UAPA చట్టం కింద నమోదైన 97.8 శాతం కేసుల్లో ఆరోపణలు నిరూపితం కాలేదు

యూఏపీఏ

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, సల్మాన్ రావి
    • హోదా, బీబీసీ ప్రతినిధి
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), రాజద్రోహం అంటే భారత శిక్షాస్మృతి సెక్షన్ 124 A కింద అత్యధిక కేసులు 2016 నుంచి 2019 మధ్యే నమోదయ్యాయి. వీటిలో ఒక్క యూఏపీఏ కిందే 5,922 కేసులు నమోదు చేశారు.

జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తాజా రిపోర్టులో ఈ గణాంకాలు ఇచ్చారు. ఆ సమయంలో 132 మందిపై ఆరోపణలు నిరూపితం అయినట్లు కూడా చెప్పారు.

ఒక ప్రశ్నకు జవాబుగా రాజ్యసభలో మాట్లాడిన కేంద్ర హోం శాఖ సహాయమంత్ర కిషన్ రెడ్డి ఈ గణాంకాల గురించి చెప్పారు. యూఏపీఏ కింద కేసులు నమోదైనవారిది ఏ మతమో, ఏ కులమో అందులో చెప్పలేదని తెలిపారు.

ఈ చట్టాల కింద అరెస్ట్ చేసిన వారిలో పౌర హక్కుల కోసం పోరాడే వారు ఎంత మంది ఉన్నారో కూడా ఆ గణాంకాలలో తెలీడం లేదని ఆయన చెప్పారు.

ఎన్‌సీఆర్‌బీ రిపోర్టును ఉటంకిస్తూ మాట్లాడిన కిషన్ రెడ్డి యూఏపీఏ కింద ఒక్క 2019లోనే 1,948 కేసులు నమోదయ్యాయని సభకు తెలిపారు.

అయితే ఆ ఏడాది ప్రాసిక్యూషన్ ఎవరి మీదా ఆరోపణలు నిరూపించలేకపోవడంతో కోర్టులు 64 మందిని నిర్దోషులుగా తేల్చాయని అవే గణాంకాలు చెబుతున్నాయి.

ఇక, 2018 విషయానికి వస్తే, ఆ సంవత్సరం యూఏపీఏ కింద నమోదైన కేసుల్లో కేవలం నలుగురిపై ప్రాసిక్యూషన్ ఆరోపణలు నిరూపించగలిగింది. ఆ ఏడాది 68 మందిని కోర్టు నిర్దోషులుగా చెప్పింది.

ఈ గణాంకాలను బట్టి చూస్తే, యూఏపీఏ చట్టం కింద 2016 నుంచి 2019 వరకూ అరెస్టైన వారిలో కేవలం 2 శాతం కంటే కాస్త ఎక్కువ మందిపై మాత్రమే ఆరోపణలు నిరూపితం అయినట్లు తెలుస్తోంది.

అదే విధంగా 2019లో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 124 A అంటే రాజద్రోహం ఆరోపణ కింద మొత్తం 96 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో కేవలం ఇద్దరి మీద మాత్రమే ఆ ఆరోపణలు నిరూపించగలిగారు. 29 మంది నిందితులు నిర్దోషులుగా తేలారు.

దిల్లీలో విద్యార్థుల నిరసన ప్రదర్శనలు

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

ఫొటో క్యాప్షన్, దిల్లీలో విద్యార్థుల నిరసన ప్రదర్శనలు

వ్యతిరేక గళం అణచివేతకు చట్టం వినియోగం

ప్రభుత్వ వ్యతిరేక గళాలను అణచివేసేందుకు యూఏపీఏ, రాజద్రోహం కేసులను ఉపయోగిస్తున్నారని పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్(పీయూసీఎల్)కు చెందిన లారా జేసానీ చెప్పారు.

ఈ కేసుల్లో ఆరోపణలు నమోదైన వారు ఎదుర్కొంటున్న ప్రక్రియ, శిక్ష కంటే తక్కువేం కాదని ఆమె అన్నట్లు ఒక వెబ్ సైట్ చెప్పింది.

ఈ కేసులన్నింటినీ విశ్లేషించడం వల్ల ఒక ప్రత్యేక తరహా పాటర్న్ గురించి తెలుస్తోందని జేసానీ చెబుతున్నారు.

"కుట్ర ఆరోపణలు ఉంటే యూఏపీఏ కేసు పెడతారు. ఈ కేసుల్లో ప్రాసిక్యూషన్ ఆరోపణలు నిరూపించలేకపోతే, వారిని ఇబ్బంది పెట్టడానికే ఆ ఆరోపణలు నమోదు చేశారనేది స్పష్టంగా తెలుస్తుంది. శిక్ష పడడం, పడకపోవడం తర్వాత విషయం. కొన్ని కేసుల్లో నిందితుల విచారణ అసలు సమయానికి ప్రారంభం కావడం లేదు" అని ఆమె అన్నారు.

కానీ, ఈ చట్టాలను ఉపయోగించి పౌర హక్కుల కోసం పోరాడే వారిమీదే చర్యలు తీసుకున్నారని చెప్పడం కష్టం అని హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారు.

"అది కష్టం ఎందుకంటే, కేసులు నమోదైన వారు ఎవరు, వారికి ఎలాంటి పనులతో సంబంధం ఉంది అనేదాని గురించి ఎన్‌సీఆర్‌బీ విడిగా ఎలాంటి అసెస్‌మెంట్ చేయలేదు" అని ఆయన అన్నారు.

