జనరల్ ఇందర్‌జీత్ సింగ్ గిల్: ఇందిరాగాంధీ మీటింగ్ నుంచి మధ్యలో వెళ్లిపోయిన సైన్యాధికారి

జనరల్ ఇందర్‌జీత్ సింగ్ గిల్

ఫొటో సోర్స్, PENGUIN VIKING

ఫొటో క్యాప్షన్, జనరల్ ఇందర్‌జీత్ సింగ్ గిల్
    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

1971లో పాకిస్తాన్‌కు మద్దతుగా చైనా యుద్ధంలోకి అడుగుపెడుతుందేమోనన్న ఆందోళన భారత్‌ను వెంటాడుతూనే ఉంది. దీని కోసం భూటాన్ సరిహద్దుల్లో 5, 123, 167 మౌంటెయిన్ బ్రిగేడ్లను జనరల్ మానెక్‌షా మోహరించారు.

అయితే, ఈ బ్రిగేడ్లను బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి పంపాలని దిల్లీలోని సైనిక ప్రధాన కార్యాలయంలో ఉన్న మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఇందర్‌జీత్ సింగ్ గిల్‌ను తూర్పు కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ జాకబ్ కోరారు.

మానెక్‌షా వ్యతిరేకిస్తున్నప్పటికీ, జాకబ్ ప్రతిపాదనకు గిల్ అంగీకరించారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న తూర్పు కమాండ్ ఛీఫ్ జనరల్ జగ్‌జీత్ సింగ్ అరోరా వెంటనే జనరల్ మానెక్‌షాకు సమాచారం అందించారు.

దీంతో రెండు గంటల్లోనే మానెక్‌షా ఒక సందేశం పంపించారు. ‘‘ఉత్తర సరిహద్దుల నుంచి ఈ బ్రిగేడ్లను తరలించాలని మీకు ఎవరు చెప్పారు? తక్షణమే ఆ బ్రిగేడ్లను అక్కడకు పంపించండి’’అని ఆయన సందేశంలో ఆదేశించారు.

ఆ సందేశాన్ని చూడగానే జనరల్ అరోరా కాలి కింద భూమి కదిలినట్లు అనిపించింది. మానెక్‌షా సందేశాన్ని చేతిలో పట్టుకుని ఆయన జనరల్ జాకబ్ గదిలోకి అడుగుపెట్టారు.

జనరల్ ఇందర్‌జీత్ సింగ్ గిల్

ఫొటో సోర్స్, PENGUIN VIKING

ఫొటో క్యాప్షన్, సర్వ్‌శ్రేష్ఠ్ పారాట్రూపర్ మెడల్ అందుకుంటున్న జనరల్ ఇందర్‌జీత్ సింగ్ గిల్

ఈ విషయాలను ‘‘సరెండర్ ఎట్ ఢాకా: బర్త్ ఆఫ్ ఎ నేషన్’’ పుస్తకంలో జనరల్ జాకబ్ వివరించారు. ‘‘ఆ సందేశం చూసిన వెంటనే, నేను గిల్‌కు ఫోన్ చేశాను. ఆ బ్రిగేడ్లను మనం వెనక్కి పంపడానికి వారాలు పడుతుందని, అందుకే వాటిని వెనక్కి తీసుకెళ్లడం కుదరదని వివరించాను’’అని జాకబ్ వివరించారు.

‘‘చైనా ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్‌కు మద్దతుగా యుద్ధంలోకి దిగదనే భరోసాను మనం మానెక్‌షాకు ఇవ్వాలి. ఇదే మన ముందున్న మార్గం అని గిల్‌తో అన్నాను. నా మాటలకు గిల్ అంగీకరించారు. అయితే, ఆయన అనుమతి లేకుండా తూర్పు పాకిస్తాన్‌లో ఈ బ్రిగేడ్లను ఉపయోగించకూడదని నా నుంచి గిల్ మాట తీసుకున్నారు.’’

‘‘ఈ విషయంపై నేను, గిల్ కలిసి చాలాసార్లు మానెక్‌షాకు సందేశాలు పంపించాం. చైనా జోక్యం చేసుకోదని బలగాలను ఉపయోగించేందుకు అనుమతించాలని వివరించాం.’’

