తల్లి పాలు ఎవరు దానం చేయవచ్చు? తల్లిపాల సేకరణ ఎలా చేయాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ శైలజ చందు
- హోదా, బీబీసీ కోసం
శిశువులకు తల్లిపాలు ఉత్తమ పోషకాహారం.
బిడ్డ జన్మించాక మొదటి 6 నెలల్లో శిశువులకు ప్రత్యేకంగా తల్లిపాలు ఇవ్వాలి
తల్లిపాలు అందించడం ద్వారా, శిశువులలో అతిసార వ్యాధి, న్యుమోనియా రాకుండా నివారించవచ్చు. తద్వారా శిశు మరణాల సంఖ్య తగ్గుతుంది.
తల్లిపాలు తాగిన పిల్లల్లో ఊబకాయం, మధుమేహ వ్యాధులు తక్కువగా కనిపిస్తాయి.
అంతే కాదు, తల్లి పాలతో ఖర్చు తక్కువ, ఆరోగ్యం ఎక్కువ .
అయితే, కొంతమంది శిశువులకు అనేక కారణాల వల్ల తల్లి పాలు అందుబాటులో ఉండవు. వారికి కృత్రిమ పాల పొడుల బదులు, దాతలనుండి సంగ్రహించిన పాలు ఇవ్వడం ద్వారా మెరుగైన ఆరోగ్యం అందించవచ్చు.

మానవ తల్లి పాల బ్యాంకు(Human Milk Bank) అంటే ఏమిటి?
ఈ మిల్క్ బ్యాంక్ తల్లి పాల దాతలను ఏర్పాటు చేసి, వారినుండి పాలను సేకరిస్తుంది. ఆ పాలలో సూక్ష్మ క్రిములేమైనా వున్నాయా లేవా అని పరీక్షిస్తారు.
ఆ తర్వాత పాలను పాశ్చరైజ్ చేసి, నిల్వ చేస్తారు. పాశ్చరైజేషన్ పద్ధతి ద్వారా పాలలో విషపూరిత, బ్యాక్టీరియా లేదా వైరల్ క్రిములు (HIV మరియు SARS తో సహా -CoV-2) ప్రమాదాన్ని తొలగిస్తారు. తల్లి పాల పోషకాహార విలువలు, రోగనిరోధక లక్షణాలు మాత్రం యథాతథంగా వుంటాయి.
ఎన్నో కారణాలవల్ల తల్లిపాలు లభ్యంకాని శిశువులకు మరియు కుటుంబాలకు, డోనర్ పాలను మిల్క్ బాంక్ పంపిణీ చేస్తుంది .
తల్లి పాల దాతలంటే ( Human Milk donors) ఎవరు?
మిల్క్ డోనర్స్.. ఆరోగ్యమైన ప్రసవానంతర మహిళలు.
వారి బిడ్డలకు పాలు ఇవ్వగా, మిగులుతూ వుండే పాలను మిల్క్ బాంక్‌లో డొనేట్ చేస్తారు.
కృత్రిమ ఫార్మూలా పాలతో పోల్చి చూస్తే పాశ్చరైజ్డ్ డోనర్ పాలకు పోషకాహార విలువలు ఎక్కువ.
బిడ్డకు అవసరమైన రోగనిరోధక శక్తిని అందిస్తుంది.
డోనర్ పాలనుండి లభించిన ఇమ్యూనిటీ వల్ల నెలల ముందు జన్మించిన బిడ్డలు లేదా తక్కువ బరువు ఉన్న శిశువులలో ఇన్ఫెక్షన్ సమస్యలు తగ్గుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
డోనర్ తల్లి పాలు ఎవరికి అవసరం?
ఈ క్రింది సందర్భాలలో జన్మించిన శిశువులకు డోనర్ మిల్క్ అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడొచ్చు.
