'ఈ నత్తలను తింటే స్వర్గంలో ఉన్నట్లుంటుంది... చలికాలం పున్నమి రోజుల్లో మాత్రమే వీటిని వేటాడాలి'

ఓర్మర్

ఫొటో సోర్స్, Ally Clark/Alamy

    • రచయిత, నార్మన్ మిల్లర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇంగ్లిష్ చానల్‌లోని గెర్నెసీ దీవి తీరంలో ‘సముద్ర చెవులు’ అనే నత్త వంటి జలచరాలను సేకరించటానికి ఏడాదిలో కేవలం 20 రోజులే అనుమతి ఉంటుంది.

ఓర్మర్ అని కూడా పిలిచే ఈ జీవులు సెనెగల్, ఆస్ట్రేలియా, జపాన్, కాలిఫోర్నియా తదితర సుదూర ప్రాంతాల్లోనూ కనిపిస్తాయి. అయితే.. కేవలం ఇంగ్లిష్ చానల్ దీవుల బీచ్‌లలో మాత్రమే వీటిని చేతులతో ఏరుకోవచ్చు. చాలా విశిష్టమైన ఈ నత్తల విషయంలో అనేక నియమనిబంధనలూ ఇక్కడ అమలులో ఉన్నాయి.

ఫ్రాన్స్ తీరానికి కొన్ని మైళ్ల దూరంలోనే ఉన్నప్పటికీ.. గెర్నెసీ దీవి 800 ఏళ్ల పాటు బ్రిటిష్ క్రౌన్ డిపెండెన్సీ ప్రాంతంగా ఉండింది. ఈ దీవిలో.. ప్రాచీన నార్మన్ ఫ్రెంచ్ మూలంగా ఉన్న గెర్నెసియాసి అనే భాషను మాట్లాడతారు.

అయితే.. ఇక్కడ సముద్ర ఆహారాల్లో ఓర్మర్‌కు ఒక విశిష్టమైన స్థానం ఉంది. పీటర్ పెరీరో చాలా కాలంగా ఓర్మర్‌ను సేకరిస్తున్నారు. ‘‘కొందరు జనం దీనిని ఎంతగా ఇష్టపడతారో ఇంకొందరు అంతగా ద్వేషిస్తారు’’ అని ఆయన చెప్తున్నారు.

1673లో రాసిన ఒక వంట ప్రస్తావనలో.. ‘‘ఓర్మర్ అనేది ఆల్చిప్ప కన్నా చాలా పెద్దగా ఉంటుంది. కానీ, అంతకన్నా ఎంతో ఎక్కువ రుచిగా ఉంటుంది. ఇది ప్లేటులో ఉంటే స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది’’ అని రాశారు.

గెర్నెసీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గెర్నెసీ

మూడు శతాబ్దాల తర్వాత.. జెరాల్డ్ బాసిల్ ఎడ్వర్డ్స్ అనే వ్యక్తి ఈ దీవిలో తన జీవితం గురించి 1981లో ‘ద బుక్ ఆఫ్ ఎబెనెజర్ లెపేజ్’ అనే పేరుతో రాసిన పుస్తకంలో.. ‘‘అన్నిటికన్నా నాకు నచ్చిన ఆహారం ఓర్మర్స్. అయితే వాటి రుచి ఎలా ఉంటుందో నేను చెప్పలేను. అవి చేపలు లాగానో, మాంసం లాగానో, పక్షుల మాంసం లాగానో ఉండవు. అసలు భూమి మీది మరే ఆహారం లాగా అవి ఉండవు’’ అని అభివర్ణించారు.

అసలు ఓర్మర్ల రుచి ఎలా ఉంటుందో గుర్తించటం ఇప్పటికీ కష్టంగానే ఉంది. ‘‘ఓర్మర్ల రుచిని వర్ణించటానికి చాలా మంది భాషలో మాటలు లేవు. అవి చాలా రుచికరంగా ఉంటాయి కానీ.. చేపల రుచి లాగా ఏమాత్రం ఉండదు’’ అని 2011లో యూకే ఆక్వాటిక్ ప్లాంట్ సొసైటీ యూజర్ ఒకరు వ్యాఖ్యానించారు.