‘‘అంతకుముందే, గిల్ సూచనలపై 123 బ్రిగేడ్‌ను పశ్చిమ సరిహద్దుల్లోకి పంపించాం. అక్కడ భారత బలగాలు పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. దీంతో పరిస్థితులను అర్థం చేసుకున్న గిల్.. వెంటనే అక్కడకు 123 బ్రిగేడ్‌ను పంపించాలని నిర్ణయించారు. పరిస్థితులను అర్థం చేసుకోవడంలో, వెంటవెంటనే నిర్ణయాలు తీసుకోవడంలో గిల్‌ మేధస్సు అద్భుతంగా పనిచేస్తుంది’’అని జాకబ్ వివరించారు.

మానెక్‌షా

ఫొటో సోర్స్, MANOHAR PUBLICATIONS

ఫొటో క్యాప్షన్, జనరల్ మానెక్‌షా

మానెక్‌షా ఆగ్రహం

ఈ విషయాలను జనరల్ ఇందర్‌జీత్ గిల్ ఆత్మకథ ‘‘బోర్న్ టు డేర్’’లోనూ ఎస్ ముత్తయ్య ప్రస్తావించారు. ‘‘గిల్.. మానెక్‌షా ఆగ్రహాన్ని చూడాల్సి వచ్చింది. అయితే, గిల్ మాత్రం తన మాట మీదే నిలబడ్డారు’’అని పేర్కొన్నారు.

‘‘ఢాకాపై ఒత్తిడి పెంచేందుకు 5, 167 బ్రిగేడ్లను వెంటనే మోహరించాలని జాకబ్ సూచించారు. దీంతో వెంటనే అలానే చేద్దామని గిల్ అన్నారు. ఈ నిర్ణయానికి ఆయన పూర్తి బాధ్యత తీసుకున్నారు. ఒకవేళ ఈ బ్రిగేడ్లను వేరే ఎక్కడైనా మోహరించాలని మానెక్‌షా భావిస్తే, వెంటనే వీటిని వెనక్కి తీసుకొచ్చేద్దామని జాకబ్‌తో గిల్ అన్నారు.’’

‘‘ఈ విషయం తెలుసుకున్న మానెక్‌షా కోపం నషాలానికి అంటింది. అయితే, గిల్ మాత్రం తను తీసుకున్న నిర్ణయం సరైనదేనని వివరించారు. అయితే, మీరు అనుమతిస్తేనే, ఈ బలగాలను యుద్ధంలోకి పంపుతామని మానెక్‌షాకు హామీఇచ్చారు.’’

జనరల్ ఇందర్‌జీత్ సింగ్ గిల్

ఫొటో సోర్స్, PENGUIN VIKING

ముక్తివాహిణికి శిక్షణ

తూర్పు పాకిస్తాన్‌లో సైనిక చర్యలు మొదలైనప్పుడు మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్‌గా కేకే సింగ్ ఉండేవారు. అయితే, ఆగస్టు 1971లో జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఆఫ్ కోర్‌గా ఆయనకు పదోన్నతి వచ్చింది.

అయితే, ఆ పదవిలోకి జనరల్ ఏ వోరాను తీసుకోవాలని మానెక్‌షా భావించారు. అయితే, ఆ సమయంలో బ్రిటన్‌లో ఓ సైనిక కోర్సులో వోరా ఉన్నారు. దీంతో ఆ పదవి గిల్‌కు దక్కింది.

ఏప్రిల్ 1971లో మిలిటరీ ట్రైనింగ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి గిల్ ఒక నివేదిక సమర్పించారు. శరణార్థులుగా వస్తున్న తూర్పు పాకిస్తాన్‌కు చెందిన బెంగాలీ యువతకు శిక్షణ ఇవ్వడం గురించి ఆయన దీనిలో ప్రస్తావించారు. అజ్ఞాతంలోనున్న అవామీ లీగ్ ప్రభుత్వానికి వీరు సహాయ పడతారని సూచించారు.

