ప్రిన్సెస్ మాకో: సామాన్యుడిని పెళ్లి చేసుకోనున్న జపాన్ రాకుమారి, అక్టోబరు 26న వివాహం

ఫొటో సోర్స్, Getty Images
ఏళ్ల తరబడి సాగిన వివాదం తరువాత, ఈ నెలలో జపాన్ రాకుమారి మాకో తన ప్రియుడు, క్లాస్‌మేట్ కొమురోను పెళ్లి చేసుకోనున్నారు. ఆ తర్వాత ఆమె రాజకుమార్తె హోదాను, రాచరికాన్ని వదిలిపెట్టనున్నారు. జపాన్ ప్రిన్స్ పుమిహిటో కుమార్తె మాకో.
మాకో, కొమురోల వివాహం అక్టోబర్ 26న జరగనున్నట్లు ఇంపీరియల్ హౌజ్‌హోల్డ్ ఏజెన్సీ వెల్లడించింది.
ఈ జంట 2018లోనే వివాహం చేసుకోబోతున్నట్లుగా ప్రకటించింది. కానీ ఆ సమయంలో కొమురో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న కారణంగా వారి వివాహాన్ని నిలిపివేశారు.
పెళ్లి తర్వాత ఈ జంట అమెరికాలో స్థిరపడాలని భావిస్తోంది. కొమురో అక్కడే న్యాయవాదిగా పనిచేస్తారు.
వీరిద్దరిపై స్థానిక మీడియా ఎక్కువ దృష్టిని కేంద్రీకరించింది.
రాకుమారితో పాటు కొమురో కుటుంబంపై చాలాకాలంగా మీడియా విపరీత కవరేజీ వల్ల.. మాకో పోస్ట్-ట్రామటిక్ స్ట్రెస్ డిజార్డర్‌తో బాధపడుతున్నారని ఇంపీరియల్ హౌజ్‌హోల్డ్ ఏజెన్సీ చెప్పినట్లు వార్తా సంస్థ క్యోడో తెలిపింది.
ఆమె అత్త మసాకో కూడా ఒత్తిడి సంబంధిత అనారోగ్యంతో బాధపడ్డారు. రాజ కుటుంబానికి వారసున్ని అందించాలని మసాకోపై విపరీతమైన ఒత్తిడి ఉండేది. జపాన్‌లో మానసిక అనారోగ్యం అనే అంశం తరచుగా వార్తల్లో ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
టోక్యోలోని ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీలో తొలిసారిగా వీరిద్దరూ 2017లో కలుసుకున్నారు.
అదే సంవత్సరంలో నిశ్చితార్థం కూడా జరిగింది. మరుసటి ఏడాది పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఆ తర్వాతే, కొమురో తల్లి ఆర్థిక సమస్యల గురించి వార్త కథనాలు బయటకొచ్చాయి. తన మాజీ ఫియాన్సీ నుంచి డబ్బు తీసుకున్న ఆమె తిరిగి చెల్లించలేదని తెలిసింది.
వీరిద్దరి వివాహం ఇంత ఆలస్యం కావడానికి ఇదే కారణమని అందరూ అంటున్నప్పటికీ, రాజభవనం ఈ వ్యాఖ్యలను ఖండించింది. మరోవైపు ప్రిన్స్ ఫుమిహిటో మాత్రం పెళ్లికి ముందే ఆర్థిక సమస్యలను పరిష్కరించడం చాలా ముఖ్యమని అన్నారు.
వివాహం సందర్భంగా ఆనవాయితీ ప్రకారం లభించే 15 కోట్ల యెన్(సుమారు రూ. 10 కోట్లు)ల మొత్తాన్ని కూడా మాకో వదులుకోనున్నారు.
రాజ కుటుంబ వివాహానికి సంబంధించిన ఆచారాలను కూడా తన పెళ్లిలో పాటించకూడదని మాకో భావిస్తున్నారు. ఒకవేళ ఆమె రాజకుటుంబ వివాహా ఆచారాలతో పాటు తనకు లభించే డబ్బును వదులుకుంటే ఇలా చేసిన రాజకుటుంబానికి చెందిన తొలి మహిళగా ఆమె నిలుస్తారు.
