నీళ్లపైనే నగరాలు.. భవిష్యత్తు ఇదేనా? యూరప్ దేశాల్లో ఈ ప్రయోగాలు ఎందుకు జరుగుతున్నాయి?

భవిష్యత్‌లో నగరాలన్నీ నీటిపై తేలుతుంటాయా

ఫొటో సోర్స్, OCEANIX/BIG-Bjarke Ingels Group

    • రచయిత, జాక్ పాల్‌ఫ్రే
    • హోదా, బీబీసీ ట్రావెల్

భూమిపై సముద్ర మట్టాల పెరుగుదల, విపరీతమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేందుకు భవిష్యత్‌లో నీటిపై తేలియాడే నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవడమే ఒక మంచి పరిష్కారంగా అందరూ భావిస్తున్నారు.

ఆమ్‌స్టర్‌డ్యామ్ ఫ్లోటింగ్ పరిసరాల్లోని రేవుపై మధ్యాహ్నం వేళ నేను అడుగుపెట్టే సమయానికి సన్నటి చినుకులు పడుతున్నాయి.

అక్కడి చిన్న సరస్సుపై పొందికగా నిర్మించిన మూడు అంతస్థుల భవనంలోని ప్రజలు, వర్షం ముప్పు ఉన్నప్పటికీ ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఒక తల్లి ఆమె కుమార్తె వంటగది కిటికీలో నుంచి చేపలు పట్టే వలను బయటకు విడిచారు. ఇద్దరు యువకులు నీళ్లలో గంతులేస్తున్నారు. ఆ రేవు రెయిలింగ్ చుట్టూ బెంచీలు, బైకులు, మాంసాహారాన్ని అందించే హోటళ్లు వరుసగా ఉన్నాయి.

ఈ ప్రత్యేకమైన సెమీ-అక్వాటిక్ కమ్యూనిటీని నేను సందర్శించడంలో టాన్ వాన్ నెమెన్ ముఖ్య పాత్ర పోషించారు. ఆయన కంపెనీ అయిన మాంటెఫ్లోర్, ఈ అద్భుతమైన సెమీ-అక్వాటిక్ కమ్యూనిటీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది.

ఆమ్‌స్టర్‌డ్యామ్

ఫొటో సోర్స్, Ashley Cooper/Getty Images

ఫొటో క్యాప్షన్, ఆమ్‌స్టర్‌డ్యామ్ నగరం

నీటిపై తేలియాడే 100 ఇళ్లను విజయవంతంగా నిర్మించిన టాన్ వాన్ నెమెన్... ఈ ప్రాజెక్టు విజయం గురించి కంటే కూడా, దీన్ని సృష్టించే సమయంలో ఎదురైన అనేక సమస్యల గురించి చర్చించడానికే ఆసక్తి కనబరిచారు.

ఒకప్పుడు మహా చిరాకు తెప్పించిన ఆ సమస్యలే ఇప్పుడు గొప్ప వినోదానికి కారణంగా నిలిచాయి.

''ఈ ప్రాజెక్టు నిర్మించే సమయంలో జోనింగ్ ప్లాన్ సమస్య ఎదురైంది'' అని మేం రేవుపై నడుస్తున్నప్పుడు వాన్ నమెన్ చెప్పారు. ''ఇందులోని ఇళ్లన్నీ వీధి స్థాయి కంటే కొంత నిర్ధిష్టమైన ఎత్తులో ఉండాలని అప్పుడు ఎవరో అన్నారు. ఇవేమో పైకి, కిందకు కదులుతున్నాయి'' అని బిగ్గరగా నవ్వారు.

తేలియాడే ఇళ్ల నిర్మాణాల కోసం నెదర్లాండ్స్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షిస్తున్నట్లు అర్థం అవుతోంది. తమ దేశ సృజనాత్మక నిర్మాణాల చరిత్రకు లోబడి ఈపరీక్షలు చేస్తోంది.