ఈ సూచనపై స్పందిస్తూ 1971, మే 1న మానెక్‌షా ఆదేశాలను జారీచేశారు. తూర్పు పాకిస్తాన్‌కు చెందిన ముక్తివాహిణి యువతను గెరిల్లా పోరాటానికి సిద్ధంచేసేలా శిక్షణ ఇవ్వాలని తూర్పు కమాండ్ ఛీఫ్ జగ్‌జీత్ సింగ్ అరోరాకు ఆయన సూచించారు.

జనరల్ ఇందర్‌జీత్ సింగ్ గిల్

ఫొటో సోర్స్, PENGUIN VIKING

ముందే యుద్ధక్షేత్రంలోకి...

సెప్టెంబరు 30నాటికి 2,000 మంది గెరిల్లా పోరాట యోధుల్ని సిద్ధం చేయాలని సైన్యం లక్ష్యం నిర్దేశించుకుంది. అయితే ఈ లక్ష్యం ఆ తర్వాత నెలకు 12,000కు, ఆ తర్వాత 20,000కు పెరిగింది.

అక్టోబరు-నవంబరు మధ్యనాటికి ముక్తివాహిణి ఫైటర్ల ప్రభావం యుద్ధ క్షేత్రంలో కనిపించింది. వారు చిన్నచిన్న వంతెనలను కూల్చివేసేవారు. పాకిస్తానీ పడవలు ముగినిపోయేలా చేసేవారు. కొందరు పాకిస్తానీ సైనిక వాహనాలు, పోలీస్ స్టేషన్లపైనా దాడులు చేసేవారు.

ఈ విషయాన్ని తూర్పు పాకిస్తాన్ కమాండర్ తన పుస్తకం ‘‘ద బిట్రేయల్ ఇన్ ఈస్ట్ పాకిస్తాన్’’లో రాసుకొచ్చారు. ఈద్ పర్వదనం రోజు, నవంబరు 20-21 అర్ధరాత్రి, భారత్‌తో యుద్ధం మొదలైందని ఆయన వివరించారు.

‘‘ఆరోజు భారీ బెటాలియన్లతో భారత్ సరిహద్దులు దాటి వచ్చింది. యుద్ధ ట్యాంకులు, ఫిరంగులను కూడా భారత సైనికులు తీసుకువచ్చారు. వారికి ముక్తివాహిణి సేనలు సహాయం చేశారు. అధికారికంగా యుద్ధం ప్రకటించేటానికి, అంటే డిసెంబరు 3కు ముందే, దాదాపు 4,000 మంది పాకిస్తానీ సైనికులు యుద్ధంలో మరణించారు.’’

పాకిస్తాన్ దాడిపై ముందే సమాచారం

పాకిస్తాన్‌తో యుద్ధం డిసెంబరు 3న మొదలైంది. అయితే, పాక్ దాడి చేయబోతోందని గిల్‌కు ముందే తెలుసు.

మిలిటర్ ట్రైనింగ్ డైరెక్టర్‌గా పనిచేసేటప్పుడు, విదేశీ దౌత్య కార్యాలయాలతో గిల్ మంచి సంబంధాలు కొనసాగించేవారు. మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా అయిన తర్వాత విదేశీ ప్రతినిధులతో సమావేశాలపై ఆంక్షలు ఉండేవి. అయితే, పాత మిత్రులతో గిల్ తన స్నేహాన్ని కొనసాగించారు.

1971 నవంబరు 30 సాయంత్రంనాడు గిల్‌కు ఆస్ట్రేలియా ప్రతినిధి నుంచి ఫోన్ వచ్చింది.

‘‘24 గంటల్లో పిల్లలు, మహిళలంతా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పాకిస్తాన్‌లోని దౌత్య కార్యాలయాల సిబ్బందికి సూచించారు. ఏదో పెద్ద పరిణామమే జరగబోతోంది. బహుశా పాకిస్తాన్ నేరుగా దాడి చేసేందుకు సిద్ధమై ఉండొచ్చు’’అని ఫోన్‌లో గిల్‌కు ఆస్ట్రేలియా ప్రతినిధి చెప్పారు.

