ఆంధ్రప్రదేశ్: కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 50 వేలు - దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - ప్రెస్ రివ్యూ

కరోనా మృతులు

ఫొటో సోర్స్, DEFODI IMAGES/GETTY

కోవిడ్‌తో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 50వేలు పరిహారంగా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులిచ్చినట్లు 'సాక్షి' వెల్లడించింది.

''మృతిచెందిన వారి భార్యా పిల్లలు లేదా రక్తసంబంధీకులకు ఈ పరిహారం చెల్లిస్తామని సింఘాల్ ప్రకటించారు.

ఇప్పటికే దీనిపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. దీనికోసం జిల్లా స్థాయిలో సీడీఏసీ (కోవిడ్ డెత్ సర్జయినింగ్ కమిటీ)ని ఏర్పాటు చేస్తారు.

బాధితులు జిల్లా రెవెన్యూ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ చేసి జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు.

ఈ సొమ్మును స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి నిబంధనల మేరకు చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకున్న రెండు వారాల్లోగా ఈ సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది.

కాగా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో భాగమైన పీఎంజీకేపీ నుంచి గానీ, రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రులను కోల్పోయిన అనాథపిల్లలకు ఇచ్చే పరిహారం కానీ పొందితే ఈ రూ. 50వేలు ఇవ్వరు.

దీనికి సంబంధించి వారానికోసారి కోవిడ్ మృతుల వివరాలను ఆయా జిల్లా వైద్యాధికారులు నివేదిక సమర్పించాలని'' సాక్షి కథనం పేర్కొంది.

గొర్రెలు

ఫొటో సోర్స్, AFP/GETTYIMAGES

వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్: మాంసం కొనేముందు పారాహుషార్...

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండలో ఇటీవల 4 గొర్రెలు ఆంత్రాక్స్ వ్యాధితో మృతి చెందడంతో, తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ ఆ చుట్టుపక్కల వందలాది గొర్రెలు, మేకలకు టీకాలు వేయడం ప్రారంభించిందని 'ఈనాడు' కథనం పేర్కొంది.

''రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కడా బయటపడకపోయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ సూచించింది.

మేక లేదా గొర్రె మాంసం కొనేముందు, ఆ జీవాలన పశువైద్యులు తనిఖీ చేశారో? లేదో నిర్ధారించుకోవాలని... వారు చెప్పింది నమ్మశక్యంగా లేకపోతే జీవాలను కోసిన ప్రాంతాన్ని ఒకసారి చూడాలని సూచించింది.

జీవాలను కోసినప్పుడు వెలువడే రక్తం వెంటనే గడ్డకట్టకుండా ద్రవరూపంలో ఉంటే ఆ జీవానికి ఆంత్రాక్స్ సోకినట్లు గుర్తించాలని తెలిపింది. వ్యాధిగ్రస్తమైన జీవాల మాంసాన్ని తినడం, తాకడం, అమ్మడం చేయొద్దని ప్రజలకు, గొర్రెల కాపరులకు, విక్రేతలకు స్పష్టం చేసింది.

కనీసం వంద డిగ్రీల ఉష్ణోగ్రతలో బాగా ఉడికించిన మాంసాన్నే తినాలి. సరిగా ఉడకకపోతే ఎట్టిపరిస్థితుల్లోనూ తినరాదు'' అని భారత మాంసం పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త బసవారెడ్డి తెలిపినట్లు'' ఈనాడు పేర్కొంది.

సినీ నటి సమంత

ఫొటో సోర్స్, SAMANTHA/FACEBOOK

సమంత వ్యక్తిగత వివరాలు ప్రసారం చేయొద్దు

సినీ నటి సమంత వ్యక్తిగత వివరాలను ఎవరూ యూట్యూబ్ చానెళ్లలో ప్రసారం చేయొద్దని కూకట్‌పల్లి కోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసినట్లు 'నమస్తే తెలంగాణ' వెల్లడించింది.

''సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేయడంపై సమంత ఇటీవల కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించారు. ఓ వైద్యుడితోపాటు మరో మూడు యూట్యూబ్‌ చానళ్లపై పరువునష్టం దావా వేశారు.

అక్కినేని నాగచైతన్యతో తన వైవాహిక జీవితంపై యూట్యూబ్‌ చానళ్లలో ఓ వైద్యుడు తప్పుడు ప్రచారం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అబద్ధపు వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మీడియా, పత్రికల ద్వారా బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని కోర్టును కోరారు.

వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను ఉల్లంఘించడం తగదని, ఇక నుంచి సమంతపై దుష్ప్రచారం చేయకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని, ఆమెను అగౌరపరిచే ఇంటర్వ్యూలను తొలగించేలా ఆదేశాలివ్వాలని సమంత తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు.

గతంలో ప్రసారమైన యూట్యూబ్‌ లింక్స్‌ తొలిగించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు వ్యక్తిగత వివరాలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయొద్దని సమంతకు సూచించినట్లు'' నమస్తే తెలంగాణ తెలిపింది.

వరవరరావు

ఫొటో సోర్స్, VIRASAM.ORG

వరవరరావుకు మరింత ఊరట

ఎల్గార్‌ పరిషద్‌ కేసులో నిందితుడైన కవి వరవరరావుకు మరికొంతకాలం ఊరట లభించిందని 'ఆంధ్రజ్యోతి' వెల్లడించింది.

''నవంబరు 18వరకు ఆయన తలోజా జైలు అధికారుల ఎదుట లొంగిపోనక్కర్లేదని బాంబే హైకోర్టు మంగళవారం తెలిపింది.

అస్వస్థత కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఆయనకు హైకోర్టు మెడికల్‌ బెయిలు మంజూరు చేసింది. సెప్టెంబరు 5న ఆయన జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది.

తన మెడికల్‌ బెయిలును పొడిగించాల్సిందిగా కోరుతూ వరవరరావు గత నెలలో హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. స్వస్థలమైన హైదరాబాద్‌లో ఉండేందుకు ఆయన అనుమతి కోరారు.

సమయభావం కారణంగా ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. మెడికల్‌ బెయిలు సమయంలో స్వస్థలంలో ఉండేందుకు అనుమతి కోరుతూ విడిగా మరో వ్యాజ్యం వేయాల్సిందిగా ధర్మాసనం వరవరరావుకు సూచించినట్లుగా'' ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)