యూరప్‌లోని అతిచిన్న దేశమైన నెదర్లాండ్స్‌కు సముద్ర మట్టాలు పెరగడం ముప్పుగా మారనుంది. అందుకే నీళ్లపై తేలియాడే ఇళ్ల నిర్మాణాలపై ప్రయోగాలు చేస్తోన్న దేశాల్లో డచ్ ఒక్కటే లేదు. నెదర్లాండ్స్ కూడా దానికి జతగా ఉంది.

బొలీవియా, పెరూ సరిహద్దుల్లోని టిటికాకా సరస్సులో ఉన్న ఉరు ప్రజల రీడ్ ఐల్యాండ్స్‌

ఫొటో సోర్స్, Saiko3p/Getty Images

ఫొటో క్యాప్షన్, బొలీవియా, పెరూ సరిహద్దుల్లోని టిటికాకా సరస్సులో ఉన్న ఉరు ప్రజల రీడ్ ఐల్యాండ్స్‌

ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు దక్షిణాన 55 కి.మీ దూరంలో మికే వాన్ వింగర్డెన్, తన పాడి ఆవుల మందను ఒక వంతెన పైనుంచి నడిపిస్తూ వాటి కోసం అత్యాధునికంగా రూపొందించిన పశుశాలకు తరలిస్తున్నారు. రోటర్‌డ్యామ్ డాక్‌ జలాల్లో ఆగి ఉన్న రవాణా నౌకల నుంచి ఆవులను దించడానికి ఈ వంతెనను ఉపయోగించారు.

''ఆవులు వచ్చే ముందు రోజు రాత్రి మొత్తం నేనసలు నిద్ర పోలేదు. కానీ ఆ ప్రక్రియ సజావుగా జరిగింది'' అని ఆమె చెప్పారు.

2012లో శాండీ హరికేన్ సృష్టించిన విధ్వంసంతో న్యూయార్క్‌లో రవాణా వ్యవస్థ, ఆహార సరఫరాలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు కూడా మాన్‌హట్టన్‌లోని సూపర్ మార్కెట్లన్నీ ఆహార నిల్వలు లేక బోసిపోయాయి. దీంతో వాన్ వింగర్డెన్ దంపతులకు 'నీళ్లపై తేలియాడే పొలం (ఫ్లోటింగ్ ఫామ్‌)'ను నిర్వహించాలనే ఆలోచన వచ్చింది.

నెదర్లాండ్స్‌కు తిరిగొచ్చిన తర్వాత, వాతావరణానికి అనుకూలంగా మెదులుకునే ఫ్లోటింగ్ ఫామ్‌ను సృష్టించడానికి సిద్ధమయ్యారు.

తేలియాడే పశువుల శాల

ఫొటో సోర్స్, Jack Palfrey

ఫొటో క్యాప్షన్, తేలియాడే పశువుల శాల

2019లో ప్రారంభమైన ఈ తేలియాడే పొలంలో 40 ఆవులు ఉన్నాయి. ఇవి డాక్ సైడ్ గడ్డి మైదానాల్లో, తేలియాడే పరిసరాల్లో తిరుగుతూ జీవిస్తున్నాయి. ప్రపంచంలోనే మొదటిసారిగా ఇలాంటి పొలాన్ని రూపొందించారు. ఈ పొలంలో పాలు, చీజ్, యోగర్ట్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. వీటిని సమీప ప్రాంతాల్లోని వినియోగదారులకు బైక్‌లు, ఎలక్ట్రిక్ వ్యాన్‌ల ద్వారా చేరవేస్తున్నారు.

''ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి, అమ్మడానికి మా పొలం అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్‌లో ఇలాంటి తేలియాడే పొలాలకు మంచి ఆదరణ ఉంటుందని అనుకుంటున్నా'' అని వాన్ వింగర్డెన్ చెప్పారు. ఆమె తేలియాడే కూరగాయల పొలంతో పాటు కోళ్ల ఫారంలను నిర్మించాలని యోచిస్తున్నారు.

