మేల్ ఫెమినిజం: ‘నేను ఫెమినిస్టునని గర్వంగా చెప్పుకుంటా, మగవాళ్లంతా చెప్పుకోవాలి... ఎందుకంటే?’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పాబ్లో ఉచావో
- హోదా, బీబీసీ ప్రతినిధి
యుజీన్ హంగ్ ఫెమినిస్ట్ (స్త్రీ సమానత్వవాది)నని చెప్పుకునేందుకు గర్వపడతారు. ప్రస్తుతం ఆయన కాలిఫోర్నియాలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
తన మొదటి కూతురు పుట్టినప్పటి నుంచి ఈ సమాజం ఆడవాళ్ల పట్ల ఎలా ఉండాలన్నదాని గురించి తాను భావజాలపరంగా తలబడుతున్నానని ఆయన అన్నారు. హంగ్ కూతురుకు ఇప్పుడు 14 ఏళ్లు.
ఎక్కడికైనా సొంతంగా వెళ్లాలంటే అమ్మాయిలు భయపడాల్సిన పరిస్థితి ఉండటం తనను బాధించిందని హంగ్ చెప్పారు.
‘‘అభద్రతాభావంతో వాళ్లు ఉండాల్సి వస్తోంది. మగాడిగానైనందుకు నేను అనుభవిస్తున్న స్వేచ్ఛ, సౌలభ్యాలు చాలా ఎక్కువ. అంతవరకూ ఆ విషయాన్ని నేను గమనించలేదు. ఈ సమాజంలో ఒక సగటు మగాడిలాగే దాని విలువను గుర్తించలేదు’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Eugene Hung
ఫెమినిస్ట్ ఏసియన్ డాడ్
హంగ్‌కు కలిగన ఆ జ్ఞానోదయం ఆయన ఫెమినిస్ట్‌గా మారేలా చేసింది. మహిళా సాధికారత ప్రాధాన్యం గురించి ప్రచారం చేసేందుకు ఫెమినిస్ట్ ఏసియన్ డాడ్ అనే ఓ బ్లాగ్‌ను ఆయన మొదలుపెట్టారు.
డిస్నీ యానిమేషన్ పాత్రల నుంచి అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళ కమలా హ్యారిస్ వరకూ... ఇలా విస్తృత అంశాల గురించి హంగ్ ఆ బ్లాగ్‌లో రాస్తుంటారు.
ఏదైనా విషయంలో సమ్మతి తెలపాలా, లేదా అని నిర్ణయించుకునేందుకు మహిళలకు ఉన్న స్వేచ్ఛ, వాళ్లు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, లైంగిక హింస లాంటి విషయాల గురించి చాలా వ్యాసాలు రాశారు.
పురుషులు కూడా ఇలాంటి చర్చల్లో భాగం కావాల్సిన అవసరం చాలా ఉందని హంగ్ అంటున్నారు.
‘‘అమెరికాలో మహిళలపై హింసకు పాల్పడుతున్నవారిలో 90 శాతం పురుషులే ఉంటున్నారు. ఈ విషయాన్ని మగవాళ్లు గుర్తించాలి. వీటిని కేవలం మహిళలకు సంబంధించిన అంశాలుగానే చూస్తారు. కానీ, పురుషుల వల్లే ఎక్కువగా సమస్య వస్తున్నప్పుడు, మనం దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా ఉందిగా?’’ అని ఆయన ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
కొన్ని తరాలుగా పురుషుల వైఖరిలో మార్పు వస్తుండటం కనిపిస్తోందని, అయితే లింగ అసమానతలు మాత్రం జనజీవితంలో ఇప్పటికీ అలాగే ఉన్నాయని హంగ్ అన్నారు.
ఐరాస వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఒకే ఉద్యోగం చేస్తున్నప్పటికీ పురుషుల కన్నా మహిళలకు వేతనం 23 శాతం తక్కువగా ఉంటోంది.
ఇంటి పని, కుటుంబ అవసరాల కోసం మహిళలు పురుషుల కన్నా రెండింతలు ఎక్కువ పని చేస్తున్నారు.
100కు పైగా దేశాల్లో మహిళలు కొన్ని ఉద్యోగాలు చేయకుండా ఆంక్షలు అమలవుతున్నాయి.
‘‘ఇవి కేవలం మహిళల సమస్యలే అయ్యుంటే, ఎప్పుడో పరిష్కారమైపోయేవి. కానీ, వీటిని పరిష్కరించడానికి పురుషుల సహకారం అవసరం. వాళ్లను ఇందులో మనం భాగం చేయడం లేదు’’ అని హంగ్ అన్నారు.
