దిల్లీ అల్లర్ల కేసు: ఉమర్ ఖాలిద్‌కు బెయిల్.. జేఎన్‌యూలో దేశద్రోహం కేసు నుంచి దిల్లీ అల్లర్ల కేసు వరకు...

Umar Khalid

ఫొటో సోర్స్, FB/Umar Khalid

    • రచయిత, ప్రశాంత్ చాహల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీ అల్లర్ల కేసులో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం మాజీ నాయకుడు, 'యునైటెడ్ అగైనెస్ట్ హేట్' సంస్థ సహవ్యవస్థాపకుడు ఉమర్ ఖాలిద్‌కు దిల్లీలోని ఒక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

పౌరసత్వ సవరణ చట్టం - సీఏఏకు వ్యతిరేకంగా ఈశాన్య దిల్లీలో జరిగిన ఆందోళనల కేసులో అక్టోబర్‌లో ఉమర్ ఖాలిద్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే, ఈ కేసులో మిగతా నిందితులను గుర్తించాల్సి ఉందని, వారిని అరెస్ట్ చేయాల్సి ఉందని చెప్పి, అప్పటి వరకు ఉమర్ ఖాలిద్‌ను జైల్లో పెట్టలేమని కోర్టు అభిప్రాయపడిందని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

గతంలో ఏం జరిగింది?

దిల్లీలో గతేడాది ఫిబ్రవరిలో జరిగిన అల్లర్ల వ్యవహారానికి ‌సంబంధించి ఉమర్ ఖాలిద్‌ను దిల్లీ పోలీసు శాఖకు చెందిన స్పెషల్ సెల్ గత అరెస్టు చేసింది.

సుమారు 11 గంటలపాటు ప్రశ్నించిన తర్వాత ‌ఉమర్‌ను పోలీసులు అరెస్టు చేశారని యునైటెడ్ అగైనెస్ట్ హేట్‌ వెల్లడించింది.

దిల్లీ అల్లర్లకు ఉమర్‌ ఖాలిద్‌ సూత్రధారి అని పోలీసులు ఆరోపిస్తున్నారు.

చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యుఏపీఏ)లోని సెక్షన్ల కింద పోలీసులు ఉమర్‌‌ను అదుపులోకి తీసుకున్నారని యునైటెడ్ అగైనెస్ట్ హేట్‌ న్యాయవాది పంకజ్‌ బీబీసీతో చెప్పారు.

అల్లర్లపై దర్యాప్తు ముసుగులో దిల్లీ పోలీసులు నిరసనలను నేరంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని యునైటెడ్ అగైనెస్ట్ హేట్ అప్పట్లో ఆరోపించింది. సీఏఏ, యూఏపీఏ చట్టాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ఆ సంస్థ స్పష్టం చేసింది.

దిల్లీ అల్లర్ల కేసుకు సంబంధించి గతేడాది మార్చి 6న దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో ఈ అల్లర్ల వెనుక పెద్ద కుట్ర ఉందని దిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ పేర్కొంది. కుట్రదారుల్లో ప్రధాన వ్యక్తిగా ఉమర్ ఖాలిద్ పేరును పేర్కొంది.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారత పర్యటన (2020 ఫిబ్రవరి) సందర్భంగా అల్లర్లు సృష్టించాలని ఉమర్ ఖాలిద్ కుట్ర పన్నారని, తన సహచరుల సాయంతో జనాన్ని పోగు చేశారని ఎఫ్ఐఆర్ పేర్కొంది.

అమిత్ షా

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, అమిత్ షా

ఉమర్ ప్రసంగాన్ని పార్లమెంటులో ప్రస్తావించిన అమిత్ షా

దిల్లీ అల్లర్ల గురించి పార్లమెంటులో మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా... ఉమర్ ఖాలిద్ పేరు నేరుగా ప్రస్తావించకుండానే గతేడాది ఫిబ్రవరి 17న ఉమర్ చేసిన ఓ ప్రసంగం గురించి మాట్లాడారు.

‘‘ఫిబ్రవరి 17న ఓ ప్రసంగంలో ‘డోనల్డ్ ట్రంప్ భారత్‌కు వచ్చినప్పుడు, భారత ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తుందో ప్రపంచానికి తెలియజెబుతాం. పాలకులను వ్యతిరేకించేందుకూ అందరూ కదిలిరావాలి’ అని అన్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 23, 24 తేదీల్లో దిల్లీలో అల్లర్లు జరిగాయి’’ అని అమిత్ షా పార్లమెంటులో అన్నారు.

