మైక్రోవేవ్‌లో వండిన వంట ఆరోగ్యానికి మంచిదేనా? అందులో వాడే ప్లాస్టిక్ వస్తువులతో కలిగే ప్రమాదమేంటి

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, జెస్సికా బ్రౌన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మైక్రోవేవ్‌లో ఆహారం వేడి చేసుకోవడం వల్ల ప్రమాదం ఏమీ లేదు. కానీ దానికోసం ప్లాస్టిక్ వాడడంతోనే సమస్య అంతా.
వంట రానివారికి, చేసుకునే టైం లేనివారికి మైక్రోవేవ్ వంటింటి నేస్తం అయింది. కానీ వంటల్లో చేయి తిరిగిన నలభీములు మాత్రం మైక్రోవేవ్ వాడకాన్ని వ్యతిరేకిస్తున్నారు.
వంట చెయ్యడం ఒక కళ అనీ, మైక్రోవేవ్ ఆ కళని కనుమరుగయేలా చేస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు.
మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఫాస్ట్‌ఫుడ్ తయారీలో మైక్రోవేవ్ ఎంతగానో ఉపయోగపడుతోంది. కానీ, మెల్లిగా, నిదానంగా వండుకున్న ఆహారం ద్వారా వచ్చే లాభాలు ఈ తరానికి అందడం లేదన్నది వారి వాదన.
సరిగ్గా ఉపయోగిస్తే మైక్రోవేవ్ రేడియేషన్ ప్రమాదకరం కాదని, దాని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది.
అయితే, మైక్రోవేవ్‌లో వండటం వల్ల ఆహారంలో పోషక విలువలు నశిస్తాయని, ప్లాస్టిక్ గిన్నెలు వాడకం వలన శరీరంలోని హార్మోన్ల సమతుల్యం దెబ్బతింటుందనే భయాలు లేకపోలేదు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పోషక విలువల నష్టం
మైక్రోవేవ్‌లో వండటం వల్ల కూరగాయల్లో ఉండే ముఖ్యమైన పోషక విలువలు నశిస్తాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
ముఖ్యంగా బ్రోకలీలాంటి కూరగాయలను మైక్రోవేవ్‌లో వండితే వాటిలో ఉండే కొన్ని రకాల ఫ్లేవనాయిడ్లు 97% వరకూ తగ్గిపోతాయని, పొయ్యి మీద ఉడికించడం వల్ల జరిగే నష్టంకన్నా ఇది ఎక్కువ శాతమని తేలింది. ఈ ఫ్లేవనాయిడ్లు కడుపులో మంటను తగ్గించేందుకు సహాయపడతాయి.
అయితే, తక్కువ సమయంలో వండితే (ఒక నిముషం పాటు మైక్రోవేవ్‌లో ఉడికించారు) బ్రోకలీలో ఎలాంటి పోషక విలువల నష్టం జరగలేదని 2019లో వచ్చిన ఒక పరిశోధనలో తేలింది.
నిజానికి, ఆవిరిలో ఉడికించడం, మైక్రోవేవ్‌లో వండడం వలన ఆహారంలో చాలా రకల ఫ్లేవనాయిడ్లు పెరుగుతాయని, ఇవి గుండెకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తాయని ఈ పరిశోధన చేసిన వాళ్లు చెప్పారు.
కొన్ని కండీషన్ల ప్రకారం వండితే ఆవిరి మీద వండడంకన్నా కూడా మైక్రోవేవ్‌లో వండడంవల్ల ఫ్లేవనాయిడ్లు పెరిగాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఉడికించడానికి ఎక్కువ నీరు వాడితే మాత్రం ఫ్లేవనాయిడ్ల శాతం తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు.
