయం చేయడం మొదలుపెట్టాను" అని ఇంద్రజీత్ చెప్పారు.

"సాధారణ దంపతులకు విదేశాలకు వీసా వెంటనే వచ్చేస్తుంది. కానీ, నాకు చాలా ఇబ్బందైంది. ఏ సంబంధంలో అయినా వైద్యపరమైన అత్యవసర సమయాలు, ఆస్తి విషయాల లాంటివి ఉంటాయి. కానీ, నా విషయంలో నా బంధం వృత్తిపరమైన సవాళ్ళను తెచ్చి ఒక పెద్ద ఆటంకంగా నిలిచింది. నేను చాలా అవకాశాలు వదులుకోవలసి వచ్చింది. లేదంటే, మేమెప్పుడో ఐర్లాండ్ లో స్థిరపడిపోయి ఉండేవాళ్ళం" అని ఇంద్రజీత్ అన్నారు.

54 సంవత్సరాల దీప్ ముంబయిలో ఉంటారు. ఆయన యాడ్ ఫిల్మ్ మేకర్. ఆయన యూనిసెఫ్ లాంటి సంస్థలకు పని చేస్తున్నారు.

కానీ, ఆయన జీవితంలో పెళ్లి చేసుకోలేకపోయినందుకు చింతిస్తున్నారు. నిజానికి ఆయనకు పెళ్లి చేసుకోవాలని ఉన్నప్పటికీ ఆయన పరిస్థితులు అనుకూలించలేదు.

"నాకు మొదట్లో నా మీద అనుమానం వచ్చేది. కొన్ని రోజులకు నేనేమిటో నాకర్ధమయింది. కానీ, నా ఇష్టాలకు భారతీయ చట్టాలలో ఆమోదం లేదు. నేనొక 'గే' ని కావడం వలన ఒక పెద్ద మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చింది" అని అన్నారు.

కొంత కాలానికి నాకు నచ్చిన ఒక భాగస్వామి దొరికారు, మేము వివాహం చేసుకోవాలని అనుకున్నాం, కానీ, అది భారతదేశంలో సాధ్యం కాదు. దాంతో, నా భాగస్వామి మేము విదేశాల్లో వివాహం చేసుకోవచ్చని సూచించారు.

కానీ, నా తల్లితండ్రులు అనారోగ్యంతో ఉండటంతో నాకు విదేశాలకు వెళ్ళడానికి కుదరలేదు. దాంతో నేను ఆ బంధం నుంచి బయట పడాల్సి వచ్చింది. నా భాగస్వామి కెనడాలో మరొకరిని వివాహం చేసుకున్నారు.

అయితే, ఇది పూర్తిగా అసాధ్యమైనది ఏమి కాదు. నా సోదరిలిద్దరూ నా తల్లితండ్రుల బాధ్యత తీసుకుని ఉంటే నేను వివాహం చేసుకుని ఉండేవాడిని. కానీ, వారిద్దరూ అలా చేయడానికి అంగీకరించలేదు.

lgbt
ఫొటో క్యాప్షన్, సేమ్ సెక్స్ వివాహాలకు భారతీయ చట్టాలలో ఆమోదం లేదు

నేను 'గే' అని తెలిసి కూడా నా సోదరులిద్దరూ నన్ను పెళ్లి చేసుకోమని చెప్పారు. వాళ్ళు నా పరిస్థితిని అవకాశంగా తీసుకున్నారు.

దాంతో నేను వృత్తిపరంగా కూడా దృష్టి పెట్టలేకపోయాను. నేను మరో భాగస్వామి కోసం వెతుక్కోలేదు.

నాకు కూడా జీవితం ఉంది. నాకు కూడా బతకాలని, ఆనందంగా ఉండాలని ఉంది.

నాకు ఒక్కొక్కసారి తీవ్రమైన మానసిక ఒత్తిడి వస్తుంది. ఇది నా శారీరక ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపింది.

"సేమ్ సెక్స్ వివాహాలను చట్టబద్ధం చేస్తూ చట్టాలు చేసిన వెంటనే సమాజం ఏమి మారిపోదు. కానీ, మాకు కూడా అందరితో సమానంగా జీవించే హక్కు వస్తుంది" అని భువనేశ్వర్‌కి చెందిన రుచా చెప్పారు.

రిచా ఆమె భాగస్వామిని వివాహం చేసుకోవాలని అనుకున్నారు. వారిద్దరూ గత 14 ఏళ్లుగా సంబంధంలో ఉన్నారు. వారు గత మూడేళ్ళుగా కలిసే ఉంటున్నారు.

కానీ, ఇందుకు రుచా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఆమె కుటుంబం ఆమెను ఇంటి నుంచి వెళ్లిపొమ్మని చెప్పింది. ఆమెకు కుటుంబం నుంచి రావల్సిన ఆస్తిలో హక్కు లేదని రాయించుకుని ఆమెను ఇంటి నుంచి పంపేశారు.

"నేను మొదటి నుంచి మా కుటుంబ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నాను. వ్యాపారంలో వచ్చే ఆదాయం అంతా బ్యాంకు అకౌంటులోకి వెళ్ళేవి. నా కోసం వేరేగా నేను డబ్బు పెట్టుకోలేదు.

