కోవిడ్ వ్యాక్సీన్: మోడెర్నా టీకాకు కేంద్రం పరిమిత అనుమతులు - Newsreel

మోడెర్నాతో భారతదేశంలో మొత్తం వ్యాక్సీన్‌ల సంఖ్య నాలుగుకు చేరుకుంది. త్వరలో ఫైజర్ కంపెనీతో కూడా ఒప్పందం చేసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, మోడెర్నాతో భారతదేశంలో మొత్తం వ్యాక్సీన్‌ల సంఖ్య నాలుగుకు చేరుకుంది.

కోవిడ్-19 టీకా మోడెర్నాకు భారత్‌లో వినియోగానికి అనుమతి ఇచ్చినట్లు నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు. అయితే, దీనిని అత్యవసర పరిస్థితుల్లో, నిబంధనలకు లోబడి మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

ఈ వ్యాక్సీన్ రాకతో, భారతదేశంలో అందుబాటులో ఉన్న టీకాల సంఖ్య నాలుగుకు చేరింది. గతంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్‌ వి వినియోగంలో ఉండగా, ఇప్పుడు మోడెర్నా కూడా వీటికి జత కాబోతోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

త్వరలో ఫైజర్ కంపెనీ వ్యాక్సీన్ కోసం కూడా ఒప్పందాలు చేసుకోబోతున్నామని వీకే పాల్ వెల్లడించారు.

మోడెర్నా.. భారత్‌లోకి అనుమతించిన తొలి అంతర్జాతీయ వ్యాక్సీన్ అని పాల్ తెలిపారు. దీన్ని రెండు డోసులలో ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు.

ఈ వ్యాక్సీన్‌ను దిగుమతి చేసుకోవడానికి ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లాకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చినట్లు తెలిసింది.

కోవిడ్‌ నుంచి రక్షణ కోసం తాము తయారు చేసిన వ్యాక్సీన్‌ 95% ఫలితాలనిచ్చిందని అమెరికాకు చెందిన మోడెర్నా గతంలో ప్రకటించుకుంది.

పంజాబ్ ప్రజలకు కరెంటు బిల్లుపై భారీ ఎన్నికల హామీలను అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేజ్రీవాల్

కేజ్రీవాల్: పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్

భారీ హామీలతో పంజాబ్ ఎన్నికల బరిలో దిగింది ఆమ్ ఆద్మీ పార్టీ. విద్యుత్‌కు సంబంధించి కీలకమైన మూడు హామీలను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చండీగఢ్‌లో ప్రకటించారు.

రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి 300 యూనిట్ల లోపు విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామన్నారు. దీనివల్ల పంజాబ్‌లోని 80 శాతం మందికి విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉండదని కేజ్రీవాల్ చెప్పారు.

ఇక రెండో హామీగా, ఇప్పటి వరకు ఉన్న విద్యుత్ బకాయిలను రద్దు చేస్తామని, బిల్లు కట్టనందుకు తొలగించిన కనెక్షన్లను పునరుద్ధరిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు.

రాష్ట్రంలో 24 గంటలపాటు విద్యుత్ అందిస్తామని ఆయన మూడో హామీగా ప్రకటించారు. పంజాబ్‌లో అవసరానికంటే ఎక్కువగా విద్యుత్‌ ఉత్పత్తి అవుతోందని, కానీ ఇక్కడ కరెంట్ చాలా ఖరీదైనదిగా మారిందని ఆయన అన్నారు.

విద్యుత్ సంస్థలు, ప్రభుత్వాలకు మధ్య ఉన్న అనైతిక అవగాహన కారణంగా ప్రజలపై కరెంటు బిల్లుల భారం పడుతోందని ఆయన ఆరోపించారు. కరెంటు బిల్లుల భారం తగ్గించాలని తమ పార్టీ ఏడాది నుంచి డిమాండ్ చేస్తోందని ఆయన గుర్తు చేశారు.

ఇంటిని నడిపేది మహిళలే కాబట్టి, ఈ నిర్ణయం వల్ల వారు ఎక్కువ సంతోషిస్తారని కేజ్రీవాల్ అన్నారు.

2013కు ముందు దిల్లీలో కూడా కరెంటు బిల్లులు అధికంగా ఉండేవని, ఇప్పుడు చవకైన విద్యుత్, 24 గంటలపాటు దిల్లీ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని కేజ్రీవాల్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)