మైక్రోవేవ్ కుకింగ్‌లో ఫ్లేవనాయిడ్ల శాతం ఎందుకు పెరుగుతుందో వివరించడానికి కచ్చితమైన సాధనాలేమీ లేవని అమెరికా వ్యవసాయ శాఖకు చెందిన బెల్ట్స్‌విల్ హ్యూమన్ న్యూట్రిషన్ రిసెర్చ్ సెంటర్‌లో ప్రధాన పరిశోధకులు షియాన్లీ వూ అన్నారు.
వాస్తవంలో ఫ్లేవనాయిడ్లు పెరుగుతూ ఉండకపోవచ్చు. కానీ మైక్రోవేవ్‌లో వండడంవలన ఫ్లేవనాయిడ్లను కొలవగలిగే అవకాశం ఎక్కువ. అందువల్ల మైక్రోవేవ్ కుకింగ్‌లో ఫ్లేవనాయిడ్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందని వూ తెలిపారు.
"మైక్రోవేవ్ కుకింగ్‌లో ఎక్కువ పోషకాలు ఉంటాయని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే కూరగాయలన్నిటినీ ఒకే గాటన కట్టలేం. ఒక్కో జాతికి ఒక్కోరకమైన ఆకృతి, నిర్మాణం ఉంటాయి. పోషక విలువల్లో భేదం ఉంటుంది. మొక్కల నుంచి వచ్చే చాలా రకాలైన కూరగాయలకు మైక్రోవేవ్‌లో కుకింగ్ మేలైన పద్ధతి. అయితే, అన్ని కూరగాయలకూ ఇది వర్తించకపోవచ్చు" అని వూ అన్నారు.
మరొక అధ్యయనంలో, కూరగాయల్లో ఉండే ఫినోలిక్స్ మిశ్రమాలు, నీళ్లల్లో ఉడికించినప్పుడు, ఆవిరి మీద ఉడికించినప్పుడు, మైక్రోవేవ్‌లో వండేటప్పుడు ఎలా మారుతున్నాయో పరిశీలించారు.
ఆవిరి మీద ఉడికించినప్పుడు, మైక్రోవేవ్‌లో వండినప్పుడు పాలకూర, కాప్సికం, బ్రోకలీ, గ్రీన్ బీన్స్‌లాంటి వాటిల్లో ఫినోలిక్స్ కోల్పోలేదు కానీ గుమ్మడి, పచ్చి బఠాణీ, ఉల్లికాడలు లాంటి వాటిల్లో ఫినోలిక్స్ ఎక్కువ శాతం నశించాయి.
అలాగే ఈ మూడు పద్ధతుల్లో యాంటీఆక్సిడెంట్ల మోతాదును కూడా గమనించారు. మైక్రోవేవ్ కుకింగ్‌లో యాంటీఆక్సిడెంట్ల శాతం మెరుగ్గా ఉందని తేలింది.
కూరగాయల విషయంలో పొయ్యి మీద ఉడికించడం కన్నా మైక్రోవేవ్ కుకింగ్ మేలైన పద్ధతి అని ఈ అధ్యయనంలో వెల్లడైంది.
కొన్ని రకాల కూరగాయలను వండడానికి కావలసిన ఉష్ణోగ్రతలలో తేడాల వలన మైక్రోవేవ్ కుకింగ్ మెరుగైన ఫలితాలను ఇస్తోందని పరిశోధకులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్లాస్టిక్ పాత్రల్లో వండడం సురక్షితమేనా?
కొన్ని రకాలైన ప్లాస్టిక్ పాత్రలు మైక్రోవేవ్‌కు అనుగుణమైనవి కావు. వేడి చేసినప్పుడు ప్లాస్టిక్, ప్లాలిమర్స్ ఆహారంలోకి చేరే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
2011లో జరిపిన ఒక అధయ్యనంలో, ఆహారానికి అనుగుణమైనవని చెప్పే 400 రకాల ప్లాస్టిక్ పాత్రలను మైక్రోవేవ్‌లో పెట్టి పరిశీలించారు. వీటిల్లో అధికశాతం, శరీరంలోని హార్మోన్లను దెబ్బతీసే రసాయనాలను ఆహారంలోకి లీక్ చేసాయి.
