సెక్సువల్ అటానమీ: భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా, సెక్స్ ‌భంగిమల కోసం బలవంతం చేయవచ్చా... చట్టం ఏం చెబుతోంది?

సెక్సువల్ అటానమీ

ఫొటో సోర్స్, Science Photo Library

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రాధికకు (పేరు మార్చాం) 2016లో వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజుల వరకు ఆమె వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. కానీ, కొన్ని నెలలకే ఆమె భర్త సెక్స్ విషయంలో ఆమెతో ప్రవర్తించే తీరు మారిపోయింది.

ప్రతీ రోజూ బ్లూ ఫిల్మ్ వీడియోలు తీసుకొచ్చి ఆ ఫిల్మ్‌లో చూపించిన మాదిరిగా అసహజ ధోరణిలో సెక్స్ చేయమని బలవంత పెట్టడం మొదలు పెట్టారు.

పోర్న్ సీన్లలో మాదిరిగా వివిధ భంగిమల్లో సెక్స్ చేయాలంటూ రోజూ వేధించేవారు. ఆమె కొన్ని రోజుల పాటు ప్రతిఘటించారు. కానీ, భర్త బలత్కారం చేయడం ఎక్కువైపోయింది.

ఒక రోజు బలవంతంగా అసహజ ధోరణిలో లైంగిక వాంఛ తీర్చుకున్నారు. దాంతో, ఆమెకు తీవ్ర రక్తస్రావం కూడా జరిగింది.

ఇక ఆ బాధను భరించలేక చివరకు 2019లో హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో భర్త పై ఫిర్యాదు చేశారని, ఆమె తరఫు న్యాయవాది శ్రీకాంత్ చింతల బీబీసీకి చెప్పారు.

ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.

పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌లో వివాహాన్ని పవిత్రంగా భావిస్తారు.

భార్య శరీరంపై హక్కు ఎంత వరకు?

వివాహం జరిగినంత మాత్రాన ఆమె శరీరంపై హక్కు భర్తకు ఇచ్చేసినట్లేనా? అటువంటి మనిషితో జీవితం కొనసాగించి పిల్లల్ని కనాలో వద్దో నిర్ణయించుకునే హక్కు మహిళకు ఉంటుందా లేదా?

ఒక మహిళ లైంగిక సంబంధానికి అంగీకారం తెలిపినంత మాత్రాన ఆమె పునరుత్పత్తి హక్కుల పై అధికారాన్ని కోల్పోయినట్లు కాదంటూ ఇటీవల దిల్లీ కోర్టు పేర్కొంది.

ఒక మహిళపై అనేక సార్లు అత్యాచారం జరిపి ఆమెను గర్భస్రావం చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చిన వ్యక్తికి బెయిల్ నిరాకరిస్తూ దిల్లీ కోర్టు జడ్జి ఈ వ్యాఖ్యలు చేశారు.

లైంగిక సంబంధానికి అంగీకారం తెలిపినంత మాత్రాన ఆమె పై లైంగిక దోపిడీ చేసేందుకు గానీ , ఆమె పునరుత్పత్తి హక్కులను పూర్తిగా మరొకరి చేతిలో పెట్టినట్లు కాదని అడిషనల్ సెషన్స్ జడ్జి విశాల్ గోగ్నే పేర్కొన్నారు.

ఒకవేళ మహిళ అనేక సార్లు బలవంతంగా గర్భస్రావానికి లోను కావడం వల్ల లేదా ఆమె పునరుత్పత్తి హక్కులకు భంగం వాటిల్లుతుందని భయపడిన పక్షంలో ఆమె తెలిపిన లైంగిక అంగీకారం ప్రశ్నార్థకమే అవుతుందని, ఆమె అంగీకారం నిజంగానే తెలిపారా లేదా అనే విషయాన్ని విచారణకు ముందు పరిగణించలేమని కోర్టు పేర్కొంది.

శ్రీకాంత్ చింతల

ఫొటో సోర్స్, SRIKANTH CHINTALA

ఫొటో క్యాప్షన్, న్యాయవాది శ్రీకాంత్ చింతల

సెక్స్‌కు ఓకే చెబితే స్త్రీ తన శరీరంపై హక్కులను కోల్పోతుందా?

వివాహం అయినంత మాత్రాన, లేదా లైంగిక సంబంధానికి ఆమోదం తెలిపినంత మాత్రాన లైంగిక చర్యలో ఆమె శరీరాన్ని దోపిడీ చేసే అధికారం గాని, బలవంతంగా అత్యాచారం చేసే అధికారం కానీ ఉండదని న్యాయవాది శ్రీకాంత్ చింతల చెప్పారు.