ఈ విషయాన్ని వెంటనే మానెక్‌షాకు గిల్ తెలియజేశారు. ఆ తర్వాత అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి ఈ సమాచారాన్ని మానెక్‌షా అందించారు.

‘‘డిసెంబరు 4న మధ్యాహ్నం రెండు గంటలకు పాకిస్తాన్‌పై దాడి చేయాలని ఇందిర, మానెక్‌షా నిర్ణయించారు. అయితే, డిసెంబరు 3న సాయంత్రం భారత వైమానిక స్థావరాలపై పాకిస్తానీ యుద్ధ విమానాలు దాడులు చేశాయి’’అని ముత్తయ్య తన పుస్తకంలో రాసుకొచ్చారు.

‘‘పాకిస్తానీ దాడుల వల్ల భారత్‌కు పెద్దగా నష్టం సంభవించలేదు. అయితే, దాడి మొదట చేసింది పాకిస్తానేనని ప్రపంచం మొత్తానికి చెప్పే అవకాశం భారత్‌కు దొరికింది.’’

జనరల్ ఇందర్‌జీత్ సింగ్ గిల్

ఫొటో సోర్స్, PENGUIN VIKING

ఫొటో క్యాప్షన్, పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకుంటున్న గిల్

దాడులు జరిగేటప్పుడు..

1971, డిసెంబరు 3న సాయంత్రం ఐదు గంటలకు డీఎంవో ఆపరేషన్ రూమ్‌లో సమావేశం జరుగుతోంది. తాజా పరిస్థితులపై గిల్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులకు సీనియర్ మిలిటరీ ఆఫీసర్లు సమాచారం ఇస్తున్నారు.

ఆనాటి పరిస్థితులపై మానిక్‌షా మిలిటరీ అసిస్టెంట్ డీపీ సింగ్ తన ఆత్మకథ ‘‘శామ్ మానిక్‌షా సోల్జరింగ్ విత్ డిగ్నిటీ’’ పుస్తకంలో రాసుకొచ్చారు. ‘‘ఒక్కసారిగా రక్షణ శాఖ కార్యదర్శి కేబీ లాల్ గదిలోకి వచ్చారు. పశ్చిమ సెక్టార్‌లో పాకిస్తానీ బాంబర్లు దాడులు చేపడుతున్నారని చెప్పారు.’’

‘‘అధికారులంతా ఆపరేషన్ రూమ్‌లోనే ఉండటంతో, పశ్చిమ కమాండ్ చీఫ్‌కు సీనియర్ అధికారులతో మాట్లాడటం వీలుకాలేదు. ఈ విషయంలో అసంతృప్తికి గురైన పశ్చిమ కమాండ్ చీఫ్.. ఆ విషయాన్ని రక్షణ శాఖ కార్యదర్శికి తెలియజేశారు.’’

‘‘ఆపరేషన్ రూమ్‌లోనూ ఒక టెలిఫోన్ ఏర్పాటుచేయాలని గిల్‌కు మానెక్‌షా సూచించారు. ఆ తర్వాత యుద్ధ కార్యకలాపాల్లో గిల్, ఆయన సిబ్బంది నిమగ్నమయ్యారు. కొద్దిసేపటి తర్వాత, తన భార్య మోనాకు గిల్ ఫోన్‌చేసి తను రాత్రికి ఇంటికి రాబోవడంలేదని చెప్పారు.’’

భార్య మోనాతో గిల్

ఫొటో సోర్స్, PENGUIN VIKING

ఫొటో క్యాప్షన్, భార్య మోనాతో గిల్

13 రోజులు శాండ్‌విచ్‌లే ఆహారం

యుద్ధ సమయంలో గిల్ కార్యాలయంలో లెఫ్టినెంట్ కల్నల్‌గా సీఏ బెరెటో పనిచేశారు. ఆనాటి సంగతులను బెరెటో గుర్తుచేసుకున్నారు. ‘‘మేం పనిచేయడం మొదలుపెట్టినప్పుడు, భోజనం గురించి ఎవరూ ఆలోచించేవారు కాదు. నిజానికి సైనిక ప్రధాన కార్యాలయంలో క్యాంటీన్ సాయంత్రం ఆరు తర్వాత ఉండేది కాదు.’’