- ఒకే కాన్పులో కవలలు లేదా అంతకన్నా ఎక్కువ మంది బిడ్డలు జన్మించినపుడు, ఆ బిడ్డలకు తల్లి పాలు సరిపోనపుడు
- కాన్పు తర్వాత, తల్లి మరణిస్తే
- బిడ్డని ప్రసవించి, తల్లి వదిలి వెళ్లిపోయినపుడు
- తల్లికి HIV సోకినపుడు, ఆమె తన పాలివ్వడం ద్వారా, బిడ్డకు HIV సోకే ప్రమాదం వుంది
- తల్లికి బ్రెస్ట్ కాన్సర్ సోకినపుడు లేదా, ఆ వ్యాధికి సర్జరీ జరిగినపుడు
- తల్లి కీమోతెరపీ తీసుకుంటున్నపుడు, లేదా ఇతర ప్రమాదకరమైన మందులు వాడుతున్నపుడు
- కొకైన్ మరియు గంజాయిని ఉపయోగించే తల్లులు, శిశువుకు తమ పాలివ్వడం ద్వారా, బిడ్డలలో దీర్ఘాకాలిక నరాల సమస్యలు, ప్రవర్తనాలోపాలు తలెత్తే అవకాశం వుంది
- లెస్బియన్, స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులు మరియు లింగమార్పిడి (LGBT) జంటలు, పాలిచ్చే సామర్థ్యం లేని దత్తత చేసుకున్న తల్లిదండ్రులు
- బిడ్డ పుట్టిన తర్వాత మొదటి రోజుల్లో, తగినంత తల్లి పాలు లేని తల్లులు ఈ మిల్క్ బాంక్ సేవలనుపయోగించుకోవచ్చు.
తల్లి పాలు ఎవరు దానం చేయవచ్చు?
ఆరోగ్యవంతురాలైన స్త్రీ, మరియు ఆరోగ్యకరమైన జీవన విధానం కలిగిన వున్న ప్రసవానంతర మహిళ అయి వుండాలి.
ఏ రకమైన ఇన్ఫెక్షన్లూ లేవని రక్త పరీక్షల ద్వారా నిర్ధారించబడి వుండాలి. తన బిడ్డకు సంతృప్తికరంగా పాలు తాగించిన తర్వాత, డొనేట్ చేయగలినన్ని పాలు కలిగి వుండాలి. ఆమె శిశువుకు ఆరోగ్యవంతమైన పెరుగుదల కలిగి వుండాలి.
తల్లిపాలు డొనేట్ చేయాలనుకునే మహిళ, పొగాకు ఉత్పత్తులు కానీ, నిషేధించబడిన డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ మరియు మితిమీరి కాఫీ పానీయాలు తీసుకునే అలవాటు లేనివారై వుండాలి.
HIV, HTLV, హెపటైటిస్ B లేదా C లేదా సిఫిలిస్ ఇన్ఫెక్షన్ వున్న మహిళలు, ఆమెకు లేదా, ఆమె లైంగిక భాగస్వామికి HBV, HIV, HCV మొదలైన ఇన్ఫెక్షన్లు వున్నట్లైతే, ఆ మహిళలు తమ బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేయడానికి అనర్హులు.
గత 12 నెలల్లో ఏదైనా అవయవ మార్పిడి లేదా కణజాల మార్పిడి చేయించుకున్న స్త్రీలు, ఏదైనా రక్త మార్పిడి/రక్త ఉత్పత్తిని స్వీకరించిన స్త్రీలు కూడా పాలు డొనేట్ చేయకూడదు.
రేడియోధార్మిక లేదా ఇతర ఔషధాలను తీసుకుంటున్నట్లైతే ఇవి తల్లిపాలలో విసర్జించబడతాయి. ఆ పదార్థాలు శిశువుకు విషపూరితమైనవి.
చెస్ట్ ప్రాంతంలో చనుమొన లేదా హెర్పెస్ లేదా చికెన్ పాక్స్ ఇన్‌ఫెక్షన్ లేదా ఫంగల్ ఇన్‌ఫెక్షన్ వున్నట్లైతే, పాలను డొనేట్ చేయకూడదు.

తల్లిపాల సేకరణ ఎలా చేయాలి?
సరైన కౌన్సెలింగ్ ఇచ్చాక, వ్రాతపూర్వక సమ్మతి తీసుకోవాలి. ఆపైన ఆమె ఆరోగ్య వివరాలు సేకరించి, శారీరక పరీక్ష జరిపి, ప్రయోగశాల పరీక్షల కోసం నమూనా తీసుకున్న తర్వాత, దాతను తల్లిపాలను సేకరించే ప్రాంతానికి పంపుతారు.