టేస్ట్ అట్లాస్ అనే ఆన్‌లైన్ గ్లోబల్ గైడ్ కూడా ఈ ఓర్మర్ల రుచి గురించి వర్ణించలేకపోయింది. ఎంతో కాలంగా ఓర్మర్లను సేకరించే పేరీయో సైతం.. వీటి గురించి నిర్దిష్టంగా చెప్పలేదు.

‘‘ఓర్మర్లను చక్కగా వండితే.. స్క్విడ్, ఆక్టోపస్, కటిల్‌ఫిష్ తరహా రుచి ఉంటాయి. వాటి రుచి నిజంగానే చాలా భిన్నంగా ఉంటుంది. దేనితోనూ నేరుగా పోల్చలేం. ఇంకా గట్టిగా అడిగితే.. రేజర్ క్లామ్స్ నత్తల రుచి వీటికి దగ్గరగా ఉంటుందని చెప్తాను’’ అని ఆయన నాతో పేర్కొన్నారు.

అయితే.. ఓ ఓర్మర్ వేటకు సంబంధించిన చట్టాలు.. ఈ నత్త గురించి మరింత ఆసక్తి రేకెత్తిస్తుంది. కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచి ఏప్రిల్ చివరి వరకూ మధ్య కాలంలో వచ్చే పున్నమి రోజుల్లో, ఆ రోజుకు అటూ ఇటూ రెండు రోజుల్లో మాత్రమే ఈ ఓర్మర్లను సేకరించాలని ఆ చట్టం నిర్దేశిస్తోంది. దీనిని ఓర్మర్ వేటగాళ్లు విధిగా పాటిస్తారు. అలా ఓర్మర్లను సేకరించే రోజులను ‘ఓర్మరింగ్ టైడ్స్’ అని కూడా వ్యవహరిస్తారు.

గెర్నెసీ

ఫొటో సోర్స్, Visit Guernsey

సముద్రపు అలల మీద చంద్రుడి ప్రభావం అత్యంత అధికంగా ఉండే రోజులివి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన అలలు వచ్చే అతి కొద్ది దీవుల్లో ఒకటైన గెర్నెసీ దీవిలో ఈ ప్రభావం మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అతిచిన్న అలకు, అతి పెద్ద అలకు మధ్య పది మీటర్ల వరకూ తేడా ఉంటుంది.

సముద్రపు అలలను చంద్రుడు బాగా వెనక్కు లాగినపుడు.. బయటకు తేలే రాళ్లు, వాటి మధ్య భాగాల్లో సముద్రపు నాచును భుజిస్తూ ఓర్మర్లు కనిపిస్తాయి. ఆ నాచు వెనుక దాగివున్న ఈ నత్తలను వెదుకుతూ వెళ్లే వేటగాళ్లు ఒడుపుగా పట్టుకుంటారు. ఓర్మర్‌ను కనిపెట్టగానే పని ముగిసిపోదు. అవి రాళ్లకు ఎంత గట్టిగా పట్టుకుంటాయంటే.. వాటిని తీయటానికి ఓర్మరింగ్ హుక్‌లు వాడాల్సి వస్తుంది.

ఓర్మర్లను ఎప్పుడు వేటాడాలనేదే కాదు.. ఎలా వేటాడాలో కూడా ఇక్కడి చట్టం నిర్దేశిస్తుంది. నీటిలో పాక్షికంగా కానీ, పూర్తిగా కానీ మునిగివున్న ఓర్మర్‌ను సేకరించటానికి వీలు లేదు. ఇక సేకరించిన ఓర్మర్లను ఈ దీవి నుంచి బయటకు తీసుకెళ్లాలంటే విస్పష్టమైన అనుమతి అవసరం. అతి కొద్ది మొత్తంలో మాత్రమే జపాన్ మార్కెట్‌కు ఎగుమతి చేస్తుంటారు. అక్కడ కిలో ఓర్మర్లకు 15,000 రూపాయల వరకూ లభిస్తాయి.