‘‘మనం (మగాళ్లం) మన కుటుంబాలు, పరిసరాలు, కాలనీలు, సమాజంతో ఈ అంశాల గురించి మాట్లాడుకున్నప్పుడే, పరిష్కారం దిశగా పయనిస్తాం’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘మహిళల వ్యక్తిత్వ లక్షణాలకు పురుషులు వీలైనంత దూరంగా జరిగేలా మొదటి నుంచి ఈ సమాజం వ్యవహరిస్తుంది. ఫలితంగా మగాళ్లలో ఓ లక్షణం ఏర్పడుతుంది. స్త్రీల వైపు నిలబడితే, మగ జాతికి ద్రోహం చేస్తున్నామన్నట్లుగా వాళ్లు భావిస్తున్నారు’’ అని లూడో గాబ్రియెల్ అన్నారు.
గాబ్రియెల్ కూడా ఓ బ్లాగర్. కుటుంబంలో తండ్రి పాత్ర ఎలా ఉండాలన్న దాని గురించి ఆయన వ్యాసాలు రాస్తుంటారు.
పని ప్రదేశాల్లో లింగ వివక్ష లేకుండా చేసేందుక కృషి చేస్తున్న ‘మార్క్’ సంస్థలో గాబ్రియెల్ పనిచేస్తున్నారు.
నాయకత్వ పాత్రల్లో మహిళలకు అవకాశాలు దక్కాలన్న ఆశయంతో పని చేస్తున్న క్యాటలిస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ పదేళ్ల పాటు అధ్యయనం చేసి, మార్క్‌ను ప్రారంభించింది.
2020లో క్యాటలిస్ట్ కెనడాలోని 1,500 మంది పురుషులను లింగ వివక్ష విషయమై సర్వే చేసింది. లింగ వివక్షను అడ్డుకునేందుకు మగవారిలో చాలా మంది ఏమీ చేయరని ఈ సర్వేలో తేలింది.
86 శాతం మంది లింగ వివక్షను అడ్డుకోవాలని తమకు అనిపిస్తుందని చెప్పినప్పటికీ, అలా అడ్డుకోగలమని చెప్పినవాళ్లు మాత్రం 31 శాతమే ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘లింగ వివక్షను నిర్మూలించే విషయంలో మూడు ప్రధాన అడ్డంకులు ఉన్నాయని మా అధ్యయనం ద్వారా తెలిసింది. అవి... విషయాన్ని పట్టించుకోకపోవడం, ఉదాసీనత, భయం. మిగతా మగవారు తమ గురించి ఏమనుకుంటారోనని, వాళ్ల దృష్టిలో తాము చులకన అయిపోతామేమోనని మగవాళ్లు భయపడుతుంటారు’’ అని మార్క్ ఉపాధ్యక్షురాలు అలెగ్జాండ్రా పోలాక్ బీబీసీతో చెప్పారు.
‘‘సాటి మగవాళ్లు తమని దూరం పెడతారన్న భయం మగవాళ్లకు ఉంటుంది. పైగా ఇక్కడ ఆడవాళ్లు అణిచివేతకు గురవుతున్న వర్గం కాబట్టి, వారి వైపు ఉండటం వల్ల నష్టమేమోనన్న భావన కూడా ఉంటుంది. మంచి ఉద్దేశాలున్న మగవాళ్లు కూడా చాలా మంది ఉంటారు. కానీ, వారిలో చాలా మంది ఎలా మొదలుపెట్టాలో తెలియక మౌనంగా ఉండిపోతారు. ఏదైనా పొరపాటు చేస్తే, తమ విలువ తగ్గుతుందని భయపడతారు’’ అని గాబ్రియెల్ అన్నారు.
మార్క్ సంస్థ కొన్ని సంస్థలతో కలిసి పని ప్రదేశాల్లో లింగ వివక్షకు వ్యతిరేకంగా అవగాహన పెంచే కార్యక్రమాలను చేపడుతోంది.
ఈ కార్యక్రమాల్లో బోధించే విషయాలు మొదట్లో కొందరికి ఇబ్బందికరంగా అనిపించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘కొందరు కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటిని బయటపెట్టడం వల్ల అప్పటికి వారికి కాస్త సిగ్గుగా అనిపించినా, అదొక పెద్ద పాఠం నేర్పిస్తుంది’’ అని గాబ్రియెల్ అన్నారు.
‘‘ఓసారి మేం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ గదిలో మహిళలు, పురుషులు ఉన్నారు. పురుషుల నుంచి లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తన ఎదుర్కొన్న మహిళలు గదిలో ఓ వైపుకు రావాలని మేం అన్నాం. మహిళలందరూ ఒక వైపుకు వచ్చారు. అంటే, వేధింపులు ఎదుర్కోని మహిళ ఒక్కరు కూడా లేరు. ఆ గదిలో ఉన్న పురుషులకు ఇదో గొప్ప పాఠం అయ్యుంటుంది’’ అని అలెగ్జాండ్రా వివరించారు.