పరిశుభ్రమైన జాగ్రత్తలతో శిక్షణ పొందిన సిబ్బంది సహాయంతో తల్లిపాలను సేకరిస్తారు. కలుషితమయ్యే ప్రమాదం ఉన్నందున తల్లిపాలను ఇంటి సేకరణ చేయడం మంచిది కాదు.
సరిగ్గా లేబుల్ చేయబడిన స్టెరియిల్ కంటైనర్‌లో పాలను సేకరించి, కోల్డ్ స్టోరేజ్ పరిస్థితిలో HMB (Human Milk Bank)కి రవాణా చేస్తారు.
సేకరించిన తల్లి పాలను మైక్రోబయొలాజికల్ స్క్రీనింగ్ ద్వారా సూక్ష్మ క్రిములున్నాయేమోనని పరీక్ష చేస్తారు. పాశ్చురైజ్ చేసి, కల్చర్ టెస్ట్ లో బాక్టీరియా టెస్ట్ నెగెటివ్ వచ్చాక నిల్వ చేసిన పాలను, అవసరమైన శిశువులకు పంపిణీ చేస్తారు.
ఆసియాలోని మొట్టమొదటి పాల బ్యాంకు 1989లో ముంబైలోని సియాన్ హాస్పిటల్‌లో స్థాపించబడింది.
ఫీడింగ్ కోసం ఘనీభవించిన పాశ్చరైజ్డ్ దాత పాలను ఎలా సిద్ధం చేయాలి?
4 ° C వద్ద రిఫ్రిజిరేటర్‌లో 24 గంటల పాటు నెమ్మదిగా దాత పాల కంటైనర్‌లను డీఫ్రాస్ట్ చేయాలి. (సూక్ష్మజీవుల పెరుగుదలను నివారించడానికి పాల ఉష్ణోగ్రత, 8 ° C కి చేరుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి.)
అత్యవసర, అసాధారణమైన సందర్భాలలో, కంటైనర్లను గది ఉష్ణోగ్రత వద్ద లేదా వెచ్చని నీటి కింద డీఫ్రాస్ట్ చేయవచ్చు.
త్వరగా డీఫ్రాస్టింగ్ చేసిన పాలను వెంటనే ఉపయోగించాలి. మళ్లీ రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడదు.
కృత్రిమ ఫార్ములా పాలతో పోలిస్తే, డోనర్ పాలకు విస్తృతమైన ప్రయోజనాలున్నాయి.
నెలల ముందుగా జన్మించే శిశువుల ఆరోగ్యానికి, పెరుగుదలకు, దేశవ్యాప్తంగా, ముఖ్యమైన ఆసుపత్రులలో పాల బ్యాంకులను ఏర్పాటు చేయడం అత్యవసరం.
(అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- INDvsENG: 21 మంది ఆటగాళ్లతో ఇంగ్లండ్ వెళ్లిన భారత్ 11 మందిని మైదానంలోకి దించలేకపోవడానికి కారణం ఏంటి?
- గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామాకు కారణమేంటి? మోదీ, షా ప్లాన్ ఏంటి?
- సెప్టెంబర్ 11 దాడులు: అమెరికాలో ఆ రోజు ఏం జరిగింది?
- ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు ఎలా జరిగాయి, "ఐ డిడింట్ లైక్ ఫిరోజ్" అని ఇందిర ఎందుకన్నారు?
- అఫ్గానిస్తాన్: పంజ్‌షీర్ లోయపై పాకిస్తాన్ డ్రోన్లు దాడి చేశాయా?
- ‘బుర్ఖా వేసుకుని, మారువేషంలో 11 చెక్పాయింట్లను దాటి వెళ్లా. కానీ..’
- ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా.. తాలిబాన్‌ను ఎందుకు ఓడించలేకపోయింది?
- తాజా నర మాంసాన్ని మేలైన ఔషధంగా ప్రాచీన వైద్య నిపుణులు ఎందుకు భావించేవారు?
- రిటైర్మెంట్ కోసం రూ.కోటి సరిపోతాయా.. భవిష్యత్తులో నిజంగా ఎంత డబ్బు అవసరం?
- హైదరాబాద్ మెట్రోను అమ్మేస్తారా, నష్టాలకు కారణాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)