ముఖ్యంగా టేక్ఎవే ఆహారాన్ని అందించే డబ్బాలు, చపాతీలు, శాండ్‌విచ్‌ల్లాంటివి చుట్టడానికి వాడే రాప్‌లు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తయారీలో వాడే రసాయనాలు(పాలెట్స్) శరీరంలో హార్మోన్లను, జీవక్రియను దెబ్బతీస్తాయని తేలింది.
ఈ రసాయనాలు చిన్నపిల్లల్లో రక్తపోటు పెరగడానికి, రోగ నిరోధక శక్తి తగ్గడానికి కారణమవుతాయి. దానివలన డయాబెటిస్, హైపర్ టెన్షన్ లాంటి సమస్యలు రావొచ్చు.
సంతానోత్పత్తి సమస్యలు, ఆస్థమా, ఏడీహెచ్‌డీలకు కూడా దారి తీయవచ్చు.
పాలెట్స్ వలన థైరాయిడ్ హార్మోన్లకు కూడా హాని కలగవచ్చని లియొనార్డో ట్రసండే అంటున్నారు. ట్రసండే, న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ఎన్విరాన్మెంటల్ మెడిసిన్ అండ్ పాపులేషన్ హెల్త్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
బిస్ఫీనోల్(బీపీఏ) కూడా ప్లాస్టిక్ తయారీలో వాడతారు. ఇది కూడా హార్మోన్ల సమతుల్యాన్ని దెబ్బతీస్తుంది.
పాలెట్స్ పిల్లలు ఆడుకునే బొమ్మల్లో, బాడీ లోషన్లలో కూడా ఉంటాయి. కానీ, ఇవి ఉన్న పాత్రల్లో ఆహారాన్ని వేడి చేయడం వలన కచ్చితంగా హాని కలుగుతుంది.
"పదార్థంలో ఉండే కలుషితాలను మైక్రోవేవ్ యాక్టివేట్ చేస్తుంది. ప్రయోగశాలల్లో రసాయనాల నుంచి కలుషితాలను వేరు చేయడానికి ఈ పద్ధతి వాడతారు" అని అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో బయోడిజైన్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఇంజినీరింగ్ శాఖాధ్యక్షులు రోల్ఫ్ హాల్డన్ తెలిపారు.
అయితే ప్లాస్టిక్ పాత్రలను ఎంత తరచుగా వాడతాం, ఎంతసేపు వాడతాం, ఎంత ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తాం అనే విషయాలపై ఎంత హాని కలుగుతుందనేది ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు ప్లాస్టిక్‌లోని రసాయనాలు యాక్టివేట్ అవుతాయిగానీ ఆహారంలోకి చేరకపోవచ్చు.
అలాగే శరీరంలోకి చేరే రసాయనాలు, హార్మోన్ల సమతుల్యంపై ఎంతవరకూ ప్రభావాన్ని చూపిస్తాయనేది కూడా కచ్చితంగా చెప్పలేమని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
వండే పదార్థాలలోని వైవిధ్యం వల్ల ఏది సురక్షితమైన స్థాయి (సేఫ్ లెవెల్), ఏది కాదు అనేది కూడా స్పష్టంగా చెప్పలేం అని పరిశోధకులు అంటున్నారు.
"అంతేకాకుండా వండేటప్పుడు ఆహారాన్ని తాకకుండా ఉండే ప్లాస్టిక్ నుంచి కూడా రసాయనాలు వెలువడవచ్చు. ఉదాహరణకు మూత పెట్టి వండుతున్నప్పుడు, ఆవిరి వలన నీటి బిందువులు మూతను తాకుతాయి. నీటిబిందువుల వేడి మూతలో ఉండే ప్లాస్టిక్‌లోని రసాయనాలను యాక్టివేట్ చెయ్యొచ్చు. ఆ బిందువులు మళ్ళీ ఆహారంపైకి జారిపడినప్పుడు ప్లాస్టిక్ మిశ్రమాలు ఆహారంలోకి చేరవచ్చు" అని హాల్డన్ తెలిపారు.
