ఆహారం వృథా: ఏటా 90 కోట్ల టన్నుల ఆహారాన్ని పారేస్తున్నారు... దీన్ని నివారించి పేదలను ఆదుకోలేమా?

ఆహార వ్యర్థాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, విక్టోరియా గిల్
    • హోదా, బీబీసీ సైన్స్ కరస్పాండెంట్

ఏటా సుమారు 900 మిలియన్‌ టన్నుల (90 కోట్ల టన్నులు) ఆహారం వృథా అవుతోందని ఓ గ్లోబల్ ‌రిపోర్ట్ వెల్లడించింది.

ఇళ్లు, దుకాణాలు, రెస్టారెంట్లతో కలిపి మనుషులు తినే ఆహారంలో 17% చెత్తకుండీలోకి వెళుతోందని యునైటెడ్‌ నేషన్స్ పర్యావరణ కార్యక్రమం (UNEP) చెందిన ఆహార వృథా సూచి(ఫుడ్‌ వేస్ట్ ఇండెక్స్)రిపోర్ట్ వెల్లడించింది.

వృథా అవుతున్న ఆహారంలో 60% జన నివాసాల నుంచే వస్తోందట. యూకేలాంటి దేశాలలో లాక్‌డౌన్‌ సందర్భంగా ఆహార వృథా కొంత తగ్గుముఖం పట్టిందని కూడా ఈ నివేదిక తేల్చింది.

లాక్‌డౌన్‌ తర్వాత షాపింగ్, ఫుడ్‌‌ విషయంలో ప్రజలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక రూపకల్పనలో పాలు పంచుకున్న ‘ర్యాప్’ (WRAP) సంస్థ వెల్లడించింది.

ఈ ప్రయత్నాలను ఇంకా ముందుకు తీసుకుపోయే చర్యల్లో భాగంగా, తక్కువ వృథాతో ఆహారాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి అన్న అంశంపై ప్రముఖ షెఫ్‌లతో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది.

ఆహార వ్యర్థాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆహారాన్ని వృథా చేయడమంటే దాన్ని పండించడానికి ఉపయోగించిన వనరులను కూడా వృథా చేయడమే

2.3 కోట్ల ట్రక్కుల ఆహారం వృథా

ఇటీవల వెల్లడైన నివేదిక ఫలితాల ప్రకారం, గతంలో పోలిస్తే ఎక్కువ పరిమాణంలో ఆహారం వృథా అవుతున్నట్లు తేలిందని ‘ర్యాప్’ సంస్థకు చెందిన రిచర్డ్ స్వానెల్ బీబీసీతో అన్నారు.

‘‘40 టన్నుల బరువు మోసే 23 మిలియన్‌ ట్రక్కులలో పట్టేంత ఆహారం చెత్తకుప్పలోకి వెళుతోంది. ఈ ట్రక్కులను వరసగా నిలబెడితే ఏడుసార్లు భూమిని చుట్టి రావచ్చు’’ అన్నారాయన.

ఈ సమస్య గతంలో కేవలం ధనిక దేశాలకే పరిమితమైందని అనుకునేవారు. ఆ దేశాల్లో కస్టమర్లు తమకు కావాల్సిన దానికన్నా ఎక్కువ కొని వృథా చేసేవారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి ప్రతిచోటా కనిపిస్తోందని నివేదిక చెబుతోంది.

అయితే ఏ దేశంలో ఎక్కువ, ఏ దేశంలో తక్కువ అనేది ధనిక, పేద దేశాల మధ్య కాస్త అటు ఇటుగా మారుతోందని నివేదిక చెప్పింది. ఇందులో ఉద్దేశపూర్వకంగా పడేసేది, అనుకోకుండా వృథా అయ్యేది ఎంత అన్నది అంచనా వేయడం కష్టం.

అయితే తినదగిన, తినలేని (ఎముకలు, ముళ్లులాంటివి) ఆహార పదార్ధాల వృథాకు సంబంధించి ధనిక దేశాలలోనే తమకు డేటా లభ్యమైందని ఈ నివేదిక వెల్లడించింది.

తినదగిన ఆహారంలో వృథా శాతం పేద దేశాలలో తక్కువగా ఉందని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం అధికారిణి మార్టినా ఒటో వెల్లడించారు.