కానీ, నా భాగస్వామి 2018 లో ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడినప్పుడు మా కుటుంబ సభ్యులకు మా సంబంధం గురించి తెలిసింది. నాకు అమ్మ, నాన్న లేరు. మా మామయ్య, అత్తయ్య నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. చట్టాలు నా వైపు ఉంటే నేను వారితో పోరాడి ఉండేదానిని" అని అన్నారు.

నేను నా భాగస్వామితో కలిసి ఒక జాబ్ కన్సల్టన్సీ ని కూడా మొదలు పెట్టాను.కానీ, నా భాగస్వామికి జరిగిన ప్రమాదంతో నేను మరో ఉద్యోగం వెతుక్కోవలసి వచ్చింది.

ఆ సమయంలో నా భాగస్వామి తల్లితండ్రులు నాకు మద్దతిచ్చారు. మేమిప్పుడు ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాం.

Women holding hands

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతీయ సంస్కృతిలో స్వలింగ సంపర్కులకు ఆమోదం ఉందా?

కానీ, ఈ కష్ట సమయంలో మేం ఒకరికి ఒకరు తోడుగా ఉండటం నాకు చాలా ఊరటనిస్తోంది" అని రుచా అన్నారు.

వీరి వివాహానికి చట్టబద్ధత లేకపోవడంతో వారు జాయింట్ ఎల్ఐసి పాలసీ కూడా తీసుకోలేరు.

ఒక సారి గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళినపుడు నేను నా భాగస్వామి వెంట ఎప్పుడూ ఎందుకు వస్తానని డాక్టర్ ప్రశ్నించారు.

కానీ, నేనేమి సమాధానం చెప్పలేకపోయాను.

నేనామెతో ఎందుకు ఉంటానని నా మగ స్నేహితులు అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఆమెను పెళ్లి చేసుకోమని అడుగుతూ ఉంటారు.

"అంటరానితనాన్ని రూపుమాపే చట్టాలున్నప్పటికీ అవి వాటిని రూపుమాపలేకపోయాయి. కానీ, అది పరిస్థితుల్లో కాస్త మార్పును తెచ్చింది. మాకు కూడా అలాంటి మార్పే వస్తుంది. ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పగల్గుతాం.

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించడానికి భారతీయ సంస్కృతి ప్రస్తావన తేవడం పట్ల రుచా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

"మహాభారతంలో సేమ్ సెక్స్ వివాహాలు కనిపించినప్పుడు అవి భారతీయ సంస్కృతి కాదని ఎలా అంటాం" అని ఆమె ప్రశ్నించారు.

"ఖజురహో దేవాలయాలు కూడా స్వలింగ సంపర్కులను చూపిస్తాయి" అని రుచా అన్నారు.

ఒక చట్టం మాకు ఎక్కువ రక్షణ కల్పించగలదు. అది మాకు సమానత్వం సాధించడానికి ఉపయోగపడుతుంది. మమ్మల్ని సమాజం తక్కువ చేసి చూస్తుంది. అని రుచా అన్నారు.

భారతీయ సంస్కృతిలో స్వలింగ సంపర్కులకు ఆమోదం ఉందా?

ఈ అంశం పై చాలా వాద ప్రతివాదాలు జరిగాయి.

మిగిలిన దేశాల్లో స్వలింగ సంపర్క సంబంధాల చట్టబద్ధత కోసం పోరాడాల్సి వచ్చింది. కానీ, ప్రాచీన భారతదేశంలో స్వలింగ సంపర్కులకు ఆమోదం ఉంది.

lgbt

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతీయ సంస్కృతిలో స్వలింగ సంపర్కులకు ఆమోదం ఉందా?

స్వలింగ సంపర్కులు, ట్రాన్స్ జెండర్‌‌లు భారతీయ సమాజంలో ఎప్పటి నుంచో ఉన్నారు అని అమర దాస్ విల్ హెల్మ్ " త్రితీయ ప్రాకృతి: పీపుల్ ఆఫ్ థర్డ్ సెక్స్ , అండర్ స్టాండింగ్ హోమో సెక్సువాలిటీ, ట్రాన్స్ జెండర్ ఐడెంటిటీ త్రూ హిందూయిజం" అనే పుస్తకంలో రాసారు.

ఒకప్పుడు స్వలింగ సంపర్క స్త్రీలను స్వరని అని పురుషులను క్లీవ్ అని పిలిచేవారని కామసూత్రలో ఉన్నట్లు అమర చెప్పారు. వారికి సమాజంలో ఆమోదం లభించేదని చెప్పారు.

గుప్తుల కాలంలో వాత్సాయనుడు రచించిన కామసూత్రలో స్వలింగ వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాల గురించి ప్రస్తావన ఉంది. స్త్రీ లక్షణాలు కలిగిన పురుషులను తప్పు చేసిన వారిలా చూసేవారు కాదు.

ఖజురహో దేవాలయాల్లో ఉన్న విగ్రహాలు ఇదే ఆలోచనను ప్రతిబింబిస్తాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)