ఇన్ని సందేహాల మధ్య మైక్రోవేవ్ కుకింగ్‌లో ప్లాస్టిక్ వాడడం మానేస్తేనే మేలు. పింగాణీ పాత్రలు వాడడం మంచిది.
ఒకవేళ ప్లాస్టిక్ వాడాల్సి వస్తే సరైన ఆకారం లేనివి, పాత గిన్నెలు, పాడైపోయిన డబ్బాలు వాడకుండా ఉండడం మేలు. అలాగే, ఆ గిన్నెల రీసైకిలింగ్ విలువ చెక్ చేయడం మంచిది. ప్లాస్టిక్ పాత్రల అడుగు భాగంలో ఈ విలువలు ముద్రిస్తారు. వాటిపై 3, 'వీ' లేదా 'పీవీసీ' అని ఉంటే వాటి తయారీలో పాలెట్స్ వాడినట్లు లెక్క.

ఫొటో సోర్స్, Getty Images
వేడి చేసే పద్ధతిలో నష్టాలు
ప్లాస్టిక్ వాడకపోయినా కూడా మైక్రోవేవ్ కుకింగ్‌లో కొన్ని రిస్కులు ఉన్నాయి. పదార్థమంతా సరిసమానంగా వేడెక్కకపోవచ్చు. కొన్ని చోట్ల బాగా వేడేక్కి, కొన్ని చోట్ల వేడెక్కకుండా ఉండొచ్చు.
"పదార్థాన్ని వేడి చేయకుండా తినకూడదు. చల్లని వస్తువుల్లో బ్యాక్టీరియా ఉంటుంది. వేడి చేయడం వలన అది నశిస్తుంది. మైక్రోవేవ్‌లో పెట్టినప్పుడు వేడి తాకని చోట బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. అలాగని మళ్లీ మళ్లీ వేడి చేయడం కూడా మంచిది కాదు" అని జార్జియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కో డెయిజ్ గోన్జాలెజ్ తెలిపారు.
82C వరకు ఆహారాన్ని వేడిచెయవచ్చు. ఈ ఉష్ణోగ్రత వద్ద బ్యాక్టీరియా నశిస్తుంది.
మైక్రోవేవ్ కుకింగ్‌లో వాడే అధిక ఉష్ణోగ్రతలు కూడా కొన్నిసార్లు హాని కలిగించవచ్చు. ముఖ్యంగా పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే దుంపలు, ధాన్యాలలాంటివి వండేటప్పుడు జాగ్రత్త వహించాలి.
పిండి పదార్థాలు ఎక్కువ ఉన్నవాటిని మైక్రోవేవ్‌లో అధిక ఉష్ణోగ్రతల వద్ద వండినప్పుడు 'ఎక్రిలమైడ్' అనే హానికరమైన రసాయనం విడుదల అవుతుంది.
వీటిని మాములు స్టవ్ మీద ఉడికించినప్పుడు ఎక్రిలమైడ్ విడుదల కాలేదని జెరూసెలంలోని హీబ్రూ యూనివర్సిటీలో న్యుట్రిషనల్ సైన్స్ ప్రొఫెసర్ బెట్టీ ష్వార్జ్ తెలిపారు.
ఎక్రిలమైడ్, శరీర కణాల్లో ఉండే డీఎన్ఏపై ప్రభావం చూపిస్తుందని జంతువులపై చేసిన పరిశోధనల్లో తేలింది. అయితే మనుషుల డీఎన్ఏపై దీని ప్రభావం పరిమితమే.
దుంపలను వండే ముందు కొంతసేపు నీటిలో ఉంచి తరువాత మైక్రోవేవ్‌లో వండుకుంటే కొంతవరకు మేలు.