‘‘అయితే, రాత్రి భోజనం సమయానికి మా ముందు శాండ్‌విచ్‌లు, వేడి కాఫీ కప్పులు ఉండేవి. వీటిని గిల్ భార్య మోనా పంపేవారు. యుద్ధం మొదలైనప్పటి నుంచీ గుడ్లు, బ్రెడ్డు, శాండివిచ్ ఫిల్లింగ్స్ అందరికీ సరిపోయేలా గిల్ తెప్పించేవారు.’’

‘‘యుద్ధం ముగిసేవరకు ఒక్కసారి కూడా గిల్ ఇంటికి పోలేదు. ఆయన భార్య పంపిన శాండ్‌విచ్‌లు తింటూ అలానే పనిచేసేవారు.’’

జనరల్ ఇందర్‌జీత్ సింగ్ గిల్

ఫొటో సోర్స్, PENGUIN VIKING

కొత్త విధానాలు..

మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా గిల్ బాధ్యతలు తీసుకున్న తర్వాత, తన కార్యాలయంలో కొత్త పని విధానాలను గిల్ ప్రోత్సహించారు.

తన బ్రీఫ్‌కేస్‌ను రోజూ తానే మోసుకుంటూ ఆఫీస్‌కు వచ్చేవారు. నా బ్రీఫ్‌కేస్ మోసుకోవడానికి ఎవరి సహాయమూ అవసరంలేదని తన సహోద్యోగి నేగికి ఆయన చెప్పేవారు.

తను బాధ్యతలు తీసుకున్న మొదటిరోజే, ఎవరైనా ఏదైనా చెప్పాలి అనుకుంటే, ‘‘సరళమైన ఇంగ్లిష్‌లో సూటిగా చెప్పాలి’’అని తన చేతితో రాసిన ఒక నోట్‌ను పంపించారు. కఠినమైన పదజాలాన్ని వీలైనంతవరకు వాడొద్దని ఆయన సూచించేవారు. ఇలా ఆయన తీసుకొచ్చిన విధానాలు చాలానే ఉన్నాయి.

‘‘ఒకరోజు సాయంత్రం గిల్ బాగా అలసిపోయారు. తన డెస్కు దగ్గర కూర్చున్నప్పుడు ఆయన కళ్లు మూతలుపడ్డాయి. ఆ సమయంలో మానెక్‌షా తన గదిలోకి అడుగుపెట్టారు. ఒక బ్రిగేడ్ తరలింపుపై సమాచారాన్ని గిల్‌కు మానెక్‌షా అడిగారు’’అని గిల్ ఆత్మకథలో ముత్తయ్య రాసుకొచ్చారు.

‘‘మూడు గంటలకు బ్రిగేడ్ ఇక్కడి నుంచి బయలుదేరి పశ్చిమ సరిద్దులవైపు వెళ్లింది’’అని గిల్ చెప్పారు. అయితే, ఇప్పుడు ఆ బ్రిగేడ్ ఎక్కడుంది? అని సూటిగా మానెక్‌షా అడిగారు. ‘‘ట్రైన్‌లో ఉంది’’అని చెప్పి గిల్ మళ్లీ కళ్లు మూసుకున్నారు.

‘‘ఇలానే మరోసారి ఆయన నిద్రపోతూ కనిపించారు. సరిహద్దుల్లో ఏం జరుగుతోందని ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ ఒకసారి ఆయనకు ఫోన్ చేశారు. నేను కలలో నా భార్యను చూస్తున్నానని గిల్ చెప్పారు. సరిహద్దుల్లో ఏవైనా ఆసక్తికరమైన పరిణామాలు జరిగితే, నేను చెప్తాను లెండి అని గిల్ ఫోన్ పెట్టేశారు.’’

జనరల్ ఇందర్‌జీత్ సింగ్ గిల్

ఫొటో సోర్స్, PENGUIN VIKING

ఫొటో క్యాప్షన్, ఇందిరా గాంధీతో జనరల్ ఇందర్‌జీత్ సింగ్ గిల్

ఇందిర సమావేశం నుంచి వాకౌట్

1971 యుద్ధం సమయంలో ఒక రోజు ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, రక్షణ మంత్రి జగ్జీవన్ రామ్, సీనియర్ మంత్రులు ఆపరేషన్ రూమ్‌లో సమావేశానికి హాజరయ్యారు.