జపాన్ చట్టం ప్రకారం, సామాన్యులను వివాహం చేసుకున్న రాజకుటుంబానికి చెందిన మహిళ రాజరికాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఈ షరతు రాజకుటుంబాలకు చెందిన పురుషులకు వర్తించదు.

జపాన్ హ్యారీ, మేఘన్
మరికో ఓయి, బీబీసీ న్యూస్
కీ కొమురోకు ఇప్పటికే వివాదాస్పద వ్యక్తిగా పేరుంది. ఈ వారం ప్రారంభంలో, వివాహ ప్రకటనకు ముందు టోక్యోకు వచ్చిన ఆయన పోనీ టెయిల్ కారణంగా మీడియా దృష్టిని ఆకర్షించారు.
వ్యక్తుల ఆహార్యానికి పెద్ద పీట వేసే దేశంలో ఇప్పటికే కొందరు జపనీయులు... ప్రిన్సెస్ మాకోను పెళ్లి చేసుకునేందుకు కొమురో సరైన వ్యక్తి కాదనేందుకు ఆయన కొత్త హెయిర్ స్టయిలే నిదర్శనమని అంటున్నారు.
నిశ్చితార్థం జరిగిన నాటి నుంచి ఈ జంటపై, ప్రజల్లో ఎలాంటి లోతైన పరిశీలన ఉందో ఇది చూపిస్తుంది. ఆయన తల్లి ఆర్థిక సమస్యలతో పాటు, రాజకుటుంబంతో సంబంధాల కారణంగానే కొమురో... యూఎస్ లా స్కూల్లో చేరగలిగాడనే వార్తలు ముఖ్యాంశాలుగా నిలిచాయి.
రాజకుటుంబంలోని వ్యక్తితో నిశ్చితార్థం కారణంగా ఎదురైన మీడియా ఒత్తిడిని ఆయన ఎదుర్కొన్న తీరును కొందరు మద్దతుదారులు కీర్తిస్తారు.
పెళ్లి తర్వాత అమెరికాలో జీవించాలనే వారి నిర్ణయం 'హ్యారీ అండ్ మేఘన్ ఆఫ్ జపాన్' అనే నిక్‌నేమ్‌ను సంపాదించి పెట్టింది.
ఇవి కూడా చదవండి:
- చైనా ప్రపంచానికి సాయం చేస్తోందా, లేక అప్పుల ఊబిలో ముంచేస్తోందా?
- తెలంగాణ: కరెంటు కనెక్షన్ లేకున్నా లక్షల్లో బిల్లులు - ప్రెస్ రివ్యూ
- నిజమైన గూఢచారులు జేమ్స్బాండ్లాగే ఉంటారా? సీక్రెట్ సర్వీస్‌లో పనిచేసే ఆఫీసర్ ఏం చెబుతున్నారు
- ‘13 ఏళ్ల నా చెల్లెలిని బలవంతంగా పెళ్లి చేసుకుంటామని తాలిబాన్లు మెసేజ్ పంపించారు’
- ‘ఆయన నాపైన చేయి కూడా వేయడం లేదు, దగ్గరకు వెళ్లినా అటు తిరిగి పడుకుంటున్నారు’
- తాలిబాన్లతో ట్రంప్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందమే అఫ్గానిస్తాన్ ప్రస్తుత సంక్షోభానికి కారణం: అమెరికా రక్షణ అధికారులు
- తెలంగాణ, ఏపీ ఉపఎన్నికలు: ఆ రెండు నియోజకవర్గాల్లో అధికారపార్టీ వ్యూహాలేంటి, ప్రతిపక్షాలు ఏం చేయబోతున్నాయి?
- విప్లవ మహిళ విగ్రహాన్ని అశ్లీలంగా తయారుచేశారంటూ ఆందోళన
- Astro: ఇది అమెజాన్ రోబో... దీని ప్రత్యేకతలేంటో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