లింగ వివక్ష సమస్యలో పురుషులకు భాగం ఉందని, అందుకే పరిష్కారంలోనూ వారు పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని హంగ్, గాబ్రియెల్ లాంటి వాళ్లు అంటున్నారు.
‘నేను ఫెమినిస్ట్‌ని అని బయటకు చెప్పుకుంటున్నా. మీరు కూడా ఇదే పని ఎందుకు చేయాలంటే?’ అన్న పేరుతో గాబ్రియెల్ ఓ బ్లాగ్ పోస్టు రాశారు.
2017లో స్త్రీ సమానత్వం కోసం పూర్తి స్థాయిలో కృషి చేయాలని గాబ్రియెల్ నిర్ణయించుకున్నారు. అప్పటికి ఆయన ఓ సంస్థలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వయసు 31 ఏళ్లు.
‘‘సమానత్వం కన్నా చాలా అనవసరపు విషయాలకు మనం ప్రాధాన్యం ఇస్తాం. పురుషాధిపత్య చట్రంలో ఉంటాం. అందుకే, నాకు జీవితంలో చాలా అసంతృప్తిగా అనిపించేది’’ అని గాబ్రియెల్ వివరించారు.

ఫొటో సోర్స్, Catalyst handout
డోవ్ అండ్ ప్రొముండో అనే స్వచ్ఛంద సంస్థ ఏడు దేశాల్లో ఇటీవల ఓ సర్వే చేసింది. తమ పిల్లల బాగోగులు చూసుకునే విషయంలో తమ పాత్ర ఇంకా ఎక్కువ ఉండాలని అనుకుంటున్నట్లు 85 శాతం మంది పురుషులు చెప్పారు.
అయితే, పిల్లలను చూసుకునేందుకు తాము సెలవు తీసుకోలేకపోతున్నామని, పని ప్రదేశాల్లో తమ సహోద్యోగులు పరిస్థితిని అర్థం చేసుకునే రీతిలో లేకపోవడమే ఇందుకు కారణమని చాలా మంది మగవాళ్లు చెప్పారు.
‘‘పురుషులు సోమరులుగా ఉంటారని, పిల్లల బాగోగుల విషయాన్ని అంతగా పట్టించుకోరని ఒక తప్పుడు ముద్ర ఉంది. వాస్తవ ఆధారాలు ఏం చెబుతున్నా, చాలా మంది ఇప్పటికీ దీన్నే నమ్ముతున్నారు’’ అని రచయిత జాష్ లెవ్స్ అన్నారు.
‘‘పిల్లలను చూసుకునేందుకు సెలవు తీసుకున్నా, ఆ వ్యక్తి ఇంట్లో ఏదో కాలక్షేపం చేస్తుంటాడని ఆఫీసులో వాళ్లు అనుకుంటుంటారు. పురుషులు ఆఫీసుల్లోనే ఉండేలా, మహిళలు ఇళ్లల్లోనే ఉండేలా ఇంకా మన వ్యవస్థ ఒత్తిడి చేస్తోంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
పరిస్థితులన్నీ మారాలంటే... చట్టాలు, విధానాలతోపాటు జనాల దృక్పథాలు కూడా మారాల్సిన అవసరం ఉందని జాష్ అన్నారు.
‘‘జనంలో మహిళలు సగం. సగం అవకాశాలు వాళ్లకు దక్కాలి. సరైన స్థానాల్లో సరైన వ్యక్తులు ఉన్న వ్యాపారాలు మెరుగ్గా రాణిస్తాయి. మహిళలకు సాధికారత కల్పించిన దేశాలు అసమానతల నిర్మూలన కోసం బాగా కృషి చేస్తున్నాయి’’ అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ‘అన్నీ పోను రూ. 500 నెల జీతం’.. అందుకే కార్మికులు తిరగబడి ఫ్యాక్టరీని ధ్వంసం చేశారా
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- హోమీ జహంగీర్ భాభా భవిష్యవాణి, బ్రిటన్‌లో నిజం కాబోతోందా
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
- బిట్ కాయిన్లు: అప్పుడు నిషేధించారు... ఇప్పుడు దూసుకుపోతున్నాయి...
- ఏసుక్రీస్తు ఎలా కనిపించేవారు.. ఆయన అసలు చిత్రం ఏది?
- కరోనావైరస్: భారత్ ఆమోదించిన కోవాగ్జిన్‌పై ప్రశ్నలు ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయి?
- మైనస్ 67 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