సెక్స్ జరిగే క్రమంలోసైతం - స్త్రీ తనకి 'నచ్చట్లేదు -వద్దు' అని చెప్తే... అది తన అంగీకారం విరమించుకున్నట్టే పరిగణించాలని చట్టం చెబుతుందని తెలిపారు.

మహిళ, మారిటల్ రేప్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

లైంగిక అటానమీ (స్వయం ప్రతిపత్తి) అంటే ఏంటి?

స్త్రీ పురుషుల లైంగిక స్వేఛ్చ పూర్తిగా వారి వ్యక్తిగతం. వారికి మాత్రమే సంబంధించిన సంపూర్ణ హక్కు. ఆ హక్కులో తాము అంగీకారపూర్వకంగా ఎంచుకున్న లైంగిక భాగస్వామికి సైతం ఎటువంటి అధికారం ఉండదు.

ఒక సారి లైంగిక సంబంధానికి ఆమోదం తెలిపినంత మాత్రాన అవతలి వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడడం, హింసకు గురి చేసే హక్కు అవతలి వ్యక్తికి ఉండదు.

అలాగే, అంగీకారం తెలిపిన తర్వాత కూడా ఆమెకు సెక్స్ మధ్యలో ఇబ్బంది కలిగిన పక్షంలో 'నో' అనే చెప్పే పూర్తి అధికారాలుంటాయి" అని శ్రీకాంత్ వివరించారు.

గర్భస్రావ చట్టం

ఫొటో సోర్స్, fpg

సెక్స్‌ కు అంగీకారం గర్భానికి కూడా వర్తిస్తుందా?

"ఒక స్త్రీ శారీరక సంబంధానికి తన అంగీకారం తెలిపినంత మాత్రాన, గర్భం దాల్చే అంశం పై కూడా అంగీకారం తెలిపినట్టు కాదు".

"పురుషుడికి ఆ విషయంలో ఎటువంటి హక్కు ఉండదు. అది భర్త అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా" అని శ్రీకాంత్ అన్నారు.

"చట్టంలో కూడా గర్భం దాల్చాలా వద్దా అనే అంశాన్ని పూర్తిగా స్త్రీ స్వేచ్చకు మాత్రమే వదిలేశారు. భర్తకి సైతం తన భార్య గర్భం మీద ఎటువంటి హక్కు లేదు" అని శ్రీకాంత్ అంటారు.

కొండవీటి సత్యవతి

ఫొటో సోర్స్, KONDAVEETI SATYAVATI/FACEBOOK

అయితే, ఈ హక్కులు పూర్తిగా మహిళకు చెందినవే అని చెప్పేందుకు చట్టాల్లో కచ్చితమైన నియమాలు లేవని స్త్రీవాద పత్రిక ‘భూమిక’ నిర్వాహకురాలు కొండవీటి సత్యవతి అన్నారు.

భర్త అనుమతి లేకుండా అబార్షన్లు చేయటం లేదని సత్యవతి అన్నారు. ఇప్పటికీ ఆసుపత్రుల్లో అబార్షన్ కోసం వెళ్లిన మహిళల నుంచి భర్త అనుమతి ఉందో లేదో డాక్టర్లు ప్రశ్నిస్తున్నారని ఆమె అంటారు.

గర్భస్రావం, లేదా పిల్లల్ని కనే విషయంలో ఎంత మంది మహిళలకు, ముఖ్యంగా గ్రామీణ మహిళలకు స్వయం నిర్ణయాధికారం ఉందని ప్రశ్నించారు.

2017లో అనిల్ కుమార్ మల్హోత్రా వెర్సస్ అజయ్ పశ్రీచా కేసులో "గర్భం దాల్చాలా వద్దా అనే అంశంలో తుది నిర్ణయం మహిళదే. వైవాహిక సంబంధానికి అంగీకారం తెల్పినంత మాత్రాన ఆ పురుషుడి బిడ్డకి తల్లినౌతాను అని అంగీకరించినట్టు కాదు" అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని శ్రీకాంత్ ఉదహరించారు.