నెదర్లాండ్స్‌లో 'నీటిపై నివసించే ప్రజలు, నీళ్లపై నిర్వహించే పాడి' విజయవంతం కావడం బట్టి చూస్తే, భవిష్యత్‌లో అన్ని నగరాలు ఇలాగే అవుతాయోమే అని ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

భవిష్యత్‌లో నగరాలన్నీ నీటిపై తేలుతుంటాయా

ఫొటో సోర్స్, Oceanix

భవిష్యత్‌లో నగరాలన్నీ నీటిపై తేలుతుంటాయా

ఫొటో సోర్స్, Oceanix

ఐక్యరాజ్యసమితి మద్దతుతో, అమెరికాకు చెందిన ఓషియానిక్స్ అనే సంస్థ పెద్ద ఎత్తున తేలియాడే మానవ ఆవాసాలను రూపొందించే పనిలో పడింది. ప్రపంచంలోనే మొట్టమొదటి స్థిరమైన ఫ్లోటింగ్ కమ్యూనిటీని 75 హెక్టార్లలో 10,000 నివాసాలతో ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సంస్థ చెబుతోంది.

''సముద్ర మట్టాలు పెరుగుతున్నప్పుడు, తీర ప్రాంతాల్లో నివసించే వారికి రెండే అవకాశాలు ఉన్నాయి. అవి 1. ఎన్నటికీ ఎత్తు తగ్గకుండా ఉండే పేద్ద గోడను నిర్మించుకోవడం, 2. అధునాతన ఇంజనీరింగ్ పద్ధతుల వైపు మళ్లడం'' అని ఓషియానిక్స్ సీఈవో మార్క్ కోలిన్స్ చెన్ అన్నారు.

''ఫ్లోటింగ్ సిటీ''గా చెబుతున్నప్పటికీ, పెద్ద జిల్లాలకు సమాన స్థాయిలో వీటి నిర్మాణం చేపట్టాలని ఓషియానిక్స్ ప్రతిపాదిస్తోంది. సముద్ర మట్టాల పెరుగుదలతో సమస్యలు ఎదుర్కొంటున్న జకార్తా, షాంఘై వంటి నగరాల్లో ఈ ఫ్లోటింగ్ సిటీ పద్ధతిని అనుసరించాలని భావిస్తోంది.

కొత్తగా రూపొందించే ఈ తేలియాడే నగరాలను రెండు హెక్టార్ల వెడల్పుతో త్రిభుజాకారంలో నిర్మించనున్నారు. ప్రతీ నగరంలోనూ 300 మంది నివాసం ఉండేలా, మిగతా ప్రాంతంలో వ్యవసాయంతో పాటు వినోద క్లబ్‌లను ఏర్పాటు చేసేలా ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నారు.

''తీవ్రమైన పరిస్థితులను తట్టుకొని నిలువగలిగే, అత్యంత స్థిరమైన మౌలిక సదుపాయాలను మేం నిర్మిస్తున్నాం. ఇందులో శిలాజ ఇంధనాలను ఉపయోగించకూడదని అనుకుంటున్నాం. నూరు శాతం ప్రోటీన్ అవసరాలు తీర్చేలా వసతులు సృష్టించేందుకు ప్రయత్నిస్తాం'' అని చెన్ అన్నారు.

ఇవన్నీ చూడటానికి, వినడానికి చాలా ఆకట్టుకుంటున్నాయి. కానీ మన జీవితకాలంలో ఈ తేలియాడే నగరాలు వాస్తవ రూపం దాల్చడం మనం చూడగలమా?

''హా. ఇది అవుతుంది. కొన్నేళ్లలోనే తేలియాడే నగరాల నమూనాను మనం చూస్తాం. ఈ విషయంలో నేను చాలా నమ్మకంగా ఉన్నా' అని చెన్ చెప్పారు.

భవిష్యత్‌లో నగరాలన్నీ నీటిపై తేలుతుంటాయా

ఫొటో సోర్స్, Oceanix

ఈ తేలియాడే నగరాలు అనేవి మనకు కథల్లో జరిగే అంశాల్లాగా అనిపిస్తుంటాయి. కానీ వాస్తవానికి కొన్ని శతాబ్ధాలుగా ఇలాంటి ఆవాసాలపై ప్రజలు నివసిస్తున్నారు. వ్యవసాయం చేస్తున్నారు.