‘‘ఎవరు ఎలా చేసినా, అందరూ కలిసి ఆహారాన్ని తయారు చేసే వనరులను సింపుల్‌గా చెత్తకుప్పలో పడేస్తున్నారు’’ అన్నారు మార్టినా ఒటో.

2030కల్లా ఈ వృథాను తగ్గించాలని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ఎగ్జిక్యుటివ్ డైరక్టర్‌ ఇంగర్‌ ఆండర్సన్‌ అన్నారు. ‘‘మనం పర్యావరణ సమస్యల గురించి ఆలోచించేటప్పుడు ఫుడ్‌వేస్ట్‌‌ గురించి కూడా ఆలోచించాలి. ఇది అందులో కీలకం’’ అన్నారామె.

వృథాగా పోతున్న ఆహారం కారణంగా పర్యావరణంలో 8-10% గ్రీన్‌హౌస్ వాయువులు వచ్చి చేరుతున్నాయని రిచర్డ్ స్వానెల్ గుర్తు చేశారు.

నాదియా హుసేన్

ఫొటో సోర్స్, Chris Terry

ఫొటో క్యాప్షన్, నాదియా హుసేన్

ఆహార వృథాను ఇలా తగ్గించవచ్చు?

  • వంట సరుకులు కొనడానికి ముందే ఎంత అవసరమో తెలుసుకోని వ్యవహరించాలి.
  • ఎవరు ఎంత తినగలరో ముందుగానే అంచనా వేసుకోవాలి. అందుకు తగ్గట్టుగానే వంట చేయాలి.
  • సరుకులు కొనేటప్పుడు వాటి మీద ఎక్స్‌పైరీ డేట్లు ఒక్కసారి సరిచూసుకోండి.
  • చలి ప్రదేశాలలో ఫ్రిజ్ చల్లదనాన్ని తగ్గించుకోవాలి. దీనివల్ల పర్యావరణంపై ప్రభావం పడదు

లాక్‌డౌన్ ఎఫెక్ట్

లాక్‌డౌన్ కారణంగా ఆహార వృథా 2019తో పోలిస్తే 22% తగ్గిందని నివేదికలో ఉంది. ‘‘ఇళ్లలోనే ఉండిపోవడం, బ్యాచ్ కుకింగ్ (కలిసి వండుకుని తినడం) కారణంగా ఆహారవృథా చాలా వరకు తగ్గింది. కానీ లాక్‌డౌన్‌ పోయింది కాబట్టి మళ్లీ వేస్ట్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది’’ అని ర్యాప్ రూపొందించిన నివేదిక పేర్కొంది.

ఆహార వ్యర్థాలు

ఫొటో సోర్స్, Getty Images

ఆహార వృథాను నిరోధించడంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు బ్రిటన్‌లో ఇప్పటికే అనేకమంది షెఫ్‌లు సోషల్ మీడియా ప్రచారానికి ముందుకు వచ్చారు.

వదిలేసిన పదార్ధాలతో సరికొత్తగా ఎలాంటి వంటలు తయారు చేయవచ్చు అనేదానిపై బ్రిటీష్‌ టీవీలలో ఎక్కువగా కనిపించే ప్రముఖ షెఫ్‌ నాడియా హుస్సేన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రోగ్రామ్‌లు చేస్తున్నారు.

ఇటలీకి చెందిన ప్రముఖ షెఫ్‌ ఒకరు ‘కిచెన్ క్వారంటైన్’ పేరుతో కార్యక్రమాలు తయారుచేసి వంటింట్లో కనిపించే ప్రతి ప్రదార్ధపు ప్రాధాన్యతను వివరించారు.

ఒకపక్క టన్నుల కొద్దీ ఆహారం వృథాగా పోతుండగా, 2019 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 69 కోట్లమంది ఆకలితో బాధపడ్డారని తేలింది.

‘‘ఆహార వృథాను అడ్డుకోవడం వల్ల గ్లోబల్‌ వార్మింగ్ నుంచి ఆర్ధిక మాంద్యం వరకు ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది’’ అన్నారు ఐక్యరాజ్యసమితి అధికారిణి ఆండర్సన్‌.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)