యూఏపీఏ

ఫొటో సోర్స్, FAISAL KHAN/NURPHOTO VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, 2019 ఆగస్టులో యూఏపీఏ చట్టంలో ఆరో సవరణ చేశారు.

యూఏపీఏపై నిపుణులు ఏమంటున్నారు

యూఏపీఏ, రాజద్రోహం లాంటి చట్టాలను రాజ్యాంగబద్ధంగా గుర్తించడం గురించి కోర్టులు ఇంకా ఎలాంటి నిర్దేశాలూ జారీ చేయలేదని యూఏపీఏ నిందితుల కేసులు వాదించే ప్రముఖ లాయర్ సౌజన్య బీబీసీతో అన్నారు.

ఈ చట్టాలను సవాలు కూడా చేశారు. కానీ ఇప్పటివరకూ వీటిపై ఎలాంటి నిషేధం విధించలేదు అని చెప్పారు.

"ఇక ఆరోపణలు నిరూపించే విషయానికి వస్తే, అందులో కూడా ఎన్నో రకాల చిక్కులు ఉన్నాయి. వాటిని నిరూపించడానికి ప్రాసిక్యూషన్ వారు చాలా ప్రయత్నించాలి. సుదీర్ఘ కాలంపాటు విచారణ వాయిదా పడడం వల్ల ప్రాసిక్యూషన్ వైపు సాక్ష్యుల వాంగ్మూలాలు మారిపోతూ ఉంటాయి. అది స్వయంగా ఒక పెద్ద సవాలు" అంటారు సౌజన్య.

మరోవైపు, ఈ కేసులను వాదించే సీనియర్ వకీల్ బద్రీనాథ్ కూడా యూఏపీఏ కింద కేసులు నమోయినంత మాత్రాన, వాళ్లదే తప్పు అయ్యుంటుందని అనడం సరికాదని అన్నారు.

"వేరు వేరు నిందితుల కేసులు వేరు వేరు సాక్ష్యాలపై ఆధారపడి ఉంటాయి. ఏదో ఒక కేసును బట్టి, అన్ని కేసుల్లో తప్పు జరిగిందని చెప్పడం సరికాదు. ఈ కేసుల్లో సుదీర్ఘ కాలంపాటు సాక్షులను బలంగా నిలబెట్టడం అనేది ప్రాసిక్యూషన్ పక్షానికి కూడా కష్టంగా ఉంటుంది. అయినా, ఇప్పటివరకూ కోర్టుల్లో ఈ కేసుల్లో న్యాయమే జరిగింది" అన్నారు.

విద్యార్థి నేత ఉమర్ ఖాలిద్‌ను యూఏపీఏ కింద అరెస్ట్ చేశారు

ఫొటో సోర్స్, FB/UMAR KHALID

ఫొటో క్యాప్షన్, జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖాలిద్‌ను యూఏపీఏ కింద అరెస్ట్ చేశారు

సీనియర్ లాయర్ తారానరుల్లా కూడా యూఏపీఏకు సంబంధించిన కేసులను నిశితంగా గమనిస్తూ వస్తున్నారు. ఈ ఆరోపణలకు సంబంధించిన ఎన్నో కేసులను వాదించిన ఆమె బీబీసీతో మాట్లాడారు.

ప్రాసిక్యూషన్ వైపు కచ్చితంగా లోపాలు ఉండచ్చు, ఉంటాయి కూడా. కానీ అంతమాత్రాన ఒక నిర్ణయానికి వచ్చేయకూడదు అన్నారు.

"ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినిపించే నోళ్లు మూయించేందుకు యూఏపీఏ, రాజద్రోహం లాంటి చట్టాలను ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. న్యాయ వ్యవస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయం. అందుకే, దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక్కటే బాధ్యత వహించదు" అని ఆమె చెప్పారు.

మరోవైపు, యూఏపీఏ, రాజద్రోహ చట్టాల గణాంకాలను మాత్రమే విడిగా చూడకూడదని రాజ్యాంగ నిపుణులు సుప్రీంకోర్టు లాయర్ విరాగ్ గుప్తా అంటున్నారు.

"వాటిని దేశంలో జరుగుతున్న మిగతా నేరాలతో పోల్చి చూడాలి. అప్పుడే ఈ నేరాల్లో ఆరోపణలు నిరూపితం అవుతున్న అసలు శాతం ఎంత అనేది తెలుస్తుంది" అన్నారు.

గణాంకాలను విడిగా చూడడం వల్ల వాస్తవ దృశ్యం కనిపించదని విరాగ్ గుప్తా అభిప్రాయపడ్డారు.

"మిగతా నేరాల కేసుల్లో ప్రాసిక్యూషన్ ఎంత సక్సెస్ అయ్యింది అనేది కూడా అంచనా వేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే యూఏపీఏ, రాజద్రోహం కేసులతో పోలిస్తే దాని పరిస్థితి ఏంటి అది తెలుస్తుంది" అన్నారు.

జర్నలిస్ట్ కృణాల్ పురోహిత్ ఈ కేసుల గురించి పరిశోధన చేశారు. న్యూస్ క్లిక్ పోర్టల్‌లో వాటికి సంబంధించిన ఒక రిపోర్టును ఆయన ప్రచురించారు.

2014 నుంచి ఇలాంటి వాటిలో 96 శాతం కేసులను ప్రభుత్వాన్ని, నేతలను విమర్శించినందుకే నమోదు చేశారని ఆయన తన రిపోర్టులో చెప్పారు.

ఈ చట్టాల కింద ఎక్కువ కేసులు నమోదైన రాష్ట్రాల్లో ముఖ్యంగా బిహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్ ఉన్నాయని ఆయన అందులో తెలిపారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)