మహారాష్ట్రలోని అమరావతిలో ఉమర్ ఖాలిద్ ఈ ప్రసంగం చేశారు. దిల్లీ పోలీసు శాఖ స్పెషల్ సెల్ దీన్ని ఆధారంగానూ తీసుకుంది.

ఉమర్ ఖాలిద్ జనాలను రెచ్చగొట్టేలా మాట్లాడినట్లు అనిపించేలా, ఆయన ప్రసంగంలోని కొంత భాగాన్ని మాత్రమే కత్తిరించి ప్రచారంలో పెట్టారని కొన్ని ప్రముఖ ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్లు పేర్కొన్నాయి.

నిరసన తెలిజేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఉమర్ ఖాలిద్ జనాలను రోడ్ల మీదకు రావాలని పిలుపునివ్వడం నేరం కాదని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఒకవేళ జనాలను హింసకు పాల్పడాలని రెచ్చగొడితే నేరం అవుతుందని అన్నారు.

ఉమర్‌ ఖాలిద్‌పై దేశద్రోహం కేసు నమోదైంది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఉమర్‌ ఖాలిద్‌పై దేశద్రోహం కేసు నమోదైంది

దేశద్రోహం కేసు

జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్న కన్హయ్య కుమార్‌తోపాటుగా ఉమర్ ఖాలిద్ పేరు 2016లో ప్రధానంగా వార్తల్లో వినిపించింది. అంతకుముందు కూడా కొన్ని సార్లు ఉమర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

మోదీ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తూ రైట్ వింగ్‌కు ఉమర్ లక్ష్యంగా మారారు.

పార్లమెంటుపై దాడి కేసులో మరణ శిక్షకు గురైన అఫ్జల్ గురు వర్థంతి సందర్భంగా జేఎన్‌యూలో కార్యక్రమం ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. ఈ కార్యక్రమంలో భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఆరోపణలు వచ్చాయి.

భారత వ్యతిరేక నినాదాలు చేసినవారిలో ఉమర్ ఖాలిద్, కన్హయ్య కుమార్ సహా ఏడుగురు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఉమర్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. కొన్ని రోజుల రిమాండు తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది.

భారత మీడియాలో ఓ వర్గం ఉమర్‌పై ‘దేశద్రోహి’ అన్న ముద్ర వేసింది. ఆయన సహచరులను ‘తుక్డే, తుక్డే గ్యాంగ్’ అని పిలవడం మొదలుపెట్టింది. మీడియా తమను తప్పుగా చిత్రీకరిస్తూ, జనాల్లో తమపై విద్వేషాన్ని పెంచిందని ఉమర్ చాలా సార్లు అన్నారు.

‘‘తక్డే తుక్డే అని మేం చేశామంటున్న ప్రసంగంపై కోర్టుకు వెళ్లండి. ఎవరిది విద్వేషపూరిత ప్రసంగం, ఎవరు దేశద్రోహులనేది తేలుతుంది’’ అని గత జనవరిలో ఉమర్... అమిత్ షాకు సవాలు విసిరారు.

బుర్హన్ వానీ

ఫొటో సోర్స్, SM Viral Image

ఫొటో క్యాప్షన్, బుర్హన్ వానీ

బుర్హన్ వానీని కీర్తిస్తూ...

2016లో కశ్మీర్‌లో వేర్పాటువాద హిజ్బుల్ కమాండర్ బుర్హన్ వానీ ఎన్‌కౌంటర్‌లో మరణించిన తర్వాత అక్కడ పెద్ద స్థాయిలో ఆందోళనలు జరిగాయి. వీటిలో కొందరు మరణించారు కూడా.

బుర్హన్ అంతిమ యాత్రకు చాలా మంది జనం వచ్చారు. అప్పుడు ఫేస్‌బుక్‌లో బుర్హన్ వానీని కీర్తిస్తూ ఉమర్ ఖాలిద్ ఓ పోస్టు పెట్టారు. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి.

కొంత సమయం తర్వాత ఆ పోస్టును ఉమర్ తొలగించారు. అయితే, సోషల్ మీడియాలో ఆయనపై వ్యతిరేకత ఆగలేదు. ఉమర్‌ను సమర్థిస్తూ మాట్లాడినవారు కూడా లేకపోలేదు.

