కోవిడ్-19 వ్యాక్సీన్: కొందరు అమెరికన్లు టీకాలు ఎందుకు వేయించుకోవడం లేదు?

- రచయిత, అలీం మక్బూల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"కోవిడ్ వ్యాక్సీన్ వేయించుకోండి.. లేదంటే మీ ఉద్యోగాలు పోతాయి" అని అమెరికాలోని అన్ని సంస్థలు తమ ఉద్యోగులకు అల్టిమేటం ఇవ్వాలని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ పిలుపు ఇచ్చారు.
వైద్య సిబ్బంది అందరూ తప్పనిసరిగా టీకా వేయించుకోవాలనే ఆదేశాలను త్వరలోనే ఇస్తామని ఆయన చెప్పారు. టీచర్ల విషయంలో రాష్ట్రాలు కూడా ఇలాగే చేయాలని ఆయన సూచించారు.
అయితే, తప్పనిసరి వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా న్యూ హంప్‌షైర్‌లోని కాన్‌కార్డ్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.
లేహ్ కుష్మన్ ఉద్యోగం వదులుకోవడానికైనా సిద్ధపడుతున్నారు. కానీ ఎట్టిపరిస్థితుల్లో వ్యాక్సీన్ మాత్రం వేయించుకోబోనని చెబుతున్నారు.
"నా నమ్మకాలు మతపరమైనవి. నన్ను సృష్టించిన వాడు నాకు రోగ నిరోధక శక్తిని ఇచ్చాడు. అదే నన్ను కాపాడుతుంది. నేను అనారోగ్యానికి గురైతే అది దేవుడి లీల. నా రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపే ఎలాంటి మందులను నేను వేసుకోను" అని లేహ్ కుష్మన్ చెప్పారు.

తన ఉద్యోగ విధులు నిర్వహించడానికి తన నమ్మకాలు ఏ విధంగానూ అడ్డురావని ఆమె చెప్పారు. తన నమ్మకాలకు, తన విధులకు సంబంధం లేదని అన్నారు.
ఫైజర్ వ్యాక్సీన్‌కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్-ఎఫ్‌డీఏ పూర్తిస్థాయి ఆమోదం తెలిపినప్పటికీ.. కుష్మన్ మాత్రం కోవిడ్ వ్యాక్సీన్లు ఇంకా ప్రయోగదశలోనే ఉన్నాయని భావిస్తున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ తాను వ్యాక్సీన్ తీసుకునేది లేదని ఆమె స్పష్టంచేశారు.
వైద్య సిబ్బందికి తప్పనిసరి వ్యాక్సినేషన్‌ను అమలు చేయాలని కొందరు ఆస్పత్రి మేనేజర్లు ఇదివరకే నిర్ణయించారు. ఆస్పత్రికి వచ్చే రోగుల్లో కరోనా సోకుతుందేమోనని భయం లేకుండా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని వాళ్లు చెబుతున్నారు.
తప్పనిసరి వ్యాక్సీన్ నిబంధన కారణంగా తాము కొంతమంది వైద్య సిబ్బందిని కోల్పోవాల్సి వచ్చిందని అప్పర్ కనెక్టికట్ వాలీ ఆస్పత్రి సీఈవో స్కాట్ కోల్బీ అంగీకరించారు.
వైద్య సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సీన్ తీసుకుని ఉండటం మంచి నిర్ణయమని ఆయన చెప్పారు. ఎందుకంటే టీకా తీసుకోని వైద్య సిబ్బందిలో కరోనావైరస్ సంబంధిత అనారోగ్యం తీవ్రంగా ఉంటోందని ఆయన వివరించారు.
కానీ వ్యాక్సీన్‌ను వ్యతిరేకిస్తున్న కొందరిలో వైద్య, మతపరమైన కారణాలు కాకుండా వేరే ఇతర కారణాలు కూడా ఉన్నాయని గుర్తించినట్లు కోల్బీ చెప్పారు.