రేడియేషన్
మైక్రోవేవ్‌లో విడుదల అయ్యే రేడియేషన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. ఇది పూర్తిగా సురక్షితం. దీనిలో వాడే విద్యుదయస్కాంత తరంగాలు చాలా తక్కువ పౌనఃపున్యాన్ని కలిగి ఉంటాయి. రేడియోల్లోనూ, బల్బుల్లోనూ వాడేవే ఇందులోనూ వాడతారు.
''ఎక్స్‌రేల్లో ఉండే అయోనైజింగ్ రేడియేషన్ మైక్రోవేవ్స్‌లో ఉండదు. ఇందులో ఉత్పన్నమయ్యే శక్తి అణువుల నుంచి ఎలక్ట్రాన్లను వేరు చేయలేదు. అందువల్ల డీఎన్ఏకు హాని కలిగే ప్రమాదం లేదు'' అని జార్జ్‌టౌన్ యూనివర్సిటీలోని మెడికల్ సెంటర్‌లో రేడియేషన్ మెడిసిన్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న టిమోతీ జార్గన్సన్ తెలిపారు.
మైక్రోవేవ్ అవన్ కనిపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రేడియేషన్‌పై ఉన్న అనుమానాలు, సందేహాలు ఒక్కొక్కటిగా తొలగిపోతూ వస్తున్నాయని జార్గన్సన్ అన్నారు.
ముఖ్యంగా, అమెరికాలోని మసాచుసెట్స్‌లోని ఆర్మీ నాటిక్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీస్ శాస్త్రవేత్తలు, మైక్రోవేవ్ కుకింగ్‌పై చేసిన పరిశోధనలు చాలావరకు సందేహాలను నివృత్తి చేశాయని ఆయన తెలిపారు.
మైక్రోవేవ్‌లో వంట ఎంత సులువైనప్పటికీ జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. మైక్రోవేవ్‌లో ఆహారాన్ని వండుతున్నప్పుడు పరిగణించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.
చాలాకాలంగా, ఇది ఒక సురక్షితమైన వంటగది ఉపకరణంగా ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు పాటించాలని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.
మైక్రోవేవ్‌లో ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులు, ఫాయిల్స్ వలన శరీరంలోని హార్మోన్లపై చెడు ప్రభావం ఉంటుందని, ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఇప్పటికీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత్‌లోనే అత్యంత ఘాటైన రాజా మిర్చి కథ ఇది
- సాంబారు పుట్టినిల్లు తమిళనాడా.. మహారాష్ట్రా
- భారత్‌లో పోషకాహార లోపం పెరుగుతోంది... ఎందుకు?
- తాటితాండ్ర, తాటిగారెలు ఎలా తయారు చేస్తారు?
- బెల్లం: ఆహారమా... ఔషధమా
- ఒక్క భోజనం 40 వేల రూపాయలు.. హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్లు... ఏంటి దీని ప్రత్యేకత
- తాటి ముంజలు: 'అధిక బరువుకు విరుగుడు, క్యాన్సర్ నిరోధకం'
- ‘ఇడ్లీ అమ్మ’కు ఆనంద్ మహేంద్ర ఊహించని గిఫ్ట్.. చనిపోయే దాకా ఒక్క రూపాయికే ఇడ్లీ అమ్ముతానంటున్న కమలాత్తాళ్
- బ్రిటన్‌లో భారతీయ వంటకాల వ్యాపారం చేస్తున్న 76 ఏళ్ళ బామ్మ
- 'ఈ నత్తలను తింటే స్వర్గంలో ఉన్నట్లుంటుంది... చలికాలం పున్నమి రోజుల్లో మాత్రమే వీటిని వేటాడాలి'
- ఆహారం వృథా: ఏటా 90 కోట్ల టన్నుల ఆహారాన్ని పారేస్తున్నారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