2017లో దిల్లీ యూనివర్సిటీకి చెందిన రామ్‌జన్ కాలేజీలోని లిటరెరీ సొసైటీ ఏర్పాటు చేసిన ఒక టా షోలో పాల్గొనేందుకు జేఎన్‌యూ విద్యార్థి నేతలుగా ఉన్న ఉమర్ ఖలీద్, శీలా రశీద్‌లను ఆహ్వానించారు.

ఉమర్ ‘ద వార్ ఇన్ ఆదివాసీ ఏరియా’ అనే అంశంపై ప్రసంగించాల్సి ఉంది. కానీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ (ఏబీవీపీ)తో సంబంధమున్న విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. చివరికి, రామ్‌జన్ కాలేజీ ఈ కార్యక్రమం కోసం ఉమర్, శీలాలకు ఇచ్చిన ఆహ్వానాలను రద్దు చేసింది.

కానీ, ఈ వ్యవహారంలో ఏబీవీపీకి, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్‌కు మధ్య దిల్లీ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో హింసాత్మక ఘర్షణ జరిగింది.

2018 ఆగస్టులో కాన్‌స్టిట్యూషన్ క్లబ్ బయట కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఉమర్ ఖాలిద్‌పై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ‘టూవర్డ్స్ ఏ ఫ్రీడమ్ వితౌట్ ఫియర్’ అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన అక్కడికి వెళ్లారు.

తెల్లటి దుస్తులు వేసుకున్న ఓ వ్యక్తి ఉమర్ ఖాలిద్‌ను తోశాడని, కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయితే, తూటా ఉమర్‌కు తగల్లేదని అన్నారు.

AFP

ఫొటో సోర్స్, AFP

‘పాకిస్తాన్‌తో అంటగట్టడం ఎందుకు?’

భీమా కొరెగావ్ హింస విషయంలో గుజరాత్‌కు చెందిన నాయకుడు జిగ్నేశ్ మేవాణీ, ఉమర్ ఖాలిద్‌లు తమ ప్రసంగాలతో జనాలు రెచ్చగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి.

ఉమర్ ఖాలిద్ ప్రసంగాలు, వ్యాఖ్యలు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి.

ఈ పరిస్థితుల నడుమ ఉమర్ ఖాలిద్ చదువు పూర్తి చేయడానికి కూడా అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. చాలా ప్రయాస తర్వాత జేఎన్‌యూ ఆయన పీహెచ్‌డీ థీసిస్‌ను స్వీకరించింది.

ఉమర్ హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు. భారత ఆదివాసీలపై ఆయన ప్రత్యేక అధ్యయనం చేశారు.

దిల్లీలో అతిపెద్ద విశ్వవిద్యాలయాలైనా డీయూ, జేఎన్‌యూ రెండింటిలో ఆయన చదువుకున్నారు. కొన్ని సామాజిక సంస్థల ద్వారా మానవ హక్కులకు సంబంధించిన అంశాలపైనా ఆయన పనిచేశారు.

కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉండగా జరిగిన ‘బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌పై కూడా ఉమర్ ప్రశ్నలు లేవనెత్తారు. కొన్ని ‘ప్రత్యేక చట్టాల’ ద్వారా పోలీసులకు లభిస్తున్న విశేష అధికారాలు మానవ హక్కులకు ప్రమాదంగా పరిణమించాయని ఆయన చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేశారు.

‘‘2016లో జేఎన్‌యూలో నాతో సహా ముగ్గురు విద్యార్థులు అరెస్టయ్యారు. కానీ, నా ఒక్కడికే పాకిస్తాన్‌తో సంబంధం అంటగడుతూ కొందరు మాట్లాడారు. నేను పాకిస్తాన్ రెండు సార్లు వెళ్లి, వచ్చానని ఆరోపించారు. దిల్లీ పోలీసులు ఇవన్నీ అవాస్తవాలని తేల్చారు. ఆ తర్వాత, మరి వాళ్లలో ఎవరైనా నన్ను క్షమాపణ అడిగారా? ఎందుకు అడగలేదు. దీనంతటికీ ఇస్లామోఫోబియానే కారణం’’ అని గత ఏడాది ఉమర్ ఓ లేఖ రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)