"ఇది ఒక్క కోవిడ్ విషయంలోనే కాదు. ఎంఎంఆర్, హెపటైటిస్ వంటి ఉద్యోగులు వేయించుకోవాల్సిన ఇతర వ్యాక్సీన్లు కూడా ఉన్నాయి. అందుకే ఇందులో రాజకీయ కోణం లేదని చెప్పడం సరికాదు" అని కోల్బీ అన్నారు.

ఇక తిరిగి నిరసన ప్రదర్శనల దగ్గరకు వస్తే.. కోవిడ్ వ్యాక్సీన్‌ను వ్యతిరేకిస్తున్న లేహ్ కుష్మన్ నర్సుగా పని చేస్తున్నారు. ఆమె రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర ప్రతినిధిగా కూడా ఉన్నారు. తమ పోరాటం స్వేచ్ఛ కోసం కూడా అని ఆమె చెబుతున్నారు.
"బైడెన్ ప్రభుత్వం మా హక్కులను హరించివేయాలని చూస్తోంది. మేము వైద్య నిపుణులం. కానీ మా శరీరాలకు ఏం జరుగుతుందో ఎంచుకునే సామర్థ్యం మాకు లేదు" అని ఆమె అన్నారు.
కొన్ని ఆస్పత్రులే రాజకీయాలు చేస్తున్నాయని నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న కొందరు నర్సులు అభిప్రాయపడ్డారు.
రోగులకు నమ్మకం కలిగించేందుకే అయితే, వైద్య సిబ్బందికి వ్యాక్సీన్ వేయించే బదులు, వారికి వారానికోసారి వైద్య పరీక్షలు చేయిస్తే సరిపోతుందని వాళ్లు చెబుతున్నారు. పైగా టీకా వేసుకున్న వాళ్ల నుంచి కూడా వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం లేకపోలేదని వాళ్లు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, టీకాలను వ్యతిరేకిస్తున్న వారిలో చాలామంది.. వారానికోసారి కోవిడ్ పరీక్ష చేయించుకునేందుకు కూడా నిరాకరిస్తున్నారు.
కనెక్టికట్‌లోని వాలింగ్‌ఫోర్డ్‌లో టీకా వేసుకోనందుకు కహ్సీమ్ అవుట్లా ఇటీవలే తన టీచర్ ఉద్యోగం కోల్పోయారు.
ఆయన గతేడాది ఉత్తమ టీచర్ అవార్డు అందుకున్నారు. తప్పనిసరిగా టీకా వేసుకోవాలని అధికారులు పెట్టిన నిబంధన తనకు నచ్చలేదని ఆయన అన్నారు.
"వైద్యపరంగా కానివ్వండి లేదంటే ఆహారం కానివ్వండి.. నా జీవితంలో నేను సింథటిక్ పదార్థాలను వాడను. ఇప్పుడు వ్యాక్సీన్ వేయించుకోవడం అంటే నేను జీవించే విధానానికి అది పూర్తి వ్యతిరేకం" అని ఆయన చెప్పారు.
ఆ రాష్ట్రంలోని ఇతర టీచర్ల మాదిరిగానే కహ్సీమ్‌కు కూడా మరో అవకాశం ఇచ్చారు. అదే వారానికోసారి కరోనా పరీక్ష చేయించుకోవడం. కానీ దానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. అదో అనవసర వైద్య ప్రక్రియ అని ఆయన అభిప్రాయపడ్డారు. అది అసౌకర్యంగా ఉంటుందని చెప్పారు.
నా అంతరాత్మ చెప్పిన ప్రకారం నేను నడుచుకుంటాను. ఏది చేయాలో, ఏది చేయకూడదో నా అంతరాత్మ నాకు చెబుతుంది. ఇప్పుడు టీకా వేయించుకోవద్దని నా అంతరాత్మ నాకు చెప్పింది అని ఆయన అన్నారు.
గతంలో తనకు కరోనా సోకినట్లు అనిపించిందని, వైరస్‌తో పోరాడే రోగ నిరోధక వ్యవస్థ తన శరీరంలో అభివృద్ధి చెందిందని నిరూపించేందుకు కోవిడ్ యాంటీబాడీ పరీక్షకు సిద్ధపడ్డానని కహ్సీమ్ చెప్పారు. అయితే, ఆ సహజ రోగ నిరోధక శక్తి ఎంతకాలం ఉంటుందో తెలియదని ఆయన అంగీకరించారు.