మహిళ కార్టూన్

ఫొటో సోర్స్, Getty Images

"చట్టరీత్యా గర్భస్రావం చేయించుకునే అనుమతి ఉంటే, అలాంటి అనుమతిని చట్టం కేవలం స్త్రీ స్వేచ్చకి మాత్రమే వదిలిపెట్టింది. గర్భస్రావం చేస్తున్న డాక్టర్ సైతం కేవలం స్త్రీ అంగీకారం మాత్రమే అడిగితే సరిపోతుంది. పురుషుడి అంగీకారం అవసరం లేదు. అయితే భర్త అనుమతి లేకుండా గర్భం తీయించుకుంటే, అది నేరం కాకపోయినప్పటికీ, భర్త ఆ కారణాన్ని చూపించి విడాకులు కోరే అవకాశం ఉంటుంది" అని శ్రీకాంత్ వివరించారు.

2008లో సుమన్ కపూర్ వర్సెస్ సుధీర్ కపూర్ కేసులో భర్త అనుమతిలేకుండా భార్య గర్భం తీయించుకోవడాన్ని సుప్రీం కోర్టు హిందూ వివాహ చట్టం సెక్షన్ 13(1) (ఏ) ప్రకారం క్రూరత్వంగా పరిగణించి విడాకులు మంజూరు చేసిన కేసును ఉదహరించారు.

మ్యారిటల్ రేప్స్

ఫొటో సోర్స్, Getty Images

మారిటల్ రేప్‌కు శిక్షలున్నాయా?

ఒక వైపు స్త్రీ శరీరం పై ఆమెకు మాత్రమే సంపూర్ణ హక్కులున్నాయని చట్టం చెబుతున్నప్పటికీ, దేశంలో మారిటల్ రేప్ కోసం ప్రత్యేక చట్టాలు లేవు.

లైంగిక చర్యకు భార్య సమ్మతి ఉండాలని వివాహ బంధం సూచిస్తుంది. భర్త కోరికలను భార్య తిరస్కరించరాదంటూ సమాజంలో పాతుకుపోయిన నమ్మకం ఉండడంతో వైవాహిక అత్యాచార అంశం సాధారణంగా మారిపోయింది.

"'భార్యకు ఇష్టం లేనప్పటికీ భర్త బలవంతంగా లైంగిక చర్యలో పాల్గొనడం నేరం కాదంటూ'' ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌కే చంద్రవంశీ ఆగస్టు 2021లో ఇచ్చిన తీర్పు సమాజంలో నాటుకుపోయిన అభిప్రాయాన్ని బలపరుస్తోంది.

భారతీయ చట్టం వైవాహిక అత్యాచారాన్ని గుర్తించనందున ఆ వ్యక్తి అసహజ సెక్స్ పద్ధతులు ప్రయత్నించినప్పటికీ ఆయన్ను నేరస్తుడిగా పరిగణించి తీవ్రమైన శిక్షలు విధించలేమని ఆ కేసులో జడ్జి పేర్కొన్నారు.

అత్యాచార నిందితుల ఆయుధం పెళ్లి

ఫొటో సోర్స్, Gopal Shoonya

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని సుదీర్ఘ కాలంగా ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ, 36 దేశాల్లో ఇది కేవలం చట్టంగానే మిగిలిపోయింది. అందులో భారత్ కూడా ఉంది.

31 శాతం మంది వివాహితలు అంటే కనీసం ముగ్గురిలో ఒకరు... తమ భర్తల కారణంగా శారీరక, మానసిక హింసలకు గురవుతున్నట్లు ఓ సర్వేలో తేలింది.

భర్త బలవంతంగా భార్యతో సంభోగిస్తే (సెక్స్ చేస్తే) చట్టప్రకారం అది అత్యాచారం అనే నిర్వచనంలోకి రాదు.

సుప్రీం కోర్టు ఈ విషయంలో తుది తీర్పు తెలపాల్సివుంది అని అంటూ, "బలవంతంగా సెక్స్ చేయటం లో చాలా సార్లు భర్త తన భార్యతో ఘర్షణ పడొచ్చు, కొట్టొచ్చు, నిర్బంధించవచ్చు లేదా బెదిరించ వచ్చు. అలా భర్త చేసే లైంగిక దాడిలో భాగంగా జరిగే ఘర్షణ, బలప్రయోగం (ఫోర్స్), గాయపర్చటం (హర్ట్), నిర్బంధించటం (కన్ఫైన్‌మెంట్ )లాంటివి జరిగితే, ఆయా నేరాలకు భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లో తగిన శిక్షలు వున్నాయి" అని శ్రీకాంత్ చెప్పారు.