‘‘వారికి గిల్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. గిల్ మాట్లాడుతున్నప్పుడు, అక్కడున్న వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ బిజీగా ఆయనకు కనిపించారు. ఇందిరా గాంధీ కూడా తన పక్కన ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నారు’’అని ముత్తయ్య రాసుకొచ్చారు.

‘‘కొద్దిసేపటి తర్వాత, గిల్ మానెక్‌షావైపు తిరిగి ఇలా చెప్పారు. ‘ఇక మీరు చూసుకోండి అక్కడ యుద్ధం జరుగుతోంది. అది ఎంతవరకు వచ్చిందో నేను చూసి వస్తాను’అని అన్నారు.’’

అలా చెప్పి, గిల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని చాలా మంది నమ్మరు. కానీ గిల్‌ గురించి బాగా తెలిసిన వారు ఎవరైనా, గిల్ ఆపని ఆయన చేసే ఉంటారని అంటారు.

జనరల్ జాకబ్

ఫొటో సోర్స్, MANOHAR PUBLICATIONS

ఫొటో క్యాప్షన్, జనరల్ జాకబ్

గిల్‌పై జాకబ్ ప్రశంసల వర్షం..

1971 యుద్ధ సమయంలో త్రివిధ దళాల మధ్య మంచి సమన్వయం ఉండేది. దీనికి కారణం గిల్‌ అని సీనియర్ సైనిక అధికారులు కొనియాడేవారు.

మరొక విషయం ఏమిటంటే, ఆయనకు క్షేత్ర స్థాయిలో ఉన్న కమాండర్లతో మంచి సంబంధాలు ఉండేవి. ఆయన కంటే సీనియర్ అధికారులే అక్కడ పనిచేస్తున్నప్పటికీ, ఎలాంటి భేషజాలు ఉండేవి కాదు.

‘‘సైనిక ప్రధాన కార్యాలయంలో గిల్ ఉండకపోతే, నేను పనిచేయడం చాలా కష్టమయ్యేది. ప్రధాన కార్యాలయంలో పనిచేసిన చాలా మంది కంటే గిల్ ప్రతిభావంతులు’’అని జనరల్ జాకబ్ తన పుస్తకంలో రాసుకొచ్చారు.

‘‘అటు పశ్చిమ కమాండ్, ఇటు తూర్పు కమాండ్ రెండింటిలోనూ గిల్ ప్రధాన పాత్ర పోషించారు. నేను ప్రధాన కార్యాలయానికి వెళ్లినప్పుడు గిల్ నా చేయి పట్టుకుని లోపలకు తీసుకెళ్లేవారు.’’

1971 యుద్ధంలో అందించిన సేవలకుగాను గిల్‌ను పద్మ భూషన్ పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఈ పురస్కారాన్ని అందుకున్న ఏకైన మేజర్ జనరల్ ఆయనే.

1973 ఏప్రిల్‌లో ఒకరోజు మానెక్‌షాను కలిసేందుకు ఆయన బంగ్లాకు గిల్ వెళ్లారు.

ఇద్దరు గ్లాస్‌లలో డ్రింక్స్ పోసుకుని తాగడానికి సిద్ధమవుతుండగా గిల్‌కు ఒక ఫోన్ వచ్చింది. ఆ తర్వాత మానెక్‌షాకు దు:ఖంతో ఒకే ఒక పదం చెప్పారు. అదే ‘‘సిక్కిం’’.

వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయిన గిల్.. సిక్కిం సరిహద్దుల్లో ఘర్షణల పరిణామాలను ఆ రోజు రాత్రంతా దగ్గరుండి పర్యవేక్షించారు.

మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ హోదాలో ఏడాది పాటు గిల్ పనిచేశారు. ఈ తర్వాత ఆయనకు తూర్పు విభాగంలోని 4 కోర్ కమాండ్ బాధ్యతలు అప్పగించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)