''ప్రపంచవ్యాప్తంగా తేలియాడే కమ్యూనిటీలకు చెందిన 64 కేస్ స్టడీలతో జాబితా రూపొందించాం. ఇంకా చెప్పాలంటే ప్రస్తుత మన నగరాల్లా కాకుండా, ఈ వ్యవస్థలు ఎల్లప్పుడూ నిలకడగా ఉంటాయి'' అని హార్వర్డ్ యూనివర్సిటీలో డిజైన్ లెక్చరర్, లోటెక్ పుస్తక రచయిత జులియా వాట్సన్ చెప్పారు.

ఈ తేలియాడే కమ్యూనిటీలకు చెందిన ఉదాహణలను మనం ఇప్పటికీ కూడా చూడవచ్చు. బొలీవియా, పెరూ సరిహద్దుల్లోని టిటికాకా సరస్సులో ఉన్న ఉరు ప్రజల రీడ్ ఐల్యాండ్స్‌ను తేలియాడే కమ్యూనిటీలకు ఉదాహరణగా చెప్పవచ్చు.

తేలియాడే ఉద్యానవనాలు సర్వసాధారణమే. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లో రుతుపవనాల సమయంలో వీటిని చూడొచ్చు.

ఈ ఫ్లోటింగ్ నగరాలు అదృశ్యం కావడానికి కారణం పెద్ద పెద్ద నగరాల నిర్మాణాల చేపట్టడమే. ఇప్పుడు మళ్లీ తేలియాడే నగరాల నిర్మాణాన్నే రానున్న భవిష్యత్‌గా భావిస్తున్నాం.

''యూరప్, చైనాలో నగరాల అభివృద్ధి కోసం చిత్తడి నేలలను, సరస్సులను పూడ్చివేయడంతో ఈ తరహా సాంకేతికత అక్కడ పూర్తిగా అదృశ్యమైంది'' అని వాట్సన్ అన్నారు.

ఇప్పుడు మనం మళ్లీ ఆమ్‌స్టర్‌డ్యామ్ దగ్గరికొస్తే, రేవు దగ్గరి నిలబడిన వాన్ నమెన్‌ మరో సమస్య గురించి గుర్తు చేసుకున్నారు.

'' ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సెమీ డిటాచ్డ్ ఇళ్లు తమకు పెద్ద తలనొప్పిగా మారాయని'' నమెన్ అన్నారు.

బంగ్లాదేశ్‌లోని ఫ్లోటింగ్ గార్డెన్

ఫొటో సోర్స్, Bengal Pix/Alamy

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్‌లోని ఫ్లోటింగ్ గార్డెన్

నీటిపై తేలియాడే నిర్మాణాలు రోజువారీ జీవితంలో భాగంగా మారాలని నమెన్ భావిస్తున్నారా అనే అంశం తెలుసుకోవడానికి నేను చాలా ఆసక్త కనబరిచాను.

'' ఇది సాధ్యమే. ప్రపంచంలోని చాలా నగరాల్లో నౌకాశ్రయాలు, ఓడరేవులు ఉన్నాయి. అక్కడ మీరు ఇలాంటి నగరాల నిర్మాణాన్ని చేపట్టవచ్చు. ఈ తరహా నిర్మాణాలపై ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు పెరుగుతున్న నీటి మట్టాలతో మనం ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ తరహా నగరాలతో పరిష్కారం దొరుకుతుంది'' అని ఆయన చెప్పారు. ఆ మాట చెప్పి వెంటనే ఆగిపోయారు.

''ఆ సమస్యకు ఇది పరిష్కారం కాదు. సముద్ర మట్టాలు మరింత పైకి పెరగకుండా కట్టడి చేయడమే దీనికి సరైన పరిష్కారం'' అని నొక్కి చెప్పారు.

దురదృష్టవశాత్తు, ఈ సమస్యను వాన్ నమెన్ కూడా పరిష్కరించలేకపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)