క్యాన్సర్ రావడానికి ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీరు తాగడం కూడా ఒక కారణమా?

ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగుతున్న యువతి

ఫొటో సోర్స్, Getty Images

ఆహార పదార్థాల ప్యాకింగ్‌లో ప్లాస్టిక్‌ ఉపయోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే వాదనలు తరచూ వింటూనే ఉంటాం.

ప్లాస్టిక్ బాటిళ్లను ఎండలో ఉంచినప్పుడు, వాటి నుండి క్యాన్సర్‌కు కారణం అయ్యే రసాయనాలు విడుదలవుతాయని, అవి నీటిలో కరిగి శరీరంలోకి చేరుతాయని వివరించే ఒక ఈ-మెయిల్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ ఈమెయిల్‌లోని అంశాలు ఓ విశ్వ విద్యాలయానికి చెందిన పరిశోధన పత్రానివిగా పలుమార్లు పేర్కొన్నారు. అయితే, అది ఓ నకిలీ ఈ-మెయిల్.

లేబొరేటరీ

ఫొటో సోర్స్, Science Photo Library

ఆందోళన కలిగిస్తున్న బీపీఏ రసాయనం

అయితే, శాస్త్రీయంగా బిస్ ఫినాల్ ఏ(బీపీఏ) అనే రసాయనం గురించి కొన్ని ఆందోళనలు ఉన్నాయి.

పాలికార్బోనేట్ కంటైనర్లు, ఫుడ్ బాక్స్ లైనింగ్‌లతో పాటు రసీదులు, స్టాంప్‌లలో ఉపయోగించే కాగితంలో బీపీఏ రసాయనం కనిపిస్తుంది.

బీపీఏ ఒక స్త్రీ హార్మోన్ లాగా ప్రభావం చూపిస్తూ హాని కలిగించవచ్చు. అయితే, ఇది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని ఇంకా నిరూపితం కాలేదు.

ప్లాస్టిక్ బాటిల్స్

ఫొటో సోర్స్, Getty Images

బీపీఏ హానికరమని ఆధారాలు ఉన్నాయా?

బీపీఏ అధిక మొత్తంలో తీసుకున్నప్పుడు, ఎలుకలకు, ముఖ్యంగా గర్భంతో ఉన్న లేదా చాలా చిన్న ఎలుకలకు హాని కలుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

కానీ, మానవుల్లో బీపీఏ వంటి రసాయనాలను చాలా భిన్నంగా జీర్ణమవుతాయి. ప్రస్తుతం మనిషి శరీరంలోకి ప్రతిరోజూ వెళ్ళే బీపీఏ హాని కలిగిస్తుందో లేదో చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు.

ప్యాకేజింగ్ పనిలో బీపీఏను సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో చాలా మంది పెద్ద వయసు వారి మూత్రంలో బీపీఏ ఉన్నట్టు అంచనా వేశారు.

అయితే, ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌లో బీపీఏని ఉపయోగించకపోవడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు. చాలా ప్లాస్టిక్‌ పరికరాలపై నంబర్ ముద్రించి ఉంటుంది. దీంతో వాటిలో బీపీఏ ఉందో లేదో గుర్తించవచ్చు.

ప్లాస్టిక్ బాటిల్స్

ఫొటో సోర్స్, Getty Images

బీపీఏని ఎలా గుర్తించాలి?

త్రిభుజాకార రీసైక్లింగ్ చిహ్నం (♲) లోపల నెంబర్‌ ముద్రించి ఉంటుంది. 1, 2, 4 లేదా 5 అంటే ప్లాస్టిక్ 'బీపీఏ రహితం'

3 లేదా 7 నెంబర్‌ ఉంటే ప్లాస్టిక్‌లో బీపీఏ ఉండవచ్చు. మీరు ప్లాస్టిక్‌ని వేడి చేస్తే లేదా డిటర్జెంట్‌ని పోస్తే, దాని నుండి బీపీఏ విడుదల చేయవచ్చు. ప్లాస్టిక్‌పై ఉన్న సంఖ్య 6 అంటే అది పాలీస్టైరిన్‌తో తయారు చేసినట్టు.

యూరోపియన్ యూనియన్‌లో, పిల్లల సీసాలు, బొమ్మల కోసం ఉపయోగించే ప్లాస్టిక్‌లు తప్పనిసరిగా 'బీపీఏ- రహితంగా' ఉండాలి.

అయితే, ఆహారం డబ్బాల లైనింగ్‌లు, వేడికి స్పందించే రసీదులు ఇప్పటికీ బీపీఏని కలిగి ఉంటున్నాయి. అందువల్ల సాధారణ జీవితంలో బీపీఏని నివారించడం దాదాపు అసాధ్యం.

వీడియో క్యాప్షన్, గుడ్డు వల్ల ఆరోగ్యానికి లాభమా? నష్టమా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)