ఓర్మర్లకు సంబంధించి ఏ నిబంధనలను ఉల్లంఘించినా కానీ.. 5,000 బ్రిటిష్ పౌండ్ల (సుమారు రూ. 5,00,000) వరకూ జరిమానా కానీ ఆరు నెలల జైలు శిక్ష కానీ ఎదుర్కోక తప్పదు. నిజానికి.. అక్రమంగా ఓర్మర్ల వేట సాగుతుండటంతో పోలీసులు 1968లోనే నీటిలోపలికి వెళ్లి మరీ ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రపంచంలో నమోదైన మొట్టమొదటి అండర్‌వాటర్ అరెస్ట్ అది.

అప్పుడు.. ఈ దీవి రాజధాని సెయింట్ పీటర్ పోర్ట్‌లో గల కాసిల్ కార్నెట్ తీరంలో ఒక డైవర్ సముద్రం లోపలి నుంచి ఓర్మర్‌ను బయటకు తీసుకురావటం అటుగా వెళ్లున్న ఒక వ్యక్తి చూశాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కానిస్టేబుల్ డేవిడ్ ఆర్చర్.. అక్కడికి వచ్చి స్కూబా పరికరాలు ధరించి సముద్రంలోకి డైవ్ చేసి, సముద్ర గర్భంలో ఉన్న నిందితుడు కెంప్‌థార్న్ లీని అరెస్ట్ చేశారు. ఓర్మర్ విషయంలో చట్టం చేతులు ఎంత దూరమైనా వస్తాయని నిరూపించారు.

ఓర్మర్

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచంలో ప్రజలు ఇష్టపడే చాలా ఆహారాల విషయంలో లాగానే ఓర్మర్ విషయంలోనూ దానిని ఎలా వండి తినాలి అనే దానిపై జనం మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బ్రిటిష్ సముద్ర ఆహార వంటగాడు రిక్ స్టీన్ ఈ దీవిని సందర్శించినపుడు.. ఓర్మర్ నత్తను సన్నగా కోసి, ఫ్లాష్ ఫ్రై చేస్తే బాగుంటుందని చెప్పాడు. ఇక సంప్రదాయ గెర్నెసీ విధానంలో.. ఓర్మర్‌ను చెక్క సుత్తితో కొట్టి, దానికి పిండి పట్టించి, గ్రేవీలో ఎనిమిది గంటల పాటు సన్నని మంట మీద ఉడికిస్తారు. ఓర్మర్‌ను పంది పొట్ట, కారట్లు, వెన్న, పలు ఆకులతో కలిపి ఉడికించే పదిహేడో శతాబ్దపు కాసరోల్ బాగుంటుందని టేస్ట్ అట్లాస్ చెప్తోంది.

‘‘ఓర్మర్లను చాలా నెమ్మదిగా కానీ, చాలా వేగంగా కానీ ఉడికించాలి.. లేదంటే వంట పాడైపోతుంది. ఓర్మర్లను తాజాగా ఉన్నపుడే స్టర్ ఫ్రై కానీ, పాన్ మీద రోస్ట్ చేసి గానీ తింటే చాలా బాగుంటాయి’’ అంటారు పెరీయో.