అయితే, స్కూల్ యాజమాన్యం ఆయనకు ఈ అవకాశం ఇవ్వలేదు.
తరగతి గదిలో విద్యార్థులతో కహ్సీమ్ చాలా దగ్గరగా మెలగాల్సి ఉంటుంది. కానీ వర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగులు కూడా తప్పనిసరిగా టీకా తీసుకోవాలా..

న్యూ హంప్‌షైర్‌లో ఒక మారుమూల ప్రాంతంలో ఉంటారు రాబ్ సెగ్రిన్. ఈ నెలాఖరులోగా కోవిడ్ టీకా మొదటి డోస్ వేయించుకోకపోతే ఐటీ ఉద్యోగం పోతుందని ఆయనకు చెప్పారు.
"నా ఉద్యోగం వందశాతం రిమోట్‌గానే ఉంటుంది. నా ఉద్యోగం వర్క్ ఫ్రం హోం లాంటిది. నేనెప్పుడూ ఆఫీస్‌కు వెళ్లలేదు. ప్రజలను కలవలేదు. వ్యాక్సీన్‌ను నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే దానిపై పూర్తిస్థాయిలో అధ్యయనం జరగలేదు. నాకు సాధ్యమైనట్లు నా కుటుంబాన్ని రక్షించుకుంటాను" అని రాబ్ చెప్పారు.
టీకా వేసుకో.. లేదంటే ఉద్యోగం ఊడుతుందని చెప్పడం నాపైన, నా కుటుంబంపైనా వ్యక్తిగతంగా దాడి చేయడమేనని నేను భావిస్తాను. వాళ్లు మా ఇంట్లోకి చొరబడినట్లు అనిపిస్తోందని ఆయన అన్నారు.
సంస్థతో తన చర్చలు ఇంకా ఫలించలేదని ఆయన చెప్పారు. ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో ఆయన తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తోంది. ఫలితంగా ఆయనకు ఆరోగ్య బీమా, ఆయన కుటుంబం ఆరోగ్య రక్షణ కూడా కోల్పోతుంది.
వ్యాక్సీన్ విధానానికి సంబంధించి అమెరికావ్యాప్తంగా అనేక అసమానతలు ఉన్నాయి. తప్పనిసరిగా టీకా వేసుకోవాలన్న విధానాన్ని రిపబ్లికన్ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- మంచు విష్ణు: ‘తెలుగులో నాకు మార్కులు తక్కువ రావచ్చు. కానీ, క్యారెక్టర్ విషయంలో మాత్రం..’
- యూపీ: ‘రైతుల్ని కారుతో గుద్ది చంపిన కేసు’లో కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా అరెస్ట్
- 'వృద్ధాప్యం ఒక వ్యాధి, దాన్ని నయం చేయవచ్చు' -హార్వర్డ్ శాస్త్రవేత్త డేవిడ్ సింక్లెయిర్
- చైనాలో తైవాన్ శాంతియుతంగా కలవాల్సిందేనన్న షీ జిన్‌పింగ్ -BBC Newsreel
- ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎందుకు పతనమవుతోంది?
- ఎయిర్ ఇండియా మళ్లీ టాటా గూటికి చేరడం వల్ల ఎలాంటి మార్పులు రావచ్చు?
- అస్సాంలో ముస్లిం యువకుడి హత్యపై ఓఐసీ ప్రకటన.. ఇస్లామిక్ దేశాల జోక్యంపై భారత్ ఏమందంటే..
- హెటిరో ఫార్మా సంస్థలో ఐటీ సోదాలు, రూ. 142 కోట్ల నగదు స్వాధీనం
- పాకిస్తాన్లో భూకంపం, స్పెయిన్‌లో బద్దలైన అగ్నిపర్వతం... ఈ వారం విశేషాల ఫోటో ఫీచర్
- "చపాతీని కొలవడానికి నా భర్త రోజూ స్కేలు తీసుకొని భోజనానికి కూర్చుంటాడు!"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