మహిళ, మారిటల్ రేప్

ఫొటో సోర్స్, Thinkstock

ఈ సమస్యకు పరిష్కారం లేదా?

"స్త్రీ శరీరం అంటే ఒక యంత్రం కాదు. బిడ్డను కనేందుకు గర్భం దాల్చాలి, తొమ్మిది నెలలు మోయాలి, కనాలి, పెంచాలి అంటే.. ఒక స్త్రీ మానసికంగా - శారీరికంగా సిద్ధపడి ఉండాలి.. మహిళ లైంగిక అంగీకారం తెలిపినంత మాత్రాన తనని ఏమైనా చెయ్యొచ్చు - తనని ఎలాగైనా వాడుకోవచ్చు అనే నీచ భావన పోయినప్పుడే సెక్సువల్ అటానమీ సాధించినట్లు" అని శ్రీకాంత్ అన్నారు.

ఆగ్నేయాసియా దేశాల్లో కేసులను జెండర్ దృక్కోణంతో పరిశీలించేందుకు ఇంటర్నేషనల్ కమీషన్ ఆఫ్ జ్యూరిస్ట్స్ న్యాయమూర్తుల కోసం బ్యాంకాక్ నియమావళిని రూపొందించింది.

సాధారణంగా చట్టసంబంధమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు -

  • మహిళలు బలహీనులని, సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరని, మహిళలు అణిగిమణిగి, విధేయతతో ఉండాలని,
  • మంచి మహిళలు లైంగికంగా పవిత్రంగా ఉండాలని,
  • ప్రతీ మహిళా తల్లి కావాలని కోరుకుంటారని, తల్లులే పిల్లల సంరక్షణ చూసుకోవాలని,
  • కొన్ని రకాల దుస్తులు ధరించడం వల్ల లేదా ఒంటరిగా ఉండటం వల్ల దాడులకు గురయ్యే అవకాశాన్ని తమంతట తామే కొనితెచ్చుకుంటారని,
  • మహిళలు భావోద్వేగాలతో కూడుకుని ఉంటారని దాంతో అవసరానికి మించి స్పందిస్తారని, దాంతో వారు చెప్పే విషయాలకు సాక్ష్యాలతో నిరూపించాల్సి ఉంటుందని...

లైంగిక నేరాల కేసుల్లో అంగీకారం గురించి పరిశీలిస్తున్నప్పుడు లైంగికంగా చురుకుగా ఉండే మహిళలు ఇచ్చే సాక్ష్యాల పట్ల అనుమానం ప్రదర్శించడం లైంగిక నేరాల్లో శారీరక గాయాలు లేకపోవడమంటే అంగీకారం తెలిపినట్లే లాంటి కొన్ని స్టీరియో టైపు భావాలను పరిగణనలోకి తీసుకుని న్యాయమూర్తులు నిర్ణయాలు తీసుకోకూడదని ఈ నియమావళి పేర్కొంది.

"స్త్రీల కోసం మరిన్ని చట్టాలు"

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, "స్త్రీల కోసం మరిన్ని చట్టాలు"

"స్త్రీల కోసం మరిన్ని చట్టాలు"

"స్త్రీల పక్షాన మరిన్ని చట్టాలు రావాలి.. అలాగే, జడ్జీలు కూడా చట్టాన్ని నిజమైన రీతిలో విశ్లేషించి అభిప్రాయలు చెప్పినప్పుడే మార్పు సాధ్యం" అని శ్రీకాంత్ అన్నారు.

లైంగిక హింస కేసులను పరిష్కరించడానికి వన్ స్టాప్ కేంద్రాలను, మారిటల్ రేప్‌ను అత్యాచార చట్టం పరిధిలోకి తీసుకురావాలని జస్టిస్ వర్మ కమీషన్ చేసిన సూచనలను అమలు చేయాలని సత్యవతి సూచించారు.

ఇవి అమలు చేసిన నాడే, మారిటల్ రేప్ కానీ, భ్రూణ హత్యలు కానీ ఆగుతాయని అభిప్రాయపడ్డారు. పూర్తిగా వ్యక్తిగతమైన విషయాల గురించి స్త్రీకి సంపూర్ణ స్వేచ్ఛ లభించినప్పుడే నిజమైన స్వయం ప్రతిపత్తి సాధించినట్లని అంటూ, ఎన్ని చట్టాలు వచ్చినా మన సమాజంలో చాలా నిర్ణయాలను తీసుకునేందుకు సంస్కృతి అడ్డు పడుతూ ఉంటుందని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)