క్వింటన్ డికాక్: ‘మోకాళ్లపై నిలబడనందుకు క్షమాపణలు.. నేను జాత్యాహంకారిని కాదు’

డికాక్, బవుమా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డికాక్ (ఎడమ), కెప్టెన్ తెంబా బవుమా

క్వింటన్ డికాక్, తాను జాత్యాహంకారిని కాదని పేర్కొంటూ, బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి సంఘీభావంగా మోకాళ్లపై కూర్చోనందుకు క్షమాపణలు చెప్పాడు.

దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ అయిన డికాక్.. మోకాళ్లపై కూర్చొని బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి సంఘీభావం తెలపలేనని పేర్కొంటూ ఏకంగా ఐసీసీ టి20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్‌తో మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు.

''నా జట్టుతో పాటు నా సొంత దేశ క్రికెట్ అభిమానులను క్షమాపణలు కోరుతున్నా. కేవలం నేను మోకాళ్లపై కూర్చోవడం వల్లే ఇతరులకు అవగాహన కలుగుతుంది, దీని వల్ల ఇతరుల జీవితాలు మెరుగుపడుతాయని అంటే అలా చేయడం నాకు సంతోషకరమే'' అని డికాక్ వ్యాఖ్యానించాడు.

డికాక్ లేఖ

ఫొటో సోర్స్, CRICKET SOUTH AFRICA/TWITTER

ఫొటో క్యాప్షన్, క్వింటన్ డికాక్ లేఖ

ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో తమ తొలి మ్యాచ్ సందర్భంగా కొంతమంది దక్షిణాఫ్రికా క్రికెటర్లు మోకాళ్లపై కూర్చొని సంఘీభావం తెలిపారు. ఆ మ్యాచ్‌లో డికాక్ 7 పరుగులు చేశాడు.

మంగళవారం వెస్టిండీస్‌తో మ్యాచ్ ప్రారంభానికి కొద్దిసమయం ముందు ఆటగాళ్లందరూ మోకాళ్లపై కూర్చొని సంఘీభావం తెలపాలని క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) ఆదేశించింది.

''ఎవరినో అగౌరవపరచాలనే ఉద్దేశంతో నేను వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు దూరం కాలేదు. ముఖ్యంగా వెస్టిండీస్ జట్టును అగౌరపరిచే ఉద్దేశమే నాకు లేదు.''

''వెస్టిండీస్‌తో మ్యాచ్ ఆడేందుకు మేమంతా సిద్ధమయ్యాక మాకు ఈ ఆదేశాలు వచ్చాయన్న సంగతి కొందరికి అర్థం కాదు.''

'' నా చర్య వల్ల మనసు గాయపడిన వారికి, ఏర్పడిన గందరగోళానికి, ఆగ్రహావేశాల పట్ల తీవ్రంగా చింతిస్తున్నా.''

''ఒక క్రికెటర్‌గా చాలా రకమైన మాటలు పడ్డాను. కానీ అవేవీ నన్ను బాధించలేదు. ఒక అపార్థం కారణంగా నన్ను జాత్యాహంకారి అని పిలవడం ఇప్పుడు తీవ్రంగా బాధిస్తోంది.''

''నా కుటుంబంతో పాటు గర్భిణీ అయిన నా భార్యను కూడా ఈ మాట గాయపరుస్తోంది.''

''నేను జాత్యాహంకారిని కాదు. నేనేంటో నా మనసుకు తెలుసు. నా గురించి తెలిసిన వారందరికీ నేను ఎలాంటి వాడినో తెలుసు'' అని డికాక్ వివరించాడు.

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు

ఫొటో సోర్స్, TWITTER

డికాక్ గతంలో కూడా ఈ విధంగా చేయడానికి నిరాకరించాడు. కానీ అప్పుడు దీనిపై ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్ధం పాటించాడు. కానీ ఈ ముఖ్యమైన అంశంపై పెదవి విప్పాల్సిన సమయమిదేనని భావించినట్లు డికాక్ తెలిపాడు.

''డికాక్ ద్వంద్వ వారసత్వం నుంచి వచ్చాడు, అతని సవతి తల్లి నల్లజాతీయురాలు'' అని డికాక్ తరఫున సీఎస్ఏ ప్రకటన విడుదల చేసింది.

''బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనేది ఇప్పుడొక అంతర్జాతీయ ఉద్యమం అయింది. కానీ నేను పుట్టినప్పటి నుంచే నాకు ఇది అత్యంత ప్రాధాన్యమైన అంశం'' అని డికాక్ చెప్పాడు.

''ఒక వ్యక్తి కంటే కూడా ప్రజలందరి హక్కులు, సమానత్వం అనేవి చాలా ముఖ్యమైనవి.''

''మనలో ప్రతీ ఒక్కరికి హక్కులు ఉంటాయని, అవి చాలా ముఖ్యమైనవని అర్థం చేసుకుంటూ నేను పెరిగాను.''

''కానీ సంఘీభావం తెలిపే అంశం గురించి మాకు చెప్పిన తీరుతో నా హక్కులకు భంగం కలిగినట్లుగా నాకు అనిపించింది.''

'' టోర్నమెంట్ ప్రారంభం అవ్వకముందే ఈ అంశం గురించి మాతో చర్చించి ఉంటే... ఎవ్వరికీ ఏ ఇబ్బంది కలగకుండా ఒక పరిష్కారం దొరికి ఉండేది.''

''మేం పూర్తిగా మా ఆటపై దృష్టి సారించి ఉండేవాళ్లం.''

''వరల్డ్ కప్‌లో మేం ఆడిన ప్రతీసారి ఏదో ఒక నాటకీయత చోటు చేసుకుంటుంది. ఇది కరెక్టు కాదు'' అని డికాక్ పేర్కొన్నాడు.

తర్వాతి మ్యాచ్‌లో అక్టోబర్ 30న, శ్రీలంకతో దక్షిణాఫ్రికా తలపడనుంది. ''ఒకవేళ కెప్టెన్ తెంబా బవుమా, టీమ్ నేను ఆడాలని కోరుకుంటే అంతకన్నా సంతోషం లేదు. దేశం కోసం ఆడటానికి మించి నేను ప్రేమించేది ఏదీ లేదు'' అని డికాక్ అన్నాడు.

దక్షిణాఫ్రికా క్రికెటర్లు, టీమ్ యాజమాన్యంతో బుధవారం సీఎస్ఏ సమావేశమైంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

''ప్రపంచకప్‌లో భాగంగా మిగిలిన మ్యాచ్‌లకు ముందు కూడా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తామని ఆటగాళ్లు అంగీకరించారు. అలాగే డికాక్ క్షమాపణ చెప్పారు'' అని సీఎస్ఏ ప్రకటించింది.

''ఇలాంటి ఉద్యమాలకు క్రికెట్ దక్షిణాఫ్రికా అండగా ఉంటుంది. జాతి వివక్షకు వ్యతిరేకంగా మేం నిబద్ధులమై ఉంటాం. ఈ అంశంపై కలిసికట్టుగా ఉండటం అనేది నైతిక అంశం. ఇది రాజకీయ ప్రయోజనాలకు సంబంధించింది కాదు.''

''కానీ అనువుకాని సమయంలో ఆదేశాలు జారీ చేయడం పట్ల సీఎస్ఏ చింతిస్తోంది. అందువల్లే వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు గందరగోళానికి గురయ్యారు'' అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)