సముద్రం గడ్డ కడుతుందా అన్నట్టు ఉండే చలి నెలల్లో.. ఆ నీటిలో దాదాపుగా మునుగుతూ ఓర్మర్లను వేటాడటం చాలా అద్భుత అనుభవమని ఆయన చెప్తారు. ఇంకా.. నీటిలో కాళ్లు జారిపోయే ఎత్తుపల్లాల రాళ్ల గుట్టల్లో ఇతర ప్రమాదాలూ ఎదురవుతుంటాయి. వేళ్ల తెగటం, నలగటం వంటివి కూడా జరుగుతుంటాయి. అంతేనా.. అకస్మాత్తుగా పెద్ద పెద్ద అలలు పుట్టుకొచ్చి విరుచుకుపడుతున్నాయేమో ఎప్పుడూ జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది.

ఇన్ని ప్రమాదాలున్నా కానీ స్థానికులు శతాబ్దాలుగా ఓర్మర్లను సేకరిస్తూనే ఉన్నారు. అయితే.. ఈ నత్తలు ఎనిమిది కోట్ల సంవత్సరాల నుంచీ.. అంటే ఈ సముద్ర తీరంలో డైనోసార్లు సంచిరించిన కాలం నుంచీ జీవిస్తున్నాయి. ఓర్మర్లను డైనోసార్లు ఇష్టపడేవా లేదా అనేది తెలీదు కానీ.. ఇటీవలి కాలంలో గెర్నెసీలో ఆకలితో ఉన్న మనుషులకు మాత్రం ఓర్మర్లు ఆహారవనరుగా ఉపయోగపడ్డాయి.

ఓర్మర్

ఫొటో సోర్స్, Laura Bampton

‘‘కష్ట కాలాల్లో ఆహార కొరతను తీర్చుకోవటానికి ఓర్మర్లను సేకరించటం ఒక మార్గంగా ఉంటుంది. వీటిని పచ్చళ్లుగా చేసుకుని దాచుకుంటారు’’ అని పెరీరో తెలిపారు. 1940-45లో జర్మనీ బలగాలు ఈ దీవిని ఆక్రమించినపుడు కూడా ఇక్కడి ప్రజలను ఓర్మర్లు బతికించాయి.

కొన్ని సంవత్సరాల్లో ఓర్మర్ల పంట రికార్డులు సృష్టించాయి. 1841లో పెరిల్ బేలో ఒక్క రోజులోనే ఇరవై వేల ఓర్మర్లను పట్టుకున్నారు. 1965లో 400 మంది సేకర్తలు దాదాపు 31,000 ఓర్మర్లను సేకరించారు. ఆ తర్వాత రెండేళ్లలో ఒక సీజన్‌లో రెండు లక్షల ఓర్మర్లను సేకరించారు.

ఇంత పెద్ద మొత్తంలో ఓర్మర్లను వేటాడటం వల్ల వాటి సంఖ్య దెబ్బతినటంలో ఆశ్చర్యం లేదు. ఓర్మర్ల వేట మీద పరిమితులు విధిస్తూ గెర్నెసీలో మొదటిసారిగా 1876లోనే చట్టాలు చేశారు. ఇక 1974 నుంచి 1976 వరకూ వరుసగా మూడు సంవత్సరాల పాటు ఓర్మర్ సీజన్‌ను.. అంటే వేటను రద్దు చేశారు.

ఓర్మర్ల జనాభా ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నప్పటికీ.. వాటి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. 2018లో ప్రాజెక్ట్ ఓర్మర్ పేరుతో ఒక కార్యక్రమం ప్రారంభించారు. మెరైన్ బయాలజిస్ట్ లారా బాంప్టన్ సారథ్యంలో వలంటీర్లు సర్వే నిర్వహించి.. తమకు కనిపించిన ఓర్మర్లకు ఒక నంబరుతో కూడిన ఆకుపచ్చని లేబుల్ అంటిస్తున్నారు.

‘‘ఈ ప్రాజెక్టుతో జనంలో ఆసక్తి రేగింది. ఓర్మర్లను తినటం గురించి మాత్రమే కాకుండా.. వాటి సంరక్షణ గురించి కూడా మాట్లాడుతున్నారు’